bank loans

20:41 - December 12, 2017

మీ సొమ్ముకు భరోసా పోతోందా? భద్రంగా బ్యాంకుల్లో ఉందనుకున్న సొమ్ము ఏ రాత్రో చడీ చప్పుడు కాకుండా గుటుక్కుమంటుందా? బ్యాంకులు ఏ మాత్రం నమ్మకాన్ని ఇవ్వటానికి రెడీగా లేవా? ఇప్పటికే జీఎస్టీ, నోట్ల రద్దు.. అంటూ ప్రయోగాలు చేసిన మోడీ సర్కారు.. ఐఎఫ్ డి ఆర్ బిల్లుతో బ్యాకింగ్ రంగాన్ని సామాన్యులకు ఉపయోగపడని విధంగా, అపనమ్మకంగా మార్చే ప్రమాదం ఉందా. ప్రపంచం ఏ స్థాయిలో ఆర్ధిక ఒడిదుడుకులను చూసినా, మన దేశం ఒకింత సురక్షితంగా ఉందనే చెప్పాలి. దీనికి కారణం మన సుస్థిమైన బ్యాంకింగ్ వ్యవస్థ. ఇందులో కూడా వేలకు వేలు అప్పులిచ్చి... బ్యాంకులు వసూలు చేయటేని సందర్భాలున్నా.. ఇప్పటికైనా సామాన్యుడి నమ్మకాన్ని కోల్పోలేదనే చెప్పాలి. మరి ఈ పరిస్థితి భవిష్యత్తులో కనిపించదా?

ఈ మాటలోనే కొండంత భరోసా.. అంతులేని భద్రత..మన సొమ్ము ఎటూ పోదన్న నమ్మకం.. భవిష్యత్తు పట్ల ఆశ.. మరి ఇదంతా గతం కానుందా? భవిష్యత్తులో బ్యాంకుల తీరు పూర్తిగా మారనుందా? ఇప్పటివరకు బ్యాంకులు దివాలా తీస్తే ఏం చేసేవారు? ఎఫ్ ఆర్ డీ ఐ చట్టంగా మారితే జరిగే మార్పులేంటి?ఇలాగే సాగితే బ్యాంకుల ప్యూచర్ ఏంటో అర్ధం కాని సిచ్యుయేషన్.. సామాన్యుడి సొమ్ము ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి. ఓ పక్క బడాబాబులకు వేల కోట్లు ధారాదత్తం చేసే బ్యాంకులు సామాన్యుడి సొమ్ము విషయంలో కుట్రలకు దిగుతున్నాయి. కష్టపడి సంపాదించిన సొమ్మును కాజేసే నీచప్రయత్నాలకు దిగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. మోడీ సర్కారు సామాన్యుడి జీవితాలతో చేస్తున్న ప్రయోగాలే ఇవి అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలోనిదంతా ప్రైవేటు పరంచేసే ప్రయత్నాలు..జాతి ఆస్తులను ఎగనమ్మే కుట్రలు..ఉమ్మడి సొత్తును కాజేసే దారుణ ప్రయత్నం.. సుస్థిర బ్యాంకింగ్ వ్యవస్థను బలహీన పరిచే ప్రయత్నాలు..బ్యాంకుల అప్పుల భారాన్ని ప్రజలపై రుద్దే కుట్రలు.. ఇవన్నీ ఇప్పుడు కనిపిస్తున్న అంశాలు.. ఇవేవీ మన దేశానికి సురక్షితం కాదని పరిశీలకులు తేల్చి చెప్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

 

16:15 - November 18, 2017

ఖమ్మం : అన్నం పెట్టే రైతన్నకు అడుగడుగునా కష్టాల కడగండ్లే ఎదురవుతున్నాయి. అష్టకష్టాలు పడి అందినకాడికి అప్పులు తెచ్చి పండించిన పంట చేతికి వచ్చేసమయానికి దోమ కాటు సోకి పంట పూర్తిగా దెబ్బతినడంతో దిక్కుతోచని రైతు తన వరి పైరుకు నిప్పటించుకున్న సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు గ్రామంలో ఈ ఏడాది వర్షాలు కురవడం.. చెరువులు నిండటంతో రైతులు పెద్ద ఎత్తున వరిసాగు చేశారు. దానికి తోడుగా భక్త రామదాసు ప్రాజెక్ట్‌ నుండి నీటిని విడుదల చేయడంతో రైతన్నలు సంతోషంగా వరి సాగు చేశారు. పంట చేతికి అందే సమయానికి దోమ కాటు రైతన్నల పాలిట శాపంగా మారింది. 

గ్రామానికి చెందిన గమిని రామచంద్రు తనకున్న ఎకరం పొలంతో పాటు మరో మూడెకరాల పొలం కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేశాడు. వరి పంట సాగు కోసం దాదాపు లక్ష రూపాయల వరకు అప్పుచేసి మరీ పెట్టుబడి పెట్టాడు. ఇంకో ఇరవై రోజుల్లో పంట చేతికి వస్తుందనుకున్న రామచంద్రుకి నిరాశే మిగిలింది. దోమకాటుతో పంట మొత్తం గింజ లేకుండా నాశనం అయ్యిందని రైతన్న ఆవేదన వ్యక్తం చేశాడు. దోమకాటు నివారణకి మందులు పిచికారీ చేసినా ఉపయోగం లేకుండా పోయిందని వాపోతున్నాడు. బ్యాంక్‌ నుండి క్రాప్‌ లోన్‌ తీసుకున్న సమయంలో ఇన్సూరెన్స్‌ చేయించుకున్నాడు. పంట నష్టం గురించి బ్యాంక్‌ అధికారులకు తెలియచేసి.. తనకు ఇన్సూరెన్స్‌ ఇప్పించాలని కోరాడు. ప్రభుత్వం నుండి ఆదేశాలు లేవని బ్యాంక్‌ అధికారులు తెలియజేయడంతో.. మనస్తాపానికి గురైన రైతు రామచంద్రు తన పంటకి తానే నిప్పంటించుకున్నాడు.

దోమ కాటు నివారణకు మందులు కొట్టినా  ఉపయోగంలేకుండా పోయిందని గ్రామ రైతులు వాపోతున్నారు. మందులు ప్రయోగించిన తర్వాత మరింత ఎక్కువ వ్యాప్తి చెందుతుందని రైతులు అంటున్నారు.  ప్రభుత్వం మందుల షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పంట నష్టపోయిన రైతుకు నష్టపరిహారం అందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామంలోని సాటి రైతులు కోరుతున్నారు.

17:25 - October 22, 2017

వరంగల్ : త్వరలోనే వరంగల్ బంగారు వరంగల్ గా మారుతుందని..తరువాతే బంగారు తెలంగాణ మారుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. దేశ, విదేశీ సంస్థల భాగస్వామ్యంతో.. రూ.11వేల కోట్ల పెట్టుబడులతో.. మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. పరిశ్రమ శంకుస్థాపన రోజే రూ. 3,900 కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. 27వేల మందికి ప్రత్యక్ష ఉపాధి..50వేల మందిక పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.

సూరత్, షోలాపూర్, బివండిలో పనిచేస్తున్న వారందరూ తిరిగి రావాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధమైన పాలసీ తమదేనని, 50 కార్యక్రమాలు చేస్తున్నట్లు, రైతులకు రూ. 8వేల కోట్ల పెట్టుబడి సమకూర్చిన ప్రభుత్వం తమదేనన్నారు. తమ ప్రభుత్వం హాయంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టామన్న కేసీఆర్ పథకాల వివరాలను మరోసారి వివరించారు.

దేశంలో అతిపెద్ద టెక్స్ టైల్ పార్కును ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమన్నారు. ఆజంజాహి మిల్లు మూతపడడంతో నేతన్నలు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లారని తెలితపారు. సూరత్ లో మహిళలు ధరించే వస్త్రాలు..షోలాపూర్ లో దుప్పట్లు..రగ్గులు..తమిళనాడులో అండర్ గార్మెంట్స్ తయరావుతాయన్నారు. సూరత్, తమిళనాడు, షోలాపూర్ కలయికే వరంగల్ టెక్స్ టైల్ పార్కు అని తెలిపారు.

పంచాయతీ రాజ్ వ్యవస్థలో విప్లవత్మాకమైన చట్టాన్ని శాసనసభలో ప్రవేశ పెడుతామని, గిరిజనగూడెలు, లంబాడీ తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు సమయంలోపే నిర్వహిస్తామన్నారు. పరకాలలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని, ఇందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పరకాల నియోజకవర్గానికి రూ. 50 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

21:45 - October 9, 2017

కర్నూలు : ఒకప్పుడు అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కష్టాలు పెరిగిపోయాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలంలోని తంగడంచలో మెగాసీడ్‌ పార్క్‌కు శంకుస్థాపన చేసిన చంద్రబాబు... చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే సీడ్‌ పార్క్‌కు శంకుస్థాపన చేయడం తన అదృష్టమన్నారు. కాంగ్రెస్‌ హయాంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. రైతులకు నాసిరకం విత్తనాలు ఇచ్చేవారన్నారు. కష్టాల నుంచి రైతులను ఆదుకునేందుకే రుణమాఫీ హామీ ఇచ్చానన్నారు చంద్రబాబు. కొందరు రుణమాఫీ ద్వారా లబ్ధి పొంది తనపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇక రైతులకు మూడో విడత రుణమాఫీ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. రుణమాఫీ కింద 36.72 లక్షల మంది రైతులకు 3,600 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు.

అంతర్జాతీయ బ్లాక్‌చైన్‌ సదస్సు...
అంతకుముందు విశాఖలో పర్యటించిన చంద్రబాబు... అంతర్జాతీయ బ్లాక్‌చైన్‌ సదస్సును ప్రారంభించారు. 25 దేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన ప్రతినిధులతో సమావేశమైన చంద్రబాబు... బ్లాక్‌చైన్‌ నిపుణులందరినీ ఏకతాటిపైకి తీసుకువస్తామన్నారు. బ్లాక్‌ చైన్‌ పరిజ్ఞానంతో భవిష్యత్‌లో అద్భుతాలు సృష్టించవచ్చాన్నారు చంద్రబాబు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం టెక్నాలజీని వాడుకుంటుందన్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు... కోర్‌ డాష్‌ బోర్డును పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఇక అంతకుముందు విశాఖ పాండురంగాపురం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద భూగర్భ విద్యుత్‌ వ్యవస్థకు శంకుస్థాపన చేశారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా.. 675 కిలోమీటర్లు భూగర్భ విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

08:02 - September 7, 2017

ఆదిలాబాద్ : ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారంగా 5.19 లక్షల మంది రైతులుంటే, ఇందులో 50 శాతం మంది రైతులకు మాత్రమే బ్యాంకు రుణాలు అందుతున్నాయి. అవి కూడా అరకొరగా అందుతుండటంతో పెట్టుబడి కోసం దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇక బ్యాంకు గడప తొక్కని ఇతర రైతులు పూర్తిగా వ్యాపారులపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

వర్షాధార పంటలపైనే ఆధారపడాలి
ఆదిలాబాద్ జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం ఏడు లక్షల హెక్టార్ల వ్యవసాయభూమి ఉంది. అయితే ఏటా సాగయ్యే భూమి ఆరు లక్షల హెక్టార్లకు మించడం లేదు. సాగు నీటి సౌకర్యం 2.50 లక్షల హెక్టార్లకే ఉండటంతో.. ఎక్కువ మంది రైతులు వర్షాధార పంటలపైనే ఆధారపడాల్సి వస్తోంది. అధికారుల నివేదిక ప్రకారం జిల్లాలో కాలువల ద్వారా 60 వేల హెక్టార్లు, రిజర్వాయర్ల ద్వారా 72 వేలు, బావులు, బోర్లు తదితర వాటితో 50 వేలు, ఇతర సౌకర్యాల ద్వారా 28 వేల హెక్టార్ల భూమికి సాగు నీరందుతోంది. జిల్లాలో ఉన్న సాగు భూమిలో 32 శాతం భూమికి మాత్రమే సాగు నీరందుతుంది. దీంతో కాలం కలిసి రాక రైతులు ఏటా నష్టపోవాల్సి వస్తోంది. దీంతో తిరిగి పంట వేయటానికి దళారుల వద్ద మళ్లీ అప్పులు చేస్తున్నారు. ఇలా ఏటా అప్పులు పెరుగుతున్నాయే తప్ప లాభపడింది లేదని రైతన్నలు వాపోతున్నారు. అయితే జిల్లాలో ఈ ఏడాది పంట రుణాలు రూ.1323 కోట్లు ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. గతంతో పోలిస్తే రెండేళ్లలో వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం పెరిగినా రైతులను ఆదుకోవడంలో బ్యాంకులు వెనుకబడి ఉన్నాయి. అప్పులు తీసుకునే వారిలో సన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారు. పంటల సాగుకు పెట్టుబడి లేకపోవడంతో రైతులు వ్యాపారులపై ఆధారపడాల్సి వస్తోంది.

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
అయితే జిల్లాలో అటవీ భూమిని హక్కుగా పొంది సాగు చేసుకుంటున్న రైతులు 50 వేలకు పైగా ఉన్నారు. వారికి ప్రభుత్వం భూమి సాగు చేసేందుకు హక్కు కల్పించినా ఆ భూమిపై పంట రుణం పొందని పరిస్థితి ఉంది. ఎన్నోఏళ్లుగా ఏజెన్సీ ఏరియాలో భూములు సాగు చేసుకుంటున్న రైతులు ఉన్నారు. వారికి ఆ భూములపై పట్టాలు లేకపోవడంతో ఆయా రైతులు రుణాలు పొందడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి... తమకు రుణాలు బ్యాంకుల నుంచే లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. ఏజెన్సీ ఏరియాలో భూములు సాగుచేసుకునే రైతులకు కూడా రుణాలు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  

21:03 - August 4, 2017

శ్రీకాకుళం : ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనా రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు అటువైపు చూడటమే మానేశారు. కాయ కష్టం చేసినా, సేద్యానికి మదుపు దొరకడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదీ శ్రీకాకుళం జిల్లా రైతుల పరిస్థితి.
రైతన్నలకు చుక్కలు చూపిస్తున్న బ్యాంకులు  
శ్రీకాకుళం జిల్లాలో బ్యాంకులు రైతన్నలకు చుక్కలు చూపిస్తున్నాయి. పంట రుణాల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా..అప్పు మాత్రం పుట్టడం లేదు.ఖరీఫ్‌ రుణ లక్ష్యం 1580 కోట్లు ఉండగా ఇప్పటి వరకు 436 మందికి మాత్రమే రుణాలు అందాయి. వీరికి కోటి పదమూడు లక్షల రూపాయల రుణాలను మాత్రమే బ్యాంకులు అందిచాయి. కొత్తగా దరఖాస్తు చేసిన వారికి రుణ అర్హత కార్డులు, సాగు విస్తీర్ణ ధృవపత్రాలున్నా ఇంకా రుణాలు మంజూరు చేయలేదు. 
కౌలు రైతులకు బ్యాంకులు మొండి చేయి
శ్రీకాకుళం జిల్లాలో వరిసాగు విస్తీర్ణం రెండు లక్షల హెక్టార్లుగా ఉంది. ఇందులో లక్షా ఎనబై వేల మంది కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులకు బ్యాంకులు మొండి చేయి చూపించడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు అల్లాడుతున్నారు. సేద్యానికి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందని, బ్యాంకుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ముప్పై ఎనమిది మండలాల పరిధిలో 500 మంది రుణ ధరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ఇంకా దరఖాస్తు చేయని వారి సంఖ్య చాలానే ఉంది. ఈ తరుణంలో బ్యాంకులు రుణాలు మంజూరు చేసి, పెట్టుబడికి సహాయం అందించాలని రైతులు కోరుతున్నారు. సకాలంలో రుణాలు అందితే తప్ప ఖరీఫ్‌ సాగుకు పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు. జిల్లాలో కౌలు రైతులకు జాయింట్‌ లయిబులిటీ గ్రూపులు ఏర్పాటు చేసి పంట రుణాలు అందించాలని రైతు సంఘాలు డిమండ్‌ చేస్తున్నాయి. 

22:09 - July 21, 2017
16:47 - June 30, 2017

శ్రీకాకుళం : సిక్కోలు ఆంధ్రా బ్యాంక్ దేశంలోనే ఉత్తమ శిక్షణ సంస్థగా అవార్డును అందుకుంది.. శ్రీకాకుళం ఆంధ్రా బ్యాంక్ అబిర్డ్‌ సంస్థ సీ కేటగిరీ విభాగంలో ఎక్సలెన్సీ అవార్డు దక్కింది.. ఇంతటి ముఖ్యమైన పురస్కారాన్ని అందుకోవడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి. 2002 నవంబర్‌ 27న ఆంధ్రాబ్యాంక్‌ రూరల్‌ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రారంభమైంది.. అప్పటినుంచి నిరుద్యోగ యువతీ, యువకులకు వివిధ విభాగాల్లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది.. ప్రతి ఏడాది ఇందులో చేరేవారిసంఖ్య క్రమంగా పెరిగింది.. 2015-16 సంవత్సరంలో 32 బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చింది.. ఇందులో ట్రైనింగ్‌ పొందిన 816మంది టైలరింగ్‌, బ్యూటీపార్లర్‌, సెల్‌ఫోన్‌ రిపేర్‌, ట్యాక్సీ డ్రైవింగ్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, డీటీపీ, అగర్‌బత్తులు, సాఫ్ట్‌ టాయ్స్, జుట్‌ వస్తువుల తయారీరంగంలో స్థిరపడ్డారు.. వీరిలో దాదాపు 60శాతంమంది స్వయంఉపాదివైపు అడుగులువేశారు..

ఉచిత శిక్షణ, భోజనం
అనుభవజ్ఞులైనవారితో శిక్షణ, ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు నిరుద్యోగులకు వరంగా మారాయి.. కోర్సు పూర్తయ్యాక అర్హులైనవారికి సర్టిఫికేట్లుకూడా ప్రదానం చేస్తున్నారు.. యూనిట్‌ స్థాపించడానికి ముందుకువస్తే బ్యాంకులద్వారా రుణాలుకూడా మంజూరుచేస్తున్నారు. ఆంధ్రా బ్యాంకు శిక్షణ నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులునింపుతోంది.. జీవితంలో స్థిరపడే ఇంతమంచి అవకాశం కల్పిస్తున్న ఆంధ్రా బ్యాంక్‌కు యువత కృతజ్ఞతలు చెబుతున్నారు. ఆంధ్రాబ్యాంక్‌ ఒక్క నిరుద్యోగులకేకాదు.. రైతులకూ ఉపయోగపడే పలు కార్యక్రమాలు చేపట్టింది.. పాడి పశువులు, గొర్రెలు, పట్టుపురుగులు, వానపాముల పెంపకం, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శిక్షణ అందిస్తోంది.. బ్యాంక్‌ చేపట్టిన ఈ కార్యక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలవర్షం కురుస్తోంది.

11:51 - June 25, 2017

హైదరాబాద్ : సకాలానికి వచ్చిన వానలు ఆశలు నింపితే.. బ్యాంకుల తీరు అన్నదాతలకు మింగుడుపడటం లేదు. ఖరీఫ్‌ ప్రారంభానికి ముందే రుణప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సి ఉండగా.. తొలకరి ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా.. ఇంకా లెక్కలతో కుస్తీపడుతున్నాయి బ్యాంకులు. ప్రభుత్వం రుణమాఫీ అంటూ తెగ హడావిడి చేసినా .. తమకేం ఒరిగిందని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. కోటి ఆశలతో ఖరీఫ్‌ సాగు చేపట్టిన రైతు పెట్టుబడి కోసం దిక్కులు చూస్తున్న పరిస్థితి నెలకొంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలకు కూలీ డబ్బుల కోసం రైతుకు ధనం అవసరం. సీజన్ ప్రారంభానికి ముందే తయారు కావాల్సిన ఖరీఫ్ ప్రణాళిక నేటికీ తయారు కాలేదు. తొలకరికి ముందే మేనెలలోనే రుణ ప్రణాళిక ప్రకటించాల్సిన బ్యాంకులు.. సీజన్‌ ప్రారంభమైన నెలరోజలకు సమావేశం అయ్యాయి.

39 వేల కోట్ల రూపాయలు..
ఈ ఖరీఫ్‌లో 39 వేల కోట్ల రూపాయలు రైతులకు రుణాలు అందించాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే ఈ నిర్ణయం ఆదేశంగా మారి, క్షేత్ర స్థాయికి వేళ్లేందుకు కనీసం 20 రోజులు పడుతుందంటున్నారు రైతు సంఘాల నేతలు. అప్పుడైనా రుణం అందుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే రైతులకు అమలు చేస్తున్న రుణమాఫీ ప్రధాన అడ్డంకిగా మారింది. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన రుణమాఫీ ప్రహసనంగా మారింది. గత సంవత్సరం 87 శాతం రుణ లక్ష్యాన్ని చేరుకున్నామని బ్యాంకర్ల కమిటీ ప్రకటించింది. కానీ వాస్తవం మరో రకంగా ఉంది. వేల కోట్ల రూపాయల రుణమాఫీ సొమ్మును పాతఅప్పులు, వాటివడ్డీలకే జమవేసుకున్న బ్యాంకులు ..పుస్తకాల్లో మాత్రం కొత్తరుణాలు ఇచ్చినట్టు రాసిపెట్టుకున్నాయి. దీనిపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. సహకార బ్యాంకులకు ప్రభుత్వం సపోర్ట్‌చేస్తే.. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రుణాలు అందుతాయంటున్నారు.

రైతుకు నగదు అందుతుందా ?
మరో వైపు ముమ్మాటికి ఇది రైతు రాజ్యం.. రుణమాఫీయే దీనికి సాక్ష్యం అంటూ ప్రకటనలిస్తోంది కేసిఆర్ సర్కార్. రైతు రాజ్యంలో రైతన్నలకు చేసిన రుణమాఫీ వడ్డీకే సరిపోయిందంటున్నారు అన్నదాతలు. రుణమాఫీ విడతల వారీగా జరగటంతో కొత్త రుణం ఇవ్వకుండా బ్యాంకులు ఇచ్చినట్టు నమోదు చేసుకుంటుండంతో పంటలకు పెట్టుబడి కోసం కర్షకులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మూడు రూపాయల నుండి ఐదు రూపాయల వరకు వడ్డీకి అప్పులు తెచ్చి మరీ సేద్యం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకటించిన రుణ ప్రణాళిక ఆచరణలోకి రావడానికి మరో నెల రోజులు పడుతుంది. అప్పుడు క్షేత్ర స్థాయిలో బ్యాంకులు కనికరించినా రైతుకు నగదు అందుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతుంది.

మంత్రుల అసహనం..
బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రులు బ్యాంకర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. బ్యాంకులకు సామాజిక సృహ ఉండాలన్నారు. పదిహేడు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే రైతులకు సరైన ప్రయోజనం కలగలేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మంత్రుల వ్యాఖ్యలకు ప్రాధాన్యత చేకూరింది. రుణ మాఫీపై వడ్డీ వేయడంతో రైతులకు భారంగా మారింది అనే విమర్శలు వినిపిస్తున్న సందర్భంలో మంత్రుల వ్యాఖ్యలు బ్యాంకుల తీరుకు అద్దం పట్టాయి. రుణమాఫీతో సంబంధం లేకుండా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. అధిక వడ్డీలతో అన్నదాతల నడ్డి విరుస్తున్న ప్రయివేటు వడ్డీ వ్యాపారుల బారి నుండి కాపాడి సకాలంలో పంట రుణాలిస్తే రైతు ఆత్మహత్యలు నిలిచిపోతాయి. ఈ సారైనా రుణాల్ని అందించే విషయంలో బుక్ అడ్జెస్ట్ మెంట్ లు జరగకుండా రుణం అందించాలని రైతులు కోరుతున్నారు.

18:38 - June 11, 2017

అనంతపురం : అనంత రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అనంత రైతులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అసలే కరవుతో రైతులు అల్లాడిపోతుంటే, ప్రణాళిక ప్రకారం ముందుగా ఇవ్వాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడి, ఇన్సూరెన్స్‌ను విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వం వేరుశనగ విత్తన పంపిణీని చేపట్టింది. దీంతో అనంత వేరుశనగ రైతులు ఆగ్రహంతో మండిపడుతున్నారు.

చేతిలో డబ్బులు లేక ఇబ్బంది..
చేతిలో డబ్బులు లేక వేరుశనగ విత్తనాలను కొనలేక పోతున్నారు. పోనీ బ్యాంకుల్లో రుణాలు తీసుకుందామని అనుకున్నా, బ్యాంకర్లు లోన్స్ రెన్యువల్ చేయడం లేదు. కొన్ని బ్యాంకులు వడ్డీ కట్టించుకొని రెన్యువల్ చేస్తుండగా,.. చాలా బ్యాంకులు మాత్రం అంతా కడితేనే రెన్యువల్ చేస్తామంటున్నారు. దీంతో రైతులు తమ కష్టాలను ఏకరవు పెడుతుంటే.. ప్రభుత్వం మాత్రం ఏదోలా రైతులను ఆదుకుంటామనే అంటోంది. ఈనెలాఖరులోపు ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ను పంపిణీ చేస్తామని వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి అంటున్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఈనెలాఖరులోపు రైతులకు అందించేందుకు చర్యలు తీసుకొంటున్నామంటున్నారు.

ప్రభుత్వ రైతులు ఆగ్రహం
అసలు ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ ఇచ్చే డబ్బులు ముందుగానే ఇచ్చి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదంటున్నారు. విత్తనాల పంపిణీ ముందుగానే మొదలపెట్టి రైతులకు అందుబాటులోకి తెచ్చిన విధంగానే,. డబ్బులను కూడా ముందే ఇచ్చివుంటే బాగుండేదంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇన్‌పుట్‌ సబ్సిడి, ఇన్సూరెన్స్‌ పంపిణీని మొదలుపెట్టాలని.. రైతులు డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు ఖరీఫ్‌ లోన్స్‌ రెన్యువల్ విషయంలో కూడా వడ్డీ మాత్రమే కట్టించుకొని లోన్‌ను రెన్యువల్‌ చేయాలని కోరుతున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - bank loans