air pollution

15:07 - October 27, 2018

ఢిల్లీ : దేశ రాజధాని హస్తినలో ఓ పది రోజుల అత్యంత ప్రమాదకరంగా ఉంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్రంలో అత్యంత విషపూరిత వాయువులు మరింత వ్యాపిస్తాయని పేర్కొంటోంది. గత కొంతకాలంగా దేశ రాజధాని ఢిల్లీలో విష వాయువులు అధికంగా వ్యాపిస్తుండడం..కాలుష్యం అధికంగా ఉంటుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యంపై అక్కడి ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రయివేట్‌ కార్లు ప్రతిరోజూ రోడ్డుపై తిరిగే అవకాశం లేదు. నెంబర్‌ ప్లేట్‌ సరి బేసి సంఖ్యల ఆధారంగా రోజు విడిచి రోజు కారును బయటకు తీయాల్సి ఉంటుందని..పలు చర్యలు తీసుకుంది. 
తాజాగా నవంబర్ మాసం వస్తోంది. ఈ నెల నుండి దేశ రాజధాని విషవాయువులు మరింతగా వ్యాపించనున్నాయని తెలుస్తోంది. నవంబర్ మాసంలో వచ్చే దీపావళి పండుగ నేపథ్యంలో్ మరింత ఆందోళన నెలకొంది. పటాసులు కాలవడం..ఉన్న వాతావరాణానికి మరింత కాలుష్యం జోడయితే పరిస్థితి మరింత దిగజారనుందని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ కాలుష్య నియంత్రిణ మండలి పలు సూచనలు చేసింది. నిర్మాణ పనులు, విద్యుత్ రంగానికి సంబంధించిన పనులను బ్యాన్ చేయాలని సూచించింది. బొగ్గు ఆధారంగా పనిచేస్తున్న థర్మల్‌ప్లాంట్‌ను సైతం మూసివేయాలని సూచించిందని తెలుస్తోంది. మరి ఈ రోజుల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ..ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. 

11:10 - October 23, 2018

ఢిల్లీ: దేశంలో బాణాసంచా విక్రయాలపై నిషేధం విధించాలా వద్దా అనే విషయమై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. బాణాసంచా విక్రయాలపై నిషేధం విధించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. టపాసుల విక్రయాలకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. అయితే పలు షరతులు విధించింది. బాణాసంచా తయారీ, విక్రయానికి లైసెన్స్ తప్పనిసరి అని నిబంధన విధించింది. అంతేకాదు బాణాసంచాను ఆన్‌లైన్‌లో విక్రయించకూడదని స్పష్టం చేసింది. దీపావళి రోజున పలానా సమయంలో మాత్రమే టపాసులు కాల్చాలని ప్రజలకు సూచించింది. 

ఇక దీపావళి, న్యూఇయర్, క్రిస్మస్ రోజున బాణాసంచా కాల్చాల్సిన సమయాన్ని సైతం న్యాయస్థానం డిసైడ్ చేసింది. దీపావళి రోజున రాత్రి 8 నుంచి 10గంటల మధ్య.. న్యూఇయర్, క్రిస్మస్ రోజున రాత్రి 11.45 నుంచి ఉ.12.45 గంటల మధ్య మాత్రమే బాణాసంచా కాల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Image result for fire crackersవాయు కాలుష్యం, ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని దేశంలో బాణాసంచా విక్రయాలను పూర్తిగా నిషేధించాలని కోరుతూ అనేక పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. గత ఆగస్టులో ఈ అంశంపై విచారణ జరిపిన సమయంలో బాణాసంచా తయారీదారుల జీవనోపాధికి సంబంధించిన ప్రాథమిక హక్కులు, 130 కోట్ల మంది ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.

వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు... బాణాసంచా వల్ల ప్రజలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ సమయంలో వాయు కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం ఉంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
* బాణాసంచా విక్రయాలకు సుప్రీంకోర్టు అనుమతి
* తయారీ, విక్రయాలకు లైసెన్స్ తప్పనిసరి
* ఆన్‌లైన్‌లో విక్రయాలపై బ్యాన్
* దీపావళి రోజున రా.8 నుంచి 10గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చాలి
* న్యూఇయర్, క్రిస్మస్ రోజున రా.11.45 నుంచి ఉ.12.45గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చాలి

అయితే బాణాసంచాపై పూర్తిగా నిషేధం విధించకుండా... వీటిని నియంత్రించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని బాణాసంచా తయారీదారులు కోర్టును కోరారు. వాయు కాలుష్యానికి పూర్తిగా బాణాసంచా మాత్రమే కారణం కాదని... ఇందుకు అనేక ఇతర కారణాలు ఉన్నాయని వారు కోర్టుకు వివరించారు. ఈ అంశంలో వాస్తవాలు తెలియకపోవడం వల్ల తాము నష్టపోవాల్సి ఉంటుందని వాదించారు. 

గతేడాది అక్టోబర్‌లో దీపావళికి ముందు బాణాసంచా అమ్మకాలపై సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిషేధం విధించింది. పండగకు రెండు రోజులు ముందు అమ్మకాలకు అవకాశం కల్పించాలని వ్యాపారుల వినతిని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. వాయు కాలుష్యం ప్రభావం ఆయా ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుందనే విషయం తెలుసుకోవడానికే ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. 

16:20 - October 20, 2018

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శ్వాస సంబంధమైన వ్యాధులు గత కొన్ని ఏళ్లుగా విజృంభించి ప్రజల జీవితాలపై మరణశాసనాన్ని లిఖిస్తున్నాయి. 2016 సంవత్సరంలో.. 29,000 వేల మంది క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్ (సీఓపీడీ) (ఊపిరితిత్తుల వ్యాధులు) కారణంగా ఆంద్రప్రదేశ్‌లో మరణించినట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ మరణాల సంఖ్య తెలంగాణలో 19,000 గా గుర్తించారు. దేశవ్యాప్తంగా 2016 సంవత్సరంలో ఊపిరితిత్తుల వ్యాధుల వల్ల  8.48 లక్షల మంది మరణించారు. 
ఇదే సంవత్సరంలో ఆస్థమా వ్యాధి కారణంగా మరణాల సంఖ్య తెలంగాణలో 4 వేలుకు చేరుకోగా, ఆంద్రప్రదేశ్‌లో 6 వేలకు చేరింది. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 1.83 లక్షలుగా పేర్కొన్నారు. 
రాష్ట్రాల వారీగా ఊపిరితిత్తుల వ్యాధి తీవ్రతపై లాన్సెట్ 2018 నిర్వహించిన నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో తక్కువే అయినప్పటికీ.. వ్యాధి తీవ్రత అధికమేనని నివేదిక తేల్చింది. తెలంగాణ కంటే ఏపీలో ఆస్థమా వ్యాధి ప్రభావం అధికంగా ఉంది. ఊపిరితిత్తుల వ్యాధి తీవ్రత అధికంగా ఉండటానికి కారణాలు అనేకం. వాయి కాలుష్యం, మితిమీరిన టుబాకో వాడకంతో పాటు పనిచేసే ప్రదేశాల్లో దుమ్ము, ధూళీ వంటి ఆంశాలు సీఓపీడీ వ్యాధుల విజృంభణకు కారణమని నివేదిక స్పష్టం చేసింది.

 

 

12:43 - August 10, 2018

తినే తిండి విషయంలో శ్రద్ధ పెరిగింది. తాగే నీటి విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నాం. కానీ..మనం బతికేందుకు ప్రధాన వనరు అయిన 'గాలి' విషయంలో మాత్రం మన దారుణంగా నష్టపోతున్నాం. అదే ఆరోగ్యం విషయంలో . మనం నిజానికి, తిండికన్నా, నీటికన్నా గాలినే మనం ఎక్కువగా అవసరం. అనుక్షణం ఆక్సిజన్ మన శరీరంలోని అణువణువుకూ అందాలి. అప్పుడే మనం సజీవంగా ఉండగలుగుతాం. సృష్టిలో జీవులకు, నిర్జీవులకు మధ్య అదే అతిపెద్ద తేడా. మనం మనగలుగుతున్నా మంటే అందుకు కారణం ప్రాణవాయువే. ఆ గాలి ఎంతగా కాలుష్యమౌతోందంటే, అది మన మనుగడకే శాపంగా మారింది. విషవాయువుల్ని పీలుస్తూ మనకు తెలియకుండానే మనం మన ఆయుషును కోల్పోతున్నాం.

దేశవ్యాప్తంగా కాలుష్య నగరాల సంఖ్య 100..
దేశంలోని వంద నగరాల్లో అత్యవసర కాలుష్య నిరోధక కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది అంటే వాయు కాలుష్యం ఎంతటి పెను ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో ఊహించలేం. ముంబై, పూణే, నాగపూర్, లక్నో, కాన్పూర్, వారణాసి, చంఢీఘడ్, కోల్ కతాలతోపాటు వంద నగరాల్లో కాలుష్య నివారణకు చర్యలు చేపట్టనుంది. కానీ ఇది ఎప్పటికి ఆచరణలో వచ్చేనో..మన ప్రాణాలకు ఎప్పుడు రక్షణ దొరికేనో? అదంతా పాలకు చేతిలోనే వుంది.

వాయు కాలుష్యంతో డయాబెటిస్ ముప్పు..
భారత్‌లోని ప్రధాన నగరాల్లో వాతావరణ కాలుష్యం ఎంతగా పెరిగిపోతోందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఈ కాలుష్యం మనుషుల్లో పలు వ్యాధులకు కారణం అవుతోంది. దీని కారణంగా డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం కూడా అధికమని తాజాగా పరిశోధనలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో బాధపడుతోన్న వారి సంఖ్య పెరగడానికి గాలి కలుషితం కావడం కూడా ఓ కారణమని పరిశోధకులు గుర్తించారు.

ఇన్సులిన్‌ ఉత్పత్తిపై వాయు కాలుష్య ప్రభావం..
కలుషితమైన గాలి మనిషిలో ఇన్సులిన్‌ ఉత్పత్తిపై ప్రభావం చూపుతోందని.. రక్తంలోని గ్లూకోజ్‌ను శక్తిగా మారకుండా అడ్డుకుంటుందని పరిశోధనలో తేలింది. గాలి కాలుష్యం విషయంలో తక్కువ ఆదాయ దేశాల్లో ఎలాంటి ప్రత్యామ్నాయ పాలసీలు లేవని, దీంతో ఆయా దేశాల్లో ప్రజలు అత్యధికంగా గాలి కాలుష్యం వల్ల డయాబెటిస్‌ బారిన పడుతున్నారని గుర్తించారు.

గాలి కాలుష్యం 30లక్షల మంది మృతి..
పర్యావరణ రక్షణ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థలు కలిసి అతి తక్కువ కాలుష్యంగా గుర్తించిన ప్రదేశాల్లోనూ డయాబెటిస్‌ పెరిగిపోయిందని పరిశోధకులు తెలిపారు. 2016లో గాలి కాలుష్యం వల్ల ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల మధుమేహ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. మరి ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి వాయు కాలుష్యం తగ్గించటంలో చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం..లేకుండే మానవ మనుగడకు ముప్పును మనకు మనమే మన విధి విధానాలతో కొన్ని తెచ్చుకునే ప్రమాదంలో పడిపోతాం..ఎన్నికల సమయంలో పాలకులకు ప్రజల ఓట్లు కోరేవారు ప్రజల ఆరోగ్య విషయంలో కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవరముంది. లేకుంటే స్వచ్ఛమైన గాలి కావాలంటు ప్రజలే ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. 

06:41 - May 14, 2018

ఢిల్లీ : దేశ రాజధానిలో గాలివానా బీభత్సం సృష్టించింది. దుమ్మూ ధూళితో బలమైన గాలులు వీచాయి. దీంతో పలు చోట్ల చెట్లు నేలకూలాయి. ఢిల్లీ, గురుగ్రామ్‌లో మిట్ట మధ్యాహ్నమే చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలి వీయడంతో.. 40 విమానాలను దారి మల్లించారు. 72 గంటల పాటు అలర్ట్‌ ప్రకటించారు.

21:38 - April 17, 2018

మెదక్ : మెతుకుసీమ.. కాలుష్యపు కోరలకు చిక్కి విలవిలలాడుతోంది. జిల్లాలో ఎక్కడ చూసినా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలే. నీరు, గాలి, మట్టి.. ఇలా అంతటా కాలుష్యమే. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు మరో కాలుష్యకారక పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాలుష్యంతో తల్లడిల్లిపోతున్న స్థానికులు.. కొత్తపరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. 

పారిశ్రామికంగా ఎదుగుతున్న సంగారెడ్డి జిల్లాలో.. అంతే స్థాయిలో కాలుష్యమూ విస్తరిస్తోంది. ఇప్పుడున్న వాటికి తోడు.. మరో కాలుష్యకారక పరిశ్రమ ఈ ప్రాంతానికి రాబోతోంది. ప్రజల అభీష్టంతో నిమిత్తం లేకుండానే ఈ ఫార్మా పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం యావాపూర్‌, మద్దికుంట సమీపంలో కొత్తగా ఓ ఫార్మా కంపెనీని స్థాపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుమారు పదిహేడు వందల ఇరవై ఎనిమిది మెట్రిక్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యంతో ఈ ఫార్మా కంపెనీని స్థాపిస్తున్నారు. ఇప్పటికే పరిశ్రమల కాలుష్యంతో అనారోగ్యాల బారిన పడుతున్న ప్రజలు.. కొత్త ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమించేందుకు సన్నద్ధమవుతున్నారు. నిజానికి మార్చి 28న ఈ కంపెనీపై ప్రజాభిప్రాయ సేకరణకు సభ నిర్వహించాలని ప్రయత్నించారు. కారణాలేమో కానీ.. ఈ సభ రద్దయింది. మళ్లీ జనాభిప్రాయ సేకరణ సభ ఎప్పుడు ఏర్పాటు చేస్తారో తెలియదు కానీ.. ఆ ప్రయత్నాన్ని గట్టిగా ప్రతిఘటిస్తామని స్థానికులు చెబుతున్నారు. 

యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్స్‌ పేరిట ప్రారంభించబోతున్న పరిశ్రమకు వ్యతిరేకంగా ఇప్పటికే ఆందోళనలు మొదలయ్యాయి. ఇటీవలే జడ్పీ సర్వసభ్య సమావేశంలోనూ దీనిపై వాడివేడిగా చర్చ జరిగింది.. ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా.. పరిశ్రమలకు అనుమతులు ఎలా ఇస్తారంటూ  స్థానిక ఎమ్మెల్సీ పోతూరి సుధాకర్‌ రెడ్డి కూడా అధికారులను జెడ్పీ సమావేశంలో గట్టిగా నిలదీశారు. 

సదాశివపేటలో.. 112 ఎకరాల్లో నెలకొల్పే ఈ పరిశ్రమలో 16 రకాల ఉత్పత్తులు బయటికొస్తాయి. వీటికోసం రోజుకు 863 లీటర్ల నీరు అవసరం అవుతుందని... సుమారు 1500 మందికి ఉపాధి లభించవచ్చని ప్రభుత్వం చెప్పుకొస్తోంది.  పరిశ్రమ వల్ల కలిగే లాభాలనే ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది. ఐతే పరిశ్రమల వల్ల వ్యాపించే కాలుష్యం గురించి ప్రభుత్వం కానీ,  అధికారులు కానీ పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.     బైట్ : 
నిజానికి ఈ ప్రాంతంలోని ఫార్మా కంపెనీలన్నింటినీ జనావాసాలకు దూరంగా ఒకే చోటికి తరలిస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. అయితే.. ఇప్పుడు మాట తప్పి.. కొత్తగా మరో ఫార్మా కంపెనీకి అనుమతినివ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో.. స్థానికుల అభిప్రాయాన్ని సేకరించి.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని స్థానిక కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. 

పరిశ్రమలు రావాలి.. ఉపాధి లభించాలి.. అయితే ఆ వంకతో ప్రజారోగ్యంతో చెలగాటమాడతామంటే మాత్రం సహించేది లేదని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వం.. జనాభిప్రాయ సేకరణను మొక్కుబడి తంతుగా నిర్వహించి చేతులు దులిపేసుకుంటే రోడ్డెక్కుతామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా నెలకొల్పబోయే యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్స్‌కు గడ్డుపరిస్థితే కనిపిస్తోంది. 

12:43 - April 7, 2018

హైదరాబాద్ : ట్విట్టర్‌ వేదికగా పవన్‌ కల్యాణ్‌ మరోసారి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు పెట్టారు. దేశంలో వాయుకాలుష్యంపై ప్రశ్నించారు. భారత్‌ ఆర్థికంగా దూసుకుపోతున్నా, భారత్ వెలిగిపోతున్నా.. దేశంలో స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే పరిస్థితి లేదని అన్నారు. ఇందుకు నాయకుల చర్యలే కారణమని అన్నారు. స్వచ్ఛమై గాలి, నీరు దొరకడం లేదని తుందుర్రు యువత ప్రశ్నిస్తోందన్నారు.

 

11:07 - December 25, 2017

ఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ రాజధానిలో పరిస్థితి దారుణంగా తయారైంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని..పొగమంచు దట్టంగా అలుముకుంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం పొగమంచు అలుముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 11గంటలవుతున్నా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. సమీపంలో ఉన్న వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రవాణా వ్యవస్థ పై ప్రభావం చూపిస్తోంది. రైలు..విమాన సర్వీసులు ఆలస్యంగా ప్రయాణిస్తుండడం..రద్దు అవుతున్నాయి. 17 రైళ్లను రద్దు చేయగా ఆరు రైలు సర్వీసులను రీ షెడ్యూల్ చేశారు. 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది.

 

19:01 - December 7, 2017

హైదరాబాద్ : కాలుష్యం కనిపించని భూతంలా ప్రజల ప్రాణాలను హరిస్తోంది. ప్రధానంగా వాయు కాలుష్యంతో చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. దేశంలోనే ఈ రక్కసి బారిన పడిన నగరాల్లో హైదరాబాద్ భయంకరమైన స్థాయికి చేరుతోంది.  దేశ రాజధాని ఢిల్లీలోని కాలుష్యంలో సగం మన భాగ్యనగరంలోనే ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది. 

రోజురోజుకూ వాతావరణంలో కాలుష్యం పెరిగిపోతోంది. కార్లు, బైకుల వినియోగం నానాటికీ ఎక్కువ కావడం వల్ల... పొగవల్ల కాలుష్యం, రేడియేషన్ పేరుకుపోతోంది. దీనివల్ల ప్రజలు  పలు రకాల జబ్బుల బారిన పడుతున్నారు. కంటికి కనిపించని ధూళికణాలు గాలిలో ప్రమాదకర స్థాయిలో పేరుకుపోయాయి..  కార్యాలయాల్లో కూర్చుని పని చేసేవారికంటే.... బయటి ప్రాంతాల్లో పని చేసే కార్మికులు, ట్రాఫిక్ పోలీసుల వంటి వారిపాలిట ఇది మరింత భయంకరంగా మారింది.

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీత స్థాయికి చేరుకున్న పరిస్థితుల్లో దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉందన్న విషయం కూడా చర్చకువచ్చింది. దీని ప్రభావం ప్రజల మీద ఏస్థాయిలో ఉంటుందన్నది ప్రధానంగా చర్చకొచ్చింది. భాగ్యనగరంలోని కాలుష్యంపై ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ ప్రొఫెసర్ మధుసూదన్ రావ్  ఆధ్వర్యంలో విద్యార్థులు పరిశోధన నిర్వహించారు.  జీహెచ్ ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో  గాలిలో ధూళి కణాలు అధిక స్థాయిలో ఉన్నట్లు వారి అధ్యయనంలో తేలింది. ఢిల్లీలోని కాలుష్యంలో సగ భాగం హైదరాబాద్ లో ఉన్నట్లు చెబుతున్నారు. స్పాట్...

పరిశోధక విద్యార్థులు కాలుష్యంపై ఒక సంవత్సరంపాటు నగరంలో మ్యాగ్నెటిక్ విధానంలో అధ్యయనం చేశారు.   హబ్సిగూడ నుంచి చర్లపల్లి, అమీర్ పేట్ నుంచి పటాన్ చెరువు, ఎల్బీనగర్ నుంచి శిల్పారామం. జేబీఎస్ నుంచి ఫలక్ నుమా, ఎల్బీనగర్ నుంచి అమీర్ పేట్, మియాపూర్ క్రాస్ రోడ్- బాచుపల్లి ప్రాంతాల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉందని వారు తెలిపారు. ఇదంతా కూడా కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉందని తేల్చారు. 

హైదరాబాద్‌లో కాలుష్యం పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి.  వాటిలో ప్రధానంగా  శుభ్రంగా లేని రహదారులు... లెక్కకు మించి జరుగుతున్న భవన నిర్మాణాలు, కాలం తీరిన భవనాల తొలగింపు, ఎప్పటికప్పుడు చెత్తను తొలగించకపోవడం, చెత్తకు నిప్పుపెట్టడంతో గాలిలో కాలుష్యం ప్రమాద స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని.. లేకుంటే ఢిల్లీ లాంటి పరిస్థితి తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

20:24 - November 30, 2017

మామూలుగా గాలి పీల్చక పోతే చస్తారు.. కానీ, ఇక్కడ గాలి పీల్చినందుకు చస్తున్నారు..ఇది మామూలు గాలి కాదు.. ఊపిరితిత్తులను రోజుకింత కొరుక్కు తినేస్తోంది. ఇది ఏ ఒక్క ప్రదేశానికో, నగరానికో పరిమితం కాదు.. దేశంలోని పెద్ద పెద్ద నగరాలనుంచి, చిన్న స్థాయి పట్టణాల వరకు ఇదే పరిస్థితి. ఒక్కమాటలో చెప్పాలంటే వాయు కాలుష్యం అంతులేకుండా పెరుగుతోంది. ప్రాణాంతకంగా మారుతోంది. ఈ అంశంపై ప్రత్యేక కథనం...ఆకాశహర్మ్యాలు.. సకల సౌకర్యాలు..అత్యంత నాగరికం.. ఇక్కడ దొరకనిది లేదు.. అందనిది లేదు. కానీ, ఈ నగరాలే.. ప్రాణాలను తీసేస్తున్నాయి. ఆక్సిజన్ ని మింగేస్తూ, ప్రమాదకర వాయువులను అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. దేశమంతా కాలుష్య కాసారంలా మారుతోంది. ఆక్సిజన్ తక్కువ.. కార్బన్ ఎక్కువ.. పీలిస్తే రోగాలు ఖాయం..అటు ఢిల్లీ నుండి ఇటుహైదరాబాద్ వరకు..

కరీంనగర్ నుండి ఖమ్మం లాంటి పట్టణాల వరకు ఇదే తీరు. నిత్యం పెరుగుతున్న వాయు కాలుష్యం లక్షలాదిమందిని రోగాలపాల్జేస్తోంది.. ఉసురు తీస్తోంది. దేశానికే కాదు.. కాలుష్యానికీ క్యాపిటల్ గా నిలుస్తోంది.. పట్టపగలే పొగమంచు పేరుకుని ఎదురుగా వచ్చే వాహనాలే కనిపించని పరిస్థితి. పొల్యూషన్ లో బీజింగ్ ని దాటి శరగవేగంగా దూసుకుపోతోంది ఢిల్లీ.. ఢిల్లీలో ప్రజారోగ్యం ఇప్పటికే ప్రమాదంలో ఉంది. ఇదిలాగే సాగితే కొన్నాళ్లకు దేశ రాజధానిలో ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో ఊహించటం కూడా కష్టమే..అన్ని అనర్ధాలకు కారణం కారణం ఏమిటి? నగరాలు ఎందుకు ఇంత కాలుష్య భరితంగా మారుతున్నాయి. ఒక్క భారత్ లోనే కాదు.. అనేక వర్ధమాన దేశాల గాలి ప్రమాదకరంగా ఎందుకు మారుతోంది? ఊహించని అనర్ధాలకు ఎందుకు కారణం అవుతోంది. దీనిని నియంత్రింకపోతే ఎలాంటి అనర్థాలు జరిగే అవకాశాలున్నాయి?

ప్రమాదపు చివరి అంచులో ఉన్నాం. వాయుకాలుష్యం ఇదే రీతిలో పెరిగితే దేశంలో సగం జనాభా ఆస్పత్రుల్లోనే మకాం పెట్టే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపడాల్సిందే లేదు. పర్యావరణ ముప్పునుండి ఈ భూగోళాన్ని కాపాడుకోటానికి ఎలాంటి మార్గాలున్నాయి? వాయు కాలుష్యం.. గ్లోబల్ వార్మింగ్ కు కారణంగా మారకుండా నియంత్రించే మార్గాలే లేవా? ముందూ వెనుకా చూడకుండా అభివృద్ధి కోసం పరుగులో మిగుల్చుకుంటున్నది, పోగుచేస్తున్నది అపారమైన కాలుష్యాన్ని మాత్రమే. దీన్నిలాగే కొనసాగిస్తే ఇప్పటికే వెల్లువెత్తుతున్న విపత్తులు మరింత ఉగ్రరూపం దాల్చి ప్రపంచదేశాలను అన్ని రకాలుగా కబళించటం ఖాయం..అన్నిటికంటే ముందు నూట ముప్ఫై కోట్లతో నిండిన నిండు కుండలాంటి భారతదేశానికి ఈ పరిణామాలు వీలైనంత త్వరగా మేల్కొవలసిన అవసరాన్ని సూచిస్తున్నాయి. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి…

Pages

Don't Miss

Subscribe to RSS - air pollution