మౌనం

22:57 - September 12, 2018

హైదరాబాద్ : ఉత్తరాంధ్రలో పర్యటనతో సెగ పుట్టించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ .. చల్లబడ్డారు. పశ్చిమలో భారీ బహిరంగ సభ నిర్వహించి కాక రేపిన జనసేనాని.. మళ్లీ కనుమరుగైపోయారు. సీరియస్‌గా పాలిటిక్స్ మొదలుపెట్టారని అనుకున్నంతలోనే.. తన తీరు మారలేదని నిరూపించుకుంటున్నారు. ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కుతున్న సమయంలో పవన్‌ తెరమరుగు అవడం సంచలనం కలిగిస్తోంది. 

మే 20న ఇచ్ఛాపురం నుంచి పోరాట యాత్ర మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్‌.. రెండు విడతల్లో దాదాపు 40 రోజుల పాటు జనం మధ్యే గడిపారు. మధ్యలో రంజాన్‌ పేరుతో కొన్ని రోజులు, కంటి సమస్య పేరుతో మరికొన్ని రోజులు విరామం తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ పర్యటించిన పవన్.. ఆ తర్వాత మాత్రం అనూహ్యంగా మౌనం దాల్చారు. పవన్ కళ్యాణ్‌పై చాలా ఆశలు పెట్టుకున్న ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు  తీవ్ర నిరాశకు గురవుతున్నారు. 

16:39 - July 21, 2018

హైదరాబాద్ : పొలిటికల్‌ ఫైర్‌బ్రాండ్‌ రేవంత్‌రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారు? కాంగ్రెస్‌లోకి వచ్చిన కొత్తలో పదునైన విమర్శలతో సర్కార్‌పై ముప్పేట దాడిచేసిన రేవంత్‌... ఇప్పుడు ఎందుకు సైలెంట్‌ అయిపోయారు? తనంతట తానే నోటికి తాళం వేసుకున్నారా? లేక కావాలనే పార్టీలో ఎవరైనా రేవంత్‌ను అడ్డుకుంటున్నారా? ఇంతకు కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌ హస్తవాసి ఎలా ఉంది?
తెలంగాణ పాలిటిక్స్‌లో రేవంత్‌ ఫైర్‌బ్రాండ్‌
తెలంగాణ పాలిటిక్స్‌లో రేవంత్‌ రెడ్డి ఓ ఫైర్‌బ్రాండ్‌. రేవంత్‌ మైక్‌ అందుకున్నారంటే... కేసీఆర్‌ ఫ్యామిలీపై విమర్శల జడివాన మొదలవుతుంది. తన పదునైన విమర్శలతో గులాబీ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేయగలరు. రేవంత్‌ ప్రెస్‌మీట్ పెట్టారంటే.. మీడియాకంటే ఇంటెలీజెన్స్‌ వారి హడావుడే ఎక్కువగా ఉంటుంది. మరి అలాంటి రేవంత్‌రెడ్డి ఉన్నట్టుండి కాంగ్రెస్‌లో ఎందుకు సైలెంట్‌ అయ్యారు? కాంగ్రెస్‌లో చేరిన కొత్తలో వరుస ప్రెస్‌మీట్‌లతో గులాబీ పాలనను ఏకిపారేసిన ఆయన... ఇప్పుడు మీడియాకు ఎందుకు దూరంగా ఉంటున్నారు?
కొత్తలో చూపిన దూకుడు మాయం
రేవంత్‌ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత పార్టీకి రాష్ట్రంలో పాజిటివ్‌ వేవ్‌ పెరిగింది. అప్పటి దాకా గులాబీ ఆకర్ష్‌కు విలవిలలాడిన కాంగ్రెస్‌కు  ఇతర పార్టీల నేతలు క్యూకట్టారు. ఇక రేవంత్‌ కూడా తనదైన స్పీడ్‌తో సర్కార్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు.  ప్రభుత్వం అమలు చేస్తోన్న 24 గంటల విద్యుత్‌లో అవినీతి.. నూతన మెట్రోలైన్‌ తెరవెనుక కథలు.. మంత్రి కేటీఆర్‌ మామ ఫేక్‌ సర్టిఫికెట్‌ ఇలా ప్రభుత్వాన్ని తన ఆరోపణాస్త్రాలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. రేవంత్‌ దూకుడుకు కౌంటర్‌ ఇవ్వలేక అధికార పార్టీ నేతలు సైతం సైడైపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి అంతలా రెచ్చిపోయిన రేవంత్‌ ఇప్పుడు ఎప్పుకు మౌనం దాల్చుతున్నారు?
రేవంత్‌ మౌనానికి పెద్ద కారణం
రేవంత్‌రెడ్డి మౌనం వెనుక పెద్ద కథే ఉందట. టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉండి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌కు అదే స్థాయిలో పార్టీ పదవి, గౌరవం ఉంటుందని రాహుల్‌ హామీ ఇచ్చారట. దీనిలో భాగంగా రేవంత్‌కు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ ఇచ్చేందుకు ఢిల్లీ పెద్దలు గ్రీన్‌సిగ్నల్‌ కూడా ఇచ్చారట. అయితే దీనికిగాను హైకమాండ్‌కు ప్రతిపాదన లిస్ట్‌ను పంపించకుండా కావాలని కాలయాపన చేస్తున్నారట. అంతేకాదు.... రేవంత్‌కు ప్రచార కమిటీ చైర్మన్‌ కాకుండా... నలుగురిలో ఒకడిగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కు పరిమితం చేయాలని, రాష్ట్రానికి చెందిన ఓ ముఖ్యనేత ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారన్నది రేవంత్‌ అనుచరుల వాదన.  రేవంత్‌ చేయాలనుకున్న ఆలంపూర్‌ టూ ఆదిలాబాద్‌ పాదయాత్ర సైజ్‌ను తగ్గించడమే కాకుండా.. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌తో కలిసి పాదయాత్ర చేసేలా అధిష్టానానికి నివేదిక ఇచ్చినట్టు రేవంత్‌ మద్దతుదారుల ఆరోపణ.. ఇదంతా తనను తక్కువ చేసేందుకే ఇలా చేస్తున్నారని రేవంత్‌ తన సన్నిహితుల దగ్గర వాపోతున్నారట.  ఈ మొత్తం వ్యవహారంలో హైకమాండ్‌ అనుసరిస్తునన పాస్‌ ఫార్ములాపై రేవంత్‌ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.
గాంధీభవన్‌లో జరిగే కార్యక్రమాలకు అందని ఆహ్వానం
మొద‌ట్లో చూపిన గౌర‌వం .. గాంధీభ‌వ‌న్ నుండి రేవంత్ కు ఇప్పుడు అందడం లేదట. గాంధీభ‌వ‌న్ లో ముఖ్యమైన కార్యక్రమాలకు  క‌నీసం ఆహ్వానం కూడా రేవంత్‌కు చేరడం లేదట. అలాంటప్పుడు ఎలా తమ నేత యాక్టివ్‌గా ఉంటారని అనుచరులు ప్రశ్నిస్తున్నారు. తాను పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేసేందుకు సిద్దమని... అయినా తనను ఎందుకు దూరం పెడుతున్నారో అర్థంకావడం లేదని రేవంత్‌ సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.
అందుకే సైలెంట్‌ అయిపోయిన రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్‌లో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలను రేవంత్‌ జీర్ణించుకోలేక పోతున్నారట. తీవ్ర ఆవేదనలో ఉన్న ఈ ఫైర్‌బ్రాండ్‌ సైలెంట్‌ అయిపోయారని టాక్‌. రాష్ట్రంలో ముందస్తు ఘంటికలు మోగుతున్న వేళ అతను మాట్లాడితేనే పార్టీకి కలిసి వస్తుందని ఆశపడుతున్న క్యాడర్‌లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది. మరి హస్తంపార్టీలో సెగలు రేపుతున్న రేవంత్‌ సైలెన్స్‌ వైబ్రేషన్స్‌కు ఢిల్లీ పెద్దలు ఏ మేరకుబ్రేక్‌ చేస్తారో చూడాలి.

 

07:30 - October 3, 2017

పాత్రికేయురాలు గౌరీలంకేశ్‌ హత్యపై ప్రధాని మోదీ స్పందించాలని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ డిమాండ్‌ చేశారు. గౌరీహత్య వెనుక ఉన్న నిజానిజాలు దేశప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో జూలకంటి రంగారెడ్డి (సీపీఎం), ప్రకాష్ రెడ్డి (బీజేపీ), దిలీప్ భైరవ (సామాజిక విశ్లేషకులు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

10:39 - August 31, 2017

భారతదేశంలో జరుగుతున్న కొన్ని పరిణామాలపై దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మౌనం వహిస్తుండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర వాటిపై స్పందిస్తున్నారు కానీ..జరుగుతున్న ఘోరాలపై మాత్రం స్పదించడం లేదని సోషల్ మీడియాలో కేంద్ర పాలనపై నెటిజన్లు వ్యంగ్యాస్రాలు సంధిస్తున్నారు. గతంలో ప్రధాన మంత్రిగా ఉన్న మన్మోహన్ ను మౌన మునిగా కాషాయ దళాలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

దేశంలో ప్రస్తుతం దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలు అందర్నీ కలిచివేస్తున్నాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో దళితులపై దాడులు..వివక్ష కొనసాగుతోంది. గోరక్షక్ పేరిట కొంతమంది గూండాలు విచక్షణారహితంగా దాడులకు తెగబడుతూ నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఈ ఘటనలపై ప్రధాన మంత్రి మోడీ హెచ్చరించినా దాడుల ఘటనలు మాత్రం ఆగకపోవడం విచారకరమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌లో బిఆర్‌డి ఆసుపత్రిలో చిన్నారుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఎలా పాలన కొనసాగుతోందో అక్కడ జరుగుతున్న ఘటనలు చూస్తుంటే అర్థమౌతుంది. గత మూడు రోజుల్లో 63 మంది పిల్లలు మృత్యు ఒడికి చేరుకున్నా ప్రధాన మంత్రి మోడీ స్పందించకపోవడంపై పలువురు మండి పడుతున్నారు. ఒక్క ఆగస్టు నెలలోనే 290 పసిపిల్లలు కన్నుమూయడం విచారకరం.  మృతి చెందిన చిన్నారులో ఏడుగురు మెదడువాపు వ్యాధి, మిగిలినవారు రకారకాల వైద్య కారణాలతో చనిపోయారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆక్సిజన్‌ కొరత వల్లే పిల్లలు మృతి చెందినట్లు ఈ ఘటనపై విచారణ జరిపిన నివేదికలో స్పష్టమైంది. ఘటనపై సీఎం స్పందించి ఓ అధికారిని సస్పెండ్ చేశారు.

మొన్న నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచిన టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏకంగా అభినందనలు తెలుపుతూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ప్రతి చిన్నదానికీ అలవోకగా చాయ్ పే బాత్‌, మన్‌ కీ బాత్‌లు నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గోరఖ్‌పూర్‌ దురంతంపై ఎందుకు మౌనం దాల్చినట్టు ? ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నోరు లేని ఆవుల రక్షణకు ప్రత్యేక దళాలను నెలకొల్పి నడిపిస్తున్న సీఎం యోగికి ఆవుల కంటే పసికందుల ప్రాణాలు లెక్కలేదని సోషల్ మీడియాలో పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. వెంటనే రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై సీఎం యోగి రాజీనామా చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. 

17:59 - July 31, 2017

పాట్నా : బిహార్‌ రాజకీయ పరిణామాలపై జేడీయూ సీనియ‌ర్ నేత శ‌ర‌ద్ యాద‌వ్ ఎట్టకేల‌కు మౌనం వీడారు. మహాకూటమితో తెగతెంపులు చేసుకోవాలన్న నితీష్‌ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టారు. బిహార్‌లో ప్రస్తుతం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు దురదృష్టకరమైనవని తెలిపారు. మహాకూటమి విచ్ఛిన్నం కావడం బాధకరమని శరద్‌ యాదవ్‌ చెప్పారు. నితీష్‌ మహాకూటమితో తెగతెంపులు చేసుకుని బిజెపితో పొత్తు పెట్టుకోవడం ప్రజలు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకమన్నారు.

09:26 - May 18, 2017

హైదరాబాద్ : నిత్యం సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ బిజిగా గడుపుతున్నాని అవకాశం వచ్చినప్పుడల్లా సీఎం కేసీఆర్‌ మూడేళ్లుగా చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తాను ఎవరినీ కలవలేకపోతున్నాననే ఆందోళనను వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వ పరంగా ఇస్తున్న హామీల విషయం ఎలా ఉన్నా ఇటీవల వెలుగులోకి వచ్చిన సమస్యలు మాత్రం అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

ఖమ్మం, వరంగల్‌లో మిర్చి ఘాటు
రైతును రాజుగా మారుస్తామంటూ గొప్పలు చెప్పుకునే గులాబీ దళపతికి ఖమ్మం, వరంగల్‌లో మిర్చి ఘాటు బాగా తగిలింది. మిర్చి రైతుల ఆందోళనలు ప్రభుత్వాన్ని కుదిపేశాయి. దీంతో రైతుల ఆందోళనలకు రాజకీయ అండ ఉందన్న ప్రచారం చేసి తప్పించుకునే ప్రయత్నాన్ని అధికార పార్టీ నేతలు చేస్తున్నారు. ఇక రైతుల ఆందోళనలు మరువక ముందే ఆక్యుపై ధర్నాచౌక్‌ నిరసన గులాబీ నేతలకు కొత్త చిక్కులే తెచ్చిపెట్టాయి. పోలీసులు, అధికార పార్టీ నేతల మద్దతుతో విపక్షాలపై దాడి జరగడంతో TRS నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. ఈ పరిణామాలు కేసీఆర్‌ ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన ఇలాంటి అంశాలపై అధికార పార్టీ నేతలు తమ చర్యలను సమర్థించుకుంటూ విపక్షాల వైఖరిని తప్పుబడుతున్నారు. సీఎం కేసీఆర్‌ ఇప్పటి వరకు ఈ సంఘటనలపై స్పందించక పోవడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పరంగా ఏ తప్పు చేయకపోతే..ఖమ్మం మిర్చియార్డ్‌, ధర్నాచౌక్‌ దాడులపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఎందుకు స్పదించడం లేదనే ప్రశ్నలు మొదలయ్యాయి. కేసీఆర్‌ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారా? లేక మరేదైనా కారణం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి మౌనం దేనికి సంకేతం అని పార్టీ వర్గాల్లోనూ చర్చమొదలైంది. మరి ఈ ప్రశ్నలకు సీఎం కేసీఆర్‌ ఎలాంటి సమాధానమిస్తారో చూడాలి.

 

 

 

 

21:55 - February 7, 2017

చెన్నై : తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. మెరీనా బీచ్‌ వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జయలలిత సమాధి వద్దకు పన్నీర్ సెల్వం ఒంటరిగా చేరుకున్నారు. సెల్వం మౌనంగా కూర్చున్నారు. అర్ధగంట నుంచి సమాధి వద్దే కూర్చున్నాడు. సమాచారం తెలిసిన... జయలలిత అభిమానులు మెరీనా బీచ్‌కు భారీగా తరలివస్తున్నారు. మొదటి నుంచి సెల్వం జయలలిత, పార్టీకి పరమ విధేయుడుగా ఉన్నాడు.  
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

12:27 - December 1, 2016

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు అంశంపై రాజ్యసభలో గందరగోళం నెలకొంది. నోట్ల రద్దుపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. అయితే విపక్షాలు ఆందోళన చేస్తుంటే సభకు హాజరైన ప్రధాని నరేంద్రమోడీ మౌనంగా ఉండిపోయారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత నోట్ల రద్దుకై చర్చ చేపడతామని అధికార పక్షం తెలిపింది. కానీ విపక్షాలు మాత్రం ప్రశ్నోత్తరాల సమయం కంటే ముందే చర్చ చేపట్టాలని పట్టుబట్టాయి. దీంతో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో చైర్మన్ సభను పావుగంటపాటు వాయిదా వేశారు. అంతకముందు పెద్దనోట్లు రద్దు అంశంపై కాంగ్రెస్ సభ్యుడు ఆజాద్ మాట్లాడారు. తాము నల్లధనానికి వ్యతిరేకమని, కానీ నోట్ల రద్దు అంశంపై తాము మాట్లాడాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. విపక్షాలు మాట్లాడే అంశాలు ప్రధాన మంత్రి వినాలని కోరుకుంటున్నట్లు, కానీ నల్లధనం..నోట్ల రద్దుపై ప్రధాన మంత్రి బయట, బీజేపీ ఎంపీలతో మాట్లాడడం జరుగుతోందన్నారు. నల్లధనం అంశంపై విపక్షాలపై ప్రధాని పలు ఆరోపణలు చేయడం జరిగిందన్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. 

 

11:25 - July 4, 2016

విజయవాడ : ఏపీలో టీడీపీ ఫైర్‌ బ్రాండ్‌లంతా కామ్‌ అయిపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యర్ధులకు చుక్కలు చూపించిన నేతలంతా.. అధికారంలోకి వచ్చాక సైలెంట్‌ అయ్యారు. ఇంతకీ వారెవరు..? ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదు? వారిలో జోష్‌ తగ్గడానికి కారణాలు ఏంటి ?? ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సీనియర్‌ నేతల పరిస్థితి విచిత్రంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై విరుచుకుపడి.. ఫైర్‌ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన నేతలంతా పార్టీ అధికారంలోకి వచ్చాక కామ్‌ అయిపోయారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టకుండా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు తెలుగు తమ్ముళ్ల నుంచి వినిపిస్తున్నాయి.

ఎన్నికల్లో పరాజయంతో నేతల్లో నైరాశ్యం..
దశాబ్దం పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు.. పయ్యావుల కేశవ్‌, దూళిపాళ్ల నరేంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, వర్ల రామయ్య, లింగారెడ్డి, నన్నపనేని రాజకుమార్‌, పంచమర్తి అనురాధ వంటి నేతలు తమ వాక్పటిమతో అండగా నిలబడ్డారు. నిత్యం మీడియాలో కనిపిస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడేవారు. ఆరోపణలకు ప్రత్యారోపణలు చేసేవారు. పదేళ్ల తర్వాత కష్టపడి అధికారంలోకి వచ్చిన తర్వాత.. సీన్‌ రివర్స్‌ అయ్యింది. వాక్చాతుర్యం కలిగిన నేతలంతా అపజయం పాలై నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు... పయ్యావుల, సోమిరెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడులకు ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారు. మరికొంత మందికి కార్పొరేషన్‌ పదవులు అప్పగించారు. దీంతో వారు వారి పనుల్లో బీజీగా మారిపోయారు.

సైలెంట్‌గా మారిన నన్నపనేని రాజకుమారి...
అనంతలో మంత్రులు పల్లె, పరిటాల సునీత పవర్‌ సెంటర్లుగా మారడంతో పయ్యావుల స్థానిక రాజకీయాలకే పరిమితమైపోయారు. నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ, ఆనం సోదరుల రాకతో సోమిరెడ్డి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అడపాదడపా మీడియాలో కనిపిస్తున్నా.. ఇంతకుముందు జోష్‌ ఆయనలో కనిపించడం లేదనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఒకప్పుడు జగన్‌ పేరు ఎత్తితే తీవ్రంగా విరుచుకుపడిన వర్ల రామయ్య మౌనవ్రతం పాటిస్తున్నారు. టీడీపీకి మంచి పట్టున్న పామర్రు నియోజకవర్గంలో ఓటమి పాలు కావడంతో.. ఆయన దూకుడుకు బ్రేక్‌ పడింది. అనంతరం ఆయనకు కేటాయించిన హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవీ బాధ్యతలు నిర్వహిస్తూ తన పనేదో తాను చూసుకుంటున్నారు. అదేవిధంగా మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పదవి పొందిన నన్నపనేని రాజకుమారి.. రాజ్యాంగబద్ధ పదవి కావడంతో సైలెంట్‌ అయిపోయారు. ఇక పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ మంత్రి పదవి దక్కకపోవడంతో దూళిపాళ్ల ఇంతకు మునుపటిలా యాక్టివ్‌గా ఉండడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ లింగారెడ్డి,.. మహిళా సాధికారిత చైర్మన్‌ పంచమర్తి అనురాధ పదవీ బాధ్యతల్లో బిజీగా ఉంటూ.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక గాలి ముద్దుకృష్ణమనాయుడు మాత్రం అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తూ అందరికంటే కాస్తా బెటర్‌ అని అనిపించుకుంటున్నారన్నది పార్టీ నేతల మాట. కారణాలు ఏవైనప్పటికీ టీడీపీ ఫైర్‌ బ్రాండ్‌లంతా మూకుమ్మడిగా మౌనం పాటించడం పార్టీవర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీలో కొత్తనీరు వచ్చి చేరుతున్నా.. విపక్షాలపై దూకుడును ప్రదర్శించే సీనియర్ల వాగ్ధాటి లోటు స్పష్టంగా కనిపిస్తోందని తెలుగుదేశం శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

06:39 - January 20, 2016

జమ్మూ కాశ్మీర్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ మరణం తర్వాత ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పీడీపీ-బీజేపీ కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఇప్పుడు కూడా ఇదే దిశగా రెండు పార్టీల మధ్య అంతర్గతంగా చర్చలు సాగుతున్నాయి. బీజేపీతో పొత్తు కొనసాగింపు, ప్రభుత్వం ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అంశాన్ని పార్టీ నాయకురాలు మెహబూబా ముఫ్తీకి అప్పగిస్తూ పీడీపీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే అసెంబ్లీని రద్దు చేసి తాజా ఎన్నికలకు వెళ్లాలని నేఫనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా డిమాండ్‌ చేసిన తర్వాత పీడీపీ వైఖరిలో కొద్దిగా మార్పు వచ్చింది. బీజేపీతో పొత్తు కొనసాగింపుకే నిర్ణయం తీసుకున్నారు.

ఉప ముఖ్యమంత్రి పదవి ఉండదు..
అయితే ప్రభుత్వం ఏర్పాటుపై పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. కశ్మీర్‌ను ఆదుకునేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో చాలా వాటిని అమలు చేయకపోవడాన్ని పీడీపీ నాయకులు వేలెత్తిచూపుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటుపై జాప్యం చేయడం ద్వారా అటు కేంద్రంతోపాటు, ఇటు బీజేపీపై ఒత్తిడి పెంచి, తమ డిమాండ్లను సాధించుకోవచ్చన్న ఆలోచలో మెహబూబాముఫ్తీ ఉన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కింద రాష్ట్రానికి ప్రకటించిన ఆర్ధిక సహాయాన్ని వెంటనే విడుదల చేయాలన్న డిమాండ్‌ లేవనెత్తుతున్నారు. ముఫ్తీ మహ్మద్‌ కేబినెట్‌లో బీజేపీకి చెందని నిర్మల్‌సింగ్‌ ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. ఇప్పుడు ఈ పదవి ఉండదని మెహబూబా ముఫ్తీ చెబుతున్నారు. బీజీపీని ఇరకాటంలో పెట్టి, తమ డిమాండ్లను సాధించుకునే ఎత్తుగడల్లో ఇదో భాగంగా భావిస్తున్నారు.

సయీద్ అంత్యక్రియలకు హాజరు కాని మోడీ...
కాశ్మీర్‌లో జరిగిన ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ అంత్యక్రియలు ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కాకపోవడాన్ని పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ తప్పుపడుతున్నారు. సయీద్‌ మృతదేహానికి ప్రధాని మోడీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లోనే నివాళి అర్పించారు. ఎన్టీయే వన్‌ హయాంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఎన్‌సీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా తల్లి బేగం అక్తర్‌ జహాన్‌ చనిపోయినప్పుడు... శ్రీనగర్‌లో జరిగిన అంత్యక్రియలకు అప్పటి ప్రధాని వాజ్‌పేయి, ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ హాజరైన విషయాన్ని మెహబూబా ముఫ్తీ గుర్తు చేస్తున్నారు. అయితే గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే క్రమంలో పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ఇప్పుడు బెట్టుతో ఉన్నా... త్వరలోనే దిగొచ్చి ప్రభుత్వం ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - మౌనం