BJP

17:09 - November 16, 2018

ఢిల్లీ : సీబీఐలో వివాదాస్పదంగా తయారైన అవినీతి భాగోతం సుప్రీంకోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో అభిమానం. ఈ క్రమంలో ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా ఉన్నప్పటి నుంచి అలోక్ వర్మ తనకు తెలుసని, ఎంతో నిజాయతీ పరుడైన ఆయనకు అన్యాయం జరిగిందని సుబ్రహణ్యస్వామి పేర్కొన్నారు.  అలోక్ వర్మపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో  సుప్రీంకోర్టు ఆయనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం తనకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 

14:53 - November 16, 2018

పశ్చిమబెంగాల్ : ఇటీవల కాలంలో ఏపీలో పలు ప్రాంతాలలో సీబీఐ హఠాత్తుగా దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో రాష్ట్రంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రవేశాన్ని కట్టడి చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు బాటలోనే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా అనుసరించబోతున్నారు. సీబీఐ చట్టాన్ని తాము కూడా పరిశీలిస్తున్నామని... తదుపరి చర్యలను త్వరలోనే తీసుకుంటామని మమతా  స్పష్టం చేశారు. రాష్ట్రాల పరిధిలో కేంద్రం తప్పుడు వైఖరిని అనుసరిస్తోందని ఆమె మండిపడ్డారు. అధికారాన్ని బీజేపీ దుర్వినియోగం చేస్తోందని.. సీబీఐ, ఈడీ, ఆర్బీఐలను తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలని కేంద్రం భావిస్తోందనీ..ఈ క్రమంలోనే కేంద్రం తీసుకుంటున్న పలు నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆమె విమర్శించారు. బీజేపీ కుతంత్రాల వల్ల దేశానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో, ఏపీ మాదిరే తమ రాష్ట్రంలో కూడా సీబీఐకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకునేందుకు యత్నిస్తున్నామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. కాగా ఏపీలో సీబీఐకి ఎంట్రీ లేదంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
 

 

10:27 - November 16, 2018

అమరావతి:  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (సీబీఐ) కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని దర్యాప్తు సంస్థపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో సీబీఐ ఎటువంటి సోదాలు కానీ, దర్యాప్తు కానీ చేసే అధికారాన్ని కోల్పోయినట్టే. సీబీఐకు అనుమతించిన కన్సెంట్‌ను విరమించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొంది. 
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఏదేని రాష్ట్రంలో విచారణ చేయలన్నా, కేసులు చేపట్టాలన్నా ఆ రాష్ట్ర అనుమతి తప్పనిసరి. ఈ విషయంలో దేశ  రాజధాని ఢిల్లీకి మినహాయింపు ఉంది. ఈ ఆదేశాల ఫలితంగా రాష్ట్రంలో సీబీఐ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కానీ ఇతర కేంద్ర పబ్లిక్ సెక్టార్ సంస్థలలోకాని ఎటువంటి విచారణ చేయటానికి అర్హత లేదు. ఇటీవల రాష్ట్రంలో పలుచోట్ల సీబీఐ దాడులు నిర్వహించి వ్యాపారస్థుల, రాజకీయనాయకుల వెన్నుల్లో వణుకు పుట్టించిన సంగతి తెలిసిందే. దీనికితోడు రాష్ట్ర సర్కారు కేంద్రంతో అమీతుమీకి దిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కేంద్రానికి చురకలాంటిదని భావించవచ్చు.   

 

 

08:53 - November 16, 2018

హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ మూడో జాబితాను విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న మరో 20 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 20 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేశారు. ఇప్పటికే రెండు జాబితాలో బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో 38 మంది, రెండో జాబితాలో 28 మంది అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు బీజేపీ 86 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. 
మూడో జాబితాలోని అభ్యర్థులు వీరే..
లక్ష్మారెడ్డి.. (ఎల్లారెడ్డి)
ప్రతాప రామకృష్ణ.. (వేములవాడ) 
పుప్పాల రఘు.. (హుజురాబాద్‌) 
చాడ శ్రీనివాస్‌రెడ్డి.. (హుస్నాబాద్‌) 
ఆకుల రాజయ్య.. (మెదక్‌) 
జి.రవికుమార్‌గౌడ్‌.. (నారాయణ్‌ఖేడ్‌), 
బి.రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే.. (సంగారెడ్డి), 
పి.కరుణాకర్‌రెడ్డి.. (పటాన్‌చెరు) 
కొత్త అశోక్‌గౌడ్‌.. (ఇబ్రహీంపట్నం) 
కంజెర్ల ప్రకాశ్‌.. (చేవెళ్ల-ఎస్సీ) 
దేవర కరుణాకర్‌.. (నాంపల్లి) 
సతీశ్‌గౌడ్‌.. (సికింద్రాబాద్‌) 
నాగురావు నామోజీ.. (కొడంగల్‌) 
పద్మజారెడ్డి.. (మహబూబ్‌నగర్‌) 
రజనీ మాధవరెడ్డి.. (ఆలంపూర్‌-ఎస్సీ) 
శ్రీరామోజు షణ్ముఖ.. (నల్లగొండ) 
కాసర్ల లింగయ్య.. (నకిరేకల్‌-ఎస్సీ) 
హుస్సేన్‌నాయక్‌..(మహబూబాబాద్‌-ఎస్టీ) 
ఉప్పాల శారద.. (ఖమ్మం) 
శ్యామల్‌రావు.. (మధిర-ఎస్సీ)

15:47 - November 15, 2018

కరీంనగర్ : అందరూ ఊహించినట్టే జరిగింది. చొప్పదండి టికెట్ ఆశించిన బొడిగె శోభ గులాబీ కండువా వదిలి కాషాయ కండువా కప్పుకున్నారు. టికెట్ రాకపోవడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురై బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ అధిష్టానం కూడా ఆమెకు చొప్పదండి టికెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 15వ తేదీన గురువారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, పార్టీ ఎమ్యెల్యే అభ్యర్థి కిషన్ రెడ్డి సమక్షంలో బొడిగె శోభ బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ...తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారిణిగా..దళిత బిడ్డనైనా తనకు అవమానం ఎదురైందని, కార్యకర్తల ఒత్తిడి మేరకు బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ సడ్డకులు రవీంద్ర రావు, ఎంపీగా కొనసాగుతున్న సంతోష్ వల్ల తాను అవమానానికి గురయ్యాయన్నారు. బీజేపీ నాయకత్వంలో అభివృద్ధి చేసుకోవాలని లక్ష్యంతో తాను చేరినట్లు చెప్పారు బొడిగె శోభ.. 
పార్టీ టికెట్ కోసం బొడిగె శోభ తీవ్రంగా ప్రయత్నించారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలువాలని ప్రయత్నించినా అది వీలు కాలేదు. ఇటీవలే కేటీఆర్ ను కలిసినా టికెట్ పై స్పష్టమైన హామీనివ్వలేదు. కాంగ్రెస్ పెద్దలు పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లుగా ప్రచారం జరిగింది. చివరకు కార్యకర్తలతో సమావేశమైన బొడిగె బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం చొప్పదండి బరిలో ఎవరు గెలుస్తారు ? అనేది చూడాలి. 

08:44 - November 15, 2018

భూపాల్ : మధ్యప్రదేశ్‌లో వినూత్న రీతిలో బీజేపీ ప్రచారం చేస్తోంది. ప్రధాని మోడీ, సీఎం శివరాజ్‌సింగ్ మాస్కులు ధరించి బీజేపీ అభ్యర్థి ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఇండోర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మహేంద్ర హర్ణియా ప్రచారం చేస్తున్నారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోడీ, శివరాజ్‌సింగ్ మాస్కులతో జనం సెల్ఫీలు తీసుకుంటున్నారు. 

20:24 - November 14, 2018

ఢిల్లీ: కేంద్రంలో ఈసారి అధికారంలోకి ఎవరు వస్తారు? దేశ ప్రధాని ఎవరు అవుతారు? ఇలాంటి చర్చలు తీవ్రంగా జరుగుతున్న తరుణంలో ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ రెండో సారి అధికారంలోకి రావడం దేశానికి మంచిదని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. నిత్యం దేశాభివృద్ధి గురించి ఆలోచించే మోడీ వంటి జాతీయ నాయకుడు ఉండటం దేశానికే మంచిదన్నారు. ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించిన ఆయన కేంద్ర స్థాయిలో అవినీతిని నిర్మూలనకు ప్రధాని మోడీ మంత్రివర్గం విశేషమైన కృషి చేసిందని కితాబిచ్చారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 
దేశ ఆర్థికాభివృద్ధి కోసం ప్రధాని మోడీ ప్రయత్నిస్తుంటారని, మోడీ వచ్చాక అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు చాలా తక్కువగా వింటున్నానని నారాయణమూర్తి తెలిపారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వంటి సంస్కరణలు ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేసేందుకేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వాటి అమలు తీరు సక్రమంగా లేకపోతే అందుకు ప్రధాని ఎంతమాత్రం బాధ్యులు కారని, అధికారులకే ఆ బాధ్యత ఉంటుందని వివరించారు. మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి క్రమశిక్షణ, పరిశుభ్రత, ఆర్థిక వృద్ధి మీద దృష్టి సారించారని ప్రశంసించారు. ఇటువంటి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడం మంచి విషయమన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోడీని ప్రశంసిస్తూ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.

19:46 - November 14, 2018

కాకినాడ: పార్టీలు చేసే కుల రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. కులం, మతం, ప్రాంతం పేరుతో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదన్నారు. తాను బతికుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుల రాజకీయాలతో పాడు చేయనివ్వని పవన్ హామీ ఇచ్చారు. జనసేన దృష్టిలో అన్ని కులాలు, మతాలు ఒక్కటే అని పవన్ స్పష్టం చేశారు. అవసరమైతే ఓటమిని అయినా అంగీకరిస్తాను కానీ నా సిద్దాంతాన్ని మాత్రం మార్చుకోనని పవన్ తేల్చి చెప్పారు. ఆఖరికి సీఎం చంద్రబాబు కూడా తన సామాజికవర్గాన్ని ఒక్కమాట కూడా అనే ధైర్యం లేదన్నారు. తాను మాత్రం అలా కాదని, తన సామాజికవర్గంలో జరిగే తప్పుల గురించి బలంగా మాట్లాడగలనని పవన్ చెప్పారు. బీజేపీ హిందువుల పార్టీ కాదని పక్కా పొలిటికల్ పార్టీ అని పవన్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పవన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

19:24 - November 14, 2018

రాజస్థాన్‌ : రాష్ట్రంలో బీజేపీకి షాక్ తగిలింది. అదికూడా మామూలు షాక్ కాదు. రాజుల స్థానం రాజస్థాన్ లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ పట్టుదలగా వుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ. బలమైన రాజకీయ వ్యూహాలతో బీజేపీకి జోరుకు కాంగ్రెస్ కళ్లెం వేసేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. ఈ నేపథ్యంలో కమలదళానికి ఎంపీ హరీష్ చంద్ర మీనా హ్యాండిచ్చారు. బుధవారం మాజీ సీఎం అశోఖ్ గెహ్లాట్, కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలెట్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 

Related image2014లో బీజేపీలో చేరిన హరీశ్ చంద్ర మీనా మాజీ ఐపీఎస్ అధికారి అయిన మీనా 2009 నుంచి 2013 వరకు రాజస్థాన్ డీజీపీగా పనిచేశారు. మీనాల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న దౌసా లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఈ క్రమంలో  తూర్పు రాజస్థాన్‌లో కూడా మీనాలు ఎక్కువమంది ఉండటంతో.. హరీశ్ చంద్ర చేరికతో తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. రాజస్థాన్‌లో ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఇలాంటి సమయంలోనే సీనియర్ నేతగా ఉన్న హరీష్ మీనా పార్టీని వీడటం బీజేపీకి ఎదురు దెబ్బేనని చెప్పాలి. మరి హరీశ్ చంద్ర మీనా ఝలక్ తో బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
 

09:58 - November 14, 2018

హైదరాబాద్: తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీచేసే  బీజేపీ అభ్యర్ధుల 3వ జాబితాను  పార్టీ అధిష్టానం  నేడు విడుదల చేయనుంది.  మొత్తం 119 స్ధానాలకు గాను ఇప్పటికే 2 విడతల్లో  66 మంది అభ్యర్ధులను ప్రకటించిన పార్టీ బుధవారం మరో 30 స్ధానాల్లో పేర్లు  ప్రకటించనుంది. పార్టీ  రాష్ట్రఅధ్యక్షుడు  డాక్టర్ కె.లక్ష్మణ్ అధ్యక్షతన పార్టీ ఎన్నికల కమిటీ మంగళవారం సమావేశమై పేర్లు ఖరారు చేసింది. బుధవారం ఢిల్లీలో జరిగే జాతీయ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో మూడోజాబితాపై చర్చించి పేర్లు ప్రకటించనున్నారు. ఇందుకోసం పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, పార్లమెంట్ సభ్యులు  దత్తాత్రేయ, పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధరరావులు ఢిల్లీ వెళ్లారు. ఇప్పటికే నామినేషన్లు పర్వం మొదలవటంతో చాలా మంది అభ్యర్దులు ఈరోజు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. గడచిన 2 రోజుల్లో  67 మంది అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు  చేశారు. రెండు రోజులుగా అత్యధికంగా బీజేపీ నుంచి దాదాపు 20 నామినేషన్లు దాఖలు కాగా ,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ముషీరాబాద్ స్థానం నుంచి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈనెల 19 వరకు నామినేషన్ల  వేయటానికి గడువు ఉంది. 22వ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది.

Pages

Don't Miss

Subscribe to RSS - BJP