Andhrapradesh Projects

08:29 - September 16, 2018

విజయవాడ : అమరావతి నగర భవిష్యత్ కు భరోసా ఇచ్చే...కొండవీటి వాగు ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వందల కోట్ల రూపాయల వ్యయంతో...నిర్మించిన కొండవీటివాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం ప్రారంభించనున్నారు. ప్రకాశం బ్యారేజ్ కి పడమటి దిక్కున వేలాది క్యూసెక్కుల నీటిని....కృష్ణాలోకి ఎత్తిపోసేందుకు లిఫ్ట్ ల నిర్మాణం పూర్తయింది.కృష్ణా తీర గ్రామాల్లో....వేలాది ఎకరాల పంట పొలాలను నీట ముంచుతున్న వాగుల ప్రవాహాన్ని మళ్లించనుంది. 14 మొటార్లు, 14 పంప్ లతో ఉరకలు వేసే కొండవీటి వాగు నీటిని...కృష్ణానదిలోకి ఎత్తిపోయనున్నారు. రాజధాని నిర్మాణం జరుగుతున్న అనంతవరం నుంచి దాదాపు 20కిలోమీటర్లు ప్రవహించి...ఉండవల్లి గ్రామం వద్ద కృష్ణానదిలో కొండవీటి వాగు కలుస్తుంది. 

1964లో వాగునీరు నదిలోకి కలిసే చోట రెగ్యులేటర్ నిర్మాణం జరిగింది. అయితే వర్షాకాలంలో కృష్ణానదిలో నీటి ప్రవాహం ఉంటే....వాగు నీరు నదిలోకి వెళ్లే అవకాశం ఉండదు. దీనికి తోడు విజయవాడ థర్మల్ పవర్ ప్లాంట్ లో...విద్యుత్ ఉత్పత్తి జరగాలంటే ప్రకాశం బ్యారేజ్ వద్ద ఎప్పుడు 12 అడుగుల నీటి మట్టం కొనసాగించాల్సి ఉంటుంది. రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన తర్వాత....రాజధాని ముంపు గ్రామాలకు పొంచి ఉన్న ముంపు తొలిసారి తెరపైకి వచ్చింది. దీంతో ప్రభుత్వం కొండవీటి వాగు నిర్మాణం చేపట్టింది. నెదర్లాండ్స్ సాంకేతిక పరిజ్జానంతో టాటా కన్సల్టెన్సీ వాగుల ప్రవాహాన్ని డిజైన్ చేసింది. 19.85 కిలోమీటర్ల దూరం ప్రవహించే కొండవీటి వాగును...8 మీటర్ల వెడల్పు నుంచి 20 మీటర్లకు పెంచుతున్నారు. వైకుంఠపురం వద్ద కృష్ణానదిలో కలిసే వాగు వెడల్పును 10 మీటర్ల నుంచి 45 మీటర్లకు పెంచుతారు.

ఉండవల్లి వద్ద 12వేల క్యూసెక్కుల నీటిని మోటర్ల సాయంతో కృష్ణానదిలోకి ఎత్తిపోస్తారు. 4వేల 5వందల క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ వెనుక నుంచి బకింగ్ హమ్ కెనాల్ కు మళ్లిస్తారు. వందేళ్లలో కొండవీటి వాగు 16వేల 575 క్యూసెక్కుల ప్రవాహం నమోదు చేసుకుంటే...ప్రస్తుతం 21 వేల క్యూసెక్కుల ప్రవాహనికి అనుగుణంగా డిజైన్ చేశారు.

 

08:31 - September 12, 2018

పశ్చిమ గోదావరి : ఏపీలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్టులో మంత్రులు, అధికారులు, వారి కుటుంబసభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు బుధవారం నడవనున్నారు. నాగార్జునసాగర్ డ్యాం నిర్మించినప్పుడు... అప్పటి  దేశ ప్రధాని  జవహర్ లాల్ నెహ్రూ.. సాగర్ స్పిల్‌వే వాక్ నిర్వహించి చరిత్రలో నిలిచిపోయారు. ఇప్పుడలాగే.. భారీ స్థాయిలో చేపట్టిన పోలవరంలో నిర్వహించనున్న స్పిల్‌వే వాక్‌తో సీఎం చరిత్రను తిరగరాయనున్నారు. వచ్చే ఏడాది మే నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో వేగంగా పనులు చేస్తున్నారు. కేంద్రం సహకరించకున్నా.. డయాఫ్రం వాల్‌, స్పిల్‌వే నిర్మాణం పూర్తి దశకు తెచ్చారు. వైద్యబృందంతో కలిసి నడవనున్న సీఎం.. 48వ బ్లాక్ వద్ద పైలాన్ ఆవిష్కరించనున్నారు. తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నడవనున్నారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు.. 

1148 మీటర్ల పొడవు, రెండున్నర మీటర్ల ఎత్తు, రెండు మీటర్ల వెడల్పుతో దీని నిర్మాణం చేపట్టారు. 52 బ్లాకులకు గాను 48 బ్లాకుల్లో గ్యాలరీ నిర్మాణం పూర్తయ్యింది. ప్రాజెక్టు మొత్తం పనుల్లో 58 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులను మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. అత్యంత అధునాతన జపాన్, జర్మన్ టెక్నాలజీతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టులో పండుగ వాతావరణం సంతరించుకోనుంది. 

Don't Miss

Subscribe to RSS - Andhrapradesh Projects