amaravati

20:46 - November 12, 2018

కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని హెచ్చరించారు. చంద్రబాబు హైదరాబాద్‌లో చేసిన తప్పు మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో చేస్తున్నారని, ఇలా అయితే ఇబ్బందులు తప్పవని పవన్ అన్నారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పర్యటిస్తున్న పవన్.. చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. హైదరాబాద్‌లో అన్ని ప్రధాన కంపెనీలు, కేంద్రాలు ఒకే చోట కేంద్రీకరించడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఇప్పుడు అదే తప్పు మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో చేస్తున్నారని పవన్ విమర్శించారు. అన్ని కేంద్రాలు అమరావతిలోనే నిర్మిస్తే భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. మళ్లీ ప్రాంతీయవాదం పుట్టుకురావడంతో పాటు జిల్లాల వారీగా ఉద్యమాలు తలెత్తే ప్రమాదం లేకపోలేదన్నారు. 14 మెడికల్ కాలేజీలు అమరావతి పరిసర ప్రాంతాల్లో పెడితే ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. మెడికల్ కాలేజీలు ఒకే చోట నిర్మించినా ప్రజలను తరలించలేం కదా అని ప్రశ్నించారు. అన్ని ముఖ్య కేంద్రాలను వికేంద్రీకరించాలని పవన్ సూచించారు. విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్రం ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నించిందని దాన్ని తాను అడ్డుకోవడంతో అది ప్రైవేట్ పరం కాకుండా చేశానని పవన్ గుర్తు చేశారు. ప్రజల దీవెనలే తనను ముఖ్యమంత్రిని చేస్తాయి పవన్ వ్యాఖ్యానించారు.

13:35 - November 11, 2018

అమరావతి: ఆంద్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ ఆదివారం జరిగింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసంలోని ప్రజావేదికలో వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.  కొత్త మంత్రులుగా ఎన్ఎమ్డీ ఫరూక్, కిడారి శ్రావణ్ కుమార్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఫరూక్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా, శ్రవణ్ ఇంగ్లీషులో ప్రమాణం చేశారు.  ఈమంత్రి వర్గ విస్తరణతో చంద్రబాబు మంత్రివర్గంలో ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి కూడా క్యాబినెట్‌లో అవకాశం దక్కింది. కాగా 14 ఏళ్ల తర్వాత ఫరూక్ మళ్లీ చంద్రబాబు మంత్రి వర్గంలో స్ధానం సంపాదించుకున్నారు. నక్సల్స్ కాల్పుల్లో మరణించిన విశాఖజిల్లా అరకు ఎమ్మెల్యే  కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రవణ్ కు ముఖ్యమంత్రి కేబినెట్ లో స్ధానం కల్పించారు. శ్రవణ్ వారణాశి ఐఐటీలో మెటలార్జీ పూర్తి చేసి,సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నారు. మైనార్టీ సంక్షేమం, వైద్యా ఆరోగ్యశాఖను ఫరూక్ కు, గిరిజన సంక్షేమ శాఖను శ్రవణ్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. 

 

11:51 - November 10, 2018

అమరావతి: 2019ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా, దేశంలోని బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల జేడీఎస్,డీఎంకే  అధ్యక్షులతో సమావేశం అయ్యారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజస్ధాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో అమరావతిలో భేటీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దూతగా  ఆయన చంద్రబాబుతో  చర్చలు జరపనున్నారు.  ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఢిల్లీలో  రాహుల్‌గాంధీ, శరద్‌పవార్‌, ఫరూక్‌ అబ్దుల్లా, కేజ్రీవాల్  తదితర ఉత్తారిది నాయకులతో సమావేశమై ప్రస్తుతం దక్షిణాది పార్టీల నాయకులను సంఘటితం చేసే పనిలో ఉన్నారు. ఈ నేపధ్యంలో శనివారం కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అశోక్‌ గెహ్లాట్ అమరావతిలో చంద్రబాబుతో సమావేశంకావడం మరో ముందడుగుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

15:18 - November 5, 2018

ఢిల్లీ: ఉమ్మడి హైకోర్టు విభజన సమస్య ఓ కొలిక్కి వచ్చింది. ఏపీలో హైకోర్టుకు మౌలిక వసతులు కల్పన పూర్తయితే నోటిఫికేషన్ జారీ చేస్తామని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్ తో కూడిన ధర్మాసనం స్పృష్టం చేసింది. డిసెంబర్ 15నాటికి అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవనం పూర్తవుతుందని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. ఏపీ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ పై  సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. అమరావతిలో జస్టిస్ సిటీ నిర్మాణం కొనసాగుతున్నందున జడ్జిల నివాసం అద్దె భవనాల్లో ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై  ఏపీకి వెళ్లే  హై హైకోర్టు న్యాయమూర్తులుకూడా సంతృప్తి చెందారని కోర్టు స్పృష్టం చేసింది. జనవరి 1 నుంచి కొత్త రాజధానిలో హైకోర్టు ప్రారంభం అవుతుందని ఆశిస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పన పూర్తయ్యాక హైకోర్టు విభజన పూర్తి స్ధాయిలో జరుగుతుందని సుప్రీం కోర్టు ఉత్తర్వుల్లో పేర్కోంది. 

16:55 - November 4, 2018

గజ్వేల్: కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని చంద్రబాబునాయుడు మళ్లీ తెలంగాణాకు నష్టం చేయాలని చూస్తే భవిష్యత్తులో చంద్రబాబు సంగతి చూస్తాం అని టీఆర్ఎస్ నాయకుడు హరీష్రావు హెచ్చరించారు. గజ్వేల్లో జరిగిన మైనారిటీల సభలో  హరీష్రావు మాట్లాడుతూ... కేసీఆర్ కొట్టిన దెబ్బకు అమరావతి పారిపోయిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని తెలంగాణాలో పెత్తనం చెలాయించాలని చూస్తే భవిష్యత్తులో మావద్ద ఉన్నరికార్డులు బయటపెట్టి మరోసారి బాబు బండారం బయటపెడతాం అని హెచ్చరించారు. తెలంగాణ కాంగ్రెస్కు అండ,దండ, అంతా చంద్రబాబే, అని అమరావతి నుంచి డబ్బులు, టికెట్లు, మాట్లాడాల్సిన స్క్రిప్ట్ అక్కడి నుంచే వస్తున్నాయని  హరీష్రావు అన్నారు. గజ్వేల్ నియోజకవర్గానికి కేసీఆర్ ఇప్పటివరకు చేసింది పాతికశాతం మాత్రమేనని, ఇప్పటివరకు 2500 కోట్లతో అభివృద్ది పనులు చేశారని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని ఆయన తెలిపారు. రంజాన్ పండుగకు ముస్లిం సోదరులకు బట్టలు పంచడం ఏరాష్ట్రంలోనూ లేదని కేసీఆర్ తొలిసారిగా తెలంగాణాలో ప్రవేశపెట్టి అమలు  చేస్తున్నారని హరీష్ రావు చెప్పారు. 

19:45 - October 26, 2018

అమరావతి: ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం శుక్రవారం తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సంజీవకుమార్ జిందాల్ నేతృత్వంలోని ఈ బృందం పర్యటించి నష్టాలను అంచనా వేసింది. 
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయిడుతో కలిసిన బృంద సభ్యలు తుఫాను సహాయక చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. తిత్లీ తుఫాను వల్ల రూ. 3,673 కోట్ల నష్టం సంభవించిందని సీఎం వివరించారు. దీనిపై స్పందించి తక్షణం  సహాయం అందించాల్సిందిగా కేంద్ర బృందాన్ని చంద్రబాబు కోరారు. 

 

 

12:34 - October 26, 2018

అమరావతి: నేరప్రవృత్తి కలిగిన వారు రాజకీయాల్లో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో జరుగుతున్న 2వరోజు కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్ధితి, నక్సలైట్ల సమస్యలపై సమీక్ష నిర్వహించారు. రాజకీయ నాయకులు దాడులకు పాల్పడితే పోలీసులు ఎవరికీ భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు. ఆందప్రదేశ్ కు ప్రత్యేక హోదా అడిగితే ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం జగన్ తో కుమ్మక్కై రాష్ట్రంలో ఐటీ దాడులు చేయిస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఇంకా ఐటీ దాడులు జరుగుతాయని, ఎవ్వరూ అధైర్యపడవద్దని, ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని చంద్రబాబునాయుడు అన్నారు. ఐటీ దాడుల వల్ల వ్యాపారస్తులు  భయపడి పోతున్నారని, అభివృధ్దిని అడ్డుకునే పనులు సమాజానికి పనికిరావని ఆయన అన్నారు.  
గురువారంనాడు  విశాఖ విమానాశ్రయంలో  ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి పై దాడి జరిగితే గవర్నర్ తనను అడగకుండా నేరుగా డీజీపీ తో మాట్లాడటం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. గవర్నర్ల వ్యవస్ధ వలన ఎటువంటి ఉపయోగం లేదని తాను చాలా ఏళ్లుగా చెపుతున్నానని, గవర్నర్లు కేంద్రానికి సీక్రెట్ ఏజెంట్లుగా పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆపరేషన్ "గరుడ" అన్నప్పుడు నేను సీరియస్ గా తీసుకోలేదని, అందులో భాగంగానే నిన్న జగన్ మోహన్ రెడ్డి పై దాడి జరిగిందని ఆయన చెప్పారు. భవిష్యత్తులో దేవాలయాల వద్ద దాడులు చేసే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇన్నేళ్లుగా  రాజకీయాల్లో ఉన్నానని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ఇక ఎవరి ఆటలు సాగనివ్వను అని ముఖ్యమంత్రి  ధీమాగా చెప్పారు.  

12:51 - October 23, 2018

విశాఖ: ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్ విశాఖ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాబోయే రోజుల్లో విశాఖ అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని సీఎం చెప్పారు. విశాఖలో ఫిన్‌టెక్ ఫెస్టివల్ రెండో రోజుకి చేరింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.. సాంకేతికతతో నూతన ఆవిష్కరణలు రావాలని అన్నారు. ఇన్ని కంపెనీలు ఏపీకి రావడం ఆనందంగా ఉందన్నారు. మీ ఆవిష్కరణలు ప్రభుత్వానికి ఉపయోగపడతాయన్నారు. నాల్జెడ్ ఎకానమీలోమరిన్ని అద్భుతాలు సృష్టించవచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తిరుపతి అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా అవతరించిందని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రపంచంలోనే ఐదో అద్భుత నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అమరావతిలో 9 నగరాలు నిర్మిస్తున్నామన్న సీఎం... అవన్నీ నాలెడ్జ్ సిటీలుగా అభివృద్ది చెందే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థికంగా చాలా నష్టపోయినా.. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్ని ప్రభుత్వం కార్యకలాపాలు ఆదార్‌తో అనుసంధానం చేయాలని సీఎం సూచించారు.

18:49 - June 14, 2018

విజయవాడ : టీడీపీపై వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీ మొన్నటి వరకు ఎన్డీయేతో కలిసి రాష్ట్రాని దెబ్బతీసిందన్నారు. ఇందులో భాగంగానే కడప ఉక్కు కర్మాగారాన్ని తుక్కుతుక్కు చేయాలనే పధకం వేశారని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలని మభ్యపెట్టి.. ఓట్లు సాధించుకునేందుకు కొత్త పథకం వేశారన్నారు అంబటి. 

21:34 - June 12, 2018

అమరావతి : ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని టీడీపీ సమన్వయ కమిటీ ఆరోపించింది. వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయంటూ.. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా జనంలోకి వెళ్లాలని నిర్ణయించింది. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఏపీ అభివృద్ధికి చారిత్రక అవసరమని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించారు. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చిన చంద్రబాబు... ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకులను ఆదేశించారు.

నేతలకు చంద్రబాబు దిశానిర్ధేశం..
అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల ఏడాదిలో పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలతోపాటు జాతీయ రాజకీయ పరిణామాలపై చర్చించారు.

ఆధారాలు లేకుండా విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్న టీడీపీ
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తోపాటు తెలుగుదేశం ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై ప్రధానంగా చర్చించారు. ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పన్నుతున్న కుట్ర రాజకీయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ సమన్వయ కమిటీలో నిర్ణయించారు. ప్రపంచంలో రెండు భిన్నధృవాలైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ శాంతి కోసం సింగపూర్‌లో కలిసిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. అలాంటి సింగపూర్‌ ప్రభుత్వం.. ఏపీని నమ్మి సహకరిస్తుంటే విపక్షాలు విమర్శలు చేయడం వారి అజ్ఞానానికి నిదర్శనమని చంద్రబాబు విమర్శించారు. వైపీసీ ప్రయోజనాలు కాపాడేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత వపన్‌ కల్యాణ్‌ పనిచేస్తున్నారంటూ... దీనిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ సమన్వయ కమిటీ నిర్ణయించింది.

సరిగా పనిచేయకపోయినా బహిరంగ విమర్శలు చేస్తున్న నాయకులు
మరోవైపు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించిన చంద్రబాబు.. కొన్ని జిల్లాల్లో టీడీపీ నేతల మధ్య ముదురుతున్న అంతర్గత కలహాలను ప్రస్తావించారు. పరోక్షంగా కడప టీడీపీ నేతలు వరదరాజులురెడ్డి, సీఎం రమేశ్‌ వ్యవహారాన్ని గుర్తు చేశారు. కొందరు నేతలు సరిగా పనిచేయకపోయినా... బహిరంగ విమర్శలకు దిగుతున్న అంశాన్ని ప్రస్తావించారు. పనిచేయకపోయినా మారతారన్న ఉద్దేశంతో ఇంతకాలం చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అధినేత ఏమీ పట్టించుకోవడం లేదంటూ.. ఏదైనా చేయొచ్చనుకుంటే పొరపాటని హెచ్చరించినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రోజు ఎవరేం చేస్తున్నారో అన్ని నివేదికలు తన వద్ద ఉన్నాయని, తాను తీసుకునే చర్యలకు నాయకులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించినట్టు సమాచారం. నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించేబోనని తేల్చిచెప్పారని పార్టీ నాయకులు చెబుతున్నారు. రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై కూడా చంద్రబాబు మండిపడ్డినట్టు సమాచారం. ఎన్నికల సమయంలో చాలా జాగ్రత్తగా పని చేయాలని సూచించారు.చంద్రబాబు సూచనలను తెలుగుదేశం నాయకులు ఎంతవరకు వంటపట్టించుకుంటారో, హెచ్చరికలను ఎంతవరకు ఖాతరు చేస్తారో, పద్ధతులు ఎంతవరకు మార్చుకుంటారో చూడాలి. 

Pages

Don't Miss

Subscribe to RSS - amaravati