మృతి

14:13 - September 18, 2018

ఢిల్లీ : మహిళా సాధికరత అనే మాట భారత్ లో తొలిసారిగా వినిపించిన రోజుల్లోనే కొందరు మహిళా మణులు విభిన్న రంగాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు. ఇంటిలోని నుండి మహిళలు బైటకు అడుగు పెట్టని రోజుల్లో ఐఏఎస్ స్థాయికి చేరుకున్న మహిళలు తమదైన శైలిలో తమ ప్రతిభను కనబరిచారు. వీరిలో భారతదేశంలోనే మొట్టమొదటి ఐఏఎస్ గా గుర్తింపబడిన తొలి మహిళా ఐఏఎస్ రాజమ్ మల్హోత్రా. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో విజేతగా నిలిచి తొట్టతొలి ఐఏఎస్‌ ఆఫీసర్‌గా విధులు  నిర్వహించిన రాజమ్‌ మల్హోత్రా తన 91వ ఏట  కన్నుమూశారు. ముంబయిలోని తన స్వగృహంలో ఆమె కన్నుమూశారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లాకు చెందిన రాజమ్‌ 1951 సివిల్స్‌ బ్యాచ్‌ సభ్యురాలు. హోసూరు సబ్‌ కలెక్టర్‌గా తొలిసారి సేవందించారు. ఐఏఎస్‌ అధికారిణిగా చెన్నైలో సేవందించిన ఆమె అప్పటి సీఎం సి.రాజగోపాలచారి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. మొత్తం ఏడుగురు సీఎంల వద్ద పనిచేసిన అనుభవం ఆమెకుంది. 1985-90 మధ్య ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేసిన ఆర్‌.ఎన్‌.మల్హోత్రా ఈమె భర్త.

 

14:29 - September 17, 2018

హైదరాబాద్: పలు మలయాళం, తమిళ్, తెలుగు సినిమాల్లో నటించిన డ్యానియల్ రాజు ఎలియాస్ కేప్టన్ రాజు హార్ట్ ఎటాక్‌తో మరణించారు. అమెరికా వేళ్లేందుకు విమానంలో ప్రయాణిస్తుండగా ఛాతీ నొప్పి రావడంతో..  విమానాన్ని మస్కట్‌లో ఎమర్జెన్సీ ల్యాండిగ్ చేసి ఆయనను కిమ్స్ ఓమన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన తుదిశ్వాస విడిచినట్టు మలయాళం సినీ వర్గాలు వెల్లడించాయి.

కేప్టన్ రాజు దాదాపు 500 సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా..విలన్‌గా, కమేడియన్‌గా నటించి మెప్పించారు. మలయాళ సినిమాల్లోనే కాక, తమిళ్, తెలుగు, ఇంగ్లీషులో కూడా నటించారు. మర్చంట్ ఐవరీస్ కాటన్ మ్యారీ అనే ఇంగ్లీషు మూవీలో నటించారు. తెలుగులో చిరంజీవి నటించిన గ్యాంగ్‌లీడర్‌లో కేప్టెన్ రాజు విలన్‌గా కనిపించారు. వెంకటేష్ నటించిన శతృవు, బాలకృష్ణ నటించిన గాండీవం, చిరంజీవి నటించిన రౌడీ అల్లుడు వంటి సినిమాల్లో రాజు నటించారు.  

సినిమాల్లోకి రాకముందు రాజు ఐదేళ్లపాటు ఆర్మీలో కేప్టన్‌గా పనిచేశారు. సినిమా మీద మక్కువతో మిలటరీ నుంచి రిటైరయ్యారు.

22:11 - September 14, 2018

సిద్ధిపేట : కొండ గట్టు బస్సు ప్రమాద ఘటన మరువకముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. సిద్ధిపేట జిల్లాలో జిరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. పాములపర్తి గ్రామానికి చెందిన 20 మంది ఆటోలో నాగపురి గ్రామానికి వెళ్తున్నారు. గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద రోడ్డు పక్కన ఆగిఉన్నటాటా ఏస్ వాహనాన్నిలారీ ఢీకొనడంతో ఆటోలోని ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో 13 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్నపోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

 

16:26 - September 8, 2018

జీవితం అనేది అందరికి వడ్డించిన విస్తరికాదు. కష్టంతో, కమిట్ మెంట్ తో..కష్టాన్నే ఇష్టంగా మార్చుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరిన వ్యక్తి చిన్ని చిన్నివాటికే బేజారైపోయి జీవితాన్ని నాశనం చేసుకుని ఆఖిరి ఆ జీవితాన్నే అంతం చేసుకునే పరిస్థితులకు దిగజారిపోతున్న నేటితరం యువతను చూస్తుంటే ఆత్మస్థైర్యం తగ్గిపోతుందా? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే ఉన్నత స్థానాన్ని అధిరోహించి కోట్లాది మంది సంగీత అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ అమెరికన్‌ ర్యాప్‌ సింగర్ మ్యాక్‌ మిల్లర్ మృతి చెందాడు. డ్రగ్స్‌ మోతాదు అధికం తీసుకోవటంతో తన 26 ఏళ్ల వయసులోనే మిల్లర్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. చిన్ననాటే పెద్ద పేరు..ప్రేమలో పడటం..ప్రియురాలితో బ్రేకప్‌...హిట్‌ అండ్‌ రన్‌ కేసులో అరెస్టులు వంటి పలు సమస్యలతో మిల్లర్ తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన ఈ ర్యాపర్‌ డ్రగ్స్‌కు బానిసయ్యాడు. లాస్‌ ఏంజిల్స్‌లోని తన నివాసంలో ఆపస్మారక స్థితిలో పడివున్న మ్యాక్‌ మిల్లర్ ను కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించేసరికే డ్రగ్స్ మోతాదు ఎక్కువ కావటంతో అప్పటికే చనిపోయినట్లు డాక్టర్స్ తెలిపారు.

ప్రియురాలు అరియానా గ్రాండే తనకు బ్రేఇకప్ చెప్పి అమెరికా కమేడియన్‌ పిటె డేవిడ్సన్‌తో ఎగేజ్ మెంట్ ఫిక్స్ చేసుకోవడాన్ని మ్యాక్‌ మిల్లర్ తట్టుకోలేకపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమెతో విడిపోయినప్పటి నుండి మిల్లర్ తీవ్రంగా కృంగిపోయాడని..తన చివరి ఇంటర్వ్యూలో కూడా మిల్లర్ డిప్రెషన్‌లో ఉన్నట్లు తెలిపాడు.

11:10 - September 7, 2018

ఒహియోః అమెరికాలోని ఒహియో రాష్ట్రంలోని నార్త్ బెండ్ కు చెందిన దుండగులు జరిపిన కాల్పుల్లో గుంటూరుకు చెందిన ఆర్థిక సలహాదారు పృధ్వీరాజ్ కందెపితో పాటు మరో ఇద్దరు బలయ్యారు. 26 ఏళ్ల ఒమర్ ఎరిక్ శాంతా పెరేజ్ అనే వ్యక్తి ఫౌంటలైన్ స్కేర్ లోని ఫిప్త్ థర్డ్ బ్యాంక్ వద్ద కాల్పులు జరిపినట్టు డౌన్ టౌన్ సిన్ సిన్నటి పోలీసులు తెలిసారు.

పృధ్వీరాజ్‌ గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటకు చెందిన వాడు.  చదువు పూర్తయిన తర్వతా అమెరికాలో ఫిప్త్ థర్డ్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం బ్యాంకు విధులు ముగించుకుని ఉద్యోగులంతా బయటకు వస్తున్న వారిపై దోపిడీ దొంగలు కాల్పులు జరిపారు.

12:52 - September 1, 2018

హైదరాబాద్‌ : తుక్కుగూడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. స్కూటర్‌పై వెళుతున్న దంపతులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలైన భార్యను స్థానికులు సమీపంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో చికిత్స పొందుతూ భార్య కూడా మృతి చెందింది. పోలీసులు మృతులను తుక్కుగూడాకు చెందిన దశరథ దంపతులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. 

21:46 - August 29, 2018

హైదరాబాద్ : నందమూరి కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. గతంలో హరికృష్ణ పెద్దకుమారుడు జానకిరామ్‌ రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందగా.. ప్రస్తుత ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందారు. ఇక 2009లో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రమాద బారిన పడ్డారు. సూర్యాపేట సమీపంలోని మోతె గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్‌ గాయపడ్డారు.

టీడీపీ సీనియర్‌ నేత, సినీనటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలయ్యారు. నల్లగొండ జిల్లా సమీపంలోని అన్నేపర్తి వద్ద హరికృష్ణ కారు ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాలు పాలైన హరికృష్ణను చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లిలో కామినేని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ హరికృష్ణ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌ నుండి నెల్లూరులోని ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయంశంగా ప్రమాదాలు
హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోవటంతో ఇప్పుడు ఓ అంశం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయంశమైంది. గతంలో హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరామ్‌ రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారు. హైదరాబాద్-విజయవాడ రహదారిపై ఆకుపాముల వద్ద జరిగిన ప్రమాదంలో జానకీరామ్‌ మృతి చెందారు. జానకీరామ్‌ ఒంటరిగా టాటా సఫారీ వాహనంలో విజయవాడకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. రాంగ్‌ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్‌ను జానకీరామ్‌ వాహనం ఢీ కొనటంతో జానకీరామ్‌ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. జానకీరామ్‌ చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతిచెందారు.

2009 ఎన్నికల్లో టీడీపీ ప్రచారానికి వెళ్లిన ఎన్టీఆర్‌
ఇక హీరోగా మంచి గుర్తింపు సాధించిన జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా రోడ్డు ప్రమాదం వెంటాడింది. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేయటానికి ఎన్టీఆర్‌ ఖమ్మం జిల్లా వెళ్లారు. ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా.. సూర్యాపేట సమీపంలో గల ఓ పదునైన మలుపు వద్ద ఎన్టీఆర్‌ ప్రయాణిస్తున్న టాటా సఫారి వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్‌ తలకు, భుజానికి, చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఎన్టీఆర్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ఎన్టీఆర్‌ చికిత్స పొందారు. నందమూరి కుటుంబంలో జరిగిన ఈ ప్రమాదాల్లో ఎన్టీఆర్‌ మినహా మిగతా వారు మరణించారు.

నల్గొండ జిల్లాలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తండ్రీ కొడుకులు
హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరో విషయం కూడా ఇప్పుడు చర్చనీయంశమైంది. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరామ్‌ ప్రయణించిన కారు నెంబర్‌ ఏపీ 29 బీడీ 2323 కాగా.. ప్రస్తుతం హరికృష్ణ ప్రయాణించిన కారు నెంబర్ కూడా ఏపీ 28 బీడబ్ల్యూ 2323. అయితే 2323 సిరీస్ నందమూరి కుటుంబానికి కలిసిరాలేదని అభిమానులు భావిస్తున్నారు. కుమారుడు ఇష్టపడి రిజిస్ట్రేషన్ చేయించుకున్న నంబర్ కావడంతో ఇదే సిరీస్‌లో హరికృష్ణ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉండొచ్చిన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే, తండ్రీకొడుకులిద్దరూ నల్గొండ జిల్లాలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇక ఎన్టీఆర్‌ ప్రమాదం కూడా నల్లగొండ జిల్లాలోనే జరిగింది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్‌ కుటుంబాన్ని ప్రమాదాలు వెంటాతుండటం పట్ల అభిమానులను కలచివేస్తోంది.

 

21:39 - August 29, 2018

హైదరాబాద్ : టీడీపీ రాజకీయాల్లో హరికృష్ణకు ప్రత్యేక స్థానం ఉంది. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ తనయుడిగానే కాకుండా కుటుంబ రాజకీయాల్లో రెబల్‌గా హరికృష్ణకు పేరుంది. మంత్రి, ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యుడు, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా వివిధ పదవులు నిర్వహించారు. చంద్రబాబు... ఎన్టీఆర్‌తో విభేదించి ప్రభుత్వ పగ్గాలు చేపట్టినప్పుడు హరికృష్ణ.. చంద్రబాబుకు అండగా నిలించారు.
తండ్రి వెంటనే నడిచిన హరికృష్ణ
ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చాక హరికృష్ణ ఆయన వెంటే నడిచారు. ఎన్టీఆర్‌ ఎన్నికల ప్రచార వాహనం చైతన్య రథాన్ని ఆయనే నడిపారు. ఒకసారి కాదు... రెండు సార్లు కాదు... నాలుగుసార్లు చైతన్య రథాన్ని నడిపిన ఘనత హరికృష్ణకే దక్కింది. 1983, 85, 89, 94 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ చైతన్య రథాన్ని స్వయంగా నడిపి... తండ్రికి అన్ని విషయాల్లో చేదోడువాదోడుగా ఉన్నారు హరికృష్ణ. మొదటిసారి 9 నెలల పాటు చైతన్య రథానికి సారథిగా వ్యవహరించారు.

చంద్రబాబుతో చేతులు కలిపిన హరికృష్ణ ..రవాణా మంత్రిగా బాధ్యతలు
1994 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్‌తో చంద్రబాబు విభేదించి... 1995లో రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు, టీడీపీ సారథ్యం చేపట్టారు. అప్పుడు హరికృష్ణ తన తండ్రి ఎన్టీఆర్‌కు కాదని... బావ చంద్రబాబుతో చేతులు కలిపారు. తనకు అండగా నిలిచినందుకు చంద్రబాబు.. తన మంత్రివర్గంలో హరికృష్ణకు స్థానం కల్పించారు. అప్పట్లో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించారు. 1996లో జనవరిలో ఎన్టీఆర్‌ మరణం తర్వాత ఆయన ప్రాతినిధ్యం వహించిన అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో హరికృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆర్‌ లక్ష్మీనారాయణరెడ్డిపై 62 వేల ఓట్ల భారీ ఆధిక్యతతో గెలుపొందారు. అయితే చంద్రబాబు తన కేబినెట్‌లో హరికృష్ణకు స్థానం కల్పించకుండా విస్మరించారు. ఎన్టీఆర్‌ కుటుంబాన్ని వాడుకుని వదిలేశారన్నవిమర్శలను చంద్రబాబు ఎదుర్కొన్నారు. 1999 వరకు ఎమ్మెల్యేగానే కొనసాగారు. నాలుగేళ్లపాటు హిందూపురంలో ప్రజా సమస్యలు పరిష్కరించి అందరి మన్ననలు పొందారు.

1999 జనవరి 26 అన్న తెలుగుదేశం పార్టీ స్థాపన

1999లో హరికృష్ణ.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎదురుతిరిగారు. టీడీపీకి పోటీగా 1999 జనవరి 26న అన్న టీడీపీ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీ సిద్ధాంతాలకు చంద్రబాబు తిలోదకాలిస్తూ... ఎన్టీఆర్‌ వారసత్వాన్ని సర్వనాశనం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అన్న తెలుగుదేశమే నిజమైన టీడీపీ అని ప్రచారం చేశారు. 1999 ఎన్నికల్లో హరికృష్ణ నాయకత్వంలోని అన్న టీడీపీ పోటీ చేసినా ఒక్కసీటు కూడా గెలుచుకోలేదు. సోదరుడు బాలకృష్ణ... చంద్రబాబుకు మద్దతుగా నిలించినా.. హరికృష్ణ మాత్రం చాలా కాలం బాబుకు దూరంగానే ఉన్నారు. 2009 ఎన్నికలకు ముందు హరికృష్ణతోపాటు ఆయన తనయుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ను చంద్రబాబు మరోసారి దగ్గరకు తీశారు. అప్పట్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ టీడీపీకి ప్రచారం చేశారు. తదనంతర రాజకీయ పరిణామాల్లో చంద్రబాబు... హరికృష్ణను రాజ్యసభకు పంపారు. రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలుగులో రాజ్యసభలో ఆవేశపూరితంగా తెలుగులో ప్రసంగించారు. ముందస్తు అనుమతి లేకుండా తెలుగులో హరికృష్ణ చేసిన ప్రసంగాన్ని రికార్డుల నుంచి తొలగించాలని అప్పట్లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న పీజే కురియన్‌ ఆదేశించారు.

21:31 - August 29, 2018

హైదరాబాద్ : రోడ్డు  ప్రమాదంలో దుర్మరణం చెందిన టీడీపీ నేత హరికృష్ణకు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. హరికృష్ణ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. దుఃఖసారగంలో ఉన్న కుటుంబ సభ్యులు ఓదార్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు హరికృష్ణతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

టీడీపీ నేత హరికృష్ణ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. దుఃఖంలో ఉన్నకుటుంబ సభ్యులను ఓదార్చారు.

తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌... హరికృష్ణ నివాసానికి చేరుకుకి భౌతికకాయానికి నివాళులర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరికృష్ణ నివాసానికి చేరుకుని పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరార్శించారు.

హరికృష్ణ రోడ్డు ప్రమాదవార్త విన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు... మంత్రి లోకేశ్‌తో కలిసి హుటాహుటిన అమరావతి నుంచి బయలుదేరి హెలికాప్టర్‌లో నల్గొండ చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన నార్కెట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి వచ్చి.. హరికృష్ణ భౌతికకాయాన్నిచూసి చలించిపోయారు. చంద్రబాబు, లోకేశ్‌ కన్నీటి పర్యతంమయ్యారు. హరికృష్ణ మృతి తమ కుటుంబానికి, టీడీపీకి తీరనిలోటని... ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హరికృష్ణలేని లోటును భర్తీ చేయలేమన్నారు.

తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు హరికృష్ణ నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో హరికృష్ణ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

తెలంగాణ పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌... హరికృష్ణ మృతికి సంతాపం ప్రకటించారు. హరికృష్ణ మృతి తెలుగు ప్రజలకు తీరలని లోటని టీడీపీ ఎంపీ మురళీమోహన్‌ అన్నారు. కారు నడుపుతూ సీటు బెల్టు పెట్టుకుని ఉంటే హరికృష్ణ బతికి ఉండేవారని రాజమంత్రి గ్రామీణ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. హరికృష్ణతో తనకు ఉన్న అనుబంధాన్ని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గుర్తు చేసుకున్నారు. :హరికృష్ణ మృతికి టీడీపీ మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, టీటీడీ బోర్డు సభ్యుడు పెద్దిరెడ్డి సంతాపం ప్రకటించారు. హరికృష్ణను కడసారి చూసేందుకు ప్రజలు, ఆయన అభిమానులు భారీగా తరలివస్తున్నారు. మెహిదీపట్నంలోని హరికృష్ణ నివాసానికి చేరుకుని నివాళలర్పిస్తున్నారు. 

20:45 - August 29, 2018

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యులుగా ఢిల్లీలోనూ కీలక పాత్ర పోషించారు. రాజ్యసభలో తెలుగులో ప్రసంగించడం ద్వారా తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఇనుమడింపజేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు.

నందమూరి హరికృష్ణ సినిమాల్లోనే కాదు... రాజకీయ ప్రస్థానంలోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. రాజకీయ ప్రాధాన్యత కల్పించాలన్ని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు హరికృష్ణను రాజ్యసభకు పంపించారు. 2008లో ఆయన టిడిపి తరపున రాజ్యసభ పదవికి ఎన్నికయ్యారు.

హస్తిన రాజకీయాల్లోనూ హరికృష్ణ కీలక పాత్ర పోషించారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ హరికృష్ణకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆయన తూర్పార బట్టేవారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన తీరును నిరసిస్తూ రాజ్యసభలో ఆయన తెలుగులో చేసిన ప్రసంగం హైలైట్‌గా నిలిచిపోయింది. హరికృష్ణ తెలుగులో ప్రసంగించడానికి అప్పటి రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ పిజె కురియన్‌ అనుమతించలేదు. తెలుగులో మాట్లాడడానికి ముందస్తు పర్మిషన్‌ తీసుకోవాల్సి ఉంటుందని కురియన్‌ అన్నారు. ఉప సభాపతి మాటలను పట్టించుకోని హరికృష్ణ తనదైన శైలిలో తెలుగులోనే ప్రసంగించారు. తాంబూలలిచ్చాం...తన్నుకు చావండి...అన్నట్లుగా తెలుగు ప్రజలను విభజించారని ఆయన సభలో మండిపడ్డారు.

రాష్ట్రవిభజనకు నిరసనగా 2013, ఆగస్టు4న రాజ్యసభ పదవికి హరికృష్ణ రాజీనామా చేశారు. తన రాజీనామాను పట్టుబట్టి ఆయన ఆమోదింపజేసుకున్నారు. టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా ఉంటూ కడవరకు హరికృష్ణ పార్టీ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. కొంత కాలంగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - మృతి