టెస్టు మ్యాచ్

06:56 - September 30, 2018

ఢిల్లీ : క్రికెట్‌లో నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ ఐసీసీ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. డకవర్త్ లూయిస్ స్టెర్న్ సిస్టంను ఐసీసీ అప్‌డేట్ చేసింది. అలాగే, ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌, ఐసీసీ ప్లేయింగ్ కండీషన్లను తాజా చేర్చింది. దక్షిణాఫ్రికా-జింబాబ్వే మధ్య ఆదివారం కింబర్లీలో ప్రారంభం కానున్న తొలి వన్డే నుంచే తాజా నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 2014లో డీఎల్ఎస్ సిస్టంను అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశపెట్టాక ఇది రెండో అప్‌డేట్. 700 వన్డేలు, 428 టెస్టుల తర్వాత ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. కోడ్ ఆఫ్ కండక్ట్‌లో పలు నిబంధనలను మార్చింది.

07:06 - September 12, 2018

ఓవల్‌ టెస్ట్‌లో భారత్‌ ఓటమి పాలయ్యింది. భారత్‌తో జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. ఆ తర్వాత భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 292 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. దీంతో 40 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ విజృంభించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 423 పరుగులు చేసి.. భారత్‌కు 464 పరుగల లక్ష్యాన్ని ముందుంచింది. అయితే లక్ష్యఛేదనలో భారత్‌ మరోసారి తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా రాణించిన విహారి... ఈ ఇన్నింగ్స్‌లో పరుగులు చేయకుండా పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రిషబ్‌ పంత్‌.. రాహుల్‌కు మంచి సహకారాన్ని అందిస్తూ బ్యాటింగ్‌ చేశాడు. వీరిద్దరు కలిసి ఆరో వికెట్‌కు 204 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రాహుల్‌, పంత్‌లు సెంచరీలు చేశారు. అయితే.. 82వ ఓవర్‌లో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. రాహుల్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత రిషబ్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ దారిపట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన వారెవరూ రాణించలేదు. దీంతో భారత్‌ 94.3 ఓవర్లలో 345 పరుగులు చేసి ఆలౌంట్‌ అయ్యింది. ఫలితంగా ఇంగ్లండ్‌ ఈ మ్యాచ్‌లో 118 పరుగుల తేడాతో విజయం సాధించి.. 4-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఇరు ఇన్నింగ్స్‌లో అద్బుతంగా రాణించిన అలెస్టర్‌ కుక్‌కి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ఈ సిరీస్‌లో 250కి పైగా పరుగులు చేసి.. 11 వికెట్లు తీసిన యువ క్రికెటర్‌ శామ్‌ కర్రన్‌కి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు దక్కింది. 

 

20:58 - September 9, 2018

ఢిల్లీ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో 292 పరుగులకు భారత్ ఆలౌట్ అయ్యింది. ఈ టూర్లో చివరి టెస్ట్ మ్యాచ్ అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని భారత క్రీడకారులు భావిస్తున్నారు. అందులో భాగంగా ఐదో టెస్టు మ్యాచ్ లో జడేజా, విహారీలు భారత్ ను ఆదుకున్నారు. వీరు కనీసం ఆదుకోవడం ఆ మాత్రం స్కోరు సాధించాలని చెప్పవచ్చు. విహారీ 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరకు భారత్ ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్‌కు 40 పరుగుల ఆధిక్యం లభించింది.
174 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో మూడో రోజు ఇండియా బ్యాటింగ్ మొదలు పెట్టింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి హనుమ విహారీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంగేట్రం మ్యాచ్‌లోనే అర్ధసెంచరీ సాధించిన 26వ భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు.

06:48 - August 30, 2018

ఢిల్లీ : నేటి నుంచి భారత్‌ ఇంగ్లండ్‌ మధ్య నాలుగో టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే ఇంగ్లండ్‌ రెండు టెస్టులను గెలుచుకోగా.. భారత్‌ ఒకమ్యాచ్‌లో నెగ్గింది. వరుసగా రెండు పరాజయాలు... అందులోనూ లార్డ్స్‌లో దారుణమైన పరాభవం ఎదురైంది. ఈ స్థితిలో టీమిండియా పుంజుకుంటుందని ఎవరూ ఊహించలేదు. మరో ఓటమి ఖాయమని, సిరీస్‌పై ఆశలు నిలిచే అవకాశమే లేదన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇలాంటిస్థితిలో కోహ్లీసేన అద్భుతం చేసింది. నాటింగ్‌హామ్‌ టెస్టులో గొప్పగా పుంజుకుంది. అన్ని రంగాల్లో రాణిస్తూ... ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ ఇంగ్లాండును చిత్తుగా ఓడించి.. అభిమానుల నమ్మకాన్ని గెలుచుకుంది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు నాలుగో టెస్టులో బరిలోకి దిగుతోంది. జోరు కొనసాగిస్తూ ఈ మ్యాచ్‌లో మరో విజయం సాధించి.. ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేయాలన్న పట్టుదలతో కోహ్లీసేన బరిలోకి దిగుతోంది. భారత్‌ గత మ్యాచ్‌ జట్టునే సౌథాంప్టన్‌లోనూ కొనసాగించే అవకాశాలున్నాయి. మరోవైపు ఇంగ్లండ్‌ మాత్రం రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

 

12:53 - February 10, 2017

హైదరాబాద్ : భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ చేశాడు. విండీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ లపై సెంచరీలు చేశాడు. వరుసగా నాలుగు సీరీస్ లలో డబుల్ సెంచరీలతో కోహ్లీ రికార్డు సృష్టించాడు. 

19:07 - February 7, 2017

ఢిల్లీ : బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్ట్‌కు టీమిండియా సన్నద్ధమైంది.  విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టు బంగ్లాదేశ్‌పై సింగిల్‌ టెస్ట్‌లో ఆధిపత్యం ప్రదర్శించాలని పట్టుదలతో ఉంది. ఫిబ్రవరి 9నుంచి హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. 
టీమిండియా సొంత గడ్డపై మరో సమరం 
టెస్ట్‌ ఫార్మాట్‌లో తిరుగులేని టీమిండియా సొంత గడ్డపై మరో సమరానికి సన్నద్ధమైంది. బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లోనూ  విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టు పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించాలని తహతహలాడుతోంది. 
చోటు దక్కించుకొన్న ఆటగాళ్లు.... 
టెస్ట్ జట్టులో చోటు దక్కించుకొన్న ఆటగాళ్ళలో విరాట్‌ కొహ్లీ, మురళీ విజయ్‌,  కె ఎల్‌  రాహుల్, చతేశ్వర్ పూజారా, అజింక్యా రహానే, కరుణ్‌ నాయర్‌, అభినవ్‌ ముకుంద్‌, వృద్ధిమాన్ సాహా, ఇషాంత్‌ శర్మ,హార్దిక్‌ పాండ్య, రవిచంద్రన్‌ అశ్విన్‌,రవీంద్ర జడేజా, జయంత్‌ యాదవ్‌,అమిత్‌ మిశ్రా, ఉమేష్‌ యాదవ్‌ , భువనేశ్వర్‌ కుమార్‌ ఉన్నారు.
అభినవ్‌ ముకుంద్‌ కు అనూహ్యంగా చోటు 
సింగిల్‌ టెస్ట్‌కు ఎంపిక చేసిన జట్టులో అభినవ్‌ ముకుంద్‌ అనూహ్యంగా చోటు దక్కించుకున్నాడు. 2011లో టీమిండియా తరఫున టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన తమిళనాడు బ్యాట్స్‌మెన్‌ అభినవ్‌ ముకుంద్‌....ఆరేళ్ల తర్వాత తిరిగి చోటు దక్కించుకున్నాడు.ఇప్పటివరకూ 5 టెస్ట్‌లు ఆడిన ముకుంద్‌ 10 ఇన్నింగ్స్‌ల్లో 211 పరుగులు చేశాడు. అందరూ ఊహించినట్టుగానే ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ను సెలక్టర్లు పక్కన పెట్టారు. ఇంగ్లండ్‌తో ఆఖరి రెండు టెస్టుల్లో రాణించిన వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ పార్థీవ్‌ పటేల్‌కు జట్టులో చోటు దక్కలేదు. 
ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్ 
ప్రస్తుతం ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్‌ ర్యాంక్‌లో ఉండగా....బంగ్లాదేశ్‌ జట్టు 9వ స్థానంలో ఉంది. ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌ జట్టుతో 6 సార్లు పోటీపడిన భారత్‌ ....అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ఫిబ్రవరి 9నుంచి హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.  టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోన్న విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు బంగ్లాదేశ్‌ కనీస పోటీ అయినా ఇస్తుందో లేదో చూడాలి. 

 

14:53 - December 8, 2016

ముంబై: అరే ఏంటీ అంపైర్ రిటైర్డ్ హర్ట్ కావడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా ? కానీ ఇది నిజం. క్రికెట్ ఏదైనా జరగవచ్చు. ఓటమి చెందుతుందన్న జట్టు..విజయం సాధించవచ్చు..విజయం సాధిస్తుందని అనుకున్న జట్టు..ఓడిపోవచ్చు..కానీ భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య ఓ ఘటన చోటు చేసుకుంది. అంపైర్ట్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. ముంబైలో భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలి రోజు ఆటలో భాగంగా రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ వేస్తున్నాడు. అవతల వైపు ఇంగ్లండ్ ఆటగాడు జెన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను విసిరిన రెండో బంతిని జెన్నింగ్స్ లెగ్ స్టంప్ మీదుగా బాది సింగిల్ తీశాడు. వెంటనే అక్కడున్న ఫీల్డర్ గా ఉన్న భువనేశ్వర్ కుమార్ బంతిని పట్టుకుని వికెట్ల వైపుకు విసిరాడు. కానీ బంతి అంపైర్ గా ఉన్న రైఫెల్ ఫీల్డ్ తలకు గట్టిగా తాకింది. దీనితో ఫీల్డ్ మైదానంలోనే పడిపోయాడు. వెంటనే అతడికి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మైదానాన్ని వీడాడు. అతని స్థానంలో టీవీ అంపైర్ ఎరస్ మస్ ఫీల్డ్ అంపైర్ గా వచ్చాడు.

16:58 - September 21, 2016

టెస్ట్ క్రికెట్ చరిత్రలో ..టీమిండియా 500వ మ్యాచ్ ను అట్టహాసంగా నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 22 నుంచి 26 వరకూ జరిగే ఈ మ్యాచ్ కు...టీమిండియా మాజీ కెప్టెన్లందరినీ ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించాలని బీసీసీఐ నిర్ణయించింది. 
1932 లో ప్రపంచ క్రికెట్ మక్కా లండన్ లార్డ్స్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో భారత్ తొలిటెస్ట్ మ్యాచ్ ఆడటం ద్వారా టెస్ట్ అరంగేట్రం చేసింది. నాటినుంచి నేటివరకూ..భారత్ 499 మ్యాచ్ లు ఆడి..అత్యధిక టెస్ట్ మ్యాచ్ లు ఆడిన అతికొద్ది దేశాలలో ఒకటిగా రికార్డుల్లో చేరింది. తెలుగుతేజం కర్నల్ కఠారి కనకయ్య నాయుడు కెప్టెన్ గా మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ఆడిన భారత జట్టుకు 158 పరుగుల పరాజయం తప్పలేదు.
ఆ తర్వాత 24 సంవత్సరాలకు...చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా జరిగిన 50వ టెస్ట్ మ్యాచ్ లో పాలీ ఉమ్రిగర్ నాయకత్వంలో పోటీకి దిగిన భారత్ ఇన్నింగ్స్ 5 పరుగుల ఓటమి చవిచూసింది. భారత జట్టు ఆడిన 100వ టెస్ట్ మ్యాచ్ లో మన్సూర్ అలీఖాన్ పటౌడీ కెప్టెన్ గా వ్యవహరించారు. బర్మింగ్ హామ్ వేదికగా 1967లో జరిగిన ఈమ్యాచ్ లో ఇంగ్లండ్ 132 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది.
1977లో చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా...ఇంగ్లండ్ తో 150వ టెస్ట్ఆడిన భారత జట్టుకు...లెఫ్టామ్ స్పిన్ ఆల్ రౌండర్ బిషిన్ సింగ్ బేడీ నాయకత్వం వహించారు. ఈ మ్యాచ్ లో సైతం భారత్ కు 200 పరుగుల భారీ ఓటమి తప్పలేదు.
లాహోర్ గడ్డాఫీ స్టేడియం వేదికగా 1982లో 200వ టెస్ట్ మ్యాచ్ ఆడిన భారత్ కు..ఓపెనర్ సునీల్ గవాస్కర్ నాయకత్వం వహించారు. ఈ మ్యాచ్ హోరాహోరీ డ్రాగా ముగియడం విశేషం. 1988 సీజన్లో ..చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ..ఆల్ రౌండర్ రవిశాస్త్రి సారథ్యంలో భారత్ 250వ టెస్ట్ మ్యాచ్ లో పాల్గొంది. వెస్టిండీస్ ప్రత్యర్థిగా భారత్  ఈ మ్యాచ్ లో 255 పరుగుల భారీవిజయం నమోదు చేసింది.
1996 సీజన్లో అహ్మదాబాద్ సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో ముగిసిన భారత 300వ టెస్టు లో మాస్టర్ సచిన్ టెండుల్కర్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్ లో భారత్ 64 పరుగులతో విజేతగా నిలిచింది. భారత జట్టు 2002 సీజన్లో ఆడిన 350వ టెస్ట్ మ్యాచ్ లో సౌరవ్ గంగూలీ నాయకత్వం వహించాడు. నాగపూర్ విదర్భ స్టేడియం వేదికగా ముగిసిన ఈ మ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్ 101 పరుగుల భారీవిజయం నమోదు చేసింది.
2006 సీజన్లో ...కింగ్ స్టన్ సబైనా పార్క్ వేదికగా..వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ భారత్ కు 400వ టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. రాహుల్ ద్రావిడ్ నాయకత్వంలో భారత్ 49 పరుగుల సంచలన విజయం సాధించి చరిత్ర సృష్టించింది.
భారత జట్టు 450వ టెస్ట్ మ్యాచ్ ను సైతం విదేశీ గడ్డపైనే ఆడింది. 2011 సిరీస్ లో భాగంగా బ్రిడ్జిటౌన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం వహించాడు. ఈ మ్యాచ్ సైతం డ్రాగానే ముగిసింది.
నవతరం కెప్టెన్ విరాట్ కొహ్లీ నాయకత్వంలో టీమిండియా...ఇప్పుడు 500వ టెస్ట్ మ్యాచ్ కు సిద్ధమయ్యింది. ఏడేళ్ల విరామం తర్వాత గ్రీన్ పార్క్ వేదికగా జరుగనున్న ఈ చిరస్మరణీయ మ్యాచ్ లో 7వ ర్యాంకర్ న్యూజిలాండ్ పై విరాట్ ఆర్మీ విజేతగా నిలవాలని కోరుకొందాం.

18:50 - November 26, 2015

టెస్ట్ క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి...ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఓవల్ స్టేడియంలో రేపు తెరలేవనుంది. 138 సంవత్సరాల సాంప్రదాయ టెస్ట్ మ్యాచ్ చరిత్రలో తొలి డే-నైట్ క్రికెట్ సమరం కోసం.. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది ఎదురుచూస్తున్నారు. ఈమ్యాచ్ శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. పెద్దమనుషుల క్రీడ క్రికెట్లో..సరికొత్త చరిత్ర సృష్టించడానికి ట్రాన్స్- టాస్మన్ ప్రత్యర్థులు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు చేయి చేయి కలిపాయి. మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా...అడిలైడ్ ఓవల్ లో శుక్రవారం నుంచి ఐదురోజులపాటు జరిగే ఆఖరి టెస్ట్ ను...డే-నైట్ గా ఆడాలని నిర్ణయించాయి. సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ అనగానే... పట్టపగలు.. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ...ఎరుపు రంగు క్రికెట్ బాల్ తో ...రోజుకు 90 ఓవర్ల చొప్పున మ్యాచ్ ఆడటం అని మాత్రమే మనకు తెలుసు.

138 సంవత్సరాలుగా..
గత 138 సంవత్సరాలుగా నాగపూర్ విదర్భ స్టేడియంలో టీమిండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న 2 వేల 187వ మ్యాచ్ వరకూ..టెస్ట్ క్రికెట్ ను డేమ్యాచ్ గానే నిర్వహిస్తూ వచ్చారు. అయితే...రొటీన్ కు భిన్నంగా...ఓ టెస్ట్ మ్యాచ్ ను డే-నైట్ గా నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు వాస్తవరూపమే 2015 అడిలైడ్ ఓవల్ టెస్ట్. నవంబర్ 27 నుంచి ఐదురోజులపాటు...ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ..డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ను నిర్వహించబోతున్నారు. సాధారణ టెస్ట్ మ్యాచ్ లు ..డ్రింక్స్ బ్రేక్ తో మొదలై..లంచ్ బ్రేక్, టీ బ్రేక్ , డ్రింక్ బ్రేక్ లతో ముగిస్తే....డే -నైట్ టెస్ట్ మ్యాచ్ మాత్రం...టీ బ్రేక్ తో ప్రారంభమై..ఆ తర్వాత లంచ్ బ్రేక్ తో ఆటను కొనసాగించడం విశేషం.

గులాబీ రంగు బాల్...
మొత్తం 90 ఓవర్ల ఆటలో..సగభాగం సన్ లైట్ లోనూ, మిగిలిన సగభాగం ఫ్లడ్ లైట్ల వెలుగులోనూ జరుగుతుంది. అంతేకాదు..సాంప్రదాయం ప్రకారం ఇప్పటి వరకూ ఎరుపు రంగు బంతిని మాత్రమే ఉపయోగిస్తున్నారు. అయితే ఫ్లడ్ లైట్ల వెలుగులో బంతి స్పష్టంగా కనిపించడానికి వీలుగా తొలి సారిగా గులాబీ రంగు బాల్ ను ఉపయోగిస్తున్నారు. స్వింగ్ అండ్ సీమ్ బౌలర్లకు అనువుగాఉండే పింక్ క్రికెట్ బాల్ ను ఆస్ట్రేలియాకు చెందిన కూకాబురా కంపెనీ తయారు చేసింది.
ఇక..రెండుజట్ల బలాబలాల విషయానికి వస్తే...మూడుమ్యాచ్ ల ఈ సిరీస్ లోని మొదటి రెండు టెస్టులు ముగిసే సమయానికి ఆతిథ్య ఆస్ట్రేలియా ఇప్పటికే 1-0 ఆధిక్యం తో పైచేయి సాధించింది. సిరీస్ ను సమం చేయాలంటే ఈమ్యాచ్ లో న్యూజిలాండ్ నెగ్గి తీరాల్సి ఉంది. ఈమ్యాచ్ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు కంగారూ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెబుతున్నాడు. న్యూజిలాండ్ శిక్షకుడు బ్రయన్ మెక్మిలన్ సైతం..డే- నైట్ టెస్ట్ కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.

ఆత్మవిశ్వాసంతో కివీస్...
కంగారూ టాపార్డర్ ఆటగాడు క్వాజా గాయంతోనూ, ఫాస్ట్ బౌలర్ మిషెల్ జాన్సన్ రిటైర్మెంట్ తోనూ ఏర్పడిన ఖాళీలను...షాన్ మార్ష్, పీటర్ సిడిల్ లతో భర్తీ చేయాలని ఆసీస్ టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది. మరోవైపు..రెండోటెస్ట్ లో టాపార్డర్ ఆటగాళ్ళు కేన్ విలియమ్స్ సన్ సెంచరీ, రోస్ టేలర్ సూపర్ డబుల్ సెంచరీలతో కళ్ళు చెదిరే ఫామ్ లో ఉండడంతో న్యూజిలాండ్ ఎనలేని ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఐదురోజులపాటు జరిగే ఈ చారిత్రక డే-నైట్ టెస్ట్ లో...ఆస్ట్రేలియా విన్నర్ గా నిలుస్తుందా? లేక న్యూజిలాండ్ విజేతగా నిలిచి..సిరీస్ ను 1-1తో సమం చేయడం ద్వారా చరిత్ర సృష్టిస్తుందా?..తెలుసుకోవాలంటే...వచ్చే ఐదు రోజుల పాటు సస్పెన్స్ భరించక తప్పదు.

16:18 - November 26, 2015

నాగ్ పూర్ : భారత్ - సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ రసపట్టుగా మారింది. దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే 310 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన భారత్ 173 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తాహీర్ విజృంభించడంతో భారత్ బ్యాట్ మెన్స్ వరుసగా క్యూ కట్టారు. గురువారం సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ఆటను ఆరంభించింది. కానీ 79 పరుగలకే ఆలౌట్ అయ్యింది. అశ్విన్ స్పిన్ మాయాజాలం..జడేజాలు రాణించడంతో సఫారీ బ్యాట్ మెన్స్ పరుగులు రాబట్టలేకపోయారు. డుమిని (35) ఒక్కటే అత్యధిక స్కోరర్ గా మిగిలాడు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ కు ఆదిలోనే దెబ్బ తగిలింది. ఓపెనర్ విజయ్ (5) వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన పుజారా..ఓపెనర్ ధావన్ లు వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడడం మొదలు పెట్టారు. సింగిల్స్...అదుపు తప్పిన బాల్స్ ను బౌండరీలకు తరలించారు. జట్టు స్కోరు 52 పరుగుల వద్ద పుజారా (31) పెవిలియన్ చేరాడు. అనంతరం ధావన్ కు కోహ్లీ జత కలిశాడు. ధావన్ స్కోరు బోర్డును పరుగెత్తించాలని ప్రయత్నించాడు. కానీ తాహీర్ బౌలింగ్ లో షాట్ కు ప్రయత్నించిన ధావన్ (39) విలాస్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ విజృంభిస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. కేవలం 16 పరుగులు చేసిన కోహ్లీ తాహీర్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. అనంతరం ఇతర బ్యాట్ మెన్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. చివరకు 173 పరుగుల వద్ద భారత్ ఆలౌట్ అయ్యింది.

భారత్ తొలి ఇన్నింగ్స్ : 215 ఆలౌట్..
సౌతాఫ్రికా బౌలింగ్ : హర్మర్ 4 వికెట్లు, మోర్కెల్ 3 వికెట్లు, రబడా ఒక వికెట్, ఎల్గర్ ఒక వికెట్, తాహిర్ ఒక వికెట్ తీశారు.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : 79 ఆలౌట్..
భారత్ బౌలింగ్ : అశ్విన్ ఐదు వికెట్లు, జడేజా నాలుగు, మిశ్రా ఒక వికెట్ తీశారు.
భారత్ రెండో ఇన్నింగ్స్ : 173 ఆలౌట్
సౌతాఫ్రికా బౌలింగ్ : తాహిర్ ఐదు వికెట్లు, మోర్కెల్ మూడు వికెట్లు, హర్మర్ ఒక వికెట్, డుమిని ఒక వికెట్ తీశారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - టెస్టు మ్యాచ్