నిషేధం

10:56 - September 12, 2018

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రంపై ఓ వార్త సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ‘సైరా’ సినిమాను నిషేధిస్తారనే వార్త కలకలం రేపుతోంది. తెలుగు సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 

స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. చిరంజీవి టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో ఇతర భాష నటీనటులు కూడా నటిస్తున్నారు. శాండల్‌వుడ్ కు సంబంధించిన స్టార్ హీరో సుదీప్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఓ టీజర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘సైరా నరసింహారెడ్డి' సినిమాపై నిషేధం విధించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.  భారీ బడ్జెట్‌తో తెరకెక్కే తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల డబ్బింగ్ వెర్షన్ ని కన్నడలో విడుదల చేయాలని నిషేధించాలని అక్కడ సినీ పరిశ్రమపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోందంట. మరి ఇది నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించే వరకు తెలియదు. 

14:12 - September 9, 2018

మహారాష్ట్ర : 'నా సినిమాలను నిషేధించండి' అని నటి, రచయిత్రి ట్వింకిల్‌ ఖన్నా అంటున్నారు. తెలుగులో 'శీను', హిందీలో ‘బర్సాత్‌, ‘మేలా’తదితర చిత్రాల్లో ట్వింకిల్‌ నటించారు. నటిగా కంటే రచయిత్రిగానే ఆమెకు మంచి పేరు వచ్చింది. అయితే ఇప్పటివరకు తాను చేసిన సినిమాలను నిషేధించాలని, వాటిని ప్రేక్షకులు ఎవ్వరూ చూడకూడదని అంటున్నారు. ట్వింకిల్‌ రాసిన ‘పైజామాస్‌ ఆర్‌ ఫర్గివింగ్’పుస్తకాన్ని శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ట్వింకిల్‌ భర్త అక్షయ్‌కుమార్‌, బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ట్వింకిల్‌ తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. 'ఇప్పటివరకు నేను నటించిన ఏ ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు. కాబట్టి నేను నటించిన సినిమాలు నిషేధించాలి. వాటిని ఎవ్వరూ చూడకూడదు. ఒక్కోసారి నా కెరీర్‌ గురించి ఆలోచించడం కూడా నాకు నచ్చదు. అందుకే నాకు అల్జీమర్స్‌ వ్యాధి ఉందని ఊహించుకుంటూ నా కెరీర్‌ను మర్చిపోవాలని అనుకుంటున్నాను. కరణ్‌ జోహార్‌ తొలిసారి నాతో యాడ్‌ ఫిలింను చిత్రీకరించబోతున్నాడు. దేవుడు అతన్ని చల్లగా చూడాలి. ఎందుకంటే నాకు నటించడం రాదు.' అని ట్వింకిల్‌ వెల్లడించారు.

 

07:59 - July 24, 2018

ఢిల్లీ : హస్తినలో జంతర్‌ మంతర్‌, బోట్‌ క్లబ్‌ వద్ద ఆందోళనలపై ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఢిల్లీ వ్యాప్తంగా ప్రదర్శనలపై స్టే విధించ లేమని కోర్టు స్పష్టం చేసింది. కాలుష్యం కారణంతో జంతర్‌ మంతర్‌, బోట్‌ క్లబ్‌ వద్ద ధర్నాలపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ 2017లో స్టే విధించింది. అప్పటి నుంచి పోలీసులు ప్రదర్శనలకు అనుమతించడం లేదు. సెంట్రల్‌ ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ మజ్దూర్‌ కిసాన్‌ శక్తి సంఘటన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హక్కుల కోసం ధర్నా చేయడం తమ ప్రాథమిక హక్కుగా పేర్కొంది. 

 

21:49 - July 18, 2018

ఢిల్లీ : కేరళలోని శబరిమలై అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధంపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఆలయం ప్రయివేట్‌ ఆస్తి కాదు...అందరికి సంబంధించినదని కోర్టు స్పష్టం చేసింది.  స్త్రీ, పురుష భేదం దేవుడికే లేనపుడు భూమిపై ఈ భేదాలు ఎందుకని  కోర్టు ప్రశ్నించింది. ఏ ఆధారంతో ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తున్నారని చీఫ్‌ జస్టిస్ దీపక్‌ మిశ్రా ఆలయ అధికారులను ప్రశ్నించారు. ఇది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగకరమని పేర్కొన్నారు. ఒకసారి ఆలయాన్ని భక్తుల కోసం తెరిచాక ఆ ఆలయానికి ఎవరైనా వెళ్లవచ్చని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఓ పురుషుడికి ఆలయంలో పూజించే హక్కు ఎంత ఉందో మహిళకు కూడా అంతే ఉంటుందని...మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం సరికాదని జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు. 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలకు ఆలయ ప్రవేశాన్ని నిరాకరించడంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

 

19:57 - March 30, 2018

జనగామ : జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో గుడ్‌ ఫ్రై డే సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య సిలువ యాత్రలో పాల్గొన్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ లోని తలకాయల గుట్టపై ప్రతిఏట సిలువ పాతడం ఆనవాయితీ. అయితే అక్కడ మూడు సంవత్సరాలుగా నిషేధం ఉండడంతో ప్రభుత్వం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. దీంతో గుట్టవైపు వెళ్లకుండా భక్తులను, ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుండి నియోజక వర్గంలో పోలీస్‌ ఎస్కార్ట్‌ లేకుండా పర్యటిస్తానన్నారు.

07:47 - March 2, 2018

వెబ్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న పోర్న్‌ సైట్స్‌పై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. చిన్నారులను, యువతను పెడదోవ పట్టిస్తున్న పోర్న్‌సైట్స్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో పోర్న్‌ సైట్స్‌ నిషేధించే వరకు పోరాడతాం అంటున్నారు. అటు మహిళను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనికోసం నిరాహారా దీక్షలకు సిద్ధమవుతున్నాయి మహిళా సంఘాలు. ఈ విషయాలపై ఐద్వా ఏపీ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి టెన్ టివి జనపథంలో విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:00 - January 27, 2018

విజయవాడ : నూతన సంవత్సం నుండి ప్రజలకు పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులను నిషేధిస్తామంటూ విజయవాడ నగరపాలక సంస్థ ప్రలోభాలు పలికింది. ఇందుకోసం కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం కూడా చేసింది. అమలును మాత్రం గాలికి వదిలేసింది.  
కాగితాలకే పరిమితమైన తీర్మాణాలు
ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గిస్తాం, క్యారీ బ్యాగుల వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుతాం, ఆ దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని విజయవాడ నగర పాలక సంస్థ ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల నిషేధంపై చెప్పిన మాటలు. అంతేకాదు 2018 నూతన సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుండి దీన్ని పక్కాగా అమలు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. కాని జనవరి మాసం ముగుస్తున్నా ఆ తీర్మాణాలు కేవలం కాగితాలకే పరిమతమయ్యాయి. ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రచారం చేయడంలోనూ అధికారులు విఫలమయ్యారు. 
15 టన్నులకు పైగా ప్లాస్టిక్‌ ఉత్పత్తులు
విజయవాడలో 15 టన్నులకుపైగా ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, సంచులు, గ్లాసులు, ప్లేట్లు, సీసాలు ఇతర అనుబంధ వస్తువులను నిత్యావసరాల కోసం వినియోగించుకుంటున్నారు. నగర పాలక సంస్థ పరిధిలో రోజూవారీ ఉత్పత్తి అయ్యే 550 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాల్లో 9-20 శాతం ప్లాస్టిక్‌ వస్తువులే ఉంటాయి. ఈ వ్యర్థాలు రోజూ 5 నుండి 10 టన్నుల వరకు నేరుగా డ్రెయిన్‌లలో చేరిపోతూ పలు రకాల సమస్యలు తీసుకువస్తున్నాయి. రైల్వే, బస్‌, ఇతర రవాణా వ్యవస్థల ద్వారా ప్రయాణం సాగించేవారి ద్వారా వచ్చే ప్లాస్టిక్‌ వ్యర్థాలు మరిన్ని సమస్యలను తీసుకువస్తున్నాయి. 
50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌పై నిషేధాజ్ఞలు
పర్యావరణ పరిరక్షణ చట్టం 2011 ప్రకారం 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ ఉత్పత్తులైన క్యారీ బ్యాగులు, టీ కప్పులు, ప్లేట్లు, గ్లాసులు, సీసాలు, తోరణాలు, బ్యానర్లపై నిషేధాజ్ఞలు ఉన్నాయి. 2013లో జారీ చేసిన నెంబర్‌ 46 ఉత్తర్వుల ప్రకారం 50 మైక్రాన్ల కన్న తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ వస్తువులు ఉత్పత్తి చేయడం, నిల్వ చేయడం, పంపిణీ చేయడం, విక్రయించడం, వినియోగించడం, చివరకు కొనుగోలు చేయడం కూడా నిషేధం విధించారు. అయితే నిషేధపు ప్లాస్టిక్‌ ఉత్పత్తులు విక్రయించే వ్యాపారుల నుండి 2500 మొదలు 5వేల వరకూ అపరాధ రుసుము విధించే అధికారం అధికారులకు ఉంది. ఈ ఉత్పత్తులు తయారు చేసేవారి నుండి 25 నుండి 50 వేల వరకు జరిమానా విధించవచ్చు. అయితే కొందరు క్షేత్ర స్థాయి సిబ్బంది, వ్యాపారుల నుండి నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 
అనేక వ్యాధులకు కారణమవుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు 
ప్లాస్టిక్‌ వ్యర్థాలు అనేక వ్యాధులకు కారణమవుతున్నాయి. క్యారీబ్యాగుల దహనం వల్ల వచ్చే పొగతో ప్రాణవాయువు విషతుల్యమై ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తుంది. ప్లాస్టిక్‌ వ్యర్థాల వచ్చే దుష్ప్రభావలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఇప్పటికైనా ప్రజల సంరక్షణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 

 

13:50 - January 23, 2018

ఢిల్లీ : వివాదాస్పదంగా మారిన పద్మావత్‌ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. పద్మావత్‌ సినిమాను నిషేధించాలని మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో పద్మావత్‌  ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా రాష్ర్ట ప్రభుత్వాలే చూడాలని సుప్రీం కోర్టు సూచించింది. మరో వైపు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హర్యానా, గుజరాత్‌లలో డిస్ర్టిబ్యూటర్‌ సినిమా విడుదల సందర్భంగా భయాందోళనకు గురవుతున్నారు. పద్మావత్‌కు వ్యతిరేకంగా ఉజ్జయిని, జైపూర్‌, సవాయ్‌ మాదోపూర్‌లో కర్నిసేనల ఆందోళనలు చేస్తున్నారు.

21:35 - November 20, 2017

భోపాల్ : వివాదాస్పద పద్మావతి చిత్రాన్ని తమ రాష్ట్రంలో నిషేధిస్తున్నట్టు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. చరిత్రను వక్రీకరించిన పద్మావతి చిత్రంపై నిషేధం విధించాలని రాజ్‌పుత్‌ సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సెన్సార్‌ సమస్యల నేపథ్యంలో డిసెంబర్‌ 1న విడుదల కావాల్సిన పద్మావతి మూవీని వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. పద్మావతి చిత్రానికి సెన్సార్‌ సర్టిఫికేషన్‌ కోసం అవసరమైన పత్రాలను సమర్పించలేదని సెన్సార్‌ బోర్డ్‌ చీఫ్‌ ప్రసూన్‌ జోషి పేర్కొన్నారు. సెన్సార్‌ సర్టిఫికెట్‌ కోసం చేసిన దరఖాస్తు అసంపూర్తిగా ఉందంటూ చిత్రాన్ని సీబీఎఫ్‌సీ నిర్మాతకు తిప్పిపంపింది. 

07:16 - October 14, 2017

ఢిల్లీ : బాణసంచాపై నిషేధం ఎత్తివేయాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నవంబర్‌ 1వ తేదీవరకు ఢిల్లీతో పాటు ఎన్‌సిఆర్‌ పరిధిలో పటాకులపై నిషేధం అమల్లో ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. బాణసంచాపై నిషేధానికి మతం రంగు పులమడం తమను బాధ కలిగించిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాలుష్యానికి సంబంధించిన ఈ అంశంపై కొందరు మతం రంగు పులమడానికి యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిషేధానికి ముందు అక్టోబర్‌ 9కి ముందు పటాకులు కొనుగోలుచేసిన వారికి కాల్చడానికి కోర్టు అనుమతించింది. బాణసంచా అమ్మకాలపై నిషేధం విధించడాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌, బాబా రాందేవ్‌ తప్పుపట్టారు. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. పటాకులపై బ్యాన్‌ వల్ల కాలుష్యం ఎంతవరకు తగ్గిందన్నది... దీపావళి తర్వాత చూస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.

Pages

Don't Miss

Subscribe to RSS - నిషేధం