రేవంత్ రెడ్డి

16:12 - November 15, 2018

హైదరాబాద్ : ఎన్నికలు సమయం సమీపించేకొద్ది తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. విమర్శలతో బాణాలు విసురుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు కేసీఆర్..దమ్ముంటే ఆపుకో మంటు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దీనిపై టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ స్పదిస్తు..ఇద్దరు టీఆర్‌ఎస్ ఎంపీలు పార్టీ మారుతున్నారని రేవంత్ చెప్పడం.. పేపర్లలో రావడం.. ఓ మైండ్‌గేమ్‌లా ఉందని ఎంపీ పేర్కొన్నారు. రేవంత్‌కు దమ్ము, ధైర్యం ఉంటే పార్టీ మారుతున్న ఆ ఇద్దరు ఎంపీలేవరో చెప్పాలని సీతారాం నాయక్ డిమాండ్ చేశారు. 

తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని  సీతారాం నాయక్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి దుర్మార్గపు పనులు చేస్తున్నారని.. అవి ఆయన ఎదుగుదలకు మంచికాదని సూచించారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతోనే తాను మహబూబాబాద్ ఎంపీగా గెలిచానని సీతారాం నాయక్ స్పష్టం చేశారు. ఈ నాలుగున్నరేళ్లలో తన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని తెలిపారు.
 

20:51 - November 14, 2018

హైదరాబాద్ : ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి దూకుడు ఏమాత్రం తగ్గలేదు. సరికదా ఇనుమడించిన ఉత్సాహంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి సవాళ్లు విసిరారు. టీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, కేసీఆర్‌కు చేతనైతే అసెంబ్లీ ఎన్నికల లోపు ఆ ఇద్దరు ఎంపీలను ఆపుకోమని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఆయనకు దమ్ముంటే కొడంగల్ నుంచి పోటీ చేయాలన్నారు. నామినేషన్ వేసేందుకు ఇంకా సమయం ఉంది కాబట్టి త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్‌కు సూచించారు. ఏనాడూ తాను కొండగల్ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించలేదని.. ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని..తాను గెలవడం ఖాయమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ, ఎన్నికలు, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి, కేసీఆర్, సవాల్, టీఆర్ఎస్, ఎంపీలు, 

20:12 - November 12, 2018

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేతల ఢిల్లీ పయనం సాధారణంగా మారిపోయింది. ఇప్పటికే సీట్ల పంపకాలు, నియోజకవర్గాల కేటాయింపులవంటివి హస్తినలోనే నిర్ణయింపబడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన అతి కొద్ది కాలానికే అధిష్టానం మెప్పు పొందిన ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హుటా హుటిన ఢిల్లీ బయలుదేరివెళ్లారు. 
కాగా గత కొద్దిరోజులుగా రేవంత్ రెడ్డి తాను చెప్పిన కొంత మందికి టికెట్లు ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై రాష్ట్రస్థాయి ముఖ్య నేతల నుంచి ఎలాంటి స్పందన రాకపోగా.. ఇంత వరకు సీట్లు కొలిక్కిరాకపోవడంతో రేవంత్ కాసింత అసంతృప్తితో ఉన్నట్లుగా సమాచారం. దీంతో ఈ విషయం కాస్త కాంగ్రెస్ అధిష్టానికి చేరిందని అందుకే రేవంత్‌కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని తెలుస్తోంది. కాగా సోమవారం సాయంత్రం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డితో పలువురు ప్రముఖులు ఢిల్లీలోనే ఉన్నారు. రేవంత్‌‌కు కూడా ఇదే సమయంలో ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఢిల్లీ వెళ్లిన అనంతరం రేవంత్.. తనతో పాటు కాంగ్రెస్‌‌లోకి వచ్చిన టీమ్‌‌కు టికెట్ల విషయమై నేరుగా కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చించనున్నట్లు సమాచారం. అయితే రేవంత్‌ వినతిని అధిష్టానం అంగీరిస్తుందా లేకుంటే సర్ధి చెబుతుందో వేచి చూడాల్సిందే. 

14:28 - November 2, 2018

ఢిల్లీ : మళ్లీ ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చింది. దీనిపై త్వరగా విచారించాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ పై సుప్రీం స్పందించింది. శుక్రవారం దేశ అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఫిబ్రవరిలో విచారణకు స్వీకరిస్తామని స్పష్టం చేసింది. దీనితో మరలా ఒకసారి ఓటుకు నోటు కేసు వార్తల్లోకెక్కింది. 
ఓటుకు నోటు కేసు రాజకీయంగా తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ వ్యవహారంలో ఉన్నారంటూ ఆరోపణలు రావడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ వ్యవహారంలో ఆడియో, వీడియో టేపులు బయటికి రావడంతో... ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ దుమారం చెలరేగింది. 
కేసును త్వరగా విచారించాలంటూ ఆళ్ల సుప్రీంను ఆశ్రయించారు. ఆయన రెండు పిటిషన్ లు దాఖలు చేశారు. 2017 నుండి ఆయన పోరాటం చేస్తున్నారు. 
దీనిపై ఆళ్ల స్పందించారు. మార్చి 6వ తేదీన బాబుకు సుప్రీం నోటీసులు జారీ చేసిందని, సాక్ష్యాధారాలతో సహా ముందుకు వచ్చారని..దీనిపై సమాధానం చెప్పాలని గతంలో బాబుకు నోటీసుల్లో పేర్కొన్నారని తెలిపారు. కానీ కోర్టు ఎదుట హాజరు కాలేదని తెలిపారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో బాబు దిట్ట అని, గతంలో దాఖలు చేసిన పిటిషన్ లు ఇంతవరకు విచారణకు రాకపోవడమే కారణమన్నారు. కానీ చివరకు శుక్రవారం సుప్రీంలో బాబు తరపు న్యాయవాది వాదనలు వినిపించారని తెలిపారు. రెండు సంవత్సరాలవుతున్నా బాబు కౌంటర్ దాఖలు చేయలేదన్నారు. 
ఓటుకు నోటు కేసులో రెండు ఛార్జిషీట్లు దాఖలయ్యాయి. తొలి ఛార్జిషీట్ లో ఆడియోల్లోని గొంతులు ఒరిజనల్‌వేనంటూ ఫోరెన్సిక్ ఇచ్చిన నివేదిక,, ఆధారాలను కోర్టుకు సమర్పించారు. అందులో రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్‌‌తోపాటు ఉదయ్‌ సిన్హాను నిందితులుగా పేర్కొంది. 
కానీ ఛార్జిషీట్లలో ఏపీ సీఎం చంద్రబాబు పాత్రపై ఎక్కడా ప్రస్తావించలేదు. దీనితో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల కోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలో వద్దో ఏసీబీ కోర్టు నిర్ణయిస్తుందని కోర్టు పేర్కొంటూ ఆర్కే పిటిషన్‌‌ను కొట్టివేసింది. దీనితో ఆళ్ళ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి పిటిషన్ లు దాఖలు చేశారు. దీనిపై విచారించిన సుప్రీం వివరణ ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబుకి గతంలో నోటీసులిచ్చింది. ప్రస్తుతం ఫిబ్రవరి నుండి విచారిస్తామని కోర్టు స్పష్టం చేయడంతో టీడీపీ ఎలా స్పందిస్తందో వేచి చూడాలి. 
 

08:46 - October 23, 2018

హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి... ఇవాళ ఉదయం 10గంటలకు ఐటీ అధికారుల ముందు విచారణకు హాజరుకానున్నారు. బషీర్‌బాగ్‌లోని ఐటీ శాఖ కార్యాలయంలో జరిగే విచారణకు రేవంత్ రెడ్డి అటెండవనున్నారు. కొద్దిరోజుల క్రితం రేవంత్ రెడ్డి ఇంట్లో సోదాల తర్వాత ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల మూడున విచారణకు హాజరైన రేవంత్ రెడ్డిని  దాదాపు నాలుగున్నర గంటలపాటు అధికారులు విచారించారు. ఈనెల 23వ తేదీన మరోసారి తమ ముందుకు రావాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ మరోసారి అధికారుల ముందు హాజరవనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఆయన అనుచరుడు ఉదయ్ సింహా, మామ పద్మనాభరెడ్డి, శ్రీ సాయి మౌర్యా కంపెనీ డైరెక్టర్లు ప్రవీణ్ రెడ్డి, సురేశ్ రెడ్డి, శివరామిరెడ్డి, రామచంద్రారెడ్డిలు సైతం విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. 

కొన్ని రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఇళ్లలో రెండు రోజులకు పైగా సోదాలు నిర్వహించిన అధికారులు పలు డాక్యుమెంటు స్వాధీనం చేసుకున్నారు. ఓటు నోటు కేసు, రేవంత్ బావమరిది జయప్రకాశ్ రెడ్డికి చెందిన శ్రీ సాయి మౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రయివేటు లిమిటెడ్‌లో రూ.20 కోట్ల లెక్క తేలని ఆదాయాన్ని గుర్తించిన అధికారులు.. రేవంత్ రెడ్డి భాగస్వామ్యం పై ఆరా తీసే అవకాశాలున్నాయి.  సోదరుడు కొండల్ రెడ్డికి చెందిన భూపాల్ ఇన్‌ఫ్రా కంపెనీతో రేవంత్‌కు ఉన్న సంబంధాలపైనా వివరాలు సేకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రేవంత్ ఇంటి అడ్రస్ పైన పలు కంపెనీలు రిజిస్టర్ అయ్యాయని ఐటీ అధికారులు గుర్తించారు. అయితే, తమ ఇంట్లో అద్దెకు ఉన్న వారి కంపెనీల పేర్లు అని రేవంత్ చెప్పారు. ఆయా కంపెనీలతో రేవంత్‌కు ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలోనూ ఆరా తీయనున్నారు. మొత్తంగా ఓటుకు నోటు డబ్బులు, రూ.20 కోట్ల లెక్క, సోదరుడి కంపెనీలో వాటా, తన ఇంటి అడ్రస్‌లోని కంపెనీలపై ఆరా తీయనున్నారని తెలుస్తోంది.

09:41 - October 22, 2018

హైదరాబాద్ : తొలి విడత ప్రచారం విజయవంతం కావడంతో...రెండో విడత ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. గోల్కోండ హోటల్‌లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు...ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. గతంలో 54 నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని షెడ్యూల్‌ను రూపొందించారు. తాజాగా దీన్ని మార్చాలని టీ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఇవాళ మరోసారి సమావేశమై మలివిడత ప్రచార షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. రాహుల్ గాంధీ పాల్గొన్న భైంసా, కామారెడ్డి, హైదరాబాద్ సభలు విజయవంతం కావడంతో....నేతలు, శ్రేణులు ఉత్సాహంలో ఉన్నాయి. ఈ నెల 27 లేదా 28 తేదీల్లో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందని....వరంగల్, కరీంనగర్ జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించేలా కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఒకటి రెండ్రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.
 

19:46 - October 13, 2018

హైదరాబాద్: తనకు టీఆర్ఎస్ నుంచి ప్రాణహాని ఉందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. తనకు కేంద్ర భద్రతా సంస్థల ద్వారా రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల సంఘం అధికారులను కోరినట్లు రేవంత్‌ రెడ్డి వివరించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను రేవంత్ రెడ్డి కలిశారు. రెండు అంశాలపై ఫిర్యాదు చేసినట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవల మంత్రి జగదీశ్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, ఎంపీ బాల్క సుమన్‌ తనను భౌతికంగా అంతమొందిస్తామని హెచ్చరించారని.. టీఆర్ఎస్ సర్కార్‌ నుంచి తనకు ప్రాణహాని ఉన్నట్లు అధికారులకు తాను ఫిర్యాదు చేశానని రేవంత్ తెలిపారు. డీజీపీ మహేందర్ రెడ్డి గతంలో నాగార్జునసాగర్‌లో జరిగిన టీఆర్ఎస్ నేతల శిక్షణకు హాజరైనందున ఆయనపై తనకు నమ్మకం లేదని.. కేంద్ర సంస్థల సిబ్బందితో తనకు భద్రత కల్పించాలని కోరినట్లు రేవంత్‌ చెప్పారు. 

మరోవైపు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తనకు రూ.10 కోట్లు లంచం ఇస్తానన్నారంటూ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా ఈసీకి ఫిర్యాదు చేసినట్లు రేవంత్ తెలిపారు. నాయిని వ్యాఖ్యల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేయాలని.. లేదంటే తన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలని కోరినట్టు చెప్పారు. నాయిని స్టేట్‌మెంట్ రికార్డు చేసి కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. 

తనకు ముషీరాబాద్ టికెట్ ఇవ్వకుండా ఎల్బీనగర్ టికెట్ ఇస్తానని.. అక్కడి నుంచి పోటీ చేస్తే రూ.10కోట్ల లంచం కేసీఆర్ ఇవ్వజూపారని నాయిని నర్సింహారెడ్డి పత్రికాముఖంగా వ్యాఖ్యానించినట్టు రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి గారు నాకు పది కోట్లు లంచం ఇవ్వజూపారని స్వయంగా ఒక రాష్ట్ర మంత్రే చెప్పినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోరని రేవంత్ ప్రశ్నించారు. అవినీతి నిరోధక శాఖ చట్టం ప్రకారం ఒక ప్రజాప్రతినిధి మరొక ప్రజాప్రతినిధికి లంచం ఇస్తానని అనడం నేరం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

15:25 - October 7, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీతగాడని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కుత్బుల్లాపూర్ లో కాంగ్రెస్ మైనార్టీ సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా రేవంత్..షబ్బీర్ లు టీఆర్ఎస్..నేతలపై దుమ్మెత్తిపోశారు. 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని రేవంత్ తెలిపారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ ఇచ్చిందని, మోడీ దగ్గర పని చేస్తూ మైనార్టీలను కేసీఆర్ మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. మహా కూటమి అనేది ప్రజా కూటమి అని, కేసీఆర్ కు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కోన్నారు. అంతేగాకుండా కేసీఆర్ ను ఓడించేందుకు మైనార్టీలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తాము కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు సబ్ ప్లాన్ అమలు చేస్తామని మరో నేత షబ్బీర్ ఆలీ తెలిపారు. షాది ముబారక్ పథకం అమలు చేశామంటూ ముస్లింలను మభ్య పెడుతున్నారని, కానీ షాది ముబారక్ పథకం కాంగ్రెస్ ప్రవేశ పెట్టిందని తెలిపారు. 

12:56 - October 7, 2018

హైద‌రాబాద్:తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల న‌గారా మోగింది. డిసెంబ‌ర్ 7న తెలంగాణ‌లో 119 స్థానాల‌కు ఒకే ద‌శ‌లో పోలింగ్ నిర్వ‌హించున్నారు. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల తేదీని అనౌన్స్ చేసింది. ఎన్నిక‌ల షెడ్యూల్ ప్రక‌ట‌న రావ‌డంతో తెలంగాణ కాంగ్రెస్ జోరు పెంచింది. ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప‌రుగులు పెట్టించాల‌ని నిర్ణ‌యించింది. అంద‌రూ ఒకే చోట కాకుండా విడివిడిగా ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. రోడ్డు షోలు, స‌భ‌లు, పాద‌యాత్ర‌లతో జ‌నంలోకి వెళుతున్నారు. 

ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కుంతియా పాద‌యాత్ర చేస్తుండ‌గా, కోదాడ‌లో పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రైతు గ‌ర్జ‌న స‌భ‌లో పాల్గొంటారు. ఇక కుత్బుల్లాపూర్ లో కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ష‌బ్బీర్ అలీ, పొన్నం ప్ర‌భాక‌ర్  రోడ్ షోల పాల్గొంటారు. అన‌త‌రం మైనార్టీ స‌భ‌ల్లో పాల్గొంటారు. మైనార్టీల‌కు కాంగ్రెస్ ఏం చేసింది అనేది వారు తెలియ‌జేస్తారు. అలాగే మైనార్టీల‌కు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఎలా మోసం చేసిందో చెప్ప‌బోతున్నారు.

మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌చార జోరును పెంచింది. వ్యూహాత్మంగా, ప్ర‌ణాళికాబ‌ద్దంగా ముందుకు వెళుతోంది. ఎవ‌రు ఎక్క‌డ ప్ర‌చారం చేయాల‌నే దానిపై ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళుతున్నారు. పార్టీలోని ప్ర‌ముఖ నాయ‌కులు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌ను చుట్టేయ‌బోతున్నారు. మ‌రోవైపు తెలంగాణ ప‌రిర‌క్ష‌ణ క‌మిటీలో పార్టీల మ‌ధ్య సీట్ల స‌ర్దుబాటుపైనా మ‌రోసారి చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయి.

15:28 - October 6, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిపై వరుసగా ఐసీ, ఈడీ సోదాలు దాదాపు నాలుగు రోజుల పాటు కొనసాగిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తెలుగు రాష్ట్రాలలో పలు సంచలనం కలిగించింది. పలు మీడియా సంస్థలు కూడా ఇదే అంశంపై ప్రసారాలు కూడా చేశాయి. దీనిపై రేవంత్ మాట్లాడుతు..కావాలనే తనకు హాకాంగ్, మలేషియా, సింగపూర్ లో బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు గంటు గంటలు ప్రసారం చేసాయని..కొన్ని చానల్స్ అయితే ఇప్పటికీ ప్రసారం చేస్తున్నాయని..తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న చానళ్లపై పరువునష్టం దావా వేస్తానని రేవంత్ హెచ్చరించారు.  ముఖ్యంగా టివి9, టీ న్యూస్, నమస్తే తెలంగాణలలో తప్పుడు వార్తలు ఎక్కువగా వస్తున్నట్లు తెలిపారు. వాటి వల్ల తన ప్రతిష్టకు భంగం కలిగిందని...వెంటనే అవి తప్పుడు వార్తలని ప్రజలకు వివరించాలని హెచ్చరించారు. అలాగే బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలని...లేకుంటే పరువు నష్టం కేసు వేస్తానని రేవంత్ హెచ్చరించారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - రేవంత్ రెడ్డి