banks

20:41 - December 12, 2017

మీ సొమ్ముకు భరోసా పోతోందా? భద్రంగా బ్యాంకుల్లో ఉందనుకున్న సొమ్ము ఏ రాత్రో చడీ చప్పుడు కాకుండా గుటుక్కుమంటుందా? బ్యాంకులు ఏ మాత్రం నమ్మకాన్ని ఇవ్వటానికి రెడీగా లేవా? ఇప్పటికే జీఎస్టీ, నోట్ల రద్దు.. అంటూ ప్రయోగాలు చేసిన మోడీ సర్కారు.. ఐఎఫ్ డి ఆర్ బిల్లుతో బ్యాకింగ్ రంగాన్ని సామాన్యులకు ఉపయోగపడని విధంగా, అపనమ్మకంగా మార్చే ప్రమాదం ఉందా. ప్రపంచం ఏ స్థాయిలో ఆర్ధిక ఒడిదుడుకులను చూసినా, మన దేశం ఒకింత సురక్షితంగా ఉందనే చెప్పాలి. దీనికి కారణం మన సుస్థిమైన బ్యాంకింగ్ వ్యవస్థ. ఇందులో కూడా వేలకు వేలు అప్పులిచ్చి... బ్యాంకులు వసూలు చేయటేని సందర్భాలున్నా.. ఇప్పటికైనా సామాన్యుడి నమ్మకాన్ని కోల్పోలేదనే చెప్పాలి. మరి ఈ పరిస్థితి భవిష్యత్తులో కనిపించదా?

ఈ మాటలోనే కొండంత భరోసా.. అంతులేని భద్రత..మన సొమ్ము ఎటూ పోదన్న నమ్మకం.. భవిష్యత్తు పట్ల ఆశ.. మరి ఇదంతా గతం కానుందా? భవిష్యత్తులో బ్యాంకుల తీరు పూర్తిగా మారనుందా? ఇప్పటివరకు బ్యాంకులు దివాలా తీస్తే ఏం చేసేవారు? ఎఫ్ ఆర్ డీ ఐ చట్టంగా మారితే జరిగే మార్పులేంటి?ఇలాగే సాగితే బ్యాంకుల ప్యూచర్ ఏంటో అర్ధం కాని సిచ్యుయేషన్.. సామాన్యుడి సొమ్ము ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి. ఓ పక్క బడాబాబులకు వేల కోట్లు ధారాదత్తం చేసే బ్యాంకులు సామాన్యుడి సొమ్ము విషయంలో కుట్రలకు దిగుతున్నాయి. కష్టపడి సంపాదించిన సొమ్మును కాజేసే నీచప్రయత్నాలకు దిగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. మోడీ సర్కారు సామాన్యుడి జీవితాలతో చేస్తున్న ప్రయోగాలే ఇవి అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలోనిదంతా ప్రైవేటు పరంచేసే ప్రయత్నాలు..జాతి ఆస్తులను ఎగనమ్మే కుట్రలు..ఉమ్మడి సొత్తును కాజేసే దారుణ ప్రయత్నం.. సుస్థిర బ్యాంకింగ్ వ్యవస్థను బలహీన పరిచే ప్రయత్నాలు..బ్యాంకుల అప్పుల భారాన్ని ప్రజలపై రుద్దే కుట్రలు.. ఇవన్నీ ఇప్పుడు కనిపిస్తున్న అంశాలు.. ఇవేవీ మన దేశానికి సురక్షితం కాదని పరిశీలకులు తేల్చి చెప్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

 

21:31 - November 3, 2017

ఢిల్లీ : ఆధార్‌ను తమ ఖాతాలతో అనుసంధానం చేసుకోకుంటే అకౌంట్లు నిలిపివేస్తామని బ్యాంకులు, మొబైల్‌ కంపెనీలు వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌లు పంపుతూ ఒత్తిడి పెంచడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాంకులు, టెలికాం సంస్థలు ఆధార్ లింకింగ్ సందేశాలు పంపితే అందులో కచ్చితంగా చివరి తేదీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బ్యాంక్‌ ఖాతాలు, మొబైల్‌ నెంబర్లతో ఆధార్‌ అనుసంధానాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారిస్తూ సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్లపై బదులివ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింకేజీ కోసం డిసెంబర్‌ 31, మొబైల్‌ నెంబర్‌కు ఆధార్‌తో లింకేజీ కోసం ఫిబ్రవరి 6 గడువు విధించినట్లు కేంద్రం కోర్టుకు తెలిపింది.

16:56 - October 30, 2017

ఫైనాన్స్ : దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులు తమ ఏటీఎంలను తగ్గించేందుకు బ్యాంకులు నిర్ణయాలు తీసుకున్నాయి. 2017లో ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు వివిధ బ్యాంకులు 358 ఏటీఎంలను శాశ్వతంగా మూసివేశాయి. దేశవ్యాప్తంగా ఎస్ బీఐకి 59వేల 291ఏటీఎంలు ఉంటే అందులో 91ఏటీంలను మూసివేసింది. అలాగే హెచ్ డీఎఫ్ సీ, పంజాబ్ నేషనల్ బ్యాంకులు ఐదు చొప్పున ఏటీంలు మూసివేశాయి. మిగతా బ్యాంకులు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. బ్యాంకుల ఏటీఎంల నిర్వహణ భారంగా మారింది. ఢిల్లీ, ముంబై, బెంగళూర్, చెన్నై, హైదరాబాద్, కోల్ కత్తా వంటి మెట్రోపాలిటన్ సిటీలో ఏటీఎంల నిర్వహణ భారంగా మారింది. ఈ నగరాల్లో ఏటీఎంల నిర్వహణకు నెలకు దాదాపు 50వేల వరకు ఖర్చు అవుతున్నట్టు బ్యాంకులు చెబుతున్నాయి. 

21:51 - October 9, 2017

 

ముంబై : భారత ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో సాగడం లేదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు తగ్గిపోవడం, వృద్ధిరేటు మందగింపు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు భయాలతో... ఆర్థిక వ్యవస్థ.. ఇబ్బందుల్లో ఉందని ప్రజలు భావిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. పలు అంశాలపై రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన సర్వేలో పలు కఠిన వాస్తవాలు వెలువడ్డాయి. ఇటీవల మధ్యంతర పరపతి సమీక్షలో గ్రోత్‌రేట్‌ను 7.3 శాతం నుంచి 6.7శాతానికి తగ్గించిన రిజర్వ్ బ్యాంక్.. ఆ తరువాత.. తమ సర్వేల నివేదికను బయటపెట్టింది. ఈ సర్వేతో ఆర్థిక వ్యవస్థ భవితవ్యంపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. 

20:23 - September 29, 2017

ప్రకాశం : జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో మరో కుంభకోణం వెలుగుచూసింది. గత కొంతకాలంగా నిత్యం ఏదో ఒక కుంభకోణం వెలుగుచూస్తూనే ఉంది. బ్యాంక్‌లో ఏం జరుగుతుందో తెలియక ప్రస్తుతం డైరెక్టర్లు.. చైర్మన్‌ ఈదర మోహన్‌కు ఎదురుతిరిగారు.  చైర్మన్‌పై అనేక అభియోగాల నేపథ్యంలో... డైరెక్టర్లు అంతా సీఎం చంద్రబాబును కలిశారు. మరో వైపు బ్యాంక్‌ చైర్మన్‌ మూడు రోజులుగా పత్తాలేకుండా పోయాడు. ఇదిలావుంటే అవకతవకలకు పాల్పడిన రికార్డులను అర్ధరాత్రే తరలించాడని డైరెక్టర్లు అంటున్నారు. 

 

11:51 - June 25, 2017

హైదరాబాద్ : సకాలానికి వచ్చిన వానలు ఆశలు నింపితే.. బ్యాంకుల తీరు అన్నదాతలకు మింగుడుపడటం లేదు. ఖరీఫ్‌ ప్రారంభానికి ముందే రుణప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సి ఉండగా.. తొలకరి ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా.. ఇంకా లెక్కలతో కుస్తీపడుతున్నాయి బ్యాంకులు. ప్రభుత్వం రుణమాఫీ అంటూ తెగ హడావిడి చేసినా .. తమకేం ఒరిగిందని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. కోటి ఆశలతో ఖరీఫ్‌ సాగు చేపట్టిన రైతు పెట్టుబడి కోసం దిక్కులు చూస్తున్న పరిస్థితి నెలకొంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలకు కూలీ డబ్బుల కోసం రైతుకు ధనం అవసరం. సీజన్ ప్రారంభానికి ముందే తయారు కావాల్సిన ఖరీఫ్ ప్రణాళిక నేటికీ తయారు కాలేదు. తొలకరికి ముందే మేనెలలోనే రుణ ప్రణాళిక ప్రకటించాల్సిన బ్యాంకులు.. సీజన్‌ ప్రారంభమైన నెలరోజలకు సమావేశం అయ్యాయి.

39 వేల కోట్ల రూపాయలు..
ఈ ఖరీఫ్‌లో 39 వేల కోట్ల రూపాయలు రైతులకు రుణాలు అందించాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే ఈ నిర్ణయం ఆదేశంగా మారి, క్షేత్ర స్థాయికి వేళ్లేందుకు కనీసం 20 రోజులు పడుతుందంటున్నారు రైతు సంఘాల నేతలు. అప్పుడైనా రుణం అందుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే రైతులకు అమలు చేస్తున్న రుణమాఫీ ప్రధాన అడ్డంకిగా మారింది. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన రుణమాఫీ ప్రహసనంగా మారింది. గత సంవత్సరం 87 శాతం రుణ లక్ష్యాన్ని చేరుకున్నామని బ్యాంకర్ల కమిటీ ప్రకటించింది. కానీ వాస్తవం మరో రకంగా ఉంది. వేల కోట్ల రూపాయల రుణమాఫీ సొమ్మును పాతఅప్పులు, వాటివడ్డీలకే జమవేసుకున్న బ్యాంకులు ..పుస్తకాల్లో మాత్రం కొత్తరుణాలు ఇచ్చినట్టు రాసిపెట్టుకున్నాయి. దీనిపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. సహకార బ్యాంకులకు ప్రభుత్వం సపోర్ట్‌చేస్తే.. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రుణాలు అందుతాయంటున్నారు.

రైతుకు నగదు అందుతుందా ?
మరో వైపు ముమ్మాటికి ఇది రైతు రాజ్యం.. రుణమాఫీయే దీనికి సాక్ష్యం అంటూ ప్రకటనలిస్తోంది కేసిఆర్ సర్కార్. రైతు రాజ్యంలో రైతన్నలకు చేసిన రుణమాఫీ వడ్డీకే సరిపోయిందంటున్నారు అన్నదాతలు. రుణమాఫీ విడతల వారీగా జరగటంతో కొత్త రుణం ఇవ్వకుండా బ్యాంకులు ఇచ్చినట్టు నమోదు చేసుకుంటుండంతో పంటలకు పెట్టుబడి కోసం కర్షకులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మూడు రూపాయల నుండి ఐదు రూపాయల వరకు వడ్డీకి అప్పులు తెచ్చి మరీ సేద్యం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకటించిన రుణ ప్రణాళిక ఆచరణలోకి రావడానికి మరో నెల రోజులు పడుతుంది. అప్పుడు క్షేత్ర స్థాయిలో బ్యాంకులు కనికరించినా రైతుకు నగదు అందుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతుంది.

మంత్రుల అసహనం..
బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రులు బ్యాంకర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. బ్యాంకులకు సామాజిక సృహ ఉండాలన్నారు. పదిహేడు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే రైతులకు సరైన ప్రయోజనం కలగలేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మంత్రుల వ్యాఖ్యలకు ప్రాధాన్యత చేకూరింది. రుణ మాఫీపై వడ్డీ వేయడంతో రైతులకు భారంగా మారింది అనే విమర్శలు వినిపిస్తున్న సందర్భంలో మంత్రుల వ్యాఖ్యలు బ్యాంకుల తీరుకు అద్దం పట్టాయి. రుణమాఫీతో సంబంధం లేకుండా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. అధిక వడ్డీలతో అన్నదాతల నడ్డి విరుస్తున్న ప్రయివేటు వడ్డీ వ్యాపారుల బారి నుండి కాపాడి సకాలంలో పంట రుణాలిస్తే రైతు ఆత్మహత్యలు నిలిచిపోతాయి. ఈ సారైనా రుణాల్ని అందించే విషయంలో బుక్ అడ్జెస్ట్ మెంట్ లు జరగకుండా రుణం అందించాలని రైతులు కోరుతున్నారు.

13:47 - June 22, 2017

నోట్ల రద్దు..రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు ప్రజాజీవితంపై పెద్ద మార్పు తీసుకొచ్చింది. ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉగ్రవాదం..అవినీతి..డిజిటల్ పేమెంట్ లను ప్రోత్సాహించాలని నోట్ల రద్దుకు కారణం అని కేంద్రం పేర్కొంది. మరి డిజిటల్ పేమెంట్ లు పెరిగాయా ? తగ్గాయా ? వాస్తవంగా పెరగాల్సి ఉంటుంది. కానీ నోట్ల రద్దు అనంతరం కొద్దిగా డిజిటల్ పేమెంట్ లు పెరిగాయి. తరువాత రోజుల్లో ఈ పేమెంట్లు తగ్గిపోతున్నాయి. ఈ విషయాన్ని ఓస్వాల్ సెక్యూర్టీస్ సంస్థ పేర్కొంది. ముంబయికి చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యవహారాలను చూస్తుంటుంది. డిజిటల్ పేమెంట్ల విషయంలో పలు విషయాలను ఓస్వాల్ సెక్యూర్టీస్ వెల్లడించింది. నోట్ల రద్దు అనంతరం డిజిటల్ పేమెంట్ ల విషయంలో పెద్దగా మార్పు రాలేదని వెల్లడించడం గమనార్హం. నోట్లు రద్దు చేసిన తొలి రోజుల్లో డిజిటల్ పేమెంట్లు పెరిగినా మళ్లీ తగ్గిపోతున్నాయని పేర్కొంది. నోట్ల రద్దు పూర్వపు రోజులకు ఇప్పటికీ తేడా ఏమీ లేదని వెల్లడించడం విశేషం.

12:15 - May 6, 2017

హైదరాబాద్ : మొండి బకాయిల సమస్య పరిష్కారం దిశగా పెద్ద ముందడుగు పడింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి సవరణ జరిగింది. ఈ మేరకు కేంద్రం రూపొందించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ప్రజల సొమ్మును రుణాల రూపంలో తీసుకొని ఎగ్గొట్టే సంస్థలకు ఈ చట్టంతో ముకుతాడు పడనుంది. 
ఆర్‌బీఐకి మరిన్ని చట్టబద్ధమైన అధికారాలు
మొండి బకాయిలు-ఎన్ పీఏల సమస్య పరిష్కారం దిశగా ఆర్‌బీఐకి మరిన్ని చట్టబద్ధమైన అధికారాలను కేంద్రం కట్టబెట్టింది. ఇందుకు సంబంధించి బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం 1949లోని సెక్షన్‌ 35కి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్రం రూపొందించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. మొండిబకాయిల వసూళ్ల విషయంలో ఇదే విప్లవాత్మకమైన అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. 
ఎన్‌పీఏల పరిష్కారంలో కీలక అడుగు
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్‌పీఏలు 6 లక్షల కోట్లకు పైగా పెరిగిపోయిన నేపథ్యంలో కేంద్రం తాజా చర్యలను దిగింది. మొత్తం దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో 2016 డిసెంబర్‌ నాటికి ఎన్‌పీఏలు 7లక్షల కోట్లను దాటాయి. విద్యుత్తు, స్టీల్, మౌలిక సదుపాయాలు, టెక్స్‌టైల్స్‌ రంగాలకు ఇచ్చిన రుణాలు ఎక్కువగా మొండి బకాయిలుగా మారాయి. తాజా ఆర్డినెన్స్‌తో ''రుణ ఎగవేత దారుల విషయంలో 'ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బాంక్రప్టసీ కోడ్‌ 2016' నిబంధనల కింద దివాలా పరిష్కార చర్యలు చేపట్టాలని ఏ బ్యాంకునైనా ఆర్‌బీఐ ఆదేశించగలదు'' అని కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ పేర్కొంది. దీంతో నిర్ణయంతో... ఎన్‌పీఏల సమస్య పరిష్కారానికి బ్యాంకులకు సూచనలు ఇచ్చేందుకు ఒకటికి మించిన యంత్రాంగాలను ఏర్పాటు చేసే అధికారం ఆర్‌బీఐకి ఇచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు ఇక తాజా రుణాలు లభించడం కష్టమే. వారిపై నిషేధం విధించాలని బ్యాంకులను ఆర్‌బీఐ కోరవచ్చు. అంతేకాదు, రుణ ఎగవేతదారులను కంపెనీల బోర్డుల్లో డైరెక్టర్లుగా నియమించుకోవడం కూడా ఇకపై కుదరదు. మొండి బకాయిల సమస్య పరిష్కారానికి బ్యాంకర్లు తీసుకునే నిర్ణయాల విషయంలో సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్, సీబీఐ, కాగ్, ఈడీ తదితర దర్యాప్తు సంస్థల నుంచి బ్యాంకర్లకు కొత్త చట్టం రక్షణ కల్పి స్తోంది. దర్యాప్తు సంస్థల విచారణ భయాలతో బ్యాంకర్లు.. ఎన్‌పీఏల పరిష్కారానికి చొరవ చూపించడం లేదు. తాజా ఆర్డినెన్స్‌తో ఆ భయాలు తొలగుతాయి. మొండి బకాయిల ఖాతాల విషయంలో పరిష్కార చర్యలు చేపట్టేందుకు బ్యాంకులకు మరింత నియంత్రణ లభిస్తుంది. కొత్త చట్టంతో రుణ ఎగవేతదారులను కంపెనీల యాజమాన్యం, ఓటింగ్‌ హక్కుల నుంచి తప్పుకోవాలని బ్యాంకులు ఆదేశించగలవు. వారి స్థానంలో కొత్త యాజమాన్యాన్ని ఏర్పాటు చేసి నిర్దేశిత కాలంలోగా పునరుద్ధరణ బాట పట్టించే చర్యలు చేపట్టొచ్చు. 
రూ.6లక్షల కోట్లకు పెరిగిన మొండిబకాయిలు
ప్రస్తుతం బ్యాంకింగ్‌ సవరణలు ఆర్డినెన్స్‌ రూపంలోనే ఉండటంతో దీని గడువు ఆరు నెలలు మాత్రమే. దీంతో వీలైనంత త్వరగా చట్టంలో సవరణలకు సంబంధించిన బిల్లు పార్లమెంటు ముందుకు రావాలని కేంద్రం భావిస్తోంది. ఈ వర్షాకాల సమావేశాల్లోనే సవరణ బిల్లు పార్లమెంటులో చర్చకు వచ్చే అవకాశముంది. మొత్తానికి దేశ ఆర్థిక వ్యవస్థకు చీడపీడగా మారిన మొండిబకాయిల సమస్య పరిష్కారానికి బ్యాంకులకు కొత్త అస్త్రం దొరికిందంటున్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు.  

15:08 - April 24, 2017

నల్గొండ : జిల్లాలో మానవత్వం మంటగలిసింది. ఓ వృద్ధుడు చనిపోయినా ఎవరూ పట్టించుకోలేదు. బ్యాంకులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. క్లాక్ టవర్ సమీపంలో ఉన్న బ్యాంకుకు నాగేశ్వరరావు వృద్ధుడు వచ్చాడు. క్యూలో నిలుచున్న ఇతడు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అక్కడనే ఉన్న వారు ఓ గోడ వైపుకు కూర్చొబెట్టి సపర్యలు చేశారు. అనంతరం ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ఆ వృద్ధుడు పరిస్థితి ఎలా ఉందో ఎవరూ గమనించలేదు..చూడలేదు. చివరకు అతడిని చూసిన కొంతమంది అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందాడని గుర్తించారు. ముందే ఒకవేళ ఎవరైనా గుర్తించి ఆసుపత్రికి తరలిస్తే బతికి ఉండేవాడోమన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

14:34 - March 10, 2017

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎటిఎంలో 2 వేల నకిలీ నోటు వెలుగు చూసింది. చందన్‌ రాయ్‌ సంగమ్‌ విహార్‌లోని ఐసిఐసిఐ బ్యాంకు ఎటిఎం నుంచి 2 వేలు విత్‌ డ్రా చేయగా నకిలీ నోటు వచ్చింది. 2 వేల నోటుపై చిల్డ్రన్‌ బ్యాంక్‌ అని రాసి ఉంది. అతని అకౌంట్‌ నుంచి రెండు వేలు కట్‌ అయినట్లుగా మెసేజ్‌ వచ్చింది. చందన్‌ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చందన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఎటిఎంను సీజ్‌ చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన మార్చి 7న జరిగింది. ఇంతకు ముందు ఎస్‌బిఐ ఎటిఎం నుంచి చిల్డ్రన్‌ బ్యాంక్‌ అని రాసి ఉన్న నకిలీ 2 వేల నోట్లు రావడం తెలిసిందే.

Pages

Don't Miss

Subscribe to RSS - banks