announce

09:55 - November 17, 2018

హైదరాబాద్ : మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. తెలంగాణ జనసమితి నేడు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించనుంది. ఎనిమిది స్థానాల్లో ఆరు స్థానాలపై క్లారిటీ వచ్చింది. అయితే వరంగల్ ఈస్ట్, మిర్యాలగూడ స్థానాలపై సందిగ్థత కొనసాగుతోంది. మధ్యాహ్నంలోగా ఈ రెండు సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత కోదండరాం ప్రచారంపై దృష్టి పెట్టనున్నారు. ఇప్పటికే ప్రచారంలో వెనుకబడ్డామని అనేక సార్లు చెప్పిన కోదండారం... టీఆర్ఎస్‌కు ధీటుగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

 

08:54 - October 30, 2018

హైదరాబాద్ : ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ సిద్ధం చేసింది. సుదీర్ఘ చర్చలు, వడపోతల తర్వాత 119 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. ఆ జాబితాతో ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీ రాత్రి ఢిల్లీకి వెళ్లింది.  నవంబర్‌ 1న రాహుల్‌ నేతృత్వంలోని ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశమై తొలి జాబితాకు ఆమోదముద్ర వేయనుంది. అదే రోజు అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేయనున్నారు. మొదటి జాబితాలో 35 మంది పేర్లు ప్రకటించే అవకాశముంది. 

 

19:41 - October 27, 2018

హైదరాబాద్ : ఎట్టకేలకు కాంగ్రెస్ ఎన్నికల అభ్యర్థుల కసరత్తును పూర్తి చేసింది. భారీ స్థాయిలో కసరత్తు చేసింది. నవంబర్ 1న టీకాంగ్రెస్ మేనిఫెస్టో, అభ్యర్థుల ప్రకటన వెలువడనుంది. మాజీ సైనికులకు కాంగ్రెస్ వరాల జల్లు కురిపించింది. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గోల్కొండ హోటల్ లో ఆ పార్టీ ముఖ్యనేతలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం అయ్యారు. మాజీ సైనికులకు ఇళ్ల స్థలాలు, ఐదు ఎకరాల భూమి ఇస్తామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా సైనికుల కాలనీలు నిర్మిస్తామని చెప్పారు. మొత్తంగా రెబల్స్ రంగంలో ఉండకుండ కాంగ్రెస్ జాగ్రత్తలు తీసుకుంది.

 

17:56 - September 12, 2018

హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల మొదటి లిస్టు ఈనెల 20వ తేదీలోపు ప్రకటించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. 30 నుంచి 35 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. వీటిలో జీహెచ్ ఎంసీలో 10 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఈనెల 15న హైదరాబాద్ కు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రానున్నారు. అదే రోజున మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అయితే అమిత్ షా వచ్చాక అయినా లేదా రాకముందైన 20 వ తేదీ లోపు అభ్యర్థుల లిస్టును ప్రకటించనున్నారు. అభ్యర్థుపై ఖరారుపై కమిటీ వేశారు. ఆ రిపోర్టును బీజేపీ పార్లమెంటరీ బోర్డుకు పంపనున్నారు. అనంతరం ఎన్నికల ఫైనల్ లిస్టును ప్రకటించనున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు సీటు ఖరారు చేశారు. ముషీరాబాద్ నుంచి బి.లక్ష్మణ్, అంబర్ పేట్ నుంచి జి.కిషన్ రెడ్డి, ఉప్పల్ నుంచి ఎన్ వీఎస్ ఎస్ ప్రభాకర్, గోషామహల్ నుంచి రాజాసింగ్, ఖైరతాబాద్ నుంచి చింతల రాంచంద్రారెడ్డిల పేర్లు ఖరారు అయ్యాయి. వీరు ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్నారు.  వీరితోపాటు మల్కాజ్ గిరి నుంచి రామచంద్రారావు(బీజేపీ జీహెచ్ ఎంసీ అధ్యక్షుడు), సికింద్రాబాద్ నుంచి సతీష్ గౌడ్, కూకట్ పల్లి నుంచి మాతవరం కాంతారావు, మహబూబ్ నగర్ నుంచి పద్మజారెడ్డి, మునుగోడు నుంచి జి.మనోహర్ రెడ్డి, సూర్యపేట నుంచి సంకినేని వెంకటేశ్వరరావు, మహేశ్వరం నుంచి సందీప్ శర్మ, పరిగి నుంచి ప్రహ్లాద్ పేర్లు ఫైనల్ అయ్యాయి. అభ్యర్థులు లేని చోట ఆశావహులు ఎవరైనా పోటీ చేసేందుకు ముందుకు వస్తే వారికి అవకాశం ఇస్తామని చెప్పారు. 

18:35 - September 11, 2018

జగిత్యాల : కొండగట్టు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 52కు చేరింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాద ఘటనపై తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. కొండగట్టు బస్సు ప్రమాద ఘటనపై గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు ఏపీ మంత్రి నారా లోకేశ్‌  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.


జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సుమారు 88 మందితో వెళ్తోంది. కొండగట్టు ఘాట్‌ రోడ్డు పైకి ఎక్కుతున్నసమయంలో చివరి మూలమలుపు స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద అదుపుతప్పి ఒక్కసారిగా లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 52 మంది మృతిచెందారు. మృతుల్లో 25 మంది మహిళలు ఉన్నారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. తీవ్రంగా గాయాలపాలైన 8 మందిని చికిత్స నిమిత్తం కరీంనగర్‌, హైదరాబాద్‌ ఆస్పత్రులకు తరలించారు. మరికొందరికి జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందగానే జగిత్యాల జిల్లా కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ సింధూ శర్మ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతిచెందిన వారిలో ఇప్పటివరకు 35 మందిని అధికారులు గుర్తించారు. వారిలో 30 మంది శనివారంపేట, హిమ్మత్‌రావుపేటకు చెందినవారని తెలిపారు. బస్సు డ్రైవర్‌ శ్రీనివాస్‌ మృతిచెందగా.. కండక్టర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. అక్కడే శవపరీక్ష నిర్వహించి బంధువులకు అప్పగించనున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకొని అక్కడికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు, వారి బంధువులు దుఃఖ సంద్రంలో మునిగిపోయారు. వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా దద్ధరిల్లింది.

 

16:39 - October 4, 2016

ఢిల్లీ : దసరా ముందు రిజర్వ్‌ బ్యాంక్ గుడ్‌న్యూస్ ప్రకటించింది. త్రైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో... బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వడ్డీరేటును పావుశాతం తగ్గించింది. దీంతో రెపోరేటు 6.50 నుంచి 6.25 శాతానికి తగ్గింది. రివర్స్ రెపోరేటును కూడా పావుశాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రఘురామ్ రాజన్‌ పదవీ విరమణ అనంతరం... గత నెలలో గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఉర్జిత్ పటేల్... తన తొలి సమీక్షలోనే... వడ్డీరేట్లు తగ్గిస్తూ కీలక ప్రకటన చేశారు. అయితే చరిత్రలో తొలిసారిగా..  ఆర్బీఐ గవర్నర్ నిర్ణయం కాకుండా... రిజర్వ్ బ్యాంక్ నియమించిన కమిటీ సూచన ప్రకారం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ ప్రకటనతో రెపోరేటు ఆరేళ్ల కనిష్ఠానికి చేరింది. దేశీయంగా ద్రవ్యోల్బణం... రిజర్‌ బ్యాంక్ లక్ష్యం కంటే తక్కువగా ఉండటం.. కలిసొచ్చింది. ఆర్బీఐ నిర్ణయంతో బ్యాంకులు కూడా ఖాతాదారులకు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగిందే.. గృహ, వాహన, వ్యాపార రుణాలపై వడ్డీ కూడా తగ్గుతుంది. 

 

15:57 - October 3, 2016

జమ్ము కశ్మీర్ : నియంత్రణ రేఖ వద్ద భారత-పాకిస్తాన్‌ల మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయని పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌ పేర్కొన్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, పాకిస్తాన్‌ అధికారి నాసిర్‌ జన్‌జువా ఫోన్లో మాట్లాడినట్లు ఆయన చెప్పారు. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే దిశగా వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయన్నారు. యూరీ ఉగ్రవాద దాడి, పిఓకేలో భారత ఆర్మీ సర్జికల్‌ దాడులు నిర్వహించిన నేపథ్యంలో సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తమకు ఏ ఇతర దేశానికి చెందిన భూభాగాన్ని ఆక్రమించాలన్న ఉద్దేశం లేదని ప్రధాని మోది స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

 

08:32 - October 3, 2016

ఢిల్లీ : ఉరి ఘటన తర్వాత భారత్ సైన్యం చేపట్టిన సర్జికల్‌ అటాక్స్‌తో పాకిస్తాన్‌ ప్రతికార చర్యలకు దిగుతోంది. తాజాగా భారత్‌ నుంచి పాకిస్తాన్‌ మీదుగా యూరప్‌, మధ్య ఆసియా దేశాలకు వెళ్లే విమానాలపై గగనతల ఆంక్షలు విధించింది. పాక్‌ గగనతలంపై తక్కువు ఎత్తులో ఎగిరేందుకు వీల్లేకుండా ఆ దేశం భారత విమానాలపై ఆంక్షలు పెట్టింది. మరోవైపు అ్రగరాజ్యం అమెరికా పాక్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలన్న ప్రతిపాదనకు ప్రపంచ దేశాల నుంచి భారీగా మద్దతు లభిస్తోంది. భారత్‌ సర్జికల్‌ దాడులతో ఉలిక్కిపడ్డ పాకిస్తాన్‌ తాజాగా గగనతల ఆంక్షల్ని విధించింది. భారత్‌ నుంచి యూరప్‌, మధ్య ఆసియా దేశాలకు రాకపోకలు సాగించే విమానాలపై పాకిస్తాన్‌ ఆంక్షలు పెట్టింది. పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ మినహాయించి మిగతా అన్ని విమానాలు పాక్‌ గగన తలంపై తక్కువ ఎత్తులో ఎగిరే వీల్లేకుండా ఆ దేశం ఆంక్షలు పెట్టింది. మధ్య ఆసియా, యూరప్‌ దేశాలకు రాకపోకలు సాగించే విమానాలకు ఎప్పటినుంచో పాక్‌ ఎయిర్‌ కారిడార్‌పై విమానాలు ప్రయాణిస్తున్నాయి. తాజా ఆంక్షలతో విమానాలు మరింత ఎత్తులో ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో అమెరికా, యూరప్‌, మధ్య ఆసియా దేశాలకు వెళ్లాల్సిన విమానాలకు అంతరాయం కలుగుతోంది.
మరోవైపు పాక్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలన్న.. అగ్రరాజ్యం అమెరికా ప్రతిపాదనకు ప్రపంచ వ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఉగ్రవాద ఘటనల వెనక పాక్‌ హస్తం ఉండటాన్ని అమెరికా ఎప్పటి నుంచో గమనిస్తూ వస్తోంది. తాజాగా ఆ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలన్న వాదనకు అనేక దేశాల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది.   

20:37 - August 27, 2015

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 98 స్మార్ట్‌ సిటీల జాబితాను కేంద్రం విడుదల చేసింది. స్మార్ట్‌ సిటీ నగరాలపై ఉత్కంఠ తొలగింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 98 నగరాలను స్మార్ట్‌ సిటీలుగా ఎంపిక చేసినట్టు ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, మహారాష్ట్రకు స్మార్ట్‌ సిటీల జాబితాలో కేంద్ర పెద్ద పీట వేసింది. ఉత్తరప్రదేశ్‌లో 13 నగరాలు, తమిళనాడులో 12 నగరాలు, మహారాష్ట్రలో 10 నగరాలు స్మార్ట్‌ సిటీలుగా రూపొందనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 3, తెలంగాణలో 2 నగరాలను కేంద్రం స్మార్ట్‌ సిటీల కింద చేర్చింది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి... తెలంగాణలో హైదరాబాద్, వరంగల్‌ నగరాలకు స్మార్ట్‌ సిటీల జాబితాలో చోటు దక్కింది. జమ్ముకాశ్మీర్‌ను మినహాయిస్తే దాదాపు ప్రతి రాష్ట్రానికి ఓ స్మార్ట్‌ సిటీ దక్కనుంది.
నగర జీవన ప్రమాణాల పెంపే ముఖ్య ఉద్దేశం
నగర జీవన ప్రమాణాలను పెంచడమే ఈ ప్రాజెక్ట్‌ ముఖ్య ఉద్దేశమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. వాస్తవిక దృష్టితోనే ఈ పథకాన్ని రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. స్మార్ట్‌ సిటీల కోసం ప్రజల భాగస్వామ్యం కూడా తప్పనిసరని పేర్కొన్నారు.
డిజిటలైజేషన్, ఈ గవర్నెన్స్‌కు అత్యధిక ప్రాధాన్యత
స్మార్ట్‌ సిటీల్లో భాగంగా నగరంలో పలు సౌకర్యాలు సమకూరనున్నాయి. డిజిటలైజేషన్, ఈ గవర్నెన్స్‌కు అత్యధిక ప్రాధాన్యతనివ్వనున్నారు. చెత్త చెదారంతో పవర్‌ ఉత్పత్తి, కంపోస్టు ఎరువుల తయారీకి ప్రాజెక్టులు రూపొందిస్తారు. స్వచ్ఛమైన తాగునీటిని అందజేయడం, స్మార్ట్‌ పార్కింగ్‌, ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, టెలి మెడిసన్‌, టెలి ఎడ్యుకేషన్, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు తదితర సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని వెంకయ్య పేర్కొన్నారు.
తొలివిడతలో 20 టాప్‌ నగరాల అభివృద్ధి
మొదటి విడత ప్రాజెక్టులో భాగంగా 20 టాప్‌ నగరాలను స్మార్ట్‌ సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. రెండేళ్ల తర్వాత మిగతా నగరాలను అభివృద్ధి చేయనుంది. రాబోయే ఆరేళ్లలో స్మార్ట్‌ సిటీల కోసం కేంద్రం 3 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది. ఈ పథకం కింద స్మార్ట్‌ సిటీగా ఎంపికైన ప్రతి నగరానికి ప్రతి ఏడాది వందకోట్ల చొప్పున ఐదేళ్ల వరకు కేంద్రం నిధులు మంజూరు చేయనుంది.

 

Don't Miss

Subscribe to RSS - announce