AP Bifurcation Promises

16:19 - August 25, 2018

కడప : మన పూర్వీకులు చెట్లు నాటి, అడవులు కాపాడటం వల్లే ఈ మాత్రమైనా పర్యావరణం ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కడపలో వనం మనం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు సీఎం. కొందరు స్వార్థపరులు పర్యావరణాన్ని దుర్వినియోగం చేశారన్నారు.. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్లనే కడపలో అనావృష్టి, కేరళలో అతివృష్టి నెలకొందన్నారు. వాతావరణాన్ని, పర్యావరణాన్ని కాపాడుకోకుంటే చాలా సమస్యలు తలెత్తుతాయని సీఎం అన్నారు.

 

13:48 - August 11, 2018

అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అనంతపురంలో సెల్‌ టవర్‌ ఎక్కి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భాస్కర్‌ను కిందికి దింపేందుకు అనంతపురం ఎమ్మెల్యేలు సెల్‌ టవర్‌ వద్దకు చేరుకున్నారు. భాస్కర్‌తో ఫోన్‌ మాట్లాడిన ఎమ్మెల్యేలు యువకుడిని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయం కేంద్రం పరిధిలో ఉందని.... కావాలంటే భాస్కర్‌ను సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

11:17 - August 11, 2018

అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతపురం జిల్లా ధర్మవరంలో  పెనుబోలు విజయ్‌ భాస్కర్‌ సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్యాయత్నం చేశాడు. ధర్మవరం రూరల్‌ పీఎస్‌ వద్ద సెల్‌ టవర్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఏపీకి ప్రత్యేక హోదాకోసం చనిపోతున్నానని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12:57 - August 10, 2018

ఢిల్లీ : కేంద్రానికి వ్యతిరేకంగా పార్లమెంటులో గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన చట్టం అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. చిత్తూరు ఎంపీ డాక్టర్‌ శివప్రసాద్‌.. హిజ్రా వేషధారణలో శివప్రసాద్‌ నిరసన వ్యక్తం చేశారు. మోదీబాబా ప్రత్యేక హోదా ఇవ్వకుంటే నీ అంతం ఆరంభం అంటూ.. హాస్య గీతం ఆలపించారు. మాటలెన్నో చెప్పావో.. చేతల్లో ఏమీ చూపలేదంటూ ఛలోక్తులు విసిరారు. 
 

17:33 - July 31, 2018

విశాఖ : అందరికీ ఇల్లు కట్టిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎస్.రాయవరం మండలం గుడివాడలో గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఎన్ టీఆర్ హౌసింగ్ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ 19 లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టామని అన్నారు. మరో 6 లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టామని తెలిపారు. మొత్తం 25 లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కాపులకు రిజర్వేషన్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కాపు రిజర్వేషన్లపై వైసీపీ రోజుకోమాట మాట్లాడుతోందని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం, కేసుల మాఫి కోసం వచ్చిన వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందన్నారు. కేంద్రం సహకరించకపోయినా ముందుకు దూసుకెళ్తున్నామని చెప్పారు. టీడీపీకి వెనుకబడిన వర్గాలు వెన్నెముకని అభివర్ణించారు. పేదవారిని ఆదుకుంటామని చెప్పారు. అందరి జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చిన పార్టీ టీడీపీ అని అన్నారు. 24వేల కోట్లకు పైగా రైతు రుణమాఫీ చేశామని తెలిపారు. అంగన్ వాడీల జీతాలను 10500 రూపాయలకు పెంచామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ ఉద్యోగులను అభినందించారు.

 

17:20 - July 31, 2018

విశాఖ : మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 సం.రాలు ఉన్న మత్స్యకారులందరికీ పించన్ ఇస్తామని చెప్పారు. అన్ని విధాలుగా అదుకుంటామని చెప్పారు. మత్స్యకారులకు అండగా ఉంటామని చెప్పారు. కారు డ్రైవర్లు ఓనర్లుగా మారాలన్నారు. మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ఆనందం, సంతోషం కల్గుతుందన్నారు.

 

20:23 - July 28, 2018

ప్రకాశం : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన హామీల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ ధర్మపోరాటం సభలో ఆయన పాల్గొన్నారు. విభజన చట్టం హామీల విషయంలో కేంద్రమే యూటర్న్‌ తీసుకుందని చంద్రబాబు మండిపడ్డారు. విపక్షాలు సైతం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయంటూ విరుచుకుపడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన టీడీపీ ధర్మ పోరాటం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. తాము గొంతెమ్మ కోరికల కోరడం లేదని.. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే ఎందుకు చేయడం లేదో సమాధానం చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

కేంద్రంపై అవిశ్వాసం పెట్టినప్పుడు దేశంలోని అన్ని పార్టీలు టీడీపీతో కలిసి వచ్చాయని, వైసీపీ అవిశ్వాసానికి మాత్రం ఎవరూ మద్దతు ఇవ్వలేదని గుర్తు చేశారు. కేసుల మాఫీ కోసం రాష్ట్ర హక్కుల్ని తాకట్టు పెట్టిన పార్టీ వైసీపీ అని చంద్రబాబు విమర్శించారు. జీవిత ఆశయంగా పోలవరాన్ని ఎంచుకున్నామన్నారు సీఎం చంద్రబాబు. 2019 కల్లా ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత తీసుకుంటామన్నారు.

ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వెన్నుపోటు పొడిచిందని మంత్రి నారా లోకేశ్‌ ఆరోపించారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి తెలుగు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్రం అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు సీఎం చంద్రబాబు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం బుల్లెట్‌లా దూసుకుపోతానని వెనుదిరిగే సమస్యేలేదని స్పష్టం చేశారు. విభజన హామీలపై పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీసిన టీడీపీ ఎంపీలను సీఎం సన్మానించారు.

21:11 - July 23, 2018

విశాఖపట్టణం : వైసీసీ చేపట్టిన బంద్‌కు ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని కోరుతూ వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళలు నల్ల చీరలతో ధర్నా నిర్వహించారు. సీఎం చంద్రబాబు చేసిన మోసం ప్రజలందరికీ తెలియజేసేందుకే రేపు బంద్‌ చేపట్టామన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్‌లో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నారని మహిళలు తెలిపారు. 

21:04 - July 23, 2018

అనంతపురం : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఊమెన్‌ చాందీ చెప్పారు. రాహుల్‌ ప్రధాని అయిన వెంటనే హోదా ఫైలు పైనే తొలి సంతకం చేస్తారని చెప్పారు. అనంతపురంలో కాంగ్రెస్‌ అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షా సమావేశం నిర్వహించిన చాందీ... హోదా అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ చేసిన ఈ తీర్మానంపై విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. 

19:58 - July 23, 2018

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఆగదని టీడీపీ ఎంపీలు మరోసారి స్పష్టం చేశారు. విభజన హామీల అమల్లో ప్రధాని మోదీ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. మోదీకి వ్యతిరేకంగా అన్ని స్థాయిల్లో ఉద్యమిస్తామని టీడీపీ ఎంపీలు ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌తో టీడీపీ ఎంపీలు పార్లమెంటు వెలుపల, లోపల ఆందోళన చేశారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ అన్నమయ్య వేషధారణలో ఆకట్టుకున్నారు. శుక్రవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని మోదీ.. ఏ ఒక్క అంశంపైనా స్పష్టత ఇవ్వలేదని టీడీపీ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్లకార్డులు పట్టుకుని పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. విభజన హామీలైన విశాఖ రైల్వే జోన్‌, కడప స్టీల్‌ ప్లాంట్‌, రెవెన్యూ లోటు భర్తీ వంటి అంశాలకు ప్రధాని సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేశారని టీడీపీ ఎంపీలు మండిపడ్డారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదాను విస్మరించిన మోదీ వైఖరిని నిరసించారు. ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.

పార్లమెంటు ఒకటవ నంబర్‌ ద్వారం వద్ద జరిగిన టీడీపీ ఎంపీల నిరసన కార్యక్రమంలో చిత్తూరు లోక్‌సభ సభ్యుడు శివప్రసాద్‌ అన్నమయ్య వేషధారణలో ఆకట్టుకున్నారు. పార్లమెంటు ఆవరణలో ఆందోళన కొనసాగించిన టీడీపీ ఎంపీలు లోక్‌సభలో కూడా ప్లకార్డులు పట్టుకుని తమ స్థానాల్లో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలంటూ కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్లకార్డు పట్టుకుని పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని హామీలు అమలు చేస్తుందన్నారు. నాలుగేళ్ల పాటు కేంద్ర మంత్రివర్గంలో కానసాగిన టీడీపీ ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని ఇప్పుడు హోదా కావాలని డిమాండ్‌ చేయడం విడ్డూరంగా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. విభజన హామీల అమలుపై టీడీపీ, వైసీపీ ఎంపీలు రాజ్యసభలో కూడా ఆందోళన కొనసాగించారు.

సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ ఎంపీ సుజనాచౌదరి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విభజన హామీలపై స్వల్పవ్యవధి చర్చకు నోటీసు ఇచ్చిన అంశాన్ని ప్రస్తావించారు. దీనిని చర్చకు చేపట్టాలని పట్టుపట్టారు. మంగళవారం నాటి సభా కార్యక్రమాల అజెండాలో ఏపీ విభజన హామీలపై స్వల్పవ్యవధి చర్చను చేర్చామని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు టీడీపీ, వైసీపీ సభ్యుల దృష్టికి తెచ్చారు. వెంకయ్యనాయుడు సమాధానంతో సంతృప్తి చెందని టీడీపీ, వైసీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి చర్చ కోసం పట్టుపట్టడంతో సభా కార్యక్రమాలు కొద్దిసేపు స్తంభించాయి. దీంతో టీడీపీ, వైసీపీ ఎంపీల ఆందోళనపై ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకయ్యనాయుడు.. రాజ్యసభ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయించారు.

మరోవైపు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా.. టీడీపీ అసత్య ఆరోపణలను తిప్పికొట్టిన విధంగానే విభజన హామీలపై రాజ్యసభలో జరిగే చర్చకు కూడా దీటుగా సమాధానం ఇస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు చెప్పారు. విభజన హామీలపై మంగళవారం రాజ్యసభలో జరిగే చర్చ ద్వారా మోదీ ప్రభుత్వ వైఖరి మరోసారి ఎండగట్టాలని టీడీపీ నిర్ణయించింది. 

Pages

Don't Miss

Subscribe to RSS - AP Bifurcation Promises