సుప్రీంకోర్టు

18:24 - September 14, 2018

న్యూఢిల్లీ: ఆయన ఓ సాంకేతిక విజయాన్ని దేశానికి అందించిన అత్యంత ప్రతిభావంతుడు. రాకెట్ల ప్రయోగంలో ఓ కీలక ప్రయోగానికి నాంది పలికిన విజ్ఞాని. అప్పటివరకూ ద్రవ ఇంధనాన్ని రాకెట్ ప్రయోగంలో వినియోగించలేదు. 70వ దశకంలోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనుడు కేరళకు చెందిన నంబి నారాయణన్. ఇస్రోలో పనిచేసిన సమయంలో మెదటిసారిగా ద్రవ ఇంధనాన్ని రాకెట్ ప్రయోగంలో ఉపయోగించిన గొప్ప శాస్త్రవేత్త. అటువంటి శాస్త్రజ్ఞుడిని మిలిటరీ రహస్యాలను మాల్దీవుల సీక్రెట్ ఏజెంట్లకు అమ్మివేశాడని ఆరోపిస్తూ 1994లో కేరళ పోలీసులు అరెస్టు చేశారు.

50 రోజుల పాటు జైలులో ఉంచారు.  ఈయనతోపాటు డి.శశికుమారన్ అనే మరోక శాస్త్రవేత్తను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్లైట్ టెస్ట్ డాటాను రహస్యంగా అమ్మివేశారన్న ఆరోపణలతో ఆయనను ముగ్గురు పోలీసులు సిబీ మాథ్యూ, కెకె జోషువా, ఎస్ విజయన్ లాకప్ లో చిత్రహింసలకు గురిచేశారు.

ఆ తర్వాత ఆ కేసును సీబీఐ తీసుకోవడంతో నారాయణన్ ను నిర్దోషి అని తేల్చి వదిలేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని, అవమానాన్ని వివరిస్తూ కేరళ హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై స్పందించిన కోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రూ.1 లక్ష రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. దీంతో మరింత కృంగిపోయిన 70 ఏళ్ల నారాయణన్ సుప్రీంకోర్టులో తిరిగి పోరాటం ప్రారంభించారు. దీనిపై తీర్పును శుక్రావారంనాడు వెలువరిస్తూ నారాయణన్ కు రూ. 50 లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.

‘‘ దోషిగా..దేశద్రోహిగా ఇక నన్ను ఎవరూ పిలవలేరు. నన్ను ఈ కేసులో ఇరికించిన పోలీసలు వాళ్లు ఎంత తప్పు చేశారో అర్థమయితే చాలు. సుప్రీంకోర్టు తీర్పు నాకు ప్రశాంతతను ఇచ్చింది. నేను ఇప్పుడు నా కుటుంబంతో సంతోషంగా జీవించగలను..‘‘  అంటూ నారాయణన్ కోర్టు తీర్పు అనంతరం ఎన్డీటీవీతో తన ఆవేదనను పంచుకున్నారు.

 

16:28 - September 13, 2018

హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ తరఫున వాదించేందుకు సీనియర్ న్యాయవాది పాలి నారిమన్ ను ఏపీ ప్రభుత్వం నియమించింది. అందుకు గానూ నారిమన్ కు 33 లక్షల ఫీజు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సుప్రీంకోర్టులో ఏపీ తరఫున పాలి నారిమన్ వాదించనున్నారు. శుక్రవారం సుప్రీంకోర్టులో ఉమ్మడి హైకోర్టు విభజన విచారణకు రానుంది. ఉమ్మడి హైకోర్టు విభజనపై గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 

 

08:19 - September 7, 2018

ఢిల్లీ : స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. స్వలింగ సంపర్కం ఇకపై నేరం కాదు.. స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పిస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. అందరిలాగే స్వలింగ సంపర్కులకు కూడా రాజ్యంగం ప్రకారం అన్ని సమాన హక్కులు లభిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పును వెలువరించడం విశేషం. తాజా తీర్పుతో సెక్షన్‌ 377పై కొనసాగుతున్న వివాదానికి తెరపడింది.
సుప్రీంకోర్టు తుది తీర్పు
స్వలింగ సంపర్కంపై ఐపిసి సెక్షన్‌ 377 చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు  తుది తీర్పును వెల్లడించింది. పరస్పర అంగీకారంతో జరికే స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పింది. చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌, జస్టిస్‌ ఖాన్‌విల్కర్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందూ మల్హోత్రాలతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పు వెలువరించింది. 
జంతువులతో లైంగిక చర్య, చిన్నారులతో అసహజ శృంగారం నేరం 
వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కని...స్వలింగ సంపర్కులకు కూడా రాజ్యాంగం ప్రకారం అన్ని సమాన హక్కులు లభిస్తాయని కోర్టు స్పష్టం చేసింది. లైంగిక స్వభావం ఆధారంగా ఒకరిపై పక్షపాతం చూపడమంటే వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లేననే తెలిపింది. ఎల్‌జిబిటి సముదాయాన్ని అందరూ గౌరవించాలని...వీరిపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం ప్రచారం నిర్వహించాలని సూచించింది. సుప్రీం తీర్పుతో సెక్షన్‌ 377పై 150 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి తెర పడింది. జంతువులతో లైంగిక చర్యను, చిన్నారులతో అసహజ శృంగారం మాత్రం నేరంగానే పరిగణించాలని కోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పును ఎల్‌జిబీటీ కార్యకర్తలతో పాటు పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు కొత్త శకానికి నాందిగా పేర్కొన్నారు. ఈ విషయంలో తనను తప్పు పట్టిన బిజెపి ఎంపీలకు ఈ తీర్పు చెంప పెట్టులాంటిదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ అన్నారు.
377 సెక్షన్‌ను సవాల్‌ చేస్తూ పిటిషన్ 
సెక్షన్‌ 377 ప్రకారం స్వలింగ సంపర్కం, జంతువులతో లైంగిక చర్యలు, అసహజ శృంగారానికి పాల్పడినవారికి పదేళ్ల వరకు జైలుశిక్ష, జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉంది. 377 సెక్షన్‌ను సవాల్‌ చేస్తూ నాజ్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ 2001లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఇద్దరు వయోజనుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగే లైంగిక చర్యను నేరంగా పరిగణించకూడదని 2009లో ఢిల్లీ  హైకోర్టు తీర్పు చెప్పింది. 2013లో ఈ తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.  సెక్షన్‌ 377 చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్తలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు జులై 17న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు తాజా తీర్పునిచ్చింది.

 

16:38 - September 4, 2018

ఢిల్లీ : కొంతమందికి డ్రైవ్ చేయటంలో మజా ఫీలవుతుంటారు. ఈ క్రమంలో వారు ర్యాష్ గా..స్టైల్ గా..కేర్ లెస్ గా డ్రైవ్ చేస్తుంటారు. దీంతో వాహనాలు పలు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు వున్నాయి. ఈ క్రమంలో వాహనం పూర్తిగా డేమేజ్ కావచ్చు. ఆ ఏముందిలే..బీమా వుందిగా..మనకెందుకు చింత అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు యాక్సిలేటర్ మీద కాలేసినట్లే. ర్యాష్ డ్రైవింగ్ చేసిన సమయంలో యాక్సిడెంట్ అయిన వాహనాలకు బీమా వర్తించదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి గురైన వారు బీమా క్లెయిమ్‌ చేసుకోవద్దని చెప్పింది. జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది. అయితే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి ‘పర్సనల్‌ యాక్సిడెంట్‌’ పాలసీ కింద పరిహారం అందుతుందని కోర్టు వెల్లడించింది.

జాతీయ బీమా కంపెనీ దాఖలు చేసిన ఓ పిటిషన్‌పై విచారణ చేప్టిన సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. దిలీప్‌ భౌమిక్‌ అనే వ్యక్తి 2012 మే 20న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబసభ్యులు బీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన స్వయం తప్పిదం వల్లే ప్రమాదానికి గురయ్యారని బీమా కంపెనీ వాదించింది. అయితే త్రిపుర హైకోర్టు మృతుడి కుటుంబసభ్యులకు రూ.10.57లక్షల ఇన్స్యూరెన్స్‌ చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశించింది. దీనిపై బీమా కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు త్రిపుర హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. మృతుడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసినట్లు గుర్తించింది. స్వయం తప్పిదంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసి ప్రమాదానికి గురైతే బీమా ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అటువంటి సందర్భాల్లో మోటార్‌ వాహనాల చట్టం సెక్షన్‌ 166 ప్రకారం బాధిత కుటుంబసభ్యులు కూడా ఇన్స్యూరెన్స్‌ కోరొద్దని పేర్కొంది. అయితే పర్సనల్‌ యాక్సిడెంట్‌ కవర్‌ కింద భౌమిక్‌ కుటుంబానికి రూ.2లక్షల బీమా ఇవ్వాలని కోర్టు జాతీయ బీమా కంపెనీని సుప్రీంకోర్టు ఆదేశించింది.

07:32 - September 1, 2018

ఉమ్మడి హైకోర్టు విభజనపై ఏపీ ప్రభుత్వానికి, హైకోర్టుకు దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టుల ఏర్పాటుపై కేంద్రం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎకె సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరురాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా వున్న హైదరాబాద్‌లో వేరే భవనంలో వేర్వేరుగా హైకోర్టుల ఏర్పాటుపై కేంద్రం ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఎందుకు హైకోర్టులను ఏర్పాటు చేయకూడదని కేంద్రం ఈ పిటిషన్‌లో పేర్కొంది. హైకోర్టు విభజన ఎంతమాత్రం జాప్యం చేయటం వీలులేదని తెలంగాణ తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి, రెండు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులు ఏర్పాటు చేయాల్సిందేనని కేంద్ర న్యాయశాఖ తరపున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌లు వాదించారు. కేంద్రం వాదనలతో తెలంగాణ ఏకీభవించింది. దీనిపై ఏపిలో హైకోర్టు భవన నిర్మాణాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా..దీనికి సంబంధించిన నిర్మాణాలు పూర్తి కాలేదని కేంద్రం న్యాయస్థానానికి తెలిపింది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు రెండు ప్రతిపాదనలు పెట్టింది. ప్రస్తుత హైకోర్టు భవనంలో ఖాళీగా ఉన్న 24 హాళ్లలో ఏపికి వేరుగా హైకోర్టు ఏర్పాటు చేయవచ్చునని, లేదంటే రెండో ప్రత్యామ్నాయంగా ప్రస్తుత హైకోర్టు భవనాన్ని తాము ఖాళీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. చట్టసభలు, అధికారుల విభజన జరిగిందని, కానీ న్యాయవ్యవస్థ విభజన జరగలేదని ముకుల్‌ రోహత్గి కోర్టుకు విన్నవించారు. హైకోర్టు విభజన ఆలస్యం కావడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, న్యాయమూర్తుల్లో 40 శాతం ఉండాల్సిన తెలంగాణ వాటా కూడా లేదని కోర్టుకు తెలిపింది. కేసు వాదనల సమయంలో ఏపి ప్రభుత్వం తరపు న్యాయవాది గైర్హాజయ్యారు. దీంతో ఏపి ప్రభుత్వానికి, హైకోర్టుకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను సుప్రీం కోర్టు ధర్మాసనం రెండు వారాలపాటు వాయిదా వేసింది. ఈ అంశంపై 10టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఏపీ బీజేపీ అధికార ప్రతినిథి ఆర్.డి. విల్సన్, కాంగ్రెస్ మాజీ ఎంపీ, తులసిరెడ్డి, టీఆర్ఎస్ నేత రాకేశ్ , టీడీపీ నేత లాల్ వజీర్ పాల్గొన్నారు. 

17:50 - August 31, 2018

జమ్ముకశ్మీర్‌ : జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్న ఆర్టికల్‌ 35 ఏ అధికరణపై విచారణను సుప్రీంకోర్టు వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. 35ఏ అధికరణ రాజ్యంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విచారణ వాయిదా వేయాలని జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం తరపున ఏఎస్‌జి తుషార్‌ మెహతా సుప్రీంకోర్టును అభ్యర్థించారు. భద్రతా సంస్థలు ఎన్నికల నిర్వహణలో తలమునకలై ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో సుప్రీంకోర్టు తదుపరి విచారణ జనవరి 19, 2019కు వాయిదా వేసింది. ఆర్టికల్‌ 35 ఏ అధికరణం రద్దు చేయొద్దని కోరుతూ వేర్పాటు వాదులు జమ్ముకశ్మీర్‌లో గురు, శుక్రవారాల్లో బంద్‌ పాటించారు. 1954లో రాష్ట్రపతి ఆదేశాలతో ఆర్టికల్‌ 35 ఏ చట్టబద్దమైంది. ఈ ఆర్టికల్‌ ప్రకారం జమ్ముకశ్మీర్‌ ప్రజలకు ప్రత్యేక అధికారాలు సంక్రమించాయి. భూములు, ఉద్యోగాల్లో కేవలం కశ్మీరీలకు మాత్రమే హక్కు ఉంటుంది. 

16:53 - August 31, 2018

ఢిల్లీ : ఏపీ హైకోర్టు విభజనపై కేంద్రం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇప్పుడున్న హైకోర్టు ఏపీకి ఇచ్చేందుకు సిద్దమని తెలంగాణ తెలిపింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. 

15:44 - August 31, 2018

కేరళ : మలయాళ నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌పై ఉన్న కేసును సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఆమె నటించిన 'ఒరు అదార్‌ లవ్' చిత్రంలో ముస్లిం భావాలను కించపరిచేలా పాట ఉందన్న ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ పాటలో ప్రియ కన్నుకొట్టిన సన్నివేశాలు దేశవ్యాప్తంగా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. నాలుగు నెలల తర్వాత ప్రియపై వేసిన కేసును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 'ఎవరో సినిమాలో ఏదో పాట పాడితే మీకు కేసు వేయడం తప్ప మరో పని లేదా?' అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

18:55 - August 29, 2018

హైదరాబాద్ : భీమా-కోరేగావ్‌ హింస కేసులో అరెస్ట్‌ అయిన ఐదుగురు పౌరహక్కుల నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అరెస్ట్‌లపై దాఖలైన పిటిషన్‌లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు- మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. వారిని సెప్టెంబర్‌ 5 వరకు హౌజ్‌ అరెస్ట్‌లో ఉంచాలని కోర్టు ఆదేశించింది. వరవరరావు సహా మిగతా నలుగురు మానవ హక్కుల కార్యకర్తలను గృహ నిర్బంధంలో ఉంచాలని, వారని బయటకు వెళ్లకుండా నిరోధించాలని పేర్కొంది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ సెప్టెంబర్‌ 6కు వాయిదా వేసింది. పౌరహక్కుల నేతల అరెస్ట్‌ను ఖండిస్తూ.. ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్‌తోపాటు మరో నలుగురు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఐదుగురిపై తప్పుడు అభియోగాలు మోపారని, వారిని వెంటనే విడుదల చేయాలని పిటిషన్‌లో కోరారు. భీమా-కోరేగావ్‌ హింసాత్మక ఘటనలు, మావోయిస్టులతో సంబంధాలు, చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో పుణె పోలీసులు వరవరరావుతో సహా నలుగురు పౌర హక్కుల కార్యకర్తలను మంగళవారం అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

17:27 - August 10, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్ హంతకులను విడుదల చేయమని కేంద్ర ప్రభుత్వం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రాజీవ్ హంతకులను విడుదల చేయాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించాలని కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనితో శుక్రవారం కేంద్ర వైఖరిని కోర్టుకు తెలియచేసింది. కేంద్రం అనుమతి లేకుండా నిందితులను విడుదల చేయవద్దని ఇదివరకే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఇటీవలే సుప్రీంకోర్టుకు కేంద్రాన్ని ఆదేశించింది. దీనితో రాజీవ్ హంతకులను వదిలేది లేదని సుప్రీంకోర్టుకు తెలిపింది. 1991 మే 21న శ్రీ పెరంబుదూర్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో గత 27 ఏళ్లుగా ఏడుగురు నిందితులు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇందులో త్వరగా విడుదల చేయాలని నిందితురాలిగా ఉన్న నళిని కోరగా మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. 

Pages

Don't Miss

Subscribe to RSS - సుప్రీంకోర్టు