వైడ్ యాంగిల్

20:39 - January 18, 2018

ఎట్టకేలకు పద్మావత్ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగాయి. కొన్ని రాష్ట్రాలు సినిమా విధించిన నిషేధంపై సుప్రీం కోర్టు సీరియస్ గా స్పందించింది. మీ ఇష్టం వచ్చిన్నట్టు చేస్తే కుదరదని సుప్రీం స్పష్టం చేసింది. అయితే కర్ణిసేన మాత్రం టికెట్లు కొని అయిన సినిమా నిలుపుదల చేస్తామని ప్రకటించింది. 

20:57 - January 10, 2018

సంక్షుభిత సమయాలు పరిష్కారాలకోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తాయి. అణచివేత ఆకాశాన్నంటితే పాతాళాన్ని చీల్చుకుంటూ కత్తుల చేతులు, నిప్పుల స్వరాలూ దూసుకొస్తాయి. వివక్షను బోధించిన విలువలతో దేశాన్ని అధోగతి పాల్జేస్తామంటే నిజమైన దేశభక్తి అంటే ఏంటో కొత్త పాఠాలు మొదలవుతాయి. పరిష్కారాల దిశగా దూసుకెళ్లే పావన నవజీవన బృందావన నిర్మాతలుగా కొందరు నవయువకులు తెరపైకివస్తారు.. ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాయా లేక మనుస్మృతిని నెత్తిన పెట్టుకున్నాయా అనే సందేహం వచ్చినపుడు యువ హుంకార్ అంటూ ఏకమవుతారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమం గురించి ప్రత్యేక కథనం..ఓ చేతిలో రాజ్యాంగం.. మరో చేతిలో మనుస్మృతి..ఏది కావాలి? ఏది అనుసరిస్తారు..?

హక్కులను, రక్షణలను, సమానత్వాన్ని ప్రసాదించిన రాజ్యాంగాన్నా లేక వివక్షను, అణచివేతను బోధించిన సమాజాన్ని పీడనతో నింపిన మనుస్మృతినా? ఏది కావాలి మీకు? ఇదే యువ హుంకార్ వేసిన ప్రశ్న..హస్తినలో యువ హుంకార్‌ ర్యాలీ గర్జించింది. మోది ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసింది. అవినీతి, పేదరికం, నిరుద్యోగం లాంట ప్రధాన సమస్యలను పక్కన బెట్టి.. ఘర్‌ వాప్‌సి, లవ్‌ జిహాద్‌ లాంటి అంశాలకు ప్రాధ్యనత నిస్తోందని మండిపడింది. దేశానికి మనువాదం ముప్పు పొంచి ఉందని యువతను హెచ్చరించింది. సామాజిక న్యాయం కోసం తమ పోరు కొనసాగుతుందని స్పష్టం చేసింది.

అడుగడుగునా పోలీసుల నిర్బంధం.. వాటర్ కెనాన్లు, బారికేడ్లు, లాఠీలు...భాష్పవాయుగోళాలు.. వీటన్నిటి మధ్య పార్లమెట్ స్ట్రీట్ లో పెద్ద సంఖ్యలో యువత ఏకమయింది. దళిత, మైనార్టీ వర్గాలపై వివక్ష ఆపాలని, యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలని, విద్యార్థి హక్కులను కాపాడాలని, లింగ సమానత్వం కావాలని..., భీమ్‌ కొరెగావ్‌లోని దళితులపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాజధానిలో యువత ఏకస్వరమయింది.

మాకు స్వాతంత్ర్యం కావాలి. విముక్తి కావాలి. దేశంలోపల కోట్లాది ప్రజలను పట్టి పీడిస్తున్న సకల సమస్యలనుండి మాకు విముక్తి కావాలి. ప్రజలంతా సమానమనే వ్యవస్థ సిద్ధించాలి. దానికి అడ్డుగా ఉన్న విలువలు, నమ్మకాలు వాటి మూల సిద్ధాంతాలపై పోరాటం చేస్తూనే ఉంటాం.. గెలుపు దక్కేంత వరకు మా పోరాటం ఆగదు. ఈ క్రమంలో సకల రోగాలకు కారణమైన మనుస్మృతిని వ్యతిరేకిస్తాం.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముతాం.. ఇదీ యువ హుంకార్ ర్యాలీ ఇస్తున్న సందేశం.. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

20:55 - January 2, 2018

నా దారి రహదారి.. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తా... దేవుడు శాసిస్తాడు.. నేను చేస్తాను..ఇవన్నీ రజనీ దశాబ్దాలుగా చెప్తున్న మాటలు. ఇప్పుడు మాటలనుంచి చేతల సమయం వచ్చింది. పొలిటికల్ ఎంట్రీ ప్రకటనతో ఒక్కసారిగా తమిళ రాజకీయాల్లో కలకలం రేగింది. ఎన్నాళ్లో వేచిన ఉదయం అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మరి తమిళ రాజకీయాల్లో రజనీ ఎలాంటి ప్రభావం చూపిస్తారు.సూపర్ స్టార్ రజనీకాంత్....సినిమాల్లోనే కాదు.. తమిళనాట ఈ పేరు అన్నిరకాలుగా ప్రభంజనమే. కోట్లాది అభిమానులున్న ఈ సూపర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీ ప్రకటనతో సీన్ ఒక్కసారిగా వేడెక్కింది. జయ మరణం తర్వాత అనేక మలుపులు తిరుగుతున్న తమిళ రాజకీయాల్లో ఏర్పడిన శూన్యాన్ని ఇప్పుడు రజనీ భర్తీ చేస్తాడా? ఆయన దారి రహదారి. సినిమా డైలాగే కానీ... రజనీ తీరుని చెప్తుందని ఫ్యాన్స్ నమ్మకం. మరి ఇది సినిమాల వరకేనా, లేక పాలిటిక్స్ లో కూడానా? ఇప్పుడు రజనీకాంత్ ఎంట్రీ తో పరిస్థితులు ఎలా మారతాయి..? డీఎంకే, అన్నా డీఎంకే లను చావు దెబ్బతీస్తారా? లేక విపరీతమైన హైప్ తో వచ్చి చతికిల పడిన కొందరు నటుల్లా రజనీ మిగిలిపోతారా? ప్రకటించేశాడు..వెబ్ సైట్ ప్రారంభించేశాడు..అభిమానులను సన్నద్ధం కావాలంటూ పిలుపునిచ్చాడు..ఏం చేస్తానో చెప్తాను.. చేయలేకపోతే రాజీనామా చేస్తాను అంటున్నాడు.. రెండు దశాబ్దాల ఉత్కంఠకు తెరదింపాడు..

రేపెవరిది... ఇదే తమిళనాడులో వినిపిస్తున్న ప్రశ్న. ఈ రోజు ఎవరేంటో అందరికీ తెలుసు..కానీ, రేపటిని గెలుచుకునేదెవరు? ప్రజల గుండెల్లో పాగా వేసేదెవరు? అధికార పీఠాన్ని అధిరోహించేదెవరు? ఇవే తమిళనాడులో వినిపిస్తున్న ప్రశ్నలు. ఈపీఎస్, ఓపీఎస్, శశికళ, స్టాలిన్ మొదలైన రెగ్యులర్ ప్లేయర్స్ తో పాటు, లేటెస్ట్ గా రజనీ, ఈ మధ్యే ఉత్సాహంగా మారిన కమల్ లాంటి స్టార్ హీరోలు.. కనిపిస్తున్న ఫీల్డ్ లో పైచేయి ఎవరు సాధించబోతున్నారు? ఆల్రెడీ ఈ బాటలో ఉన్న నటులు ఏం సాధించారు. అది ఇప్పటి చరిత్ర కాదు.. దశాబ్దాల నుండి పీఠంపై సినీ తారలనే కూర్చోబెడుతున్నారు. అక్కడ ఫిల్మ్ స్టార్స్ కే పట్టంకడుతున్నారు. దక్షిణాదినే కాదు.. ఆ మాటకొస్తే, దేశం మొత్తంమీద కూడా ఆ రాష్ట్ర రాజకీయాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ వరుసలో రజనీ పాలిటిక్స్ లో ఎంటరైతే దుమ్మురేపటం ఖాయమా? సినీ నటుల తళుకుబెళుకులే ప్రధానంగా నిలుస్తున్నతమిళ రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్నవాళ్లంతా ఇమేజ్ వాడిపోయిన తారలే. ఇలాంటి సందర్భంలో రజనీ ఎంట్రీ ఇస్తే అది... చెప్పుకోదగ్గ మార్పులకు కారణం అవుతుందా...రాజకీయ శూన్యం నుండి కొత్త శక్తులు పుట్టుకురావటం కొత్త విషయం కాదు.. వివిధ రాష్ట్రాల రాజకీయాల్లో దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు తమిళనాట అదే దృశ్యం కనిపిస్తోంది. మరి దీనిని రజనీకాంత్ తనకు అనుకూలంగా మలుచుకుంటాడా, అభిమానుల ఆశలు నెరవేరుస్తాడా అనే అంశం త్వరలో తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

20:55 - January 1, 2018

కేలండర్ మారింది. కొత్త సంవత్సరం వచ్చేసింది. కాలం శరవేగంగా మారుతోంది. కాలంతోపాటే టెక్నాలజీ కూడా పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ప్రపంచాన్ని ముంచేస్తోంది. రోబోలు నట్టింట్లో తిష్టవేస్తాయి. వర్చువల్ క్లాస్ రూమ్ లు అడుగడుగునా కనిపిస్తాయి. పొలాలు ఇళ్లపైకెక్కుతాయి. డ్రైవర్ లేకుండానే కార్లు షికార్లు కొడతాయి. తలెత్తిచూస్తే డ్రోన్లు విచ్చలవిడిగా విహారం చేస్తుంటాయి. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు రూపు రేఖలను మార్చేసుకుంటాయి. అవును.. ప్రపంచం మరింత స్మార్ట్ గా మారుతోంది. ముందున్నదంతా స్మార్ట్ పండుగే.. ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. కాలంతో పాటు మార్పులు రావటం సహజమే. మనిషిలో, సమాజంలో, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు రావటం సాధారణం. అయితే ఈ మార్పులు ఇప్పుడున్న స్థితిని సమూలంగా మార్చేదైతే, అది తెలుసుకోవలసిన విషయమే. లైఫ్ స్టైల్ తో పాటు, ప్రపంచ స్వరూపాన్ని మార్చే అలాంటి అంశాలు అనేకం 2018లోనే ప్రపంచాన్ని పలుకరించబోతున్నాయి. సాంకేతిక విప్లవం కొత్త పరవళ్లు తొక్కే కొద్దీ మానవ జీవితంలో అనేక మార్పులొస్తున్నాయి. యాంత్రీకరణతో ప్రపంచ స్వరూపం మారిపోయి.. కొత్త విలువలు, కొత్త సంస్కృతి, సరికొత్త జీవన విధానాలు ఈ ప్రపంచాన్ని నింపేశాయి. ఇదే క్రమంలో వచ్చిన కంప్యూటర్లు, సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్ లు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనల ఫలితంగా వచ్చిన రోబోలు విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. రోబోల తర్వాత మరింత ఎక్కువగా భవిష్యత్తుని ఆక్రమించే వాటిలో డ్రోన్లు కూడా ఒకటి. అయితే, వీటి వాడకం చుట్టూ అనుమానాలు, భయాలు ఎలా ఉన్నా సినిమా షూటింగ్ లను మాత్రం డ్రోన్ లు చాలా సింపుల్ గా మార్చేశాయి. కొరియర్ సర్వీసులకు, వ్యవసాయ రంగంలోను డ్రోన్ల వాడకం మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

బండెడు పుస్తకాలు మోసుకుంటూ స్కూలుకెళ్లే శ్రమ ఉండదు...ఆ మాటకొస్తే అసలు స్కూల్ కే వెళ్లనక్కర్లేదు..ఇంట్లోంచే క్లాస్ రూమ్ లో ఉన్న అనుభవాన్ని పొందొచ్చు. ఇక కారెక్కితే డ్రైవింగ్ చేయనక్కర్లేదు. మనిషికంటే జాగ్రత్తగా గమ్యాన్ని చేర్చే కార్లొస్తున్నాయి. పొలంతో పనిలేని వ్యవసాయం ఇప్పటికే వచ్చింది. కంప్యూటర్ రంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి.మట్టి వాసన, పొలాలు, బురద నీళ్లు, కలుపు మొక్కలు, ఇవన్నీ పల్లెలలతో కాస్త సంబంధం ఉన్న అందరికీ తెలిసిన విషయాలే. ఐదు వేళ్లు లోపలికి పోవాలంటే రైతన్న మట్టిలో నానా కష్టాలు పడాల్సిందే. కానీ, భవిష్యత్తు వ్యవసాయంలో పొలం లేని పంట ఉండబోతోంది. అవును.. ఇళ్ల పైకప్పులపై పంటలను పెద్ద ఎత్తున పండించబోతున్నారు. అలాగే రక్తం కొరత అనేది లేకుండా కృత్రిమ రక్తం, బరువు తగ్గించే మాత్రలు.. అన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. అనంతకాల గమనంలో, మానవ జాతి అనేక పరిణామాలకు లోనయింది. ఎంతో ముందడుగు వేసింది. ఆ ముందడుగు ఇప్పుడు మరింత వేగంగా సాగుతోంది. ప్రపంచ స్వరూపాన్ని సమూలంగా మార్చి... మనుషుల జీవితాలను అమితంగా ప్రభావితం చేసే దిశగా సాగుతోంది. అయితే సైన్స్ ఎప్పుడూ రెండంచుల కత్తిలాంటిది. దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారనే దానిపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. 

21:53 - December 29, 2017

హిట్టనుకున్నారు.. ఫట్టయింది. చిన్న సినిమా అనుకున్నారు.. కలెక్షన్లలో భారీ అని రుజువయింది. ఆ హీరో కథ ముగిసింది అనుకున్నారు..కాదు.. మళ్లీ మొదలయిందని తేలింది.కసిపెట్టి తీశారు.. ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు...టాక్ నెగెటివ్ గా వినపడింది.. కలెక్షన్లు పాజిటివ్ గా వచ్చాయి.. ఇదీ సింపుల్ గా తెలుగు సినిమాకు 2017 మిగిల్చిన గుర్తులు.. ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. 2017లో రెండు సినిమాలు విపరీతమైన హైప్ తో వచ్చాయి. ఒకటి మెగాస్టార్ 150 వ చిత్రం.. మరొకటి బాహుబలి2. కట్టప్పను చంపిందెవరో తెలుసుకోటానికి ప్రేక్షకులు ఆరాటపడ్డారు. ఫలితం మెగా హిట్ గా నిలిచింది బాహుబలి. ఇక పోస్టర్ నుంచి సినిమా రిలీజ్ వరకు... ఆ తర్వాత. ఆద్యంతం వివాదాస్పదంగా నిలిచిన అర్జున్ రెడ్డి అనూహ్యంగా ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. ఈ ఏడాది సత్తా చాటిన మరో భారీ చిత్రం ఖైదీ నంబర్ 150. దాదాపు తొమ్మిదేళ్ల తరువాత హీరోగా నటించిన మెగాస్టార్ చిరంజీవి తన కలెక్షన్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక జనతా గ్యారేజ్ లాంటి భారీ విజయం తరువాత ఎన్టీఆర్ నటించిన సినిమా జై లవకుశ రిలీజ్ కు ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టు కథా కథనాలు సాగటంతో ఈ సినిమా ఘనవిజయం సాధించింది.

టాక్ తో సంబంధం లేదు.. టాక్ ఫ్లాప్ అంటుంది. కలెక్షన్లు మాత్రం రివర్స్ లో ఉంటాయి. అవును.. 2017లో టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు తమ అభిమాన హీరోలపై కనకవర్షం కురిపించారు. సినిమాలకు ఫ్లాప్ టాక్.. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం తగ్గలేదు.. ఈ ఏడాది చిన్న సినిమాలకు బాగా కలిసొచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్న సినిమాలు సంచలన విజయాలు నమోదు చేశాయి. ఎవరూ ఊహించని విధంగా 50 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టి స్టార్ హీరోలకు కూడా షాక్ ఇచ్చాయి. అదే సమయంలో చాలా కాలంగా హిట్ చూడని హీరోలు కొందరికి 2017 బంపర్ హిట్ లను అందించింది. ఓ పక్క రొటీన్ సినిమాలు వెల్లువెత్తుతున్నా, మంచి సినిమా వచ్చిందంటే ప్రేక్షకులు ఆదరించటం సహజంగా జరిగే విషయం. 2017లోనూ అదే జరిగింది. కొన్ని అంచనాలు మించాయి. కొన్ని బోల్తా కొట్టాయి. కొన్ని ఓ రేంజ్ లో కలెక్షన్ల వర్షం సాధించాయి. ముఖ్యంగా చిన్న సినిమాలకు లైఫ్ ఉందని ప్రూవ్ అయింది. ఈ ఉత్సాహంతో ఇండస్ట్రీ 2018వైపు ఆశావహంగా అడుగులు వేస్తోంది.

 

20:49 - December 27, 2017

ఈ సంవత్సరంలో ఏడు రాష్ర్టాల్లో ఎన్నికలు జరగడం, శశికళ జైలు వెళ్లాడం, లాలూ జైలు వెళ్లాడం, దేశ ఆర్థిక వ్యవస్థ నష్టపోవడం, జీఎస్టీ అమలు పై రివైండ్ 2017. గత సంవత్సంర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థనే క్షిణించింది. గుజరాత్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్వల్ప తేడా గెలిచింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

20:43 - December 25, 2017

కాలచక్రం గిర్రున తిరిగింది. కేలండర్ లో చివరి పేజీల్లో ఉన్నాం. సంవత్సరకాలంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిణామాలు, ప్రమాదాలు, ప్రమోదాలు... కుట్రలతో ప్రపంచాన్ని మభ్య పెట్టి, నిఘాలతో తన ప్రయోజనాలు కాపాడుకునే దౌర్భాగ్యం ఒకరిది. కాళ్లకింద నేలను నిలబెట్టుకోవాలనే ఆరాటం మరోపక్క.., ఎగసిన నినాదాలు.., బిగిసిన పిడికిళ్లు, రాజకీయ చదరంగంలో ఎత్తులకు పై ఎత్తులు.., ప్రకృతి శాపానికి, విలయ తాండవానికి బలైన వారు... ఇలా అనేక ఘటనలను దాటుకుని 2017 ముగింపుకొచ్చింది.. ఈ రోజు వైడాంగిల్ లో వాల్డ్ రౌండప్ ను చూద్దాం..అయిదు దేశాలు..భవిష్యత్ ప్రపంచ ముఖచిత్రాలు.. ఒక్కటైన స్నేహహస్తాలు.. చైనా వేదికగా జరిగిన బ్రిక్స్ సమావేశం ఇప్పుడు అభివృద్ధి, సహకారం లాంటి అంశాలనే కాదు... తీవ్రవాదంలాంటి అంశాలకూ వ్యతిరేకంగా గళమెత్తింది. ప్రపంచంలోని పలుదేశాల కూటములలో అత్యంత ప్రభావం చూపుతున్న కూటమిగా బ్రిక్స్ దేశాల కూటమి నిలబడింది ..

కాళ్లకింద భూమి కదిలిపోతోంది. తలపైన ఆకాశం నిప్పుల వర్షం కురిపిస్తోంది. సంద్రం వైపు ఆశగా చూసే కళ్లను తీరం తిరస్కరిస్తోంది. వెరసి ఎవరికీ చెందని అభాగ్యులయ్యారు. మాతృభూమికి, పరాయిదేశానికి మధ్య బతుకు ప్రశ్నార్ధకంగా మారుతోంది. భూమిపై గీతలు గీసుకున్న సరిహద్దులు, నిబంధనల పేరుతో నిరాకరించి అపహసిస్తున్న పౌరసత్వాలు.. అణచివేతకు పరాకాష్టగా మారిన పరిస్థితులు.. వెరసి రోహింగ్యాలు ఇప్పుడు లెక్కల్లో లేని మనుషులు.. దేశం లేని పౌరులు.. ఉనికి నిరాకరించబడిన దీనులు..ఆధునిక ప్రపంచంలో అణచివేతకు నిజమైన ఉదాహరణగా కనిపిస్తున్నారు రోహింగ్యాలు ..మారణాయుధాలనే నమ్ముకున్న అమెరికా చివరకు తన బిడ్డలను కూడా అవే మారణాయుధాలకు బలితీసుకుంటోంది. అమెరికాలో జరుగుతున్నన్ని తుపాకీ చావులు ప్రపంచంలో మరెక్కడా జరగడం లేదు. అమెరికాలో తుపాకీ కాల్పులు వినిపించని రోజంటూ కనిపించటం లేదు.. గత అక్టోబర్ లో జరిగిన లాస్ వెగాస్ ఘటన అమెరికా గన్ కల్చర్ ఫలితాల్ని స్పష్టం చేస్తోంది.

లేని దేశాన్ని సృష్టించారు..ఉన్నదేశాన్ని నాశనం చేశారు..ప్రజలను వెళ్లగొట్టారు.. లక్షలాది మంది ప్రాణాలు తీశారు..ఇప్పుడు ఆ దేశ రాజధానిపై కన్ను పడింది. దానిపై జెండా ఎగరేసే కుట్రలు చేస్తున్నారు. అమెరికా, దాని తొత్తు ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాగతాలు జెరూసలెం నగరాన్ని పాలస్తీనీయులకు కాకుండా చేసే దిశగా సాగుతున్నాయి. నోరు జారుతున్నారు. సై అంటే సై అంటున్నారు. తెరవెనుక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నీకంత సీన్ లేదంటే నీకంత సీన్ లేదంటున్నారు. నువ్వెంతంటే నువ్వెంతని సవాల్ విసురుతున్నారు..నార్త్ కొరియా మొండితనం, పెద్దన్న మూర్ఖత్వం 2017లో స్పష్టంగా కనిపించిన అంశం.. సరదాగా మొదలౌతుంది. రక్తం చిందటంతో ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో నానా రకాల ఆటలాడిస్తుంది. అంతా గేమ్ లో భాగం అనుకుంటారు. కానీ, అది వాడి స్క్రీన్ ప్లేలో భాగమని గుర్తించలేరు. ఆడిస్తూ, పాడిస్తూ, బెదిరిస్తూ చివరకు చావుముంగిట్లోకి పిల్లలను లాక్కెళుతోందా గేమ్. అదే బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్.. 2017లో పిల్లల గురించి భయపడేలా చేసింది ఈ గేమ్గ్లోబల్ టెర్రరిజమ్ ఇండెక్స్.. ప్రపంచాన్ని మేల్కొనమని చెప్తోంది. టెర్రరిజం ఎలాంటి విధ్వంసం కలిగిస్తోందో కళ్లకు కడుతోంది. లెక్కలతో సహా రుజువులు కళ్లముందుంచుతోంది. భారత్ తో పాటు అనేక దేశాలకు ఉగ్రవాద ముప్పు బలంగా ఉందనే అంశాన్ని స్పష్టం చేస్తోంది. మాంచెస్టర్ లో జరిగిన ఘటన ఉగ్రవాదం ఎలా పెరుగుతోందో చెప్తోంది. స్పెయిన్ వేర్పాటు వాదంతో రగిలిపోతోంది. కాటలోనియా స్పెయిన్ నుంచి విడిపోవాలని బలంగా చేస్తున్న ప్రయత్నాలతో ఆ దేశం అట్టుడికి పోతోంది. మరోపక్క రెఫరెండం విడిపోటానికి అనుకూలంగా రావటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజా ఎన్నికల్లో కూడా విడిపోవాలనే వాదనకే మద్దతు లబించింది. ఇదీ వాల్డ్ రౌండప్.... ఇక మన దేశంలో ఏం జరిగింది? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగాయి.. ఎలాంటి పరిణామాలు దేశ గతిని మలుపుతిప్పుతున్నాయి... ? పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి.

20:54 - December 19, 2017

గెలవటమైతే గెలిచారు.. కానీ, గెలిచిన ఆనందం లేకుండా పోతున్న తరుణం.. మసకబారుతున్న ప్రభ.. వరుసగా తగ్గుతున్న సీట్లు..ఓట్ల శాతం.. క్రమంగా లైట్ తీసుకుంటున్న గుజరాత్ ప్రజలు.. గుజరాత్ మోడల్ అంటూ ఊదరగొడుతున్న మాటల్లో డొల్లతనం.. ఆఖరికి మతం, జాతీయత లాంటి ఎమోషనల్ ఎలిమెంట్స్ వాడితే తప్ప ప్రయోజనం సాధించలేనితనం.. ముగ్గురు యువకులను చూసి వణికిపోయిన పరిస్థితి. ఇవన్నీ చూస్తే గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ .. గెలిచిందా? ఓడిందా అనే సందేహం రాకమానదు. ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. 
బీజేపీది ప్రగల్భాలే.. 
బీజెపీది ప్రగల్భాలే తప్ప.. వాస్తవంలో అంత లేదని గణాంకాలు చెప్తున్నాయి. మరోపక్క యువరక్తం గుజరాత్ లో చూపిన దూకుడు చర్చనీయాంశంగా మారింది. అక్కడ మారుతున్న పరిణామాలను, రాజకీయాలను స్పష్టం చేస్తోంది.  గుజరాత్ ప్రజలు మత సామరస్యాన్ని, లౌకిక రాజకీయాలను కోరుతున్నారని ఇదే పాఠాన్ని అసెంబ్లీ ఎన్నికల ద్వారా నేర్పారని అర్ధమవుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:44 - December 18, 2017

గుజరాత్ ఎన్నికల ఫలితాలు బీజెపీ గుండెల్లో గుబులు రేపుతున్నాయా? చావుతప్పి కన్ను లొట్టపోయినట్టయిందా? గెలిచిన సంతోషం ఆస్వాదించలేని పరిస్థితిలో ఉందా? కాంగ్రెస్ కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉంటే, బీజెపీని బోల్తాకొట్టించగలిగేదా? గుజరాత్ ఫలితాలు ఏం చెప్తున్నాయి? మోడీ మంత్రకు, అమిత్ షా వ్యూహానికి కాలం చెల్లుతున్న ఆనవాళ్లు గుజరాత్ ఫలితాలతో స్పష్టమౌతున్నాయా? ఈ అంశంపై ప్రత్యేక కథనం..
భారత ప్రధాని కాస్తా గుజరాత్ లోకల్ లీడర్ లా గల్లీ గల్లీ తిరిగి శ్రమించాడు. ఎన్నో ఎత్తులు, పైఎత్తులతో నానా కష్టాలు పడి చివరికి గెలుపును సొంతం చేసుకుంది కమలదళం.. మరోపక్క మారుతున్న ఈక్వేషన్లు, మసకబారుతున్న ప్రభ, కొత్త శక్తులు ఆవిర్భావం కొన్ని చోట్ల దారుణ ఎదురుదెబ్బలు... ఇవన్నీ గుజరాత్ ఎన్నికల్లో బీజెపీ విస్మరించలేని అంశాలు.. ఎదురే లేదనే ధీమా ప్రదర్శించారు..దూసుకెళతామన్నారు..కానీ, వాస్తవం మరోలా కనిపించింది. మెజారిటీ సీట్లు సాధించినప్పటికీ, స్పష్టంగా గుజరాతీ ఓటరు విశ్వాసం కోల్పోయిన తీరు కనిపిస్తోంది. గుజరాత్ మోడల్ ప్రచారంలో, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ గురించి చేసుకునే ప్రచారంలో వాస్తవంలేదనే అంశం స్పష్టంగా కనిపిస్తోంది.

యువరక్తం గెలుపు..గట్టిపోటీ ఇచ్చినా వ్యూహంలో సత్తా లేని కాంగ్రెస్.. బీరాలు పలికినా, ఫలితాల్లో స్పష్టంగా బీజెపీ పట్ల కనిపించిన వ్యతిరేకత.. ఇదీ గుజరాత్ ఎన్నికల పలితాలు చెప్తున్న విషయం. రాబోయే ఎన్నికల్లో ఇది స్పష్టమైన ప్రభావాన్ని చూపుతుందనే వాదనలు బలంగా ఉన్నాయి. ఓవరాల్ గా బీజెపీకి వార్నింగ్ బెల్ ని, కాంగ్రెస్ కి కాస్త ఓదార్పుని గుజరాత్ ఓటర్లు ఇచ్చారని చెప్పాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు గుజరాత్ ఫలితాలు మోడీ సర్కారుకు స్పష్టమైన హెచ్చరికను అందించాయి. గెలుపు సాధించినప్పటికీ, అక్కడ కనిపిస్తున్న ప్రతికూలతలు, కమలదళాన్ని కలవర పరుస్తున్నాయి. చేసుకున్నవారికి చేసుకున్నంత అన్నట్టు...ఈ మూడున్నరేళ్లుగా మోడీ తీసుకున్న పలు నిర్ణయాల ప్రభావం ఇప్పుడు కనినిప్తోందనే వాదనలు పెరుగుతున్నాయి. ఇకనైనా తన విధానాల్లో మార్పు తీసుకురాకపోతే, బీజెపీ మరింత గడ్డు కాలం ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి....

20:17 - December 14, 2017

ఆల్రెడీ రేషన్ షాపులు అంతంత మాత్రంగా మారాయి? వాటిని గాలికొదిలి మాల్స్ పేరుతో కొత్త దోపిడీకి తెరలేపుతున్నారా? ప్రజాపంపిణీ వ్యవస్థ నుంచి ప్రభుత్వం సైడవ్వాలని చూస్తోందా? తక్కువ ధరలకే ఇస్తామంటూ మొదటికే మోసం తీసుకురానుందా? రిలయన్స్ లాంటి బడా సంస్థలు సామాన్యులకు తక్కువ ధరలకు ఎందుకిస్తాయి? రూపాయి పెట్టుబడి లేకుండా.. కోట్లు దండుకునే ఎత్తుగడా ఇది? చంద్రన్న మాల్స్ గుట్టేంటి? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. చంద్రన్నా ఎవరికోసమన్నా?రేషన్ షాపులను మరింత బలోపేతం చేసి సామాన్యుడి కడుపు నింపాల్సింది వదిలేసి.... మాల్స్ ఎందుకన్నా? గృహోపకరణాలు, సౌందర్య సాధనాలు కాదన్నా..బియ్యం,కందిపప్పు, నూనె, కావాలన్నా..!! రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ లను..కాదు..మా బాగోగులు పట్టించుకో అన్నా..చంద్రన్నా .. అంటున్నాడు సామాన్యుడు..

మాల్స్ భాగస్వాములుగా రిలయన్స్, ఫ్యూచర్ గ్రూపునెలా ఎంపిక చేస్తారు?ప్రజలకవసరమైన సరుకులు సరఫరా చేయలేనంత చేతకానిదా ఏపీ సర్కారు?ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి... దాని ద్వారా కార్పొరేట్లకు ఆదాయాన్ని పంచుతున్నారా? ఎవరికోసం ఈ మాల్స్? ఎవరికి లాభం? చంద్రన్నమాల్స్ పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దేశమంతా జీఎస్టీ ఉంటే ఏపీలో సీఎస్టీ ఉందని, హెరిటేజ్ రిలయన్స్ లకు మేలు చేసేందుకే ఈ నిర్ణయమని వైసీపీమండిపడుతోంది. ప్రజాపంపిణీ వ్యవస్థ నడ్డి విరిచి సామాన్యుడిని దోపిడీ చేసి కార్పొరేట్లకు దోడిపెట్టే ప్రయత్నం ఇదని సీపీఎం విమర్శిస్తోంది..

చంద్రన్న మాల్స్‌ ద్వారా నిత్యావసర వస్తువులతో పాటు, గృహోపకరణాలు, సౌందర్య సాధనాలు తక్కువ ధరలకు వస్తాయా? అలా వస్తాయంటూ చెప్తున్న సీఎం మాటల్లో నిజమెంత? చంద్రన్న మాల్స్‌తో ప్రజలకు జరిగే మేలు కన్నా, కార్పొరేట్లకు చేకూరే లబ్ధి ఎక్కువా? రిలయన్స్ లాంటి సంస్థలు ఒక్క రూపాయి పెట్టుబడి కూడా పెట్టకుండా గ్రామీణ ప్రాంతాల్లో దందాకు దిగుతున్నాయా? దానికి ఏపీ సర్కారు వత్తాసు పలుకుతోందా? ప్రజలకోసం చేస్తున్నామని చెప్పే పనుల అసలు గుట్టు తేల్చాలి.. కాకులను కొట్టి గద్దలకు వేసే కుట్రలను వ్యతిరేకించాలి..సామాన్యుడిని వినిమయ సంస్కృతికి తరలించి సొమ్ము చేసుకునే కుట్రలను తిప్పి కొట్టాలి.. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తూ, చౌక దుకాణాలను నాశనం చేసే మాల్స్ ను వ్యతిరేకించాలనే వాదనలు పెరుగుతున్నాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.


 

Pages

Don't Miss

Subscribe to RSS - వైడ్ యాంగిల్