ముందస్తు ఎన్నికలు

10:22 - September 21, 2018

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం...మరోసారి తెలంగాణలో పర్యటించనుంది. గత పర్యటనలో అధికారులతో ఎన్నికలపై చర్చించిన ఈసీ...ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించనుంది. ఈసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సమస్యాత్మక ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో పర్యటించి క్షేతస్థాయిలో ఎన్నికల నిర్వహణపై పరిస్థితులను తెలుసుకోనున్నారు. 

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులపై అధ్యాయనం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు....మరోసారి రాష్ట్రానికి రానున్నారు. గత పర్యటనలో ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపిన ఈసీ సభ్యులు...ఈ పర్యటనలో గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తిరగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత తొలిసారి జరిగే ఎన్నికలకు...ఏమైనా ఆటంకాలు ఉన్నాయా అన్న అంశాలను సభ్యులు గ్రౌండ్ లెవల్ లో తెలుసుకోనున్నారు.  ఇప్పటికే తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు సిద్దమైన సీఈసి..మధ్యప్రదేశ్, రాజస్ధాన్ రాష్ట్రాల్లోనూ ఇదే సమచారం కోసం తమ పర్యటన పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 

మరోవైపు ఈ నెల 25తో తెలంగాణలో ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమం పూర్తవుతుంది. ఓటరు నమోదుపై వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో  పెట్టుకుని... జిల్లా ఎన్నికల అధికారులు ప్రత్యేక కార్యక్రమాలతో క్యాంపెయిన్ చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్... వివిధ జిల్లాల కార్యాలయాలను నేరుగా సందర్శిస్తున్నారు. ఇప్పటికే వీవీ ప్యాట్స్, ఈవీఎంలు రాష్ట్రానికి చేరుకున్నాయి.  వాటిని ఎలా వినియోగించాలనే దానిపై కూడా ప్రత్యేక శిక్షణలు ఇస్తున్నారు. వచ్చే వారంలో రాష్ట్రానికి రానున్న సీఈసీ బృందానికి...ఈవీఎంలు, వీవీ ప్యాట్లకు సంబంధించిన నివేదికను అందజేయనున్నారు రజత్ కుమార్. గ్రామీణ స్థాయిలో పర్యటన ముగించిన తర్వాత...పరిస్థితులను బట్టి ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించే అవకాశాలున్నాయి. 

17:48 - September 20, 2018

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల వేడి తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతోంది. ఏపార్టీకి ఆ పార్టీ గెలుపుకోసం నానా పాట్లు పడుతున్నాయి. విజయంపై ధీమాగా వున్న టీఆర్ఎస్ కూడా తమ ప్రయత్నాల్లో నేతలు తలమునకలయైపోయారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేస్తుందనీ..వారిద్దరి పొత్తుతో విజయం సాధిస్తే ఇరు పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాలు చేస్తారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో..ఎంఐఎం పార్టీ ఎంపీ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  
టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకొస్తే కనుక ఆ పార్టీతో కలిసి అధికారాన్ని పంచుకుంటారా?’ అనే ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవర్ పాలిటిక్స్‌పై తనకు అంతగా ఆసక్తి లేదని, టీఆర్ఎస్‌తో కలిసి అధికారం పంచుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కానీ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే ఆయన విజయానికి దోహదపడతాయని ఎంపీ ఒవైసీ పేర్కొన్నారు.
కర్ణాటకలో కుమారస్వామి సీఎం అయినట్లుగానే తెలంగాణలో కూడా జరగవచ్చని..తాము అధికారంలోకి రావచ్చని మాజీ ఎమ్మెల్యే..ఒవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించారు. దీనిపై ఆయన స్పందిస్తూ, అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను మీడియా తప్పుగా ప్రచారం చేసిందని..మీడియా తీరంతా కట్ అండ్ పేస్ట్ అన్న రీతిలో ఉంటుందని పనిలో పనిగా ఒవైసీ మీడియాకు చురకలంటించారు. 

 

22:13 - September 19, 2018

హైదరాబాద్ : రాష్ట్ర సాధన కోసం  తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి..టీఆర్ఎస్ లో విలీనం చేసిన అనంతరం తెరమరుగు అయిపోయిన రాములమ్మ కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుస్తు ఎన్నికల్లో రాములమ్మ చక్రం తిప్పనుంది. టీఆర్ఎస్ లో ఎంపీగా పనిచేసిన ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మళ్లీ కీలకపాత్ర పోషించబోతున్నారు. ఆమెను టీకాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా పార్టీ అధిష్ఠానం నియమించింది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి 2014 ఎన్నికల్లో మెదక్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నుంచి ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 
ఇటీవల హైదరాబాద్ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన సందర్భంలో... ఆమె మళ్లీ కనిపించారు. రాజకీయాలల్లో ఇకపై క్రియాశీలకంగా ఉంటానని ఆ సందర్భంగా ఆమె తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమెకు కీలక పదవిని కట్టబెట్టింది. పార్టీ గెలుపులో ఆమె కీలక పాత్ర పోషిస్తారని పార్టీ భావిస్తోంది. మరోవైపు, టీడీపీతో పొత్తును ఇంతకు ముందే ఆమె వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

 

19:33 - September 19, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సమయం శంఖం పూరించిన వేళ టీ.కాంగ్రెస్ లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఎన్నికల సమయం ముంచుకొస్తున్న వేళ..పార్టీ అధినేత రాహుల్ గాంధీ పలు మార్పులు చేశారు. టీపీసీసీకి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు 9 అనుబంధ కమిటీలను ఏర్పాటు చేశారు. టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి పదోన్నతి లభించింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు నియమితులయ్యారు. ప్రచార కమిటీ ఛైర్మన్ గా మల్లు భట్టి విక్రమార్క, కో-ఛైర్మన్ గా డీకే అరుణ, కన్వీనర్ గా దాసోజు శ్రవణ్ లను నియమించారు. 41 మందితో ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారు. 53 మందితో కోఆర్డినేషన్ కమిటీని నియమించారు. మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా దామోదర రాజనర్సింహను నియమించారు. స్ట్రాటజీ కమిటీ ఛైర్మన్ గా వి.హనుమంతరావు నియమితులయ్యారు.

 

11:16 - September 11, 2018

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఏఐఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించింది. తమకు పట్టున్న స్థానాల్లో భారీ ఆధిక్యంతో తిరిగి గెలిచేందుకు  వ్యూహం రచించింది. అదికార టీఆర్ఎస్ తో ఎటువంటి పొత్తు లేకపోయినా  గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకొనేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పాత నగరంలో ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో ఎన్నికల వేడి మరింత పుంజుకుంది.

ఏడు స్థానాల్లో అభ్యర్థులు
 

  1. ముంతాజ్ అహ్మద్‌ఖాన్ - చార్మినార్
  2. మహ్మద్ మొజంఖాన్ -  బహదూర్‌పుర
  3. అహ్మద్‌బిన్ అబ్దుల్లా బలాల్ - మలక్‌పేట్ 
  4. అక్బరుద్దీన్ ఓవైసీ -  చంద్రాయణగుట్ట
  5. జాఫర్ హుస్సేన్ మేరాజ్ - నాంపల్లి
  6. కౌసర్ మొహిద్దీన్ - కార్వాన్
  7. సయ్యద్ అహ్మద్ పాషాఖాద్రీ - యాకుత్‌పుర
15:56 - September 8, 2018

హైదరాబాద్‌ : ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో స్థాపించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో పలు సమస్యలను ఫేస్ చేస్తోంది. విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఐదు సంవత్సరాలు నిండకుండానే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు శంఖారావం పూరించింది. దీంతో విపక్షాలు కూడా ఎన్నికలలో అవలంభించాల్సిన వ్యూహాలపై..పొత్తులపైనా కసరత్తులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీ.టీడీపీపై యోచించేందుకు హైదరాబాద్ కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుత రాజకీయ..పార్టీల విధి విధానాలపై నేతలతో ఆరా తీసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..ఆటుపోట్లు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదన్నారు. కమ్యూనిస్టు పార్టీలు, కో దండరాం పార్టీ వైఖరిపై నేతలను ఆరా తీశారు. తెలంగాణలో తెదేపా పట్ల ఆదరణ తగ్గలేదని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో 20 సీట్లలో 35 శాతం ఓటింగ్‌ పదిలంగా ఉందని.. తెదేపా బలం చెక్కు చెదరలేదని..ప్రజల్లో తెరాసపై తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

36 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నో ఆటుపోట్లు చూశామని అన్నారు. తెలుగు ప్రజల ఆదరాభిమానాలతో తెదేపాకు వన్నె తగ్గలేదన్నారు. వారి అభిమానమే పార్టీకి తరగని ఆస్తి అనీ..కార్యకర్తలే తెదేపా సంపదని వివరించారు. దేశంలో తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉండాలన్నదే తన ఎప్పటికీ తన ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు తెలిపారు. 

09:50 - September 8, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్దుతో ముందస్తు ఎన్నికలకు తెరలేసింది. రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయ సమీకణలు శరవేగంగా మారుతున్నాయి. అసలు కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి..ముందస్తుకు ఎందుకు వెళ్తున్నారు? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌... నమ్మకమే జీవితమన్నది ఆయన సూత్రం. అయితే తన మీద, తన పనితీరు మీద కాకుండా జాతకాలు, తిథులు, నక్షత్రాలు, రాశుల మీద నమ్మకం పెట్టుకోవటం ఆయన రివాజు. వాటి ప్రకారం నడుచుకోవటం.. నిర్ణయాలు తీసుకోవటమే కేసీఆర్‌కు పరమావధి. శాసనసభను రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనకు దేవుళ్లు, జాతకాలపై ఉన్న నమ్మకం తీవ్ర చర్చనీయాంశమవుతున్నది. ఫామ్‌హౌజ్‌లో చండీయాగం చేయటంతోపాటు ఇతర యాగాలను నిర్వహించటం, తెలంగాణతోపాటు ఏపీలోని పలు దేవాలయాలను సందర్శించి.. అక్కడి దేవుళ్లకు మొక్కులు చెల్లించటం, ఇందుకు ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలు వెచ్చించటం తదితర పరిణామాలన్నీ ఈ కోవలోకి చెందినవే. పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులను కలిసినప్పుడు ఆయన అనేకమార్లు వారి కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేసిన విషయం విదితమే. 
పక్కా ప్రణాళిక ప్రకారం శాసనసభ రద్దు
గురువారం గవర్నర్‌ను కలిసిన అనంతరం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో 'రాష్ట్రం బాగు కోసమే...' శాసనసభను రద్దు చేశామంటూ కేసీఆర్‌ ప్రకటించినప్పటికీ 'జాతకాలు, నమ్మకాలే...' ఇందుకు కారణమన్నది నిర్వివాదాంశం. ఆ రోజు ప్రగతి భవన్‌లో నిర్వహించిన మంత్రివర్గ సమావేశానికి ముందు కేసీఆర్‌ వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అంటే పక్కా ప్రణాళిక ప్రకారం.. జాతకాన్ని చూసుకునే కేసీఆర్‌ శాసనసభను రద్దు చేశారని విదితమవుతున్నది. మరోవైపు సెప్టెంబరులోనే ఆయన సభను రద్దు చేయటానికిగల కారణాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. గతంలో సిద్ధిపేట ఎమ్మెల్యేగాను, ఆ తర్వాత కరీంనగర్‌గా ఎంపీగానూ పనిచేసిన కేసీఆర్‌.. ఉప ఎన్నికల సందర్భంగా ఆయా పదవులకు రాజీనామా చేసింది కూడా సెప్టెంబరులోనే. అంటే ఆ నెల తనకు బాగా అచ్చొచ్చిందని ఆయన భావించారు. అందుకనుగుణంగానే సెప్టెంబరులోనే సభను రద్దు చేశారని విదితమవుతున్నది. మరోవైపు అసెంబ్లీని రద్దు చేసినప్పటి నుంచి ఆయన అపర చాణుక్యుడు.. మంచి వ్యూహకర్త అంటూ మీడియా ఆకాశానికెత్తేసిన తరుణంలో... వీటికంటే మించి పలు పథకాల్లోని వైఫల్యాలే కేసీఆర్‌ను ముందస్తుకు వెళ్లేలా ముందుకు నెట్టాయని ఓ కీలక అధికారి వ్యాఖ్యానించారు.
ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత 
పైకి కేసీఆర్‌ ఎంతో ధైర్యంగా ఉన్నట్టు కనబడుతున్నా అనేక ప్రతిష్టాత్మక పథకాలు పూర్తి కాకపోవటం ఆయన్ను మానసికంగా ఇబ్బందికి గురి చేస్తున్నదని సమాచారం. దీనికితోడు పదిహేను రోజులకొకసారి, నెల రోజులకొకసారి వాటిపై సుదీర్ఘ సమీక్షలు నిర్వహించటం.. ఆ తర్వాత నిర్ణీత గడువులోగా వాటిని పూర్తి చేయాలని ఆదేశించటం ఆయనకు ఆనవాయితీగా మారింది. ఇదే సమయంలో వాటిని పూర్తి చేసేందుకు నిర్దిష్టంగా కొన్ని తేదీలను కూడా ఆయన ప్రకటించేవారు. గత నెలలో మిషన్‌ భగీరథ మీద ఆయన రివ్యూ నిర్వహించారు. ఆగస్టు 15 అర్థరాత్రి నుంచి రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా నీటిని అందిస్తామంటూ ఆ సందర్భంగా ప్రకటన విడుదల చేశారు. దీనిపై ఇప్పుడు ఆయన నోరెత్తటం లేదు. రాజీనామా అనంతరం అపద్ధర్మ ముఖ్యమంత్రిగా తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలోనూ ఆయన దాని గురించి ప్రస్తావించకపోవటం గమనార్హం. దీంతోపాటు పెన్షన్ల పంపిణీ కూడా కేసీఆర్‌కు ఇబ్బందికరంగా మారింది. తెలంగాణ వచ్చిన తర్వాత వీటిని భారీ స్థాయిలో పెంచిన సంగతి తెలిసిందే. తొలుత ప్రతినెలా మొదటి వారంలో చేతికందిన పెన్షన్లు.. ఇప్పుడు చివరి వారానికిగానీ రావటం లేదన్నది బాధితుల ఆవేదన. వీటితోపాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ సమస్య కూడా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెద్ద ఇబ్బందిగా మారింది. షరా మామూలుగా దళితులకు మూడెకరాల భూ పంపిణీ, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, లక్షలాది ఉద్యోగులు... ఇవన్నీ తీరని సమస్యలుగా ఉన్నాయి. వీటిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది. ఇది ఇంకా పెరగకముందే ముందస్తుకు వెళ్లాలని కేసీఆర్‌ యోచించారు. అందులో భాగంగానే ఆర్నెళ్ల క్రితం నుంచే తన పరివారంతో సమాలోచనలు జరిపారు. తనకు జాతకాల మీదున్న నమ్మకంతో పక్కా వ్యూహం ప్రకారం.. సెప్టెంబరులోనే శాసనసభను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న కేసీఆర్‌ను లోన మాత్రం పథకాల వైఫల్యాల భయం వెంటాడుతున్నదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు సంఖ్యా శాస్త్రం దృష్ట్యా కూడా కేసీఆర్‌ 'ఆరు' అనే అంకెను అదృష్ట సంఖ్యగా భావిస్తారు. ఈ క్రమంలోనే 105 మంది అభ్యర్థుల జాబితాను ఆయన ప్రకటించారు. ఇక్కడ ఒకటి, సున్న, ఐదులను కలిపితే 'ఆరు' వస్తుంది. ఈ జాబితాను ప్రకటించిన తేదీ కూడా ఆరే కావటం గమనార్హం.

 

18:44 - September 7, 2018

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ స్పందించారు. ఎటువంటి ఎన్నికల షెడ్యూల్ అయిన ఎన్నికల సంఘం కాకుండా ఇతరులు ప్రకటించడం తప్పని అన్నారు. అసెంబ్లీలో కాని, ఇతర సభలో కాని రాజకీయ నాయకులు ఎన్నికల తేదీలను ప్రకటించడం దురదృష్టకరమని రావత్ వ్యాఖ్యాలనించారు. వారం రోజుల్లో తెలంగాణ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని... అయితే, మిగిలిన నాలుగు రాష్ట్రాలతో పాటే ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనే విషయాన్ని మాత్రం ఇప్పుడే చెప్పలేమని రావత్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నుంచి నివేదిక వచ్చాకే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎన్నికలను నిర్వహించేందుకు యంత్రాంగం, వసతులు, ఏర్పాట్లు అన్నీ సిద్ధంగా ఉంటే... ముందుగా నిర్వహించేందుకు తమకు ఎలాంటి సమస్య లేదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ తెలిపారు. 

16:43 - September 7, 2018

హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా వుండే కేసీఆర్ కీలక పరిణామాల మధ్య అసెంబ్లీని రద్దు చేశారు. దీనికి గవర్నర్ ఆమోద ముద్ర కూడా వేశారు. దీన్ని వ్యతిరేకిస్తు హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ప్రభుత్వానికి ఇంకా 9 నెలలు గడువు వుండగా ..అసెంబ్లీని రద్దు చేయటాన్ని సవాల్ చేస్తు రాపోలు భాస్కర్ అనే ప్రముఖ న్యాయవాది హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ప్రజల ద్వారా ఎన్నుకోబడిని ప్రభుత్వం పాలన ఐదేళ్లు పూర్తయ్యేంత వరకూ ఎటువంటి ఎన్నికలు జరపకుండా చూడాలని ముందస్తు ఎన్నికలు జరగకుండా చూడాలని రాపోలు భాస్కర్ పిటీషన్ లో కోరారు. అసెంబ్లీ రద్దుతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడతుందనీ..ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని కాబట్టి ముందస్తు ఎన్నికలు జరకుండా చూడాలని పిటీషనర్ రాపోలు భాస్కర్ కోరారు. దీనిపై విచారణకు స్వీకరించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణను పరిశీలించిన మంగళవారానికి వాయిదా వేసింది. 

14:59 - September 7, 2018

హైదరాబాద్ : తెలంగాణలో టీడీపీ పార్టీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. దీంతో తెలంగాణలో టీడీపీ నేతల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారటంతో కొందరు నేతలు కారెక్కాశారు. టీడీపీలో బలమైన నేత రేవంత్ రెడ్డి అందరికీ భిన్నంగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. టీడీపీ నుండి కారు పార్టీలోకి వెళ్లిన ఎర్రబెల్లికి గులాబీ నేత సీట్ కూడా ఖరారు చేసిన ప్రకటించేశారు. ఇక ఎటు వెళ్లలేక..టీడీపీ నుండి బహిష్కరించబడిని మోత్కుపల్లి నర్శింహులు మాత్రం రెండూ చెడ్డ రేవడిలా ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో మోత్కుపల్లి ఈ ముందస్తు ఎన్నికల్లో స్వంతగా తన సత్తా చూపించుకోవటానికి సిద్ధమైపోయారు. సైకిల్ పార్టీ పొమ్మంది. కారు పార్టీ రమ్మనలేదు. ఈ క్రమంలో  ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానంటున్నారు మోత్కుపల్లి.

ఈ నేపథ్యంలో ఆలేరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని మోత్కుపల్లి ప్రకటించారు. 35 ఏళ్లుగా ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరోసారి ఆలేరు నియోజకవర్గ ప్రజలు తనను దీవించి శానసనభకు పంపాలని కోరారు. ఎన్నికల్లో తాను గెలుపొందితే ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు గోదావరి జలాలను సాధించి సస్యశ్యామలం చేస్తానని తెలిపారు. ఈ నెల 17న యాదగిరిగుట్టలో ఆలేరు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించబోతున్నానని... ఆ భేటీలో అన్ని విషయాలను చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Pages

Don't Miss

Subscribe to RSS - ముందస్తు ఎన్నికలు