ap

20:46 - September 21, 2018

అమరావతి : ఏసీ సీఎం చంద్రబాబు నాయుడికి ఐక్యరాజ్యసమితి అరుదైన గౌరవాన్ని అందించింది. ఐక్యరాజ్యసమితిలో ప్రసగించాల్సిందిగా చంద్రబాబును కోరుతు ఐక్యరాజ్యసమితి ఆహ్వానంపంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 22న అమెరికా పర్యటనకు బయల్దేరుతున్నారు. 28వ తేదీ వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. 24వ తేదీన ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రసంగించనున్నారు. 'సుస్థిర వ్యవసాయాభివృద్ధిలో ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లు-ఏపీలో సహజ వ్యవసాయాభివృద్ధి విధానాలు' అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. 
అనంతరం 25న వరల్డ్ ఎకనామిక్ ఫోరం-ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. 26న కొలంబియా యూనిర్శిటీలో 'గవర్నెన్స్ ఇన్ ది ఏజ్ ఆఫ్ టెక్నాలజీ అనే అంశంపై ప్రసంగిస్తారు. అమెరికాకు చంద్రబాబుతో పాటు మంత్రి యనమల, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, మరో ఆరుగురు అధికారులు కూడా వెళ్తున్నారు.

 

18:13 - September 21, 2018

అనంతపురం : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై ప్రబోధానంద స్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. 2003లో ఆశ్రమంలోని కృష్ణ మందిరం ప్రారంభోత్సవానికి దివాకర్ రెడ్డిని తాము పిలిచామని ఆయన తెలిపారు. ఆయనకు తాము డబ్బు ఇవ్వలేదనే కారణంతో తమపై ఆయన కక్షగట్టారని, తమను ఎంతో వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. కక్షతో పక్క గ్రామాల ప్రజలను ఉసిగొల్పారని ప్రబోధానంద మండిపడ్డారు. తమ ఆశ్రమంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగడం లేదని స్పష్టం చేశారు. ఐఏఎస్ లు, ఐపీఎస్ లు కూడా ఆశ్రమానికి వస్తుంటారని..ప్రచారం కోసం తాము పాకులాడటం లేదని ప్రభోదానంద అన్నారు. 

 

17:58 - September 21, 2018

విజయవాడ  :  జనసేన పార్టీ పుట్టి కొంతకాలం అీయినా..ప్రత్యక్షంగా 2019 ఎన్నికలో్ల బరిలోకి దిగబోతోంది.  ఈ నేపథ్యంలో పార్టీ తరపు నుండి బరిలోకి దిగే అభ్యర్థులపై జనసేన కసరత్తు చేస్తోంది. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు కప్పలు గెంతినట్లుగా నేతలు ఆ పార్టీలో నుండి ఈ పార్టీలోకి గెంతటం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో తర పార్టీల్లో సీట్లు వచ్చే అవకాశం లేని నాయకులను తమ పార్టీలోకి తీసుకునేందుకు జనసేన నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్లు దొరకని నియోజకవర్గాల్లో కొత్త వారిని రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయని జనసేన పార్టీ నాయకులు తెలిపారు. 
ఇప్పటికే రాజకీయ కుటుంబాల వారసులు తమతో టచ్‌లో ఉన్నారని సదరు నేత తెలిపారు. విజయవాడలో కీలకంగా వున్న సెంట్రల్‌ నుంచి సీపీఎం తరఫున గతంలో పోటీ చేసిన బాబూరావు బరిలోకి దిగే అవకాశం ఉంది. పశ్చిమ నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పోటీ చేయవచ్చునని చెబుతున్నారు.
 ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ రెండవ కుమార్తె విజయవాడ లేదా మచిలీపట్నం పార్లమెంటు సీటు అడుగుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు సన్నిహితుడు తోట చంద్రశేఖర్‌ భార్య అనురాధ అవనిగడ్డ ప్రాంతానికి చెందినవారు కావడంతో అవనిగడ్డ అసెంబ్లీ లేదా మచిలీపట్నం పార్లమెంటు నుంచి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టు పార్టీ వర్గా లు తెలిపాయి. మాజీమంత్రి సింహాద్రి సత్య నారాయణ మనమడు రామచరణ్‌ పేరు కూడా ఈ స్థానాలకు వినిపిస్తోంది. జగ్గయ్య పేట సీటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మేనల్లుడు అడుగుతున్నారు. ప్రస్తుతం ఆయన సాఫ్ట్‌వేర్‌రంగంలో ఉన్నారు.

 

17:22 - September 21, 2018

విజయవాడ : 2019 ఎన్నికల వేడి రోజురోజుకీ సెగ రాజేస్తోంది. ఆయా పార్టీల ఎమ్మెల్యేలు ఎమరెవరు ఏఏ పార్టీలకు జంప్ అవుతారోనని భయం ప్రారంభమైంది. ఇప్పటికే సీట్ల కోసం కొట్లాటలు జరుగుతున్న వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీకి జంప్ అయ్యేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు వున్నారు. కాగా ఎన్నికల కురుక్షేత్రానికి జనసేన పార్టీ సిద్ధం అవుతున్న తరుణంలో ఈ ఊపు మరింతగా ఎక్కువయి్యందనే చెప్పాలి. 
త్వరలోనే పవన్‌ కల్యాణ్‌పర్యటన ఖరారైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం జనసేన, సీపీఐ, సీపీఎంలు కలిసి పయనిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో కూడా కలిసే పోటీ చేస్తామని ప్రకటించాయి. ఆప్‌, లోక్‌సత్తా కూడా వీరితో జత కలిసే అవకాశం ఉంది. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో జనసేన గ్రౌండ్‌వర్క్‌ చేసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆ పార్టీ సర్వేలు చేయించు కుంటోంది. ఢిల్లీకి చెందిన దేవ్‌ అండ్‌ కో అనే టీమ్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన రెండు యూనివర్సిటీల సిబ్బందితో సర్వేలు చేయిస్తున్నారు.
ఈ సర్వేల ఆధారంగా కొంత కసరత్తు జరుగుతోంది. పొత్తుల ఖరారు, సీట్ల సర్దుబాటు వంటి అంశాలపై ఇంకా స్పష్టత లేనప్పటికి నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల కోసం జనసేననేతలు అన్వేషణ ప్రారంభించారు. దీంతో  ఎన్నికలు దగ్గరవుతుండటంతో టికెట్లపై అపనమ్మకంతో ఉన్న ఇతర పార్టీల నేతలు కొందరు ఎందుకైనా మంచిదని జనసేనలో ముందే ఒక కర్చీఫ్‌ వేస్తున్నారు. కొంతమంది నేరుగా పవన్‌కల్యాణ్‌ను కలుస్తుంటే, మరికొందరు సంకేతాలు పంపుతున్నారు. వైసీపీకి చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు జనసేన నాయకత్వంతో టచ్‌లో ఉన్నారు. సీటు రాని పక్షంలో జనసేనలోకి వస్తామని రాయబారాలు చేస్తున్నట్టు సమాచారం. వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన కొంతమంది సీనియర్‌ నాయకులు కూడా జనసేనలో చేరేందు నేతలు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం.

 

13:52 - September 21, 2018

మహారాష్ట్ర : ధర్మాబాద్ కోర్టులో ఏపీ సీఎం చంద్రబాబుకు చుక్కెదురైంది. బాబ్లీ కేసులో చంద్రబాబుకు ఊరట లభించలేదు. చంద్రబాబు వేసిన రీకాల్ పిటిషన్‌ను ధర్మాబాద్ కోర్టు తిరస్కరించింది. అక్టోబర్ 15కు విచారణను వాయిదా వేశారు. నోలీసులు అందుకున్నవారంతా విచారణకు హాజరు కావాలని కోర్టు అదేశించింది. ప్రకాశ్‌గౌడ్, గంగుల కరుణాకర్, కేఎస్ రత్నానికి బెయిల్ మంజూరు అయింది. రూ.5 వేల చొప్పున జరిమానా విధించింది. 

 

08:36 - September 21, 2018

హైదరాబాద్ : ఎనిమిదేళ్ల క్రితం జరిగిన బాబ్లీ కేసు....మళ్లీ తెరపైకి వచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు సహా మొత్తం 16 మందికి అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. ఇవాళ కోర్టు హాజరు కావాలని ధర్మాబాద్ కోర్టు వారెంట్ ఇవ్వడంతో....చంద్రబాబు, ఇతర నేతల తరపున రీకాల్ పిటిషన్ వేయాలని డిసైడ్ అయ్యారు. మరోవైపు టీడీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసవెళ్లిన నేతలు...ధర్మాబాద్ కోర్టుకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. 

బాబ్లీ ప్రాజెక్టుతో తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ...టీడీపీ పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ఎనిమిదేళ్ల క్రితం ప్రాజెక్టు ముట్టడి కార్యక్రమం...అప్పట్లో సంచలనం సృష్టించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు 70 మంది నేతలను మహారాష్ట్ర పోలీసులు...ఐదు రోజుల పాటు నిర్బంధించారు. అంతా ఈ సంఘటనను మరచిపోయిన సమయంలో....అకస్మాత్తుగా చంద్రబాబు, ఇతర నేతలకు ధర్మాబాద్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. నోటీసులపై న్యాయనిపుణులు, సీనియర్ నేతలతో సుదీర్ఘంగ చర్చించిన చంద్రబాబు...రీకాల్ పిటిషన్ వేయాలని నిర్ణయించారు.  

అలాగే చంద్రబాబుతో పాటు వారెంట్లు అందుకున్నఏపీకి చెందిన మిగిలిన నేతల విషయంలోనూ... ఇదే థియరీని ఫాలో కావాలని టీడీపీ భావిస్తోంది. ధర్మాబాద్ కోర్టులో చంద్రబాబు తరపున హాజరయ్యే న్యాయవాదులు...టీడీపీ నేతల తరుపున కూడా రీకాల్ పిటిషన్ వేయనున్నారు. 2013లో కేసు నమోదు చేసినప్పటికీ....ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు, అరెస్ట్ వారెంట్లు తమకు అందలేదనే విషయాన్ని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టుకు దృష్టికి తీసుకెళ్లనున్నారు.  

అలాగే ఎఫ్ఐఆర్ కాపీలు.. ఇతర ఉత్తర ప్రత్యుత్తరాలు మరాఠీ భాషలో ఉండడంతో కేసు విషయంలో తమకు మరింత సమయం కావాలని కోరుతూ వాయిదా అడిగే ఛాన్స్ కన్పిస్తోంది. ఇక అరెస్ట్ వారెంట్లు అందుకున్నవారిలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, గంగుల కమలాకర్ వంటి నేతలు... ధర్మాబాద్ కోర్టుకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయ్. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా హీటెక్కించిన అరెస్ట్ వారెంట్ల ఎపిసోడులో కోర్టు ఏ విధంగా స్పందిస్తుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

20:29 - September 20, 2018

విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏపీ సీఎం చంద్రబాబుపై వున్న నాన్‌బెయిలబుల్ కేసు ధర్మాబాద్ కోర్టు తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం ధర్మాబాద్ కోర్టులో సీఎం చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ కేసు విచారణకు రానుంది. హైదరాబాద్ నుంచి ధర్మాబాద్ కోర్టుకు న్యాయవాది సుబ్బారావును పంపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బాబ్లీ కేసులో వాయిదాలు, నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినా తమకు నోటీసులు అందలేదని న్యాయవాదుల బృందం కోర్టుకు విన్నవించనున్నారు. ఎఫ్ఐఆర్, చార్జ్‌షీట్, నాన్‌బెయిలబుల్ వారెంట్ కాపీలను అధికారికంగా న్యాయవాదులు తీసుకోనున్నారు. చంద్రబాబుతో పాటు 15మంది తరపున లాయర్ల బృందం పిటిషన్ వేయనుంది. 
2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు వెళ్లిన వారిలో చంద్రబాబుతో పాటు 15 మందికి ధర్మాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న చంద్రబాబుతో పాటు 15 మందిని కోర్టులో హాజరుపర్చాల్సిందిగా కోర్టు ఆదేశించింది. చంద్రబాబు, దేవినేని ఉమా మహేశ్వరరావు, టి .ప్రకాష్ గౌడ్, నక్కా ఆనంద బాబు, గంగుల కమలాకర్, కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, చింతమనేని ప్రభాకర్, నామా నాగేశ్వరరావు,జి.రామానాయుడు,.హెచ్.విజయరామారావు, ముజఫరుద్దీన్ అన్వరుద్దీన్, హన్మంత్ షిండే, పి.అబ్దుల్ ఖాన్ రసూల్ ఖాన్, ఎస్. సోమోజు, ఏఎస్.రత్నం, పి.సత్యనారాయణ శింభులకు ధర్మాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది.

20:08 - September 20, 2018

హైదరాబాద్ : జనసేన పార్టీలోకి చేరేందుకు పలు పార్టీల నేతలు..మేధావులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో టీటీడీ మాజీ ఛైర్మన్ చదలవాడ క‌ృష్ణమూర్తి కలిశారు. త్వరలోనే ఆయన జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పవన్‌ను చదలవాడ కలిసినట్లుగా రాజకీయ వర్గాల సమాచారం.

 

18:36 - September 20, 2018

అనంతపురం : గుత్తి పోలీసు స్టేషన్‌లో ప్రభోదానంద స్వామిపై కేసు నమోదు అయింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రసంగించారంటూ టీడీపీ నేత మధుసూదన్ గుప్తా ఫిర్యాదు చేశారు. సీడీలను సాక్ష్యాలుగా అందజేశారు. వాటిని పరిశీలించిన పోలీసులు ప్రభోదానందపై కేసు నమోదు చేశారు. 
కాగా వినాయక చవితి పండుగ సందర్భంగా నిమజ్జనానికి వెళుతుండగా ప్రజలపై దాడిచేసిన ప్రబోధానంద వర్గీయులు స్వామి వారి విగ్రహాన్ని ధ్వంసం చేశారని స్థానికులు ఆరోపించారు. ఈ సందర్భంగా జరిగిన అల్లర్లలో అన్ని సామాజిక వర్గాలకు చెందినవారు గాయపడినట్లుగా తెలుస్తోంది. కాగా  ఆశ్రమాన్ని ఖాళీ చేసి దోషులను అరెస్ట్ చేసేవరకూ తాను వెనక్కు తగ్గబోనని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రసంగించారంటూ టీడీపీ నేత మధుసూదన్ గుప్తా ఫిర్యాదు చేశారు. కాగా ఎటువంటి కేసు ప్రభోదానందపై నమోదు కాలేదని ఆశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. 

 

19:21 - September 18, 2018

శ్రీకాకుళం : ఈ వాహనానికి పెట్రోల్‌ అవసరం లేదు. వాయుకాలుష్యం సమస్యే ఉత్పన్నంకాదు. జీపీఎస్‌ విధానంతో ఆ వాహనం ఎక్కడుందో తెలుసుకోవచ్చు.  తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. శ్రీకాకుళం జిల్లా కుర్రాళ్లు రూపొందించారు. 

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలోని శివానీ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు మరోసారి తమ సత్తా చూపారు. తక్కువ పెట్టుబడితో వినూత్న బైక్‌ను తయారు చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలుగచేయని ఈ నానోబైక్‌ ఇప్పుడు సిక్కోలు రోడ్లపై రయ్‌మంటూ దూసుకెళ్తోంది. ఈ నానో బైక్‌ తయారీకి ఖర్చు అయ్యింది కేవలం 13 వేల రూపాయలు మాత్రమే. ఇది పూర్తిగా బ్యాటరీ ద్వారా నడుస్తోంది. ఎలాంటి ఇంధనం దీనికి అవసరం లేకుండా విద్యార్థులు తీర్చిదిద్దారు.

నానోబైక్‌ బ్యాటరీని మూడు గంటలపాటు చార్జింగ్‌ చేస్తే... 60కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.  ఇది వంద కేజీల బరువును మోయగలదు.  గరిష్టంగా 40 కిలోమీటర్ల స్పీడ్‌తో నడువగలదు. నెలరోజుల్లో ఈ బైక్‌ను తయారు చేసినట్టు ఇంజనీరింగ్‌ విద్యార్థులు చెబుతున్నారు. తమకు మరింత ప్రోత్సాహం అందిస్తే.. ఇలాంటి బైక్‌లు ప్రజలకు అందుబాటులోకి తెస్తామంటున్నారు.

శివానీ ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నా నిఖిల్ నేతృత్వంలోని విద్యార్థుల బృందం తయారుచేసిన నానో బైక్ ను క్రాంతి అనే లెక్చలర్ పర్యవేక్షణ లో రూపొందించబడింది. ఈ బైక్‌ అందరి ప్రశంసలు  అందుకుంటోంది. వేల రూపాయల నుండి లక్షల రూపాయల వరకూ ఖర్చు చేసి ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేస్తున్న ఈ రోజుల్లో కేవలం పదమూడు వేల రూపాయలతోనే ఎన్నో సౌకర్యాలు కలిగిన ఈ నానో బైక్ అందుబాటులోకి రావడం నిజంగా అభినందనీయమే. విద్యార్థుల కృషికి అందరి నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Pages

Don't Miss

Subscribe to RSS - ap