పెట్రోలు

14:29 - September 7, 2018

ఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజల నెత్తిన అదనపు భారాలు పడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు పెరుగతు సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించటంలేదు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగి సామాన్యులకు సవాల్ విసురుతున్నాయి. దీంతో ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. రూపాయి విలువ పతనమవుతుండటం పెట్రో ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనికి తోడు ఇరాన్ పై అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ రోజు కూడా పెట్రోలియం కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ముంబైలో పెట్రోల్ ధర ఆల్ టైమ్ హైని తాకింది. ఈరోజు ఏకంగా లీటర్ కు 52 పైసలు పెరిగి రూ. 87.39కి చేరుకుంది. డీజిల్ ధర రూ. 79.99కి చేరింది. హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ. 84.91, డీజిల్ ధర రూ. 78.48కి పెరిగింది.   

07:05 - May 20, 2018

ఢిల్లీ : మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచేందుకు సిద్దమవుతోంది కేంద్రం. ఆయిల్‌ కంపెనీల నష్టాలను భర్తీ చేసేందుకు ప్రజలపై భారం మోపేందుకు రంగం సిద్దమైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కూడా పెరగడంతో ప్రజలకు పెట్రో వాత తప్పేటట్లు లేదు.

2017 జూన్‌ నుంచి రోజువారీ ధరల సవరణ..
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలకు మళ్లీ రెక్కలు రానున్నాయి. చమురు సంస్థలు 2017 జూన్‌ నుంచి రోజువారీ ధరల సవరణను ప్రవేశపెట్టాయి. అయితే.. గత కొంతకాలంగా పెట్రోలు ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. చివరగా ఏప్రిల్‌ 24 నుంచి స్థిరంగా ధరలు కొనసాగుతున్నాయి. తాజాగా కర్ణాటక ఎన్నికలు ముగియడంతో కేంద్రం పెట్రోలు ధరలు పెంచేందుకు సమాయత్తమవుతున్నాయి.

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.74.80, డీజిల్‌ రూ.66.14..
ప్రస్తుతం ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ 74.80 రూపాయలు ఉండగా, డీజిల్‌ 66.14 రూపాయలకు చేరుకుంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ఏప్రిల్‌ 24న బ్యారెల్‌ 78.84 డాలర్లు ఉండగా... ఈనెల 14కు 82.98 డాలర్లకు చేరింది. దీంతో చమురు సంస్థలు తమకు భారీ నష్టం వాటిల్లుతున్నట్లు చెబుతున్నాయి. గతంలో కేంద్రం గుజరాత్‌ ఎన్నికల సమయంలో పెట్రోల్‌ ధరలు రూపాయి నుంచి మూడు రూపాయలు తగ్గించి.. ఎన్నికలు పూర్తయిన వెంటనే ధరలు పెంచాయి. తాజాగా కర్ణాటక ఎన్నికలు కూడా ముగియడంతో... కేంద్రం 4 నుంచి ఐదు రూపాయలు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా పడిపోవడంతో పెట్రోల్‌ ధరలు ఖచ్చితంగా పెంచుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే ధరలు పెంచేందుకు సిద్దమైన చమురు సంస్థలు..
ఇక ఇప్పటికే ప్రభుత్వరంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌లు డీజిల్‌ ధర మూడున్నర నుంచి ఐదు రూపాయల వరకు... పెట్రోల్‌ ధర 4 నుంచి 4.55 రూపాయల వరకు పెంచాలని నిర్ణయించాయి. ఇదిలావుంటే అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తక్కువగా ఉన్నప్పుడు దేశంలో పెట్రో ధరలు తగ్గించని ప్రభుత్వాలు... ఇప్పుడెలా పెంచుతాయని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.

పెట్రో ధరల పెంపుపై ప్రజల ఆవేదన..
ఇలా వారానికోసారి పెట్రో ధరలు పెంచితే ఎలా జీవించాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై పునారాలోచన చేయాలని కోరుతున్నారు. లేకపోతే... రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. చమురు ధరలు పెరుగుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. తమపై మళ్లీ ఎంత భారం పడుతుందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

16:57 - May 14, 2018

ఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును ఆపేసిన ప్రభుత్వం ఎన్నికలు ముగిసిన రెండు రోజులకే ధరలు పెంచేసింది. పెట్రోల్‌ ధర లీటరుకు 17 పైసలు, డీజిల్‌ ధర 21 పైసలు పెంచింది. ఎన్నికల వేళ పెట్రోల్‌ ధరలు పెంచితే ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుందన్న ఉద్దేశ్యంతో పెంపును మూడు వారాల పాటు నిలుపు చేసింది ప్రభుత్వం.

పెట్రోల్‌ ధర లీటరుకు 17 పైసలు పెంపు
కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు, తగ్గింపులను గత 19 రోజులుగా ఆపేసిన ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. ఎన్నికల ముగిసిన రెండ్రోజులకే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర లీటర్‌కు 17పైసలు, డీజిల్‌ ధర లీటరుకు 21పైసలు పెరిగాయి. కొన్ని రోజులుగా అంతర్జాతీయ చమురు ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచకుండా ఉంచారు.

దిల్లీలో పెట్రోల్‌ ధర లీటరుకు రూ.74.63పైసలు నుంచి రూ.74.80పైసలకు పెంపు
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం.. దిల్లీలో పెట్రోల్‌ ధర లీటరుకు రూ.74.63పైసలు నుంచి రూ.74.80పైసలకు పెరిగింది. డీజిల్‌ ధర లీటరుకు రూ.65.93 పైసల నుంచి రూ.66.14పైసలకు పెరిగింది.

ఎన్నిక నేపథ్యంలో అగిన పెట్రోల్, డీజిల్ ధరలు
గత ఏడాది జూన్‌ నుంచి చమురు సంస్థలు రోజువారీగా ధరల మార్పులు చేస్తువస్తున్నాయి. అయితే కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో గత మూడు వారాలుగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో రోజువారీ మార్పుల ప్రభావం ఎన్నికలపై చూపిస్తుందనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు ధరల మార్పును నిలిపేస్తాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు బాగా పెరగడంతో పాటు రూపాయి బలహీన పడడంతో కొన్ని రోజులుగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దాదాపు రూ.500కోట్లు నష్టపోయినట్లు అంచనా. 

20:14 - January 17, 2018

పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. చాపకింద నీరులా వినియోగదారుల జేబుకు చిల్లిపెడుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై నియంత్రణ ఎత్తివేసి.. రోజువారిగా మార్చు విధానం అమలు చేసినప్పటి నుండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రో ధరలు దేశంలో భగ్గుమంటున్నాయి. బండి బయటికి తీద్దామంటే భయపడే పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గిన సమయంలో కూడా ... దేశీయంగా పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్లుగా పన్నులు వేస్తూ పోవడంతో ధరలు అమాతం పెరిగిపోతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. డీజిల్‌ ధర అయితే దేశంలోనే అత్యధికంగా ఉండడం గమనార్హం.

గతంలో ప్రతి 15 రోజులకోసారి
చమురు సంస్థలు గతంలో ప్రతి 15 రోజులకోసారి పెట్రోల్, డీజిల్‌ల ధరలను సవరించేవి. అలా చేసినప్పుడు ఒక్కోసారి రెండు మూడు రూపాయల వరకు పెంపు ఉండేది. దాంతో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమయ్యేది. దీంతో ప్రభుత్వం గతేడాది జూన్‌ 16 నుంచి రోజువారీ ధరల సవరణ విధానాన్ని తెరపైకి తెచ్చింది. నామమాత్రంగా తొలి 15 రోజుల పాటు ధరలు తగ్గించగా... ఆ తర్వాతి నుంచి మెల్లమెల్లగా మోత మొదలైంది. హైదరాబాద్‌లో గతేడాది జూలై 16న రూ.67.11గా ఉన్న లీటర్‌ పెట్రోల్‌ ధర ప్రస్తుతం రూ.75.47కు.. డీజిల్‌ ధర రూ.60.67 నుంచి రూ.67.23కు చేరింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.76.92కు, డీజిల్‌ ధర రూ.68.79కు చేరాయి. రెండేళ్ల క్రితం క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా తగ్గినప్పడు.. ధరలను తగ్గించకుండా ప్రభుత్వాలు సొమ్ముచేసుకున్నాయి. గతేడాది నుండి రోజువారీ ధరల సవరణ విధానాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుండి పది పన్నెండు పైసలు పెంచడం, నాలుగైదు పైసలు తగ్గించడం చేస్తూ.. మొత్తంగా పెట్రోల్, డీజిల్‌ల ధరలు బాగా పెంచేశారు.

లీటర్‌ పెట్రోల్‌పై ఇరవై ఒక్క రూపాయల నలభై ఎనిమిదిపైసలు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీ కింద ఒక్కో లీటర్‌ పెట్రోల్‌పై ఇరవై ఒక్క రూపాయల నలభై ఎనిమిదిపైసలు.. డీజిల్‌పై పదిహేడు రూపాయల ముప్పైమూడు పైసలు వసూలు చేస్తోంది. ఈ పన్ను తర్వాతి మొత్తం ధరపై రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ పన్ను మోత మోగిస్తున్నాయి. మొత్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు కలిపి పెట్రోల్‌పై 57 శాతం, డీజిల్‌పై 44 శాతం భారం పడుతున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్‌ ఉత్పత్తుల అమ్మకాలపై వ్యాట్, అదనపు సుంకాల విధింపులో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే రెండో స్థానంలో ఉన్నాయి. మహారాష్ట్ర పెట్రోల్‌పై 26 శాతం వ్యాట్‌తో పాటు ప్రతి లీటర్‌పై రూ.9 చొప్పున అదనపు సుంకం వసూలు చేస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్‌కు తోడు ప్రతి లీటర్‌పై రూ.4 అదనపు సుంకం వసూలు చేస్తున్నారు. దీంతో పన్ను 38.82 శాతానికి చేరింది. డీజిల్‌పై 22.25 శాతం పన్ను, ప్రతి లీటర్‌పై రూ.4 సుంకంతో పన్నుశాతం 30.71కి చేరింది. తెలంగాణలో పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్‌పై 27 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. ఢిల్లీలో పెట్రోల్‌పై పన్ను 27 శాతం ఉండగా.. గోవాలో అతి తక్కువగా 17 శాతం మాత్రమే ఉన్నాయి.

క్రూడాయిల్‌ ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయం
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు.. చమురు ఉత్పత్తి దేశాలు క్రూడాయిల్‌ ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయం తీసుకోవడం నేపథ్యంలో.. ధరలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఇండియన్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర రూ.4,085గా ఉంది. ప్రస్తుతమున్న ధరల్లో దాదాపు సగం మాత్రమే అసలు ధరలుగా ఉండగా.. మిగతాదంతా పన్నుల భారమే. దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చినా.. పెట్రోలియం ఉత్పత్తులను మాత్రం అందులో చేర్చలేదు. పెట్రోల్‌ ఉత్పత్తులతో భారీగా ఆదాయం వస్తుండడంతో జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై రాష్ట్రాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. అదే జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకువస్తే ద్వంద్వ పన్నుల భారం తగ్గి ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

 

19:18 - January 17, 2018

అంతర్జాతీయంగా పెట్రో ధరలు తగ్గుతున్నప్పుడు రోజువారి ధరల పాలసీ తీసుకురాకుండా ఇప్పుడు పెట్రో ధరలు పెరుగుతున్నప్పుడు ఈ పాలసీని తీసుకొచ్చారని, కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు పెట్రోలుపై విపరీతంగా పన్నులు విధిస్తున్నారని ఆర్థిక నిపుణులు శశికుమార్ అన్నారు. పెట్రోలు వ్యాట్ తెలుగురాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని, అందరు మానసికంగా ధరలపై నిర్ణయానికి వచ్చారని బీజేపీ నేత శ్రీధర్ రెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నినాదం అచ్చే దిన్ కానీ వాస్తవానికి ప్రజలు సచ్చే దిన్ అనుకుంటున్నారని, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్యారల్ ధర 142 డాలర్లు ఉంటే అప్పుడు ఇండియాలో లీటర్ పెట్రోలు రూ.60 నుంచి రూ.70 ఉందని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

12:31 - September 15, 2017

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సామాన్యునిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలు, గ్యాస్‌ ధరలు పెరిగి సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే తాజాగా వీటి జాబితాలోకి పెట్రోల్‌, డీజిల్‌లు వచ్చి చేరాయి. రెండు రోజుల్లోనే కేంద్రం పెట్రోలు లీటరుకు 5 పైసలు, డీజిల్‌ లీటరుకు 3 పైసలు పెంచింది. అంటే వారం రోజుల్లోనే 82 పైసల వరకూ పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగాయి. పైసల రూపంలో ధరలను పెంచుతూ వాహనదారులకు అనుమానం రాకుండా ధరలను వడ్డిస్తోంది.

ఐదురోజుల్లో 5 సార్లు పావలా చొప్పున
కేంద్రం పెట్రోల్‌పై ఐదురోజుల్లో 5 సార్లు పావలా చొప్పున ధరలను పెంచుతూ వచ్చింది. దీంతో 72 రూపాయల 40 పైసలు ఉన్న పెట్రోల్‌ ధర 74 రూపాయల 54 పైసలకు పెరిగింది. ఇక డీజిల్‌పై 82 పైసలు పెరగ్గా గురువారానికి డీజిల్‌ ధర 63 రూపాయల 82 పైసలకు చేరింది. బాదుతున్నట్లు తెలియకుండానే... పెరుగుతూ పోతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కేంద్రం ఓ ప్రణాళిక లేకుండా పెట్రోల్‌ డీజిల్‌ ధరలు పెంచుతూ పోతుంటే తమపై తీవ్ర ప్రభావం ఉంటుందంటున్నారు. ఒక్కసారిగా రూపాయల్లో ధరలు పెంచితే ప్రజలు వ్యతిరేకిస్తారని భావించిన కేంద్రం ఈ రకంగా దొంగదెబ్బ తీస్తోందని ప్రజలు మండిపడుతున్నారు.

వాహనదారుల ఆవేదన...
ఇక పెరిగిన స్పీడ్‌ పెట్రోల్‌ వాల్యూమ్‌ ధరలు వాహనదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. స్పీడ్‌ పెట్రోల్ ధర పెట్రోల్‌, డీజిల్‌ ధరలను దాటేసింది. వాస్తవంగా స్పీడ్‌ పెట్రోల్‌ ధర 74 రూపాయల 30 పైసలుగా ఉంది. అయితే పెరిగిన ధరలతో 77 రూపాయల 30 పైసలైంది. దీంతో వాహనదారుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల రోజువారీ హెచ్చుతగ్గుల పట్ల అటు, పెట్రోలు బంకుల యజమానులూ అసంతృప్తినే వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు కూడా తాము ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నామన్న భావన ఉందని.. ఫిక్స్‌డ్‌ రేట్లే మెరుగని అంటున్నారు. మెల్లిగా పెరుగుతోన్న పెట్రోల్‌ ధరలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇదే పరిస్థితి గనక కొనసాగితే ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపే ప్రమాదం ఉంది. 

12:34 - February 8, 2017

కృష్ణా : జిల్లా జి కొండూరు మండలం కంభంపాడులో విషాదం చోటుచేసుకుంది. గత నెల 26న మధర్‌ థెరిసా అనాధాశ్రమంలో చదువుతున్న విద్యార్థి ప్రవీణ్‌పై హాస్టల్‌ వార్డెన్‌ పెట్రోల్‌ పోసిన నిప్పంటించిన ఘటనలో విద్యార్థి ప్రవీణ్‌ చికిత్స పొందుతూ మృతిచెందాడు. గత నెల 26న విద్యార్థి ప్రవీణ్‌పై వార్డెన్‌ పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో..ప్రవీణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే విద్యార్థి ప్రవీణ్‌ను చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ప్రవీణ్‌ మృతిచెందాడు.

07:02 - January 16, 2017

p { margin-bottom: 0.21cm; }

హైదరాబాద్: పెట్రోలు, డీజిల్‌ రేట్లు స్వల్పంగా పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు 42 పైసలు, డీజిల్‌పై లీటరుకు రూపాయి మూడు పైసులు వంతున పెంచినట్టు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రకటించాయి. పెరిగిన రేట్లు గత అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ముడిచమురు ధరలకు అనుగుణంగా స్వదేశంలో పెట్రోలు, డీజిల్‌ రేట్లు పెంచినట్ట ఓఎంసీ ల అధికారులు చెబుతున్నారు.

21:28 - December 16, 2016

ఢిల్లీ : వాహనదారులపై మరోసారి పెట్రో వడ్డన పడింది. చమురు కంపెనీలు మరోసారి పెట్రోలు ధరలను పెంచాయి. లీటర్‌ పెట్రోల్‌పై 2 రూపాయల 21 పైసలు,.. లీటర్‌ డీజిల్‌పై రూపాయి 79 పైసలు పెంచాయి. పెరిగిన కొత్త ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. 

14:39 - November 4, 2016

తూర్పుగోదావరి : కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగిపై ఆదర్శ చిట్‌ఫండ్ కంపెనీ యాజమాన్యం దాష్టీకం ప్రదర్శించింది. అవకతవకలకు పాల్పడ్డాడన్న కారణంతో ఉద్యోగిపై పెట్రోల్‌ పోసి.. నిప్పంటించింది. దీంతో ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. ఉద్యోగిని ఆసుపత్రికి తరలించారు. చాలా కాలంగా అదే కంపెనీలో పనిచేసే ఉద్యోగిపై చిన్నపాటి అవకతవకలు జరిగిన కారణంగా కంపెనీ యాజమాన్యం ఇంతటి దారుణానికి పాల్పడటంపై తోటి ఉద్యోగులు, స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - పెట్రోలు