వ్యూహాలు

08:42 - October 10, 2018
హైదరాబాద్ : తెలంగాణలో గెలుపే లక్ష్యంగా బీజేపి పావులు కదుపుతోంది. ఎన్నికల ప్రచార బరిలోకి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దిగారు. నేడు కరీంనగర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్న ఆయన.. అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ తీరును ఎండగట్టనున్నారు. మరోవైపు అమిత్ షా పర్యటన తరువాత అభ్యర్ధుల జాబితా విడుదల చేసేందుకు బీజేపి కసరత్తు ముమ్మరం చేసింది. 
భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న షా.. ముందుగా బంజారాహిల్స్ లోని అగ్రశ్రేన్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. తరువాత కాచీగూడలోని శ్యాంబాబా మందిర్ లో సాధువులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 12గంటల 30నిమిషాలకు ఎగ్బిబిషన్ గ్రౌండ్ లో సికింద్రాబాద్, హైదరాబాద్, చేవేళ్ల, మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని పోలింగ్ కేంద్ర స్థాయి నాయకులను కలుస్తారు. మధ్యాహ్నం భోజన విరామం తరువాత ప్రత్యేక హెలీకాఫ్టర్లో కరీంనగర్ బయల్దేరతారు. బీజేపి తలపెట్టిన సమరభేరీ సభలో పాల్గొంటారు. 
 
అమిత్ షా పర్యటన తరువాత తమ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు బీజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు వెల్లడించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడానికి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆరే కారణమని విమర్శించారు. ప్రజల తీర్పును వృథా చేయడానికి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ పార్టీకి వేసినట్లేనన్నారు.
 
అమిత్‌షా పర్యటనతో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు దడపుడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్‌ అన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, మోడీ ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు. ముందుస్తు ఎన్నికలకు సీఎం కేసీఆర్‌ ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తామన్న లక్ష్మణ్.. కాంగ్రెస్ నేతలు.. తెలంగాణ ద్రోహులతో జత కట్టి మహాకూటమిగా ఏర్పడ్డారని మండిపడ్డారు.
08:01 - October 9, 2018

హైదరాబాద్ : తెలంగాణలో కింగ్‌ మేకర్‌ కావాలని బీజేపీ భావిస్తోంది.టీఆర్‌ఎస్‌, మహాకూటమిల మధ్య హోరాహోరీ పోరు తప్పదని భావిస్తున్న కమల దళం.. టీఆర్‌ఎస్‌కు మెజారిటీ తగ్గితే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని యోచిస్తోంది! ఆ దిశగా దూకుడు పెంచింది! వ్యూహాలకు పదును పెడుతోంది! రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి దేశం నలుమూలల నుంచి నేతలను రప్పించాలని నిర్ణయించింది! అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నప్పటికీ.. 30 సీట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. కచ్చితంగా 15 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నికల వ్యూహాల అమలుకు పార్టీ, సంఘ్‌ పరివార్‌ ఉమ్మడి కార్యాచరణతో రంగంలోకి దిగుతున్నాయి. 
ఒకవైపు పార్టీ పొరుగు రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలను రంగంలో దింపుతుండగా, మరోవైపు సంఘ్‌ పరివార్‌ క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల ప్రచారానికి 15మంది పార్టీ సీఎంలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 100మంది ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి నేతలు రానున్నారు. కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాలనుంచి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌ చేరుకున్నారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలు, కర్ణాటక తరహాలో ఇంటింటికీ ప్రచారం చేసేందుకు సంఘ్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది. 31 జిల్లాల నుంచి ఆరెస్సెస్ కు సంబంధించిన అన్ని అనుబంధ సంస్థల సభ్యులకు ఈ అంశంపై హైదరాబాద్‌లో వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

15:56 - September 8, 2018

హైదరాబాద్‌ : ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో స్థాపించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో పలు సమస్యలను ఫేస్ చేస్తోంది. విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఐదు సంవత్సరాలు నిండకుండానే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు శంఖారావం పూరించింది. దీంతో విపక్షాలు కూడా ఎన్నికలలో అవలంభించాల్సిన వ్యూహాలపై..పొత్తులపైనా కసరత్తులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీ.టీడీపీపై యోచించేందుకు హైదరాబాద్ కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుత రాజకీయ..పార్టీల విధి విధానాలపై నేతలతో ఆరా తీసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..ఆటుపోట్లు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదన్నారు. కమ్యూనిస్టు పార్టీలు, కో దండరాం పార్టీ వైఖరిపై నేతలను ఆరా తీశారు. తెలంగాణలో తెదేపా పట్ల ఆదరణ తగ్గలేదని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో 20 సీట్లలో 35 శాతం ఓటింగ్‌ పదిలంగా ఉందని.. తెదేపా బలం చెక్కు చెదరలేదని..ప్రజల్లో తెరాసపై తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

36 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నో ఆటుపోట్లు చూశామని అన్నారు. తెలుగు ప్రజల ఆదరాభిమానాలతో తెదేపాకు వన్నె తగ్గలేదన్నారు. వారి అభిమానమే పార్టీకి తరగని ఆస్తి అనీ..కార్యకర్తలే తెదేపా సంపదని వివరించారు. దేశంలో తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉండాలన్నదే తన ఎప్పటికీ తన ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు తెలిపారు. 

08:45 - April 24, 2018

హైదరాబాద్ : కన్నడ నాట రాజకీయం హీటెక్కుతోంది. అక్కడి ప్రధాన పార్టీలు కత్తులు దూస్తుంటే.. బీజేపీని దెబ్బకొట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్నారు. మోదీని దెబ్బతీసేందుకు ఏ ఒక్క అవకాశం వచ్చినా వదల కూడదని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలుగు ఓటర్లను ప్రభావితం చేస్తున్న టీడీపీ
కర్నాటకలో అత్యధిక సంఖ్యలో తెలుగు వారు నివసిస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వారే ఎక్కువ. ఎన్నికల్లో వీరు గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఆంధ్రుల సత్తా ప్రధాని నరేంద్ర మోదీకి చూపాలని చంద్రబాబు ఇప్పటికే పావులు కదిపారు. 
నరేంద్రమోదీని టార్గెట్‌ చేసిన చంద్రబాబు
ఇటీవలే ప్రత్యేక హోదా విషయంలో కర్నాటకలోని తెలుగు వారు చంద్రబాబును కలువగా బీజేపీని ఓడించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను నమ్మించి ద్రోహం చేసిన నరేంద్రమోదీకి కర్నాటక ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా గెలిచే వారికి ఓటు వేయాలని చెప్పారే కానీ ఏ పార్టీకి ఓటు వేయాలో మాత్రం చంద్రబాబు స్పష్టంగా చెప్పలేదు. అయితే గెలిచే వారికి ఓటు వేయమని చెప్పడం పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని సూచించినట్లయింది. టీడీపీకి వ్యతిరేక పార్టీయైన కాంగ్రెస్ గెలిచినా పర్వాలేదు కానీ బీజేపీ ఓడిపోవాలనేదే చంద్రబాబు అభిమతం. బెంగళూరు సిటీ, ఏపీ బోర్డర్‌లోని జిల్లాల్లో తెలుగువారు, వారి బంధువులు అధికంగానే ఉన్నారు వీరందరిని ఉపయోగించి మోదీకి తన సత్తా చూపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పురందేశ్వరిని రంగంలోకి దింపిన బీజేపీ
మరోవైపు  కర్నాటకలో తెలుగు వారిని తమ వైపుకు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకుగాను ఎన్టీఆర్‌ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరిని బీజేపీ నేతలు రంగంలోకి దింపారు. దాదాపు నాలుగు నెలలుగా కర్నాటకలో మకాం వేసిన పురందేశ్వరి..... ఎన్టీఆర్‌ అభిమానుల ఓట్లు బీజేపీ పడేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలు వంటి సెంట్‌మెంట్‌లతో తెలుగు వారికి కళ్లెం వేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇటువంటి  ప్రయత్నాలన్నీ ఎన్డీఏ నుండి వైదొలగక ముందునుంచే చంద్రబాబు చేస్తున్నట్లు బీజేపీ ఆరోపిస్తోంది. గుజరాత్‌లో కూడా బీజేపీని ఓడించేందుకు చంద్రబాబు ప్రయత్నించాడని మంత్రి నారా లోకేష్‌, తన ఇద్దరు మిత్రులకు డబ్బులు ఇచ్చి గుజరాత్‌కు పంపారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.  
ఆంధ్రులు ఎవరిని అందలం ఎక్కిస్తారో ? 
ఏది ఏమైనా చంద్రబాబు అక్కడి తెలుగువారికి బీజేపిని ఓడించమని సూచించటం బహిరంగ రహస్యమే... ఏపీ ప్రజల్లో కూడా ప్రత్యేకహోదా సెంటిమెంట్‌ బాగా ఉండటంతో కాగల కార్యం గందర్వులే తీర్చినట్లు భావిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. ప్రభుత్వ పరంగా వైఫల్యాలు, ఆరోపణలతో కొట్టుమిట్టాడుతున్న బీజేపికి కర్నాటకలోని తెలుగువారి ఓట్లు మింగుడుపడటం లేదు. మరి కర్ణాటకలో ఆంధ్రులు తమ సత్తా ఏమాత్రం చూపుతారో ఎవరిని అందలం ఎక్కిస్తారో చూడాలి. 

 

08:27 - April 22, 2018

హైదరాబాద్ : ప్రత్యేకహోదా సాధనకు వైసీపీ అధినేత జగన్‌ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ పార్టీ ఎంపీలు, ముఖ్యనేతలతో భేటీ అవుతున్నారు. ఇవాళ సాయంత్రం ఈ భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించనున్నారు.
ప్రత్యేకహోదాపై పోరును ఉధృతం చేసే దిశగా జగన్‌ అడుగులు 
ప్రత్యేకహోదాపై పోరును మరింత ఉధృతం చేసే దిశగా వైసీపీ అధినేత జగన్‌ అడుగులు వేస్తున్నారు. భవిష్యత్‌ కార్యాచరణను సిద్ధం చేయాలని భావిస్తున్నారు. హోదా ఉద్యమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే  ఇవాళ పార్టీ ఎంపీలు, ముఖ్యనేతలతో ఆయన భేటీ కావాలని నిర్ణయించారు. తన పాదయాత్ర శిబిరానికి రావాలని జగన్‌.. పార్టీ నేతలను ఆదేశించారు.
కలిసొచ్చే పార్టీలతో వైసీపీ కార్యాచరణ 
ప్రత్యేక హోదా కోసం ఉధృతంగా ఉద్యమించేందుకు  వైసీపీ సన్నద్ధమైంది.. కలిసొచ్చే పార్టీలతో కార్యాచరణ రూపొందించి... ప్రత్యేక హోదా పోరాటాన్ని తీసుకొని వెళ్లాలన్నది వైసీపీ వ్యూహం.  అందుకోసం .. ఢిల్లీలో రాజ్యసభ సభ్యులతో దీక్షలు చేయించాలన్న ఆలోచనలో వైసీపీ ఉంది. ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడంతోపాటు...  నియోజకవర్గాల్లో వారితో దీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు.   గత నాలుగేళ్లుగా కేంద్రంతో అంటకాగిన సీఎం... ఇప్పుడు ప్రత్యేక హోదాపై చేస్తున్న ఆందోళనను ఎలా ఎదుర్కోవాలన్నది  చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశం లో ప్రభుత్వ  వైఫల్యాలను ఎండ గట్టేందుకు  ఒక్కో సమస్యపై  బృందాలను ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి నేతల సమావేశంలో వైసీపీ అధినేత జగన్ ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

 

08:01 - October 20, 2017

హైదరాబాద్ : ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ స‌మావేశాల్లో వ్యవహారించాల్సిన వ్యూహాలపై చ‌ర్చించేందుకు 23న తెలంగాణ మంత్రి వ‌ర్గం భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమావేశమై ప్రతిపక్షాలను ఎదుర్కొనే వ్యూహాలపై సభ్యులకు సూచనలు, సలహాలు చేయనున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ సభ్యులతో ఓ దఫా భేటీ అయిన సీఎం.. ఏ ఏ అంశాలు స‌భ‌ముందుంచాల‌నే అంశంపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో టి-మాస్ ఫోరం, వామపక్షాల యాత్రలు.. మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేపథ్యంలో.. సమావేశంలో ఆచితూచి మాట్లాడాలని సభ్యులకు నిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ వేదిక ద్వారా త‌మ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై మంత్రులు స్పష్టమైన ప్రకటనలు చేయాలని నిర్ణయించారు.

కీలక బిల్లులు
మ‌రోవైపు పలు కీలక బిల్లులు కూడా ఈ సమావేశాల్లో ఆమోదించుకోవాల‌ని చూస్తున్నారు. ఇప్పటికే సభ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన పలు బిల్లులకు సంబంధించి..తిరిగి సభలో చర్చించాలనుకుంటున్నారు. వీటిలో ప్రధానంగా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు, హైకోర్టు విభజన, ఎస్టీ, మైనారిటీలకు రిజర్వేషన్ల పెంపు, సింగరేణి ఉద్యోగులకు ఆదాయపన్ను మినహాయింపు, వ్యవసాయంతో ఉపాధి హామీ పనుల అనుసంధానం, తెలంగాణలో ఎయిమ్స్ స్థాపన తదితర అంశాలు ఉంటాయని సమాచారం. సభా సమరంలో పై చేయి అధికార పార్టీదా, లేక విపక్షాలదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. 

07:33 - August 3, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికను టీడీపీ, వైసీపీలు.. 2019 ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్నాయి. ఇందుకోసం ఎలాగైనా ఉప ఎన్నికలో గెలవాలని ఇరు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే... తమ స్థానం తమకే దక్కుతుందని టీడీపీ భావిస్తుండగా... ఈ ఎన్నికలో గెలిచి.. అధికార పార్టీపై పైచేయి సాధించాలని వైసీపీ ఉవ్విళ్లూరుతోంది. పార్టీ ఫిరాయింపుతో కోల్పోయిన స్థానాన్ని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని పార్టీ అధినేత జగన్‌ పావులు కదుపుతున్నారు.

తొలి బహిరంగ సభ
నోటిఫికేషన్‌ వెలువడక ముందు నుంచే రంగంలోకి దిగిన ప్రధాన పార్టీలు ఇప్పుడు ప్రచారానికి మరింత పదునుపెట్టే పనిలో పడ్డాయి. సీఎం చంద్రబాబు ఇప్పటికే నియోజకవర్గంలో పలుమార్లు పర్యటించి ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అయితే... జగన్‌ ఇవాళ నంద్యాలలో తొలి బహిరంగ సభతో ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ సభతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఈ సభలోనే ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలో చేరనున్నారు. ఇక నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత జగన్‌ నంద్యాలలోనే మకాం వేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వరకు నియోజకవర్గంలోనే ఉండి ఉప ఎన్నికలో పార్టీ విజయం కోసం కృషి చేయనున్నారు.

గెలుపు కోసం వ్యూహాలు
సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం కూడా లేకపోవడంతో ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఈ ఫలితం వచ్చే ఎన్నికలపై ఉంటుందన్న అభిప్రాయంతో.. గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి.

 

15:38 - July 27, 2017

విజయవాడ : ఇంటర్వ్యూ అంటే.. ఇంతకాలం కాలేజీల్లో సీట్లకు, సంస్థల్లో ఉద్యోగాలకు మాత్రమే జరిగేవి. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. రాజకీయాల్లోనూ ఇంటర్వ్యూల హవా నడుస్తోంది. అధికారం చేజిక్కించుకోవడమే పరమావధిగా దూసుకు వెళుతున్న పార్టీలు.. మంచి నేతలను ఎంచుకునేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. ఏపీలో కొనసాగుతోన్న పార్టీల ఇంటర్వ్యూల ట్రెండ్‌పై 10టీవీ స్పెషల్‌ స్టోరీ. ఒకప్పుడు ఇంటర్వ్యూలు విద్యార్థులకు, ఉద్యోగులకు టెన్షన్‌గా ఉండేవి. వీటికోసమే పెద్ద ఎత్తునే కసరత్తులు చేసేవారు. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. రాజకీయ నాయకులూ ఇంటర్వ్యూల టెన్షన్‌లో కొట్టుమిట్టాడుతున్నారు. ఎలా ప్రిపేర్‌ అవ్వలా అని మదనపడి పోతున్నారు.

జనసేన..
పవన్‌ కల్యాణ్‌ సారథ్యంలోని జనసేన పార్టీ కార్యకర్తల స్థాయి నుంచే ఇంటర్వ్యూలు ప్రారంభించేసింది. టెస్ట్‌ పెట్టి పాస్‌ అయిన వారికి, ఇంటర్వ్యూలు నిర్వహించి, పార్టీలో చేర్చుకుంటున్నారు పవర్‌స్టార్‌. ఈ ట్రెండ్‌ మొదట్లో కాస్తంత విచిత్రమనిపించింది. అయితే, ఇప్పుడు రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం కూడా ఇదే ట్రెండ్‌లో సాగుతోంది. పార్టీని ఎలాగైనా పవర్‌లోకి తీసుకురావాలన్న తపనతో.. ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహాలనే నమ్ముకున్న వైసీపీ అధినేత జగన్‌.. వ్యూహకర్త సూచనలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. ఈ క్రమంలో.. ప్రశాంత్‌కిశోర్‌ బృందం నేరుగా ఎమ్మెల్యేలనూ ఇంటర్వ్యూలు చేసి పారేస్తోంది.

పని తీరుపై సర్వే..
నియోజక వర్గాల వారీగా ఎమ్మెల్యేలు, కోఆర్డినేటర్ల పనితీరుపై సర్వే నిర్వహించిన కిశోర్‌, నేరుగా నియోజక వర్గాల్లో పర్యటించి అభ్యర్థుల పనితీరు, గెలుపు, ఓటములపై వారినే ఆరా తీస్తున్నారు. గతంలో వీరి పనితీరు, ప్రజా సమస్యలపై స్పందిస్తున్న విధానం వంటి వాటిపై ఐఐటి ఖరగ్‌పూర్‌ విద్యార్థులతో, ఎమ్మెల్యేలను ఇంటర్వూ చేయిస్తున్నారు. తాజాగా ప్రశాంత్‌ కిశోరే రంగంలోకి దిగి ఇంటర్వూలు నిర్వహిస్తున్నారు.

రంగంలోకి ప్రశాంత్ కిశోర్..
ప్రశాంత్‌ కిశోర్‌ ఇప్పటికే 10 నుండి 15 మంది ఎమ్మెల్యేలతో ఆయా నియోజకవర్గాలకు వెళ్లి సమావేశం అయ్యారు. నియోజక వర్గాల్లో ఎమ్మెల్యే బలాలు, బలహీనతలు అనే అంశాలపై కిషోర్‌ వారితో భేటీ అయినట్టు తెలుస్తోంది. ప్రశాంత్‌ కిశోర్‌ భేటీలతో ఎమ్మెల్యేలు కంగారు పడుతున్నారు. ఈ భేటి కేవలం సాదాసీదాగా కాకుండా ఓ ఇంటర్వూ మాదిరిగా ఉందని అంటున్నారు. ఈ భేటిలో చర్చించిన అంశాలు, ఎమ్మెల్యేల సమాధానాలు చాలా కీలకం కానున్నాయి. ఈ ఇంటర్వూల ఆధారంగానే, వారికి తదుపరి ఎన్నికల్లో టికెట్‌ లభించేదీ లేనిదీ తేలిపోతుంది. అందుకే, ఎమ్మెల్యేలకు ప్రశాంత్‌కిశోర్‌ బృందం ఇంటర్వ్యూలంటే బెంబేలెత్తిపోతున్నారు. మరి ప్రశాంత్‌ కిశోర్‌ ఇంటర్వ్యూలు, ఆయన సలహాలు జగన్‌కు ఏమేరకు కలిసి వస్తాయో వేచి చూడాలి.  

17:00 - April 29, 2017
07:01 - April 27, 2017

అమరావతి: ఏపీలో బీజేపీ పాగా వేయడానికి వ్యూహాలు రచిస్తోందా? ఇందుకోసం వ్యూహాత్మకంగా వ్యహరిస్తోందా? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలోనూ తమకు సానుకూల పరిస్థితులు ఉంటాయన్న అంచనాకు నేతలు వచ్చారా? ఏపీలో పాగా వేయడానికి బీజేపీలో సాగుతున్న అంతర్మథనంపై 10టీవీ కథనం..

ఐదు రాష్ట్రాలు, ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఊహించని విజయం

దేశంలో బీజేపీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లోనూ బీజేపీకి ఊహించని విజయాలు దక్కాయి. దీంతో కమలనాథులు భవిష్యత్‌ తమదేనంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. దక్షిణాదినా బీజేపీ దృష్టిసారించింది. ఏపీపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇటీవలే ఏపీ బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించారు. 2019 ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు లేకుండానే ఒంటరిగా బీజేపీ పోటీచేసి తన బలాన్ని నిరూపించుకుంటుందని వెంకయ్య వ్యాఖ్యానించారు. ఏపీ పాలిటిక్స్‌లో వెంకయ్య చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు హాట్‌టాఫిక్‌గా మారాయి. ఏపీలో పాగా వేయడానికి బీజేపీ వ్యూహరచన చేస్తుందన్న చర్చ సాగుతోంది.

2014 ఎన్నికల్లో టీడీపీతో జతకట్టిన బీజేపీ

2014 ఎన్నికల్లో ఏపీలో బలహీనంగా ఉన్న బీజేపీ... టీడీపీతో జతకట్టింది. పవన్‌ కల్యాణ్‌ను రంగంలోకి దింపి వైసీపీకి వెళ్లే ఓటుబ్యాంకును టీడీపీ, బీజేపీవైపు మళ్లించింది. మూడేళ్లుగా ఏపీలో పుంజుకోవడానికి దశలవారీగా చర్యలు చేపట్టింది. కేంద్రం నుంచి ఏపీకి అధిక నిధులు మంజూరు చేయిస్తోంది. మొత్తానికి ఏపీలో పాగా వేసేందుకు అనేక చర్యలు చేపడుతోంది.

ఏపీలో టీడీపీ - వైసీపీ మధ్యే రాజకీయపోరు

ఏపీలో ప్రస్తుతం టీడీపీ, వైసీపీ మధ్యే రాజకీయ ఆధిపత్యం కొనసాగుతోంది. బీజేపీ టీడీపీకి మిత్రపక్షంగానే కొనసాగుతోంది. అయితే కొంతకాలంగా బీజేపీ నాయకత్వంలో మార్పు వచ్చింది. పదవులు, ప్రాధాన్యత విషయంలో టీడీపీ తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తిలో కాషాయనేతలున్నారు. దీంతో పలుసందర్భాల్లో టీడీపీ, బీజేపీ నేతల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు పొడచూపాయి. ఏపీ బీజేపీ ఇంచార్జ్‌ సిద్దార్థ్‌నాథ్‌సింగ్‌, చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అయినా ఇరుపార్టీల నేతల్లో మాత్రం సమన్వయం రావడంలేదు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, వాటి ఫలితాలు , లభిస్తోన్న ఆదరణను చూసి బీజేపీ నాయకత్వం ఏపీలో కూడా పాగా వేయడానికి పావులుకదుపుతోంది. దీనిపై ఇప్పటికే నియోజకవర్గాల వారీగా రెండు విడతల్లో సర్వే నిర్వహించింది. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నట్టు కమలనాథులు ఓ నిర్దారణకు వచ్చారు. అందుకే వెంకయ్యనాయుడు ఏపీలో బీజేపీ సొంతంగా పోటీచేయడానికి సిద్దంగా ఉండాలని సంకేతాలు ఇచ్చారు.

పరిస్థితులు అనుకూలిస్తాయా?

వాస్తవానికి ఏపీలో బీజేపీ పాగా వేయడానికి పరిస్థితులు అనుకూలిస్తాయా? అంటే అంత తేలికకాదన్న సమాధానమే వినిపిస్తోంది. ఏపీలో టీడీపీ హవా కొనసాగడం, కులాలు, మతాల వారీగా ఓటర్లు చీలిపోయి ఉన్న నేపథ్యంలో బీజేపీ నేతల కలలు కల్లలుగానే మిగులుతాయన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా 2019లో పాగా వేయాలని బీజేపీ.... అడ్డుకునే దిశగా టీడీపీ, వైసీపీలు వ్యూహాత్మకంగా వ్యవహరించబోతున్నాయి.

Pages

Don't Miss

Subscribe to RSS - వ్యూహాలు