బహిష్కరణ

14:20 - October 15, 2018

భద్రాద్రికొత్తగూడెం : జిల్లాలోని పినపాక నియోజకవర్గం కరకగూడెం మండలం మారుమూల గ్రామాలైన గాంధీనగర్, రఘునాథపాలెం, నర్సం పేటలలో బడి లేదు.. గుడి లేదు. కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకవు.. ఎటుచూసినా తాటికమ్మలతో నిర్మించిన పూరి గుడిసెలు. ఆ గ్రామాలకు సరైన రోడ్లు లేవు. 30 సంవత్సరాల నుంచి ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పలు పార్టీల నాయకులు రావడమే కానీ ఊరికి చేసినదేమీ లేదంటున్నారు ఆ గ్రామస్తులు.. నిత్యం మోసపు నాయకుల మాటలతో మోసపోతున్నామని..  ఇప్పుడు ఓట్ల కోసం వచ్చే నాయకులను తరిమి కొడతమంటున్నారు. రానున్న ఎన్నికలను బహిష్కరిస్తామని అంటున్నారు.  గ్రామస్తులు అంతా ఏ పార్టీకి ఓటు వేసేది లేదని తీర్మానం చేసుకున్నారు.

గాంధీనగర్, రఘునాథపాలెం, నర్సం పేట గ్రామాలలో సుమారు 500 కుటుంబాలు ఉన్నాయి. తమ ఊరు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, ప్రధానంగా తమ ఊరిలో కనీస సౌకర్యాలైన తాగునీరు, సాగునీరు , రోడ్లు, బడి, కనీసం అంగన్వాడి కేంద్రం కూడా లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

30 సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులు మాయమాటలు చెప్పి మోసం చేశారని, మద్యం , చీరలు ఎరగా పెట్టి ఓట్లు వేయించుకున్నారని, గెలిచిన తరువాత ఏ ఒక్కరూ కూడా ఊరి కోసం ఏమీ చేయలేదంటూ, తాగునీరు లేక నానా కష్టాలు పడుతున్నామని తమ గోడు వెళ్లబుచ్చారు.. ఈ సారి ఏ నాయకుడు వచ్చిన ఎవరికి ఓటు వేసేదీ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో బడి లేక మండలానికి వెళ్లాల్సి వస్తుందని, చిన్న పిల్లలను పది కిలోమీటర్ల దూరంలో బడికి పంపలేక పోతున్నామని, చాలా మంది బడిమానేసి ఇంట్లో ఉంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనాడు ఏ అధికారి తమ గ్రామాలకు రారని కేవలం ఐదేండ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలప్పుడే వీరంతా కనిపిస్తారని.. అందుకే ఈ సారి ఎవరూ వచ్చిన తమ సమస్యల పై స్పందించి రాతపూర్వకంగా హామీ ఇచ్చినప్పడే ఓట్లు వేయడానికి ఆలోచిస్తామంటున్నారు..

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయకూడదని గ్రామస్తులంతా తీర్మానం చేసుకున్నారు.. ఏ పార్టీ నేతలైనా  సరే తమకు నమ్మకం కల్పించనంత వరకు ఓటు వేసేది లేదంటున్నారు గ్రామస్తులు.. మాయమాటలు చెప్పె వారిని ఊరి పొలిమెరల్లోనే తరిమి కొడతామంటున్నారు. 

15:38 - October 14, 2018

కరీంనగర్ : గత కొంతకాలంగా స్తబ్ధంగా ఉన్న మావోయిస్టులు ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో మావోయిస్టుల లేఖలు కలకలం రేపాయి. జిల్లాలోని కోల్ బెల్ట్ ఏరియాలో మావోయిస్టుల లేఖలు సంచలనం కల్గిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు బహిష్కరించాలంటూ లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టుల లేఖలతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం చెన్నూరు, బెల్లంపల్లి అభ్యర్థులకు భద్రతను పెంచారు.

ఇటీవలే ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమలను మావోయిస్టులు కాల్చి చంపారు. ఈ ఘటన ఏపీలో సంచలనం సృష్టించింది. నిన్న ఏవోబీ సరిహద్దులో మావోయిస్టులు ల్యాండ్ మైనింగ్ పేల్చారు. ఛత్తీస్ గఢ్ లో పోలీసులపై మావోయిస్టులు దాడి చేశారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు మృతి చెందారు. కాగా మావోయిస్టుల కాల్పుల్లో ఒక జవానుకు గాయాలు అయ్యాయి. 

 

19:34 - September 12, 2018

విశాఖ : రైల్వే డీఆర్ ఎం మీటింగ్ ను ఉత్తరాంధ్ర ఎంపీలు బాయ్ కాట్ చేశారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర అనుసరిస్తున్నవైఖరికి నిరసనగా సమావేశాన్నిఉత్తరాంధ్ర ఎంపీలు బహిష్కరించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో చత్తీస్ గఢ్, ఒడిషా ఎంపీలతో డీఆర్ ఎం సమావేశం అయ్యారు. 

 

11:39 - August 14, 2018

హైదరాబాద్ : యువతలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారన్న ఆరోపణలపై నగర బహిష్కరణకు గురైన శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై హైదరాబాద్ పోలీసులు విధించిన నగర బహిష్కరణపై స్టే విధిస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం హైకోర్టు ప్రకటించింది. తనపై బహిష్కరణ వేటు సరికాదని, తన వ్యక్తిగత స్వేచ్ఛకు అది భంగం కలిగిస్తోందని ఆరోపిస్తూ, పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై వాదోపవాదాలు విన్న తరువాత, ఆయన ఎక్కడైనా తిరగవచ్చని చెబుతూ, తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ బహిష్కరణ ఉత్తర్వులను నిలుపుదల చేస్తున్నట్టు పేర్కొంది. కాగా నెల రోజుల క్రితం పరిపూర్ణానంతపై నగర బహిష్కరణ విధిస్తు..హైదరాబాద్, రాజకొండ, సైబరాబాద్ కమిషనర్లు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 

21:52 - July 10, 2018

హైదరాబాద్ : కత్తి మహేష్‌ను నగర బహిష్కరణ చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీపీఎం రాష్ట్ర నాయకులు నంద్యాల నర్సింహారెడ్డితో పాటు.. దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. కత్తి మహేష్‌పై నగర బహిష్కరణ వేటు ఎత్తివేయాలని వక్తలంతా డిమాండ్‌ చేశారు. కత్తి మహేష్‌ను నగర బహిష్కరణ చేయడమంటే... యావత్తు దళితులందర్నీ బహిష్కరణ చేసినట్లేనని అభిప్రాయపడ్డారు. కొందరు రాజకీయ స్వార్ధం కోసం.. ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడడం సరైనది కాదని వెంటనే కత్తి మహేష్‌ నగర బహిష్కరణ వేటును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 

21:44 - July 9, 2018

హైదరాబాద్ : కత్తి మహేష్‌ను హైదరాబాద్‌ నగరం నుంచి బహిష్కరించారు పోలీసులు. హిందూ ధర్మంపై కత్తి మహేష్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. హిందూ ధార్మిక సంఘాలు ఆందోళనలకు దిగాయి. అంతేకాకుండా భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేశాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. నగరంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా కత్తి మహేష్‌ను నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రకటించారు.

వివాదాస్పద వ్యాఖ్యల కత్తి మహేశ్ పై చర్యలు
గత కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యల చేస్తున్న సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్‌ నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. తమ అనుమతి లేకుండా హైదరాబాద్‌లోకి అడుగు పెట్టవద్దని ఆదేశించారు. అంతేకాకుండా కత్తి మహేష్‌ను అదుపులోకి తీసుకుని ఏపీ పోలీసులకు అప్పగించారు.

కత్తి మహేష్‌పై నగర బహిష్కరణ వేటు
కత్తి మహేష్‌, హిందూ ధార్మిక సంఘాల ఆందోళనల నేపథ్యంలో... డీజీపీ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సమాజంలో అలజడి సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తున్న కత్తి మహేష్‌ను ఆరు నెలలపాటు హైదరాబాద్‌ నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు. నగరానికి రావాలంటే తమ అనుమతి తీసుకోవాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

పరిపూర్ణానంద యాదాద్రి పాదయాత్రకు పోలీసుల అనుమతి నిరాకరణ
గత కొన్ని రోజుల క్రితం కత్తి మహేష్‌ హిందూ ధర్మాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని.. గడ్డం శ్రీధర్‌ అనే వ్యక్తి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కత్తి మహేష్‌ను పీఎస్‌కు పిలిపించి స్టేట్‌మెంట్‌ తీసుకుని పంపించి వేశారు. అయితే.. కత్తి మహేష్‌ వ్యాఖ్యలపై హిందూ ధార్మిక సంఘాలు మండిపడ్డాయి. హిందూ ధర్మాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని నిరసిస్తూ... శ్రీపీఠం అధిపతి పరిపూర్ణనంద స్వామి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నుంచి యాదాద్రికి పాదయాత్ర చేపట్టేందుకు సిద్దమయ్యారు. దీంతో సోమవారం ఉదయం నుంచే హైదరాబాద్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పరిపూర్ణనంద ఇంటికి చేరుకుని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. బయటకు వెళ్లకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిపూర్ణానందకు మద్దతుగా హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

పోలీసుల తీరుపై పరిపూర్ణానంద అసంతృప్తి
ఇక తనను హౌస్‌ అరెస్ట్‌ చేయడంపై పరిపూర్ణానంద అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులతో కలిసి వెళ్లడానికి పోలీసులు అనుమతివ్వకపోతే... ధర్మాగ్రహా యాత్రను నిర్వహించేందుకు తానొక్కడికి అనుమతివ్వాలని లేనిపక్షంలో అన్నపానీయాలు మానేస్తానని హెచ్చరించారు. తనకు మద్దతు ఇచ్చేందుకు వచ్చిన వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారని.. వారిని బేషరతుగా విడుదల చేయాలని పరిపూర్ణానంద డిమాండ్‌ చేశారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం : డీజీపీ మహేందర్‌రెడ్డి
హైదరాబాద్‌కు ఎవరైనా రావొచ్చు.. జీవించవచ్చని.. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం సహించేది లేదని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. మొత్తానికి రాష్ట్రంలో ఎలాంటి ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే పోలీసులు ప్రతిస్పందించారు. దీనిపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

 

21:58 - May 28, 2018

హైదరాబాద్ : తెలుగుదేశం సీనియర్‌ నేత మోత్కుపల్లి నరసింహులుపై వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందున మోత్కుపల్లిని సస్పెండ్‌ చేయాలని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌.రమణ.. చంద్రబాబుకు లేఖ రాయగా.. అందుకనుగుణంగా మోత్కుపల్లిపై వేటు వేస్తూ చంద్రబాబు ప్రకటించారు. గవర్నర్‌ పదవి రాదని తెలిసి మోత్కుపల్లి గొడవ మొదలు పెట్టారని రమణ ఆరోపించారు. ఇటీవల మోత్కుపల్లి విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ ఎన్టీఆర్‌కు ప్రతిరూపం అని ఆయన ఎలా చెబుతారని ప్రశ్నించారు. మోత్కుపల్లి ద్రోహానికి క్షమాపణ లేదని రమణ అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎవరిపైనైనా చర్యలు తప్పవన్నారు ఎల్‌ రమణ. 

 

11:09 - May 26, 2018

నిజామాబాద్ : ఆర్మూరులో దళిత కుటుంబాలు బహిష్కరణకు గురయ్యాయి. భూ వివాదం నేపథ్యంలో 300ల దళిత కుటుంబాలు బహిష్కరణకు గురయ్యాయి. ఆర్మూరు గ్రామ అభివృద్ధి కమిటీ 300ల దళిత కుటుంబాలను బహిష్కరించింది. దశాబ్దాల నుండి శ్మశాన వాటికలో దహనం చేసుకుంటువుండేవారమనీ కానీ..కానీ విలేజ్ డెవలప్ మెంట్ వారు తమకు చెందిన సమాధుల్ని తొలగించారని దళితులు ఆరోపిస్తున్నారు. ఎస్సీ వర్గాల వారు విలేజ్ డెవలప్ మెంట్ లో వున్నవారిని కూడా కమిటీ మీటింగ్స్ లకు రావద్దని ఆదేశించారు. ఇది గవర్నమెంట్ స్థలం కాబట్టి మీరు ఇక్కడ అంత్యక్రియలవంటి పనులు చేయకూడదని గ్రామకమిటీ వారు ఆంక్షలు విధించారని వారు ఆరోపిస్తున్నారు. అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు గ్రామకమిటీతో పోరాడతున్నారు. జరిగిన విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటంలేదనీ దళితసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో దళితులంతా ఆందోళన చేపట్టారు. 

16:35 - April 8, 2018

కామారెడ్డి : దళితులపై దాడులు చేస్తే సహించం..కఠిన చర్యలు తీసుకుంటాం..దళితులపై జరుగుతున్న దాడులు బాధాకరమంటూ పాలకులు చెబుతున్నా వారి రాష్ట్రంలోనే దళితులుపై దాష్టీకాలు జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో దేశాయిపేటలో 12 దళిత కుటుంబాలను గ్రామ పెద్దలు బహిష్కరించారు. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా డప్పు కొట్టలేదనే కారణంతో పనులను తొలగించడం..బహిష్కరించడం చేశారని దళితులు పేర్కొన్నారు. బాన్సువాడ సీఐ స్పందించి ఇరువర్గాలతో చర్చించి సమస్యను పరిష్కరించారు. దళితులపై దాడులు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

21:13 - April 5, 2018

సంగారెడ్డి : జగ్ఙీవన్ రామ్ జయంతి ఉత్సవాలను దళిత సంఘాలు బహిష్కరించాయి. దేశంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని బహిష్కరించినట్లు దళిత సంఘాల నాయకులు తెలిపారు. ప్రారంభమైన కొద్దిసేపటికే దళిత సంఘాల నాయకులు నిరసనకు దిగటంతో సభ అర్థాంతరంగా ముగిసింది. అనంతరం దళితులు బాబూ జగ్ఙీవన్ రామ్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ఇటీవల భారత్ బంద్ నిర్వహించినప్పుడు దళితులపై దాడి చేసి చంపిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - బహిష్కరణ