aryavardan raj

14:11 - September 18, 2015

హైదరాబాద్ : అందరు ఉండి తల్లిదండ్రులు వెన్నుతట్టి ప్రోత్సహించినా కొందరు ఫలితాలు సాధించరు. అలాంటి యువత నేటి సమాజంలో కోకొల్లలు. కాని ఓ యువకుడు ఎవరి మద్దతు లేకుండానే ప్రపంచానికి పరచయమయ్యాడు. అతనికి డాక్టరేట్‌లంటే ఎల్‌కేజీ, యూకేజీతో సమానం. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 18 భారత, అంతర్జాతీయ భాషలతో ప్రావీణ్యం పొందాడు. 12 భాషలను ఈజీగా చదవగలడు. ఇంతకి ఆ యువరాకెట్‌ ఎవరా అని ఆశ్చర్యపోతున్నారా అయితే ఈ స్టోరీ చూడండి.
నేపథ్యం...
ఆర్యవర్ధన్ రాజ్ హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని మనాలికి చెందినవాడు. జీవితంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండాలని కష్టపడి ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంటున్నాడు. 2013 నుంచి హైదరాబాద్‌లోనే ఉంటూ అనేక పరిశోధనలు చేస్తున్నాడు. తాళపత్ర గ్రంథాలలోని అపారమైన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ఇప్పటి వరకు ఆరువేల తాళపత్ర గ్రంధాలను సేకరించి భద్రపరిచాడు. మన దేశంలోని తాళపత్ర గ్రంథాలనే కాకుండా విదేశాలలోని యూనివర్సిటీలు, గ్రంధాలయాల నుంచి సేకరించి స్వంత ఖర్చులతో వాటిని డిజిటలైజ్ చేస్తున్నాడు.
సాంకేతిక పద్ధతలో భద్రత
భావితరాలకు విలువైన సమాచారాన్ని అందించాలని ఇప్పటి వరకు లక్ష 30వేల తాళపత్ర గ్రంధాలను సాంకేతిక పద్థతులలో భద్రపరుస్తున్నాడు. దేశ, విదేశాల నుంచి సేకరించిన గ్రంధాలలోని విషయాలను అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రాంతీయ భాషలలో వాటిని అనువదించి స్వంత సంస్థ ఆధ్వర్యంలో పుస్తకాలుగా ముద్రించి సామాన్యులకు అందిస్తున్నాడు.
మత గురువులు, ప్రవక్తల జీవిత విశేషాలు, రచలనపై పరిశోధనలు
ప్రపంచంలోని 527 మతాలపై...రామాయణం, మహాభారత, భాగవత, భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటి మత గ్రంధాలపై కాకుండా మత గురువులు...ప్రవక్తల జీవిత విశేషాలు, రచలనపై పరిశోధనలు చేస్తున్నాడు. విమర్శలు, విశ్లేషణలను సామాన్యులకు అర్ధమయ్యే విధంగా సమాచారాన్ని అందుబాటులో తీసుకువచ్చి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ప్రపంచ భౌగోళిక చరిత్ర, ప్రపంచ బానిసల చరిత్ర...మనస్తత్వ చరిత్ర, తత్త్వశాస్త్రం, వేశ్యల చరిత్ర, ప్రపంచ రాజకీయ, ఆర్ధిక చరిత్రలను వ్యాసాలుగా...గ్రంధాలుగా అందరికి అర్ధమయ్యే విధంగా ఆర్యవర్ధన్ రాజ్ అందిస్తున్నాడు.
వెయ్యికి పైగా కళాశాలలో గెస్ట్ లెక్చరర్స్
చరిత్రకారుడిగానే కాకుండా కవితలు, కథలు, గజల్స్, పాటలు, బొమ్మలు గీయడంలో తనదైన శైలిని చూపిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. తనే స్వంతగా కథను రాసుకొని స్వయంగా దర్శకత్వ బాధ్యతలను స్వీకరించి వాలి వధ-రామకథ షార్ట్ ఫిల్మ్ తీసి విడుదల చేశాడు. ఇందులో ఆరు అంతర్జాతీయ అవార్డులు, ఎనిమిది జాతీయ అవార్డులు...పదమూడు ప్రాంతీయ అవార్డులను అందుకొని రికార్డులు సృష్టించాడు. మతాలు, సాహిత్యం, చరిత్ర, రాజకీయ వ్యవస్థలపై జాతీయ, అంతర్జాతీయ యూనివర్సిటీలకు రీసెర్చ్ పేపర్స్‌కు అందిస్తూ అనేక విషయాలను తెలియచేస్తున్నాడు. మూడు వందల యూనివర్సిటీలు...వెయ్యికి పైగా కళాశాలలో గెస్ట్ లెక్చరర్స్ ఇస్తూ విద్యార్థులకు అనేక అంశాలపై అవగాహన కల్పిస్తున్నాడు.
మోస్ట్ స్టైలిష్ జీనియస్ ఇన్ వరల్డ్‌
చిన్న వయస్సులోనే డాక్టరేట్లు...ప్రాచీన కళలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్న ఆర్యవర్ధన్ రాజ్‌ను మోస్ట్ స్టైలిష్ జీనియస్ ఇన్ ద వరల్డ్‌గా ఆస్ర్టేలియా మేగ్జిన్ ప్రకటించింది. ప్రఖ్యాత ద హెరాల్డ్ సన్ మేగిజిన్ సర్వే చేసిన ద మోస్ట్ రొమాంటిక్ ఐస్ ఇన్ ద వరల్డ్‌గా ఎన్నికై ప్రపంచంలోనే ఎక్కువ ప్రజాదరణ పొందిన వ్యక్తుల్లో 20వ స్థానాన్ని దక్కించుకున్న ఆర్యవర్ధన్ రాజ్‌కు 10టీవీ కూడా కంగ్రాట్స్ చెబుతోంది.

 

 

Don't Miss

Subscribe to RSS - aryavardan raj