పోలవరం

06:31 - September 13, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్...కోడలు బ్రాహ్మాణి ల సెల్ఫీ సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరంలో బుధవారం అపూర్వ ఘట్టం జరిగింది. పోలవరం గ్యాలరీ వాక్ ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబు కుటుంబసమేతంగా ప్రాజెక్టులో నడిచారు. ఏపీ మంత్రుల కుటుంబాలు సైతం ఈ వాక్ లో పాల్గొన్నారు. ఈ వాక్ లో మంత్రి నారా లోకేశ్, సతీమణి బ్రాహ్మణితో కలిసి పట్టిసీమ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా లోకేశ్ తన మొబైల్ లో అందమైన దృశ్యాలను చిత్రీకరించారు. బ్రాహ్మణితో కలిసి లోకేశ్ ఓ సెల్ఫీ కూడా దిగారు. ఈ సెల్ఫీని లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇంత పెద్ద ప్రాజెక్టును నాలుగే నాలుగేళ్లలో పూర్తి చేస్తున్నామని, అధికారులు, కాంట్రాక్టర్లు.. అందరి సహకారం వల్ల ఈ ప్రాజెక్టు 58 శాతం పూర్తయిందన్నారు. ఇలాంటి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 

08:31 - September 12, 2018

పశ్చిమ గోదావరి : ఏపీలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్టులో మంత్రులు, అధికారులు, వారి కుటుంబసభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు బుధవారం నడవనున్నారు. నాగార్జునసాగర్ డ్యాం నిర్మించినప్పుడు... అప్పటి  దేశ ప్రధాని  జవహర్ లాల్ నెహ్రూ.. సాగర్ స్పిల్‌వే వాక్ నిర్వహించి చరిత్రలో నిలిచిపోయారు. ఇప్పుడలాగే.. భారీ స్థాయిలో చేపట్టిన పోలవరంలో నిర్వహించనున్న స్పిల్‌వే వాక్‌తో సీఎం చరిత్రను తిరగరాయనున్నారు. వచ్చే ఏడాది మే నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో వేగంగా పనులు చేస్తున్నారు. కేంద్రం సహకరించకున్నా.. డయాఫ్రం వాల్‌, స్పిల్‌వే నిర్మాణం పూర్తి దశకు తెచ్చారు. వైద్యబృందంతో కలిసి నడవనున్న సీఎం.. 48వ బ్లాక్ వద్ద పైలాన్ ఆవిష్కరించనున్నారు. తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నడవనున్నారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు.. 

1148 మీటర్ల పొడవు, రెండున్నర మీటర్ల ఎత్తు, రెండు మీటర్ల వెడల్పుతో దీని నిర్మాణం చేపట్టారు. 52 బ్లాకులకు గాను 48 బ్లాకుల్లో గ్యాలరీ నిర్మాణం పూర్తయ్యింది. ప్రాజెక్టు మొత్తం పనుల్లో 58 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులను మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. అత్యంత అధునాతన జపాన్, జర్మన్ టెక్నాలజీతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టులో పండుగ వాతావరణం సంతరించుకోనుంది. 

13:30 - August 18, 2018

పశ్చిమగోదావరి : పోలవరం పనులకు ఆంటకం ఎదురైంది. ఎగువున ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరదనీరు పోటెత్తింది. దీనితో గోదావరి నదికి ఉధృతంగా వరద ప్రవహిస్తోంది. దీని కారణంగా పోలవరం ప్రాజెక్టుల్లోకి గోదారి నీరు వచ్చి చేరింది. స్పిల్ వే, అప్రోచ్ ఛానెల్ లు నీట మునిగిపోయాయి. ఒకవైపు భారీ వర్షాలు..గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పనులను ఆపివేశారు. 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

19:46 - August 17, 2018

పశ్చిమ గోదావరి : పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి పెరిగింది.  తెలంగాణ, ఓడిస్సా, చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలలో కురుస్తున్న వర్షాలకు గోదావరి నదికి ఉప నదులైన శబరీ, ఇంద్రావతి, ప్రాణహిత, పెను గంగా నదులు పొంగి ప్రవహిస్తూ గోదావరిలో కలుస్తున్నాయి. దీంతో గోదావరి నది తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లానుండి ఆంధ్రప్రదేశ్ లోని ఉభయ గోదావరి జిల్లాల వరకు వరద నీటితో పోటెత్తి ప్రవహిస్తోంది. తెలంగాణ లోని భద్రాచలం వద్ద గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో పోలవరం వద్ద గోదావరి నది ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. పోలవరం మండలం కొత్తూరు కాజ్ వే పైకి వరద నీరు చేరడంతో ఏజెన్సీ లోని 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. 

 

07:07 - August 14, 2018

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 2 కోట్ల ఎకరాలకు నీరందించడమే లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇందుకోసం భూగర్భ జలాలు, జలాశయాలు, చెరువులలో ఉన్న నీటిని సమర్ధవంతంగా వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.

అందుబాటులో ఉన్న జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలి :చంద్రబాబు
రాష్ట్రంలోని వివిధ దశల్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులతో పాటు పోలవరం ప్రాజెక్టు పని తీరుని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ వనరుల కింద అందుబాటులో ఉన్న జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో అధికారులు వ్యూహాలను రూపొందించుకోవాలని సీఎం సూచించారు.

25 సాగునీటి ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశం..
వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. మొత్తం రాష్ట్రంలో 86 జలాశయాల్లో 380.68 టీఎంసీలు, మిగిలిన చెరువులు భూగర్భ జలాలు ఇతర వనరులలో మొత్తం 867 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని ముఖ్యమంత్రి వివరించారు. 2 కోట్ల ఎకరాలకు, పరిశ్రమలకు అందించేందుకు నీటిని ఎలా వినియోగించాలన్న దానిపై లోతుగా పరిశీలన చేయాలన్నారు. వివిధ దశల్లో ఉన్న 25 సాగునీటి ప్రాజెక్టులను డిసెంబర్‌ కల్లా పూర్తి చేసే లక్ష్యంతో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న కట్టడాలు, నిర్మాణాలు జాగ్రత్తగా పరిశీలించాలని అధికారులకు సూచించారు సీఎం.

జెట్ గ్రౌటింగ్ పనులు 94.20 శాతం, కాంక్రీట్ పనులు 33.70 శాతం పూర్తి..
పోలవరానికి సంబంధించి ఇప్పటివరకు మొత్తం 57.41 శాతం పనులు పూర్తయ్యాయని, వర్షాలు పడుతున్నప్పటికీ పనులు అనుకున్న మేర పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రధాన డ్యామ్ పనులు 44.23 శాతం, ఎడమ కాలువ పనులు 62.74 శాతం, కుడి కాలువ పనులు 90 శాతం పూర్తయ్యాయని... గేలరీ వాక్‌కి స్పిల్ వే సిద్ధం అవుతోందని అధికారులు వివరించారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఇతర తవ్వకం పనులు 77 శాతం పూర్తయ్యాయన్నారు. జెట్ గ్రౌటింగ్ పనులు 94.20 శాతం పూర్తయ్యాయని, కాంక్రీట్ పనులు 33.70 శాతం పూర్తయ్యాయని అధికారులు వివరించారు.

ప్రాజెక్టు సందర్శనకు ప్రజలను ప్రోత్సహించాలన్న సీఎం
ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టును లక్ష మంది సందర్శించారని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే అన్ని జిల్లాల నుంచి ప్రాజెక్టు సందర్శనకు ప్రజలను ప్రోత్సహించాలని, వారికి పూర్తి వివరాలు తెలియజేసి అవహగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పునరావాస పనులు వచ్చే డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు నిర్ణీత గడువులో పూర్తికావాలన్నారు. వచ్చే వారం సమావేశానికి పూర్తి కార్యాచరణతో రావాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ పనులకు చెల్లించే బిల్లులపై జీఎస్టీ గురించి కూడా చీఫ్ ఇంజినీర్ల బోర్డు సమావేశం అవుతోందని, ఆ అంశాలను కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయని ముఖ్యమంత్రి చెప్పారు.

21:48 - July 26, 2018

విజయవాడ : ప్రతిపక్ష నేత జగన్‌ సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. ప్రాజెక్టులను అడ్డుకుంటే జగన్‌ చరిత్రహీనుడవుతారని హెచ్చరించారు. పట్టిసీమ ప్రాజెక్టు రైతులకు ఉపయోగపడలేదని జగన్‌ ఆరోపించడంపై దేవినేని ఉమ మండిపడ్డారు. 

15:21 - July 26, 2018

పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల సమస్య వెంటాడుతోంది. వచ్చే ఏడాదికల్లా గ్రావిటీ ద్వారా నీటిని విడుదల చేయాలన్న సంకల్పానికి అవరోధాలు అడ్డుతుగులుతున్నాయి. బీజేపీ, టీడీపీ మధ్య నెలకొన్న రాజకీయాల కారణంగా పోలవరం పనుల్లో జాప్యం జరుగుతోంది. ప్రధాన పనులు, డిజైన్లకు నిధుల కొరత ఏర్పడింది. దీంతో పోలవరం ప్రాజెక్ట్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

పోలవరం నిర్మాణంపై నీలినీడలు..
ఆంధ్రప్రదేశ్‌కు వరప్రధాయినగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పోలవరం ప్రాజెక్ట్‌ను 2019 నాటికి పూర్తి చేయగలరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటికప్పుడు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ పోలవరాన్ని అనుకున్న సమయానికే పూర్తి చేస్తామని చెబుతున్నాయి. కానీ ఆచరణలో జరుగుతోంది ఇందుకు పూర్తిగా విరుద్దం. పోలవరం పూర్తిచేసే దిశగా పనులు సాగడం లేదు.

పోలవరం డిజైన్లు, తుది అంచనాలకు ఆమోదం తెలపని కేంద్రం..
ఇప్పటి వరకు కేంద్రం పోలవరం డిజైన్లతోపాటు తుది అంచనాలపై ఆమోదం తెలుపలేదు. కాఫర్‌ డ్యామ్‌, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌, స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌, గేట్ల బిగింపు కార్యక్రమాలన్నీ అక్టోబర్‌కల్లా పూర్తి కావాల్సి ఉంది. ఇవన్నీ జరుగాలంటే ముందుగా నిర్వాసితుల సమస్య పరిష్కరిస్తే తప్ప పనులు ముందుకుసాగే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే 2019 ఖరీఫ్‌లో గ్రావిటీ ద్వారా సాగునీరు అందించడం కష్టతరంగా మారుతుందని జలవనరులశాఖ నిపుణులు చెప్తున్నారు.

వివిధ పనులకు రూ.10వేల కోట్లు ఇవ్వాల్సిన కేంద్రం..
41.5 మీటర్ల ఎత్తులో కాఫర్‌ డ్యామ్‌, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ల నిర్మాణ జరగాలంటే కేంద్రం నుంచి పదివేల కోట్లకుపైగా నిధులు వెచ్చించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో 7వేల కోట్లకుపైగా నిర్మాణానికి అవసరమని తెలుస్తోంది. ఇప్పటి వరకు 56.69 శాతం పనులు జరుగగా.. స్పిల్‌వే, స్పిల్‌చానల్‌, అప్రోచ్‌ చానల్‌, పైలట్‌ చానల్, లెఫ్ట్‌ఫ్లాంక్‌ పనుల కోసం 851.75 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తి చేశారు. మొత్తం పనుల్లో 75.30శాతం పనులు మాత్రమే పూర్తి చేయగలిగారు. స్పిల్‌ చానల్‌, స్పిల్‌వే, స్టిల్లింగ్‌బేసిన్‌ కాంక్రీట్‌ పనులు 36.79 లక్షల క్యూబిక్‌ మీటర్లు పూర్తయ్యాయి. రేడియల్‌ గేట్ల పనులు 61.55 శాతం, జెట్‌ గ్రౌంటింగ్‌ పనులు 93శాతం పూర్తి చేశారు.

సవరించిన ప్రతిపాదనలు తప్పుల తడకగా ఉన్నాయన్న కాగ్‌..
పోలవరం ప్రాజెక్ట్‌పై కాగ్‌ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. సవరించిన ప్రతిపాదన తప్పుల తడకగా ఉందని, కాంట్రాక్టర్లకే లబ్ది చేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయంటూ కాగ్‌ తన నివేదికలో స్పష్టం చేసింది. పోలవరం ఎడమ కాలువలో మూడు ప్యాకేజీల పనుల్లో 256.7 కోట్ల భారం ప్రభుత్వ ఖజానాపై పడిందని కాగ్‌ తేల్చింది. దేశంలోని 16 జాతీయ నీటి ప్రాజెక్ట్‌ల్లోకెల్లా పోలవరం ప్రాజెక్ట్‌ పనుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు కాగ్‌ తన నివేదికలో పొందుపర్చింది. కాంట్రాక్టర్లకు అయాచిత లబ్ది చేకూరుతోందని తూర్పారబట్టింది.

పోలవరం నిధుల విడుదలపై కేంద్రం కొర్రీలు..
మరోవైపు పోలవరం ప్రాజెక్ట్‌ నిధుల విడుదలపై కేంద్రం కొర్రీలు పెడుతోంది. పోలవరం పనులకు , అంచనాలకు పొంతన లేదని... లెక్కలు చూపాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. ప్రభుత్వం లెక్కలతో కూడిన నివేదికలు పంపినా... అందులో లోపాలు ఉన్నాయంటూ పోలవరానికి ఇవ్వాల్సిన నిధులను క్రమేణా కుదిస్తూ వస్తోంది. ఇప్పుడు పోలవరం విషయంలో రెండు పార్టీలు చెరొకమాట చెబుతుండటంతో పోలవరం ఎప్పటికి పూర్తి చేస్తారన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం తామంటే తామే పూర్తి చేస్తామని చెబుతున్నాయి. కేంద్రమైతే నిధులు విడుదల చేయకుండానే పోలవరాన్ని పూర్తి చేస్తామంటూ గొప్పలుపోతోంది. మొత్తానికి రాజకీయాల కారణంగా పోలవరం మళ్లీ వచ్చే ఎన్నికల నాటికి పొలిటికల్‌ అస్త్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి . ఇన్ని ప్రతికూలతల మధ్య 2019 జూన్‌ నాటికి పోలవరం పూర్తిచేయాలన్న లక్ష్యం ఎంతవరకు సఫలీకృతం అవుతుందో వేచి చూడాలి.

17:16 - July 13, 2018

విశాఖపట్టణం : ఏపీ రాష్ట్రంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పర్యటన కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన గడ్కరి శుక్రవారం విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ....పోలవరం దేశానికే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని, పోలవరం విషయంలో తాము రాజకీయాలు చేయడం లేదని మరోసారి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని, రాజకీయాలతో అభివృద్ధిని ముడిపెట్టడం లేదని పేర్కొన్నారు. పోలవరం సివిల్ కన్ స్ట్రక్షన్ పార్టును ఫిబ్రవరి 8లోపు పూర్తి చేస్తామన్నారు. పోలవరం భూ నిర్వాసితుల విషయంలో కేంద్రం చిత్తశుద్ధితో ఉందని, వ్యవసాయానికి కేంద్రం అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. 

15:39 - July 12, 2018

హైదరాబాద్ : పోలవరం ప్రాజె క్టుపై రాష్ట్ర ప్రభుత్వం డొల్లతనం మరోసారి బయటపడిందని వైసిపి నేత బోత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరి అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయిందని పేర్కొన్నారు. డీపీఆర్ లో మార్పులు..గడ్కరి నిలదీస్తే ముఖ్యమంత్రి, అధికారులు నీళ్లు నమిలారని, ప్రాజెక్టు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని నిలదీశారు. 

21:00 - July 11, 2018

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు సివిల్‌ నిర్మాణాలన్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కాంట్రాక్ట్‌ ఏజెన్సీలను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా పోలవరం పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గడ్కరీ చెప్పారు. ఏపీ ప్రభుత్వం అధికారులు మూడు రోజులు ఢిల్లీలో మకాంవేసి.. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించుకోవాలని పోలవరంను సందర్శించిన గడ్కరీ సూచించారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. కాంట్రాక్టు సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమీక్షించారు. జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు.

పోలవరం సివిల్‌ పనులను వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి పూర్తి చేస్తామని కాంట్రాక్ట్‌ సంస్థలు గడ్కరీ దృష్టికి తెచ్చాయి. అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 2019 ఫిబ్రవరిలోగానే సివిల్‌ నిర్మాణాలను పూర్తి చేయాలని గడ్కరీ ఆదేశించారు. ఇందుకు కాంట్రాక్టు సంస్థలు సుముఖత వ్యక్తం చేశాయి. ప్రాజెక్టు పనుల కోసం అడ్వాన్స్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరగా... ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగినందున.. ఇది సాధ్యంకాదన్నారు. పెరిగిన నిర్మాణ వ్యయానికి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మూడు రోజులు ఢిల్లీలో మకాంవేసి... కేంద్ర అధికారులతో చర్చించి, అన్ని సమస్యలు పరిష్కరించుకోవాలని గడ్కరీ సూచించారు. ఇందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారు. అన్ని సమస్యలు పరిష్కరించుకున్న తర్వాత పెరిగిన నిర్మాణ వ్యయంపై ఎనిమిది రోజుల్లో ఆర్థిక శాఖను వివేదిస్తానని గడ్కరీ చెప్పారు.

పోలవరం నిర్మాణ వ్యయం పెరిగినందున సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించాలని గడ్కరీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు పునరావాసం, పునర్నిర్మాణ కార్యక్రమాల అమల్లో గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా పోలవరం ప్రాజెక్టునుపూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గడ్కరీ చెప్పారు. గడ్కరీ ఆదేశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ.. కేంద్ర కోరిన అన్ని వివరాలను అందిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు స్థలంలో కేంద్ర మంత్రి గడ్కరీని కలిసేందుకు వచ్చిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు.. బీజేపీ కార్యకర్తలకు మధ్య స్వల్ప వాగ్వాదం నెలకొంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - పోలవరం