big b

16:49 - November 1, 2018

ఢిల్లీ : బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నోటీసులు పంపింది. ఆయనతో పాటు ఎవరెస్ట్ మసాల, యూ ట్యూబ్ వారికి కూడా నోటీసులు జారీ చేసింది. ప్రసారమవుతున్న ప్రకటనలో ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని, ప్రసారం చేయడానికి చట్టబద్ధమైన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నట్లు సమాచారం. వెంటనే ప్రకటనకు సంబంధించిన ప్రసారాన్ని నిలిపివేయాలని, భవిష్యత్‌లో కూడా ఎలాంటి ప్రకటన ప్రసారం చేయవద్దని నోటీసుల్లో పేర్కొంది. వెంటనే పది రోజుల్లో స్పందన తెలియచేయాలని సూచించింది. గతంలో కూడా ఓ కంపెనీకి చెందని బంగారు ఆభరణాల ప్రకటన విషయంలో కూడా దుమారం రేపిన సంగతి తెలిసిందే. అందులో అమితాబ్ వ‌ృ‌ద్ధుడిగా నటించాడు. ఈ ప్రకటనతో బ్యాంకు ఉద్యోగులకు తీవ్ర ఆగ్రహం కల్పించింది. 

12:35 - November 1, 2018

ముంబై : బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ డ్యాన్స్ అంటేనే అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోతుంటారు. ఆమె చేసే డ్యాన్స్ మతులను పొగొడుతుంది. పలు సినిమాల్లో కత్రినా చేసిన డ్యాన్స్ లు యువతను విశేషంగా ఆకట్టుకుంటాయి.Image result for suraiya katrina kaif dance వయస్సు మీద పడుతున్నా ఆమెలో ఏ మాత్రం జోష్ తగ్గలేదని ఇటీవలే విడుదలైన టీజర్ చూస్తే అర్థమౌతుంది. 
అమితాబ్ బచ్చన్ - అమీర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ చిత్రంలో కత్రినా కైఫ్ నటిస్తోంది. ఇందులో సురైయా అనే నర్తకి పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా మొదటి పాటను ఇటీవలే విడుదల చేశారు. ఒక్కొక్కటిగా వీడియో సాంగ్ టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు.
విడుదల చేసిన 'సురయ్యా' సాంగ్ లో కత్రినా చేసిన డ్యాన్స్ అదరహో అనిపిస్తోంది. ఈ పాటకు ఇప్పటికే 9.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. పచ్చ, ఎరుపు రంగు కాంబినేషన్‌లో ఉన్న లెహెంగా ధరించిన కత్రినా గెటప్ అదిరిపోయిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సాంగ్ తో మరోసారి కత్రీనా అందరినీ మెస్మరైజ్ చేసింది. కత్రినా డ్యాన్స్‌ చేస్తుంటే చుట్టూ నిలబడిన బ్రిటిషర్స్ వావ్‌ అంటూ కళ్లప్పగించి చూస్తుండిపోయారంట. విజయ్‌ కృష్ణ ఆచార్య డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

11:31 - September 19, 2018

బాలీవుడ్ మిస్టర్ ఫర్పెక్టు అమీర్ ఖాన్ తాజా చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ షూటింగ్ కొనసాగుతోంది. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడల్ విశేషం. అమీర్ ఖాన్ తో పాటు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కత్రినా కైఫ్, దంగల్ ఫేమ్ ఫాతిమా సనా ఖాన్ చిత్రంలో నటిస్తున్నారు. స్వాతంత్రానికి పూర్వం..సిపాయిలు తిరుగుబాటు వంటి అంశాలతో చిత్రం రూపొందుతోంది. 
ఇటీవలే చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలై అభిమానులను అలరించింది. తాజాగా చిత్ర టైటిల్‌ లోగోను, అమితాబ్‌ లుక్‌ను విడుదల చేశారు. అమితాబ్‌ తలపాగ, తెల్లటి మీసం, చేతిలో కత్తితో యుద్ధానికి సిద్ధమవుతున్న వీరుడిలా కనిపిస్తూ అదరగొట్టారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా నవంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

12:36 - September 11, 2018

టాలీవుడ్ యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్...మాట మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న అరవింద సేమత సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. సినిమాలో ఎన్టీఆర్ ఆరు పలకలతో కనిపించడం అభిమానులను అలరిస్తోంది. ఎన్టీఆర్ సరసన పూజాహెగ్డే నటిస్తోంది. అక్టోబర్ మాసంలో చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. 
తాజాగా చిత్ర యూనిట్ ఆడియో వేడుకపై దృష్టి పెట్టింది. వేడుకకు ముఖ్యఅతిథులు వారేనంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు రానున్నారని ప్రచారం జరిగింది. గతంలో మహేష్ సినిమాకు ఎన్టీఆర్ వెళ్లిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ కూడా హాజరయ్యే అవకాశం ఉందని టాక్. కానీ తాజాగా మరో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వస్తారని పుకార్లు షికారు చేస్తున్నాయి. అరవింద సమేతలో బిగ్ బి కీలక పాత్ర పోషించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఇది నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. 

19:49 - June 20, 2017

ఢిల్లీ: జిఎస్‌టి అమలును ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న కేంద్రం-ఈ చట్టం అమలును అందరికీ గుర్తుండేలా అట్టహాసంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకుగాను పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలు వేదిక కానుంది. జూన్‌ 30న రాత్రి 11 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 12 గంటలు కాగానే పెద్ద గంటను మోగించి జిఎస్‌టి అమలును ప్రకటిస్తారు. అర్ధరాత్రి నుంచే జిఎస్‌టి అమలులోకి వస్తుంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా 1947, ఆగస్టు 15న అర్ధరాత్రి 'ట్రైస్ట్‌ విత్‌ డెస్టినీ' పేరిట సెంట్రల్‌ హాల్లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసేలా ఈ కార్యక్రమం ఉండబోతోంది.

జిఎస్‌టి అమలుతో దేశ వాణిజ్యంలో కీలక మార్పులు

జిఎస్‌టి అమలుతో దేశ వాణిజ్యంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. జిఎస్‌టి అమలుకు అన్ని రాష్ట్రాలు అంగీకరించాయని, జూన్‌ 30 అర్థరాత్రి నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుందని ఆయన స్పష్టం చేశారు. జిఎస్‌టిపై గత ప్రభుత్వాలు కూడా ప్రధాన భూమికను పోషించినట్లు మంత్రి పేర్కొన్నారు.

జిఎస్‌టి ప్రారంభోత్సవ కార్యక్రమానికి

జిఎస్‌టి ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్‌, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ఎంపీలు, జీఎస్టీ మండలి సభ్యులు హాజరు కానున్నారు. మాజీ ప్రధానులు మన్మోహన్‌సింగ్‌, దేవెగౌడలకు కూడా కేంద్రం ఆహ్వానాలు పంపింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోది కీలక ప్రసంగం చేయనున్నారు. జిఎస్టీ ప్రచారకర్తగా బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌బచ్చన్‌ను ఎంపిక చేసింది. జిఎస్‌టి అమలులో భాగంగా షార్ట్‌ ఫిలిం ప్రదర్శించనున్నారు.జీఎస్టీ అమలులో భాగంగా జీఎస్టీ కౌన్సిల్‌ ఇప్పటివరకు 17 సార్లు సమావేశమై తుదిరూపు నిచ్చింది.

 

11:46 - June 25, 2016

బిగ్ బి..అమితాబ్ బచ్చన్..తన వయస్సుకు తగిన పాత్రలే కాకుండా ఇతర వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ ముందుకెళుతున్న సంగతి తెలిసిందే. పికు, తీన్, వజీర్..తదితర సినిమాల్లో వైవిధ్యంగా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ప్రయోగం చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈసారి 102 ఏళ్ల ముసలాడిగా అమితాబ్ కనిపించనున్నారు. ఉమేష్ శుక్లా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి '102 నాటౌట్' అనే నామకరణం కూడా చేసేశారు. ఈ సినిమా నవంబర్..డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ సినిమా విడదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. స్క్రిప్ట్‌ మొత్తం సిద్దమైపోయిందని, సినిమా మొత్తం ముంబాయిలోనే చిత్రీకరిస్తామని శుక్లా పేర్కొన్నారు. అమితాబ్‌ 102 సంవత్సరాల వృద్ధుడి పాత్రలో కనిపిస్తారని, అమితాబ్‌కు కొడుకుగా పరమేష్‌ చేయనున్నాడని తెలిపారు. మరి 102 వృద్ధుడి వేషంలో అమితాబ్ ఎలా కనిపించనున్నారో చూడాలంటే చిత్రం విడదలయ్యే వరకు వేచి ఉండాల్సిందే.

14:49 - May 11, 2016

ఢిల్లీ : బిగ్‌ బి అమితాబ్‌బచ్చన్‌కు 'పన్ను ఎగవేత' కేసులో మరోసారి చిక్కులు తప్పడం లేదు. అమితాబ్‌పై 2001లో నమోదైన పన్ను ఎగవేత కేసును తిరిగి తెరిచేందుకు ఆదాయపుపన్ను శాఖకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. 2001-02 సంవత్సరంలో 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' షో ద్వారా వచ్చిన ఆదాయంపై కోటి 66 లక్షల పన్నును బిగ్‌బీ చెల్లించాలని ఐటి పేర్కొంది. దీనిపై 2001లో ఆయనపై కేసు నమోదైంది. తనను కళాకారుడిగా పరిగణించి.. పన్ను మినహాయించాలని అమితాబ్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన బాంబే కోర్టు బిగ్‌బీ ఆదాయంలో 30 శాతం వరకు పన్ను మినహాయింపు నిచ్చింది. బాంబే హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. ఐటీ శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసును తిరిగి విచారించేందుకు అనుమతించింది. కౌన్‌ బనేగా కరోడ్‌పతి షోలో అమితాబ్‌ యాంకర్‌గా చేశారని.. దాన్ని నటించడం అనలేరని ఐటీశాఖ కోర్టుకు తెలిపింది. 

20:44 - December 27, 2015

బాలివుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ త్వరలోనే బాలివుడ్‌ అభిమానులకు షాక్‌ ఇవ్వనున్నారు. ఐదు దశాబ్దాల పాటు వెండితెరపై వెలుగులు విరజిమ్మిన ఈ సూపర్‌ స్టార్‌ నటనకు వీడ్కోలు పలుకనున్నారా... లాంటి సందేహాలు బాలివుడ్‌ను కుదిపేస్తున్నాయి. తరాలు మారినా.. ఎంతమంది కొత్త స్టార్లు వచ్చినా అమితాబ్‌ తన స్టామినా ఐదు దశాబ్దాల పాటు నిలబెట్టుకున్నారు. అలాంటి స్టార్‌ వెలుగులు ఇకపై చరిత్రగా మారనున్నాయా.. ఇలాంటి విషయాలు తెలుసుకోవాంటే వాచ్‌ దిస్ స్పెషల్‌ ఫోకస్‌..

ఏడు దశాబ్దాల మేరునగరధీరుడు

వయస్సు తన శరీరానికే కాని తన నటనకు కాదని బిగ్‌ బీ అనేక సార్లు నిరూపించారు. కానీ పెరుగుతున్న వయస్సుతన నటనపై ప్రభావం చూపించే ప్రమాదం ఉందని ఏడు పదులు దాటిన శరీరం అలసిందని అభిమానులకు చేదువార్త వినిపించారు.

వెండితెరకు సెలవు ప్రకటిస్తున్నట్లు అమితాబ్‌ ప్రకటన

మిలీనియం స్టార్‌ అమితాబ్‌ వెలుగులను ఇకపై వెండితెరపై చూడలేమని బాలివుడ్‌లో వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ అమితాబ్‌ స్వయంగా తన బ్లాగ్‌లో ఇదే విషయమై ప్రకటించారు. తాను సినిమాల నుంచి రిటైర్‌ కావాలని అనుకుంటున్నట్లు వివరణ ఇచ్చారు. అంతేకాదు తన శరీరం నటనకు సహకరించడం లేదని, మాట తడబడుతోందని బ్లాగ్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం అనారోగ్యం బారిన పడకుండా మందులతో నెట్టుకొస్తున్నానని, సమీప భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం ముంచుకురాకపోయినా ప్రస్తుతం ముందు జాగ్రత్తగా సినిమాల నుంచి రిటైర్‌ కావాలనుకుంటున్నట్లు బ్లాగ్‌లో పేర్కొన్నారు.

అమితాబ్‌ నిర్ణయం అభిమానులకు చేదువార్త
అమితాబ్‌ ప్రకటించిన నిర్ణయం అభిమానులకు శరాఘాతమే. ఆయన స్వరంతో పరిచయం లేని భారతీయులు లేరంటే అతిశయోక్తి కాదు. అమితాబ్‌ నిర్ణయం అభిమానులను నిరాశ కల్పించేదే అయినప్పటికీ ఆయన కుటుంబసభ్యులకు మాత్రం ఊరట కలిగించేదే కావడం విశేషం. రెండేళ్ల క్రితం అమితాబ్‌ శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకోవాలని కుటుంబసభ్యులు సూచించారు. కానీ అమితాబ్‌ మాత్రం తిరిగి పుంజుకొని నటనను కొనసాగించాడు. జూనియర్‌ బచ్చన్‌, జయా బచ్చన్‌ ఇద్దరూ అమితాబ్‌ను విశ్రాంతి తీసుకోమని గత కొంత కాలంగా కోరుతున్నట్లు సమాచారం. అయితే ఇన్నాళ్లకు అమితాబ్‌ వారి కోరికను మన్నించినందుకు వారు సంతోషించే అవకాశం ఉంది.

మూడు తరాలపాటు ఏకఛత్రాధిపత్యం

అమితాబ్‌ బచ్చన్‌.. బాలివుడ్‌ను మూడు తరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన సూపర్‌ స్టార్‌. బిగ్ బి అమితాబ‌చ్చన్‌ ను చూస్తే నిజంగా 73 సంవ‌త్సరాల వ‌య‌సు పూర్తి చేసుకున్నారా అనిపిస్తుంది. న‌టుడిగా బాలీవుడ్ లో ఆయ‌న చేసిన‌న్ని ప్రయోగాలు ఎవ‌రు చేయ‌లేదంటే అతిశ‌యోక్తికాదు. కెరీర్ ప్రారంభంలో కొంగ‌లా వున్నాడు ఇత‌నొక హీరోనా.. అని ఎద్దేవా చేసినా వాళ్ల నోళ్లను.. త‌న టాలెంట్ తో త‌న స్టామినా ఏమిటో నిరూపించి మూయించాడు బిగ్‌బీ.

1969లో బాలివుడ్‌లో అమితాబ్‌ తొలి అడుగు

1969 సంవత్సరం ఫిబ్రవరి 15.... బాలీవుడ్ చరిత్రలో ఈ తేదీకి విశేష ప్రాధాన్యత ఉంది. ఓ లెజెండరీ యాక్టర్ కెరీర్‌కు నాంది పలికిన ముహూర్తం అది. అదే రోజున తొలి అడుగు వేసిన ఓ యువకుడు భవిష్యత్‌లో ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఓ లెజెండరీ సూపర్‌స్టార్‌గా నిలిచిపోయాడు. అతనే.. బిగ్ బి అమితాబ్‌బచ్చన్. ముంబయ్‌లోని ఫిల్మ్‌మేకర్ కె.ఎ.అబ్బాస్ ఆఫీస్ మెట్లు ఎక్కి ఆయన్ని కలిసి తన తొలి చిత్రం 'సాత్ హిందుస్తానీ' చిత్రానికి సైన్ చేశాడు. ఆ తర్వాత కెరీర్‌లో ఒక్కొక్క సినిమా చేసుకుంటూ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ.. బాలీవుడ్‌లో ఏ స్టార్ హీరోకి దక్కని రికార్డులను సొంతం చేసుకున్నాడు అమితాబ్.

అమితాబ్ తొలి పారితోషికం 300 రూపాయలు

ప్రపంచమంతా మెచ్చిన ఆయన గొంతు మొదట ఆలిండియా రేడియో లో వాయిస్ ఓవర్ ఉద్యోగానికి వెళ్లినప్పుడు తిరస్కరణకు గురైంది. మృణాల్ సేన్ సినిమాలో వాయిస్ ఓవర్ తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అమితాబ్ బచ్చన్ కు తొలి పారితోషికం మూడు వందల రూపాయలు. కోల్ కతాలో ఉద్యోగం వదిలేసి వచ్చిన అమితాబ్, ముంబై మెరైన్ డ్రైవ్ దగ్గర బెంచ్‌పై గడిపిన నిద్ర లేని రాత్రులన్నీ భవిష్యత్తు మీద ఆలోచనలతోనే.. ఓ ఎక్స్ ట్రా వేషం కోసం స్టూడియో లైన్లలో నుంచుని ఉంటే.. బాలివుడ్‌ స్టార్‌ శశి కపూర్ దగ్గరి నుంచి అతనికి దొరికిన సమాధానం..నువ్వు ఏదో ఒక పెద్ద విషయం సాధించడానికి వచ్చిన వాడివి. నీ ప్రయాణం ఇక్కడ మొదలు కాకూడదు అంటూ వెన్నుతట్టాడు.

ఊరటనిచ్చిన రిషికేశ్ ముఖర్జీ సినిమా..

అవకాశాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన తరుణంలో అమితాబ్ కు ఊరటనిచ్చింది రిషికేశ్ ముఖర్జీ సినిమా..ఆనంద్. రాజేష్‌ ఖన్నా లాంటి సూపర్‌ స్టార్‌ పక్కన అమితాబ్‌ ఓ డాక్టర్‌ పాత్ర వేసాడు... రాజేష్‌ ఖన్నా లాంటి స్టార్‌ పక్కన అమితాబ్‌ తేలిపోతాడు అని అనుకున్నా.. క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశంలో అమితాబ్‌ రక్తి కట్టించాడు.

అమితాబ్‌ను మాస్‌ హీరోగా నిలబెట్టిన దీవార్‌

ఇక ఆ తర్వాత అమితాబ్‌ను సూపర్‌ స్టార్‌గా నిలబెట్టింది మాత్రం "దీవార్" చిత్రం . దీవార్‌ అమితాబ్ ని అమాంతం ఆకాశంలో కూర్చోబెట్టేసింది అంటే అతిశయోక్తి కాదు. ఆ చిత్రంలో అమితాబ్ వేసుకునే నీలిరంగు డెనిమ్ షర్టు.. ఖాకీ ప్యాంటు.. భుజం మీద వేలాడుతూ కనిపించే తాడు.. ఈ మూడింటితో అమితాబ్ బచ్చన్ కు ఎక్కడలేని యాంగ్రీ యంగ్ మాన్ లుక్ వచ్చేసింది. చొక్కాను కింది భాగంలో రెండు బటన్లు విప్పి.. కింద ముడేసి మాంచి రఫ్ గా బిగ్ బీ దీవార్ చిత్రంలో కనిపించడంతో అభిమానులు ఆ సినిమాను సూపర్ డూపర్ హిట్ చేశారు.

యువతను ఆకర్షించిన అమితాబ్‌ మాస్‌ లుక్‌

దీవార్‌లో అమితాబ్‌ కనిపించే వరకూ బాలివుడ్‌లో లవర్‌ బాయ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. దేవానంద్‌, సంజీవ్‌ కుమార్‌, రాజేష్‌ ఖన్నా లాంటి స్టార్లు ప్రేమ కథా చిత్రాలతో ప్రేమ రసం పండిస్తున్న సమయంలో అమితాబ్‌ ఆ ట్రెండ్‌ను బ్రేక్‌ చేశాడు. 70 వ దశకంలో దేశ వ్యాప్తంగా నెలకొన్న నిరుద్యోగం, పేదరికం లాంటి పరిస్థితులతో యువతలో అసహనం రేగింది. ఆ పరిస్థితులకు అద్దం పట్టేలాంటి సినిమాలు.. వాటిలోని పాత్రలకు తగ్గట్లుగా అమితాబ్‌ మాస్‌ లుక్‌ యువతను ఆకర్షించేసింది. అమితాబ్ మాస్‌ పాత్రల్లో పెట్టింది పేరుగా మారాడు.

రొమాంటిక్ రోల్స్ నుంచి యాంగ్రీ యంగ్ మ్యాన్

రొమాంటిక్ రోల్స్ నుంచి యాంగ్రీ యంగ్ మ్యాన్ గా అమితాబ్ ట్రాన్స్ ఫార్మ్ అయిన తీరు ఆయన టైమింగ్ సెన్స్ ని తెలియచేస్తుంది. రెండు పరస్పర విభిన్నమైన షేడ్స్ లో పరకాయ ప్రవేశం చేయడం అమితాబ్ కు వెన్నతో పెట్టిన విద్య. యశ్ చోప్రా, ప్రకాష్ మెహ్రా, రమేశ్ సిప్పీ..ఇలాంటి దిగ్దర్శక నిర్మాతల కు అమితాబ్ ఒక వరమైపోయాడు. ఇక జంజీర్, షోలే, డాన్‌, షాన్‌, నమక్‌ హలాల్‌, సిల్‌ సిలా, అమర్‌ అక్బర్‌ ఆంథోనీ, షరాబీ చిత్రాలు అమితాబ్‌ను బాలివుడ్‌లో తిరుగులేని నటుడిగా నిలబెట్టాయి. అమితాబ్ ఫేవరేట్ స్క్రీన్ పేరు విజయ్. ఈ పేరుతో ఆయన 20కి పైగా సినిమాల్లో దర్శనమిస్తాడు.

మిలీనియం స్టార్ గా అమితాబ్‌

పురస్కారాలు తిరస్కారాలు ..అవమానాలు..అవహేళనలూ..అన్నీ ఎదుర్కుని నిలిచాడు. భారతీయ సినిమాకి మేరు పర్వతమంత కీర్తిని తెచ్చి పెట్టాడు అమితాబ్ బచ్చన్. 2000 సంవత్సరం మిలీనియం సందర్భంగా బీబీసీ నిర్వహించిన పోల్‌లో అమితాబ్‌ మిలీనియం స్టార్ గా నిలిచాడు.

'కూలీ' షూటింగ్ లో అమితాబ్ కు గాయాలు

1983లో మన్మోహన్ దేశాయ్ తెరకెక్కించిన సూపర్‌హిట్ మూవీ 'కూలీ' సినిమా షూటింగ్ సమయంలో అమితాబ్‌బచ్చన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సమయంలో అతనికి 17 బాటిళ్ల రక్తాన్ని ఎక్కించాల్సి వచ్చింది. ఆ తర్వాత అమితాబ్ ఎన్నోసార్లు స్వయంగా రక్తదానం చేస్తూ దీని ఆవశ్యకత గురించి ప్రజల్లో ఎంతో ప్రచారం చేశాడు.

డిజార్డర్‌తో బాధపడి చికిత్స

'కూలీ'కి ముందు ఓసారి ఈ సూపర్‌స్టార్ ఓ అరుదైన మస్కులర్ డిజార్డర్‌తో బాధపడి చికిత్సపొందాడు. 1983లో దీపావళి వేడుకలో బిగ్-బి తన ఎడమ చేతిని కాల్చుకున్నాడు. దీంతో 1984లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'షరాబీ' సినిమాలో అమితాబ్ ఎన్నో సీన్లలో తన ఎడమ చేతిని ప్యాంట్ ఎడమ జేబులో పెట్టుకొని కనిపిస్తాడు. సినిమా విడుదల తర్వాత అభిమానులు, ప్రేక్షకుల్లో ఇది ఓ స్టైల్‌గా మారింది.

అఫ్ఘనిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లో సగాన్ని బచ్చన్‌ రక్షణకు

1992లో అఫ్ఘనిస్తాన్‌లో 'ఖుదా గవా' షూటింగ్ సమయంలో అమితాబ్ అభిమాని అయిన ఆ దేశ అధ్యక్షుడు నజీబుల్లా అఫ్ఘనిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లో సగాన్ని బచ్చన్‌ రక్షణ కోసం ఏర్పాటు చేయడం విశేషం. ఈ సినిమాలో ఎక్కువ భాగం అఫ్ఘనిస్తాన్‌లోనే షూటింగ్ జరుపుకుంది. ఈ బాలీవుడ్ సూపర్‌స్టార్ భారతదేశ సినీ చరిత్రలోనే పొడవైన హీరోగా నిలిచిపోయాడు.

అమితాబ్‌ కౌన్‌ బనేగా క్రోర్‌పతి షోతో బుల్లితెరపై రంగప్రవేశం

బచ్చన్ జీవితంలో మరెన్నో కుదుపులు కూడా ఉన్నాయి. అమితాబ్ జీవితంలో ఇంకాస్త ముందుకెళితే అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు.. అది దివాళా తీయటం..! అదో కొత్త పాఠం ఆయనకి..! అయినా నిత్య విద్యార్ధిలా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. కౌన్ బనేగా కరోడ్ పతి తో తిరిగి నిలబడ్డాడు. 2000 సంవత్సరంలో అమితాబ్ 'కౌన్ బనేగా క్రోర్‌పతి' షోతో బుల్లితెర రంగ ప్రవేశం చేశాడు. ఈ షో ఇండియాలో రియాల్టీ, గేమ్ షోలకు నాంది పలికింది. ఇండియన్ టెలివిజన్ రంగంలో హయ్యస్ట్ టిఆర్‌పి రేటింగ్‌తో అప్పట్లో కెబిసి దూసుకుపోయింది. ఆ తర్వాత అమితాబ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా మొహబ్బతే సినిమాలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా అమితాబ్‌ కనిపించారు. ఈ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అమితాబ్‌ వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు.

పలు ఛాలెంజింగ్ పాత్రలు

బ్లాక్‌, పా, సర్కార్‌, షమితాబ్‌, ఇటీవల విడుదలైన పీకూ సహా అమితాబ్‌ ఏడు పదుల వయస్సులోనూ పలు ఛాలెంజింగ్ పాత్రలు పోషించారు. బ్లాక్‌ చిత్రానికి గానూ అమితాబ్‌ జాతీయ ఉత్తమనటుడు అవార్డును సైతం దక్కించుకున్నాడు. పా చిత్రం కోసం అమితాబ్‌ ప్రోజేరియా వ్యాధిగ్రస్తుడిగా ప్రోస్థెటిక్‌ మేకప్‌తో నటించి తనకు సాటిరాగల నటుడు మరెవరూ లేరని నిరూపించుకున్నాడు. పా చిత్రానికి సైతం అమితాబ్‌ ఉత్తమ జాతీయ నటుడు అవార్డును దక్కించుకున్నాడు. అమితాబ్‌ను దేశ విదేశాలు అవార్డులతో ముంచెత్తాయి. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో కేంద్రప్రభుత్వం సత్కరించింది. ఇక ఫ్రాన్స్‌ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారంతో అమితాబ్‌ను సన్మానించింది.

కెమెరా ముందు ఎంత భయపడతామో ప్రేక్షకులకు తెలియదు

తెరపై చూసే ప్రేక్షకులు తమని చాలా హ్యాపీ పర్సన్స్ అనుకుంటారనీ, కెమెరా ముందు తాము ఎంత భయపడతామో ప్రేక్షకులకు తెలియదంటారు బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌. పాత్ర కోసం పడే సంఘర్షణ, అంచనాల్ని అందుకోవాలనే తపనే తనను స్టార్‌ని చేసి, ఇన్నాళ్ళుగా ఆ స్టార్‌ డమ్‌ని నిలబెట్టిందని అమితాబ్‌ చెబుతారు. అమితాబ్‌ చెప్పింది అక్షర సత్యం. ఇప్పటికి కూడా అమితాబ్‌ బచ్చన్‌ బిగ్‌ స్టార్‌. సూపర్‌ స్టార్‌. అదే సమయంలో రిటైర్‌ కావాలన్న ఆయన నిర్ణయం అభిమానులకు శరాఘాతమే.

 

 

11:00 - September 19, 2015

కంగనా రనౌత్..బాలీవుడ్ నటి..ప్రస్తుతం ఆమె ఓ నటుడి విషయంలో చాలా ఎక్సైట్ అవుతోందంట. ఆయనతో నటించడం అంటే గొప్ప విషయమని పేర్కొంటోంది. ఆయనే బాలీవుడ్ బిగ్ బి 'అమితాబ్ బచ్చన్' వీరిద్దరూ కలిసి సినిమాలో నటిస్తున్నారా ? అని ఆశ్చర్యపోకండి. 'అమితాబ్', 'కంగనా' లు కలిసి ఓ యాడ్ లో నటించనున్నారు. కంగన బిగ్ బీ తో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి. సినిమా అయినా టీవీ యాడ్ అయినా అమితాబ్ తో కలిసి నటించడం అంటే గొప్ప విషయం కదా. దీంతో ఆమె చాలా ఎక్సైట్ అవుతోందట. వీళ్ళిద్దరూ కలిసి 'బోరో ప్లస్ క్రీం' యాడ్ లో కనిపించనున్నారు. 'పీకే' వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన రాజ్ కుమార్ హీరాని సూపర్ విజన్ లో జరుగుతోందంట. కరణ్ నార్వేకర్ ఈ యాడ్ కు డైరెక్టర్ అంట. 

Don't Miss

Subscribe to RSS - big b