టీఆర్ఎస్

17:10 - September 12, 2018

హైదరాబాద్: ఎంపీలు కేశవరావు, కవిత, మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు చేరిన ముఖ్యనేతలకు గులాబీ కండువా కప్పి టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు పార్టీలోకి ఆహ్వానించారు.

కరీంనగర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆకారపు భాస్కర్‌రెడ్డి, ఉప్పల్ కాంగ్రెస్ ఇంఛార్జ్ బండారి లక్ష్మారెడ్డి, నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులు తెరాసాలో చేరారు. పలువును నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

10:19 - September 11, 2018

హైదరాబాద్: ఓపిగ్గా ఎదురు చూసినందుకు దానం నాగేందర్ ను టీఆర్ఎస్ అధిష్ఠానం కరుణించింది. పార్టీ ప్రకటించిన 105 అభ్యర్థుల్లో తన పేరు లేకపోవడంతో ఖంగారు పడ్డ దానం ఇప్పుడు తేరుకున్నారు.

ఒక స్థాయిలో టిక్కెట్ రాకపోవడంతో మళ్లీ కాంగ్రెస్ నేతలను సంప్రదిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమనడంతో దానం నాగేందర్  కొంత కంగారు పడ్డారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ తన నిజాయితీని నిరూపించుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కొట్టిపారేశారు.

అయితే.. గోషామహల్ నియోజకవర్గానికి టీఆర్ఎస్ అధిష్టానం  దానం పేరు ఖరారు చేసినట్టు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో ఆయన పేరు ప్రకటించే చేసే అవకాశం ఉంది.

15:33 - September 10, 2018

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాబోయే రోజుల్లో జోరుగా వలసలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్ నుండి అసమ్మతి నేతలు జంప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టికెట్ వస్తుందని ఆశించి భంగపడిన పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు మార్గాలు వెతుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఒక ఎమ్మెల్యే చేరికకు ముహూర్తం ఖరారైంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆజాద్, ఉత్తమ్ సమక్షంలో డీఎస్, కొండా సురేఖ, కొండా మురళీ, భూపతి రెడ్డిలు కాంగ్రెస్ కండువాలు కప్పుకోనున్నారు. కాంగ్రెస్ లోకి మాజీ గులాబీ ప్రతినిధులు కూడా చేరాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నందీశ్వర్, కేఎస్ రత్నం చేరికలపై దామోదర, సబితా ఇంద్రారెడ్డిలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి నేతల చేరికతో కాంగ్రెస్ లో ఉన్న నేతలు ఎలా స్పందిస్తారు ? వారు కూడా ఇతర పార్టీల్లోకి జంప్ అవుతారా ? అనేది చూడాలి. 

16:21 - September 7, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు వేడి రాజుకున్న నేపథ్యంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత గీతారెడ్డి టీర్ఎస్ పై విమర్శలు సంధించారు. అసెంబ్లీ రద్దు అనంతరం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల అభ్యర్థులను ప్రటించారు. ఈ ప్రకటనలో కొన్ని నియోజకవర్గాలకు నేతలను ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టారు. వీటిలో జహీరాబాద్ నియోజకవర్గం కూడా ఒకటి.ఈ ఈ విషయంపై గీతారెడ్డి మాట్లాడుతు..జహీరాబాద్ నియోజకవర్గంలో తన విజయాన్ని అడ్డుకోవటం టీఆర్ఎస్ తరం కాదని..తనపై పోటీ చేసేంత దమ్ము వున్న నేతలు టీఆర్ఎస్ లో లేరనీ..అందుకే కేసీఆర్ జహీరాబాద్ నియోజకవర్గం అభ్యర్థిని ప్రకటించలేదని ఎద్దేవా చేశారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశారని ఈ ఎన్నికలతో కేసీఆర్ పతనం ప్రారంభమైందని గీతారెడ్డి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శనలు సంధించారు. 

20:19 - September 6, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. కమిటీ ఛైర్మన్ గా కె.కేశవరావు, కమిటీ సభ్యులుగా జితేందర్ రెడ్డి, జి.నగేష్, తుమ్మల నాగేశ్వరరావు, ఈటెల రాజేందర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, అజ్మీర చందూలాల్, పద్మారావు, కొప్పుల ఈశ్వర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఫరీదుద్దీన్, పి.రాములు, గుండు సుధారాణి లున్నారు. 

18:23 - September 6, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రకటించిన 105 మంది అభ్యర్థులతో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ భేటీ అయ్యారు. టీఆర్ఎస్ భవన్ లో జరుగుతున్న ఈ భేటీలో అభ్యర్థులకు దిశ..దశ నిర్దేశం చేస్తున్నారు. శుక్రవారం నుండి ఏకంగా సీఎం కదనరంగంలోకి దూకుతున్నారు. హుస్నాబాద్ నుండి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అంతేగాకుండా 50 నియోజవకవర్గాల్లో పర్యటిస్తానని, వంద సభలో పాల్గొంటానని వెల్లడించారు. ప్రకటించిన అభ్యర్థులు కూడా ప్రచారంలోకి వెళ్లాలని..టీఆర్ఎస్ 100 సీట్ల కంటే ఎక్కువ గెలుస్తుందని కేసీఆర్ జోస్యం చెప్పారు. ఇంకా కొన్ని సీట్లలో అభ్యర్థులను ప్రకటించలేదు.

 

15:17 - September 6, 2018

హైదరాబాద్ : ఎన్నికల సమయంలో తాము మేనిఫెస్టోలో చెప్పని అంశాలు ఎన్నో అమలు చేశామని తెలంగాణ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. గురువారం ఆయన ప్రెస్ మీట్ తో మాట్లాడారు. రైతు బందు, రైతు బీమా, భూ రికార్డుల ప్రక్షాళన, బీసీ కులాలకు సంబంధించినవి..ఇలాంటివి 76 అంశాలను తాము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదని తెలిపారు.

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. గురువారం వాటికన్నింటికీ తెరపడింది. కేబినెట్ రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ ఏక వ్యాఖ్య తీర్మానం చేశారు. దీనిని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉభయ రాష్ట్రాల గవర్నర్ తో భేటీ అయిన కేసీఆర్, మంత్రివర్గం సభ రద్దుకు సంబంధించిన లేఖను అందచేశారు. కొద్దిసేపట్లోనే గవర్నర్ ఆమోద ముద్ర వేశారని కార్యదర్శి ప్రకటన చేశారు.

అందులో భాగంగా ఎన్నికల అభ్యర్థులను కూడా కేసీఆర్ ప్రకటించారు. అనేక సర్వేలు చేసిన అనంతరం 105 అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు, ఇద్దరు ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వలేదన్నారు. మంచిర్యాల, సంగారెడ్డి అందోల్ నియోజకవర్గం ఎమ్మెల్యేలకు మాత్రం టికెట్ ఇవ్వలేదన్నారు. మేడ్చల్, మల్కాజ్ గిరి, చొప్పదండి, వికారాబాద్., వరంగల్ ఈస్ట్ జిల్లాల పెండింగ్ లో పెట్టినట్లు తెలిపారు. 

19:28 - September 4, 2018

హైదరాబాద్ : గత కొంతకాలంగా డీఎస్ పై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహంతో వున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన డీఎస్ కొంతకాలంగా బాగానే వున్నా..ఇటీవల కాలంలో నిజామాబాద్ నేతలు సీఎం కేసీఆర్ కు డీఎస్ పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో వున్న పార్టీలో వుండి పరిస్థితులను చక్కబెట్టుకునే ఆలోచనలో వున్న డీఎస్ ఆలోచనలు ఏమీ జరిగేటట్టు లేవు. ఈ నేపథ్యంలో తనంతట తానుగా టీఆర్ఎస్ కి రాజీనామా చేసి వెళ్లే ప్రసక్తే లేదని, కావాలంటే తనను సస్పెండ్ చేసుకోవచ్చని పార్టీ అధిష్ఠానికి ఎంపీ డీఎస్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి విరుచుకుపడ్డారు.

డీఎస్ కు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, తాను చెబితే చాలని అన్నారు. ఎందుకంటే, గతంలో డీఎస్ ను చిత్తుచిత్తుగా ఓడించానని, ఈ వ్యక్తి వల్ల నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పరంగా ఇరవై ఏళ్లు వెనకబడిందని విమర్శించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా మొత్తం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. తన పైరవీలు ఇక్కడ నడవట్లేదని, తన మాట ఎవరూ వినడం లేదని భావిస్తున్న డీఎస్ లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉన్నపళంగా, పార్టీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆయన ఇష్టమొచ్చిన పార్టీలో చేరాలని, తమకు ఎటువంటి అభ్యంతరం లేదని బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి పేర్కొన్నారు.

06:54 - September 3, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన సభపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. సభ అట్టర్‌ ప్లాప్‌ అయ్యిందని విమర్శించింది. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేసీఆర్‌ విఫలమయ్యారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ విమర్శించారు. కేసీఆర్‌ హఠావో.. తెలంగాణ బచావో నినాదంతో ప్రజల్లోకి వెళ్లనున్నట్టు తెలిపారు. ప్రగతి నివేదన సభ ప్రజల ఆవేదన సభగా మారిందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క ధ్వజమెత్తారు..

గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీల అమలులో కేసీఆర్ విఫలమయ్యారని ఉత్తమ్‌ విమర్శించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, ముస్లింలు, గిరిజన రిజర్వేషన్ల పెంపు, దళితులు, గిరిజనులకు మూడెకరాల భూమి పంపిణీలాంటి విషయాలను కేసీఆర్‌ ప్రస్తావించకపోవడాన్ని ఉత్తమ్‌ తప్పు పట్టారు.

ప్రగతి నివేదన సభ కాస్తా ప్రజల ఆవేదన సభగా మారిందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్‌ నాలుగేళ్ల పాలనలో చేసిన అప్పులు, సాధించిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. ఉద్యోగ నియామకాలను సభలో ప్రస్తావించకపోవడంపై ఆయన మండిపడ్డారు.

టీఆర్‌ఎస్‌ నిర్వహించినది ప్రగతి నివేదన సభకాదని... అది ప్రగతి నిరోధక సభ అంటూ మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. ఉద్యమ సమయంలో వసూళ్లకు అలవాటుపడిన టీఆర్‌ఎస్‌ నాయకులు.. నేడు సభ పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్కహామీని నెరవేర్చకుండా.. మాటలగారడి చేస్తున్నారని తెలిపారు. మొత్తానికి ప్రగతి నివేదన సభపై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. ఆ సభతో తమ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని వ్యాఖ్యానిస్తున్నారు.

06:47 - September 3, 2018

హైదరాబాద్ : ప్రజల సంక్షేమానికి మరెన్నో సంక్షేమ పథకాలు చేపడతామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. నాలుగున్నరేళ్ల పాలనలో 469 సంక్షేమ పథకాలు చేపట్టామని.... 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనని హామీలను కూడా నెరవేర్చామన్నారు. మరోసారి ప్రజలు దీవిస్తే బంగారు రాష్ట్రాన్ని తెలంగాణ చేస్తామన్నారు గులాబీ దళపతి. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు 2000 సంవత్సరంలోనే బీజం పడిందన్నారు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. తెలంగాణ వస్తే ఏం చేయాలనే ఆలోచనలు జయశంకర్‌ సార్‌తో కలిసి 2006-07లోనే చేశామన్నారు. అప్పటి ఆలోచనల ఫలితమే నేటి సంక్షేమ పథకాలన్నారు. ఆర్థిక ప్రగతిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు సీఎం.

14 ఏళ్ల కఠోర శ్రమ అనంతరం తెలంగాణ సాధించుకున్నామన్నారు సీఎం. వేరే వారితో కలిసే వెళ్తే కష్టపడి సాధించుకున్న తెలంగాణకు న్యాయం జరగదనే అభిప్రాయంతో 2014 ఎన్నికలకు ఒంటరిగా వెళ్లామన్నారు. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారమవుతుందని ఎంతోమంది శాపనార్దాలు పెట్టారు. కానీ.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే విద్యుత్‌ కష్టాలు తొలిగించామన్నారు. దేశంలో రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు కేసీఆర్‌.

కాంగ్రెస్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు సీఎం. అందుకే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేతివృత్తుల వారికి ఎన్నో పథకాలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో అందరికీ కేజీ నుండి పీజీ విద్య అందిస్తామన్నారు కేసీఆర్‌. ఎన్నో ఏళ్లుగా అన్యాయానికి గురైన గిరిజనుల గురించి ఆలోచించి.. గిరిజన తండాలను పంచాయతీలు మార్చామన్నారు కేసీఆర్‌. తెలంగాణకు శాశ్వత ఆదాయం వచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు కేసీఆర్‌. త్వరలోనే కోటి ఎకరాలను ఆకుపచ్చగా మార్చి చూపిస్తామన్నారు సీఎం. .

ఇప్పటికే 22 వేల గ్రామాలకు నీళ్లు అందించామని.. మరో ఆరేడు రోజుల్లో మరో 1300 గ్రామాలకు నీళ్లు అందిస్తామన్నారు కేసీఆర్‌. రైతులకు గురించి ఆలోచించి రుణమాపీ చేశామని.. రైతుబంధు పథకం ప్రవేశపెట్టామన్నారు. నవంబర్‌లో రెండో విడత రైతుబంధు చెక్కులు అందజేస్తామన్నారు ఇసుకపై కాంగ్రెస్‌ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ఇసుకపై ఆదాయం 10 కోట్ల రూపాయలు వస్తే.. నాలుగున్నరేళ్ల పాలనలో... 1980 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. మళ్లీ టీఆర్‌ఎస్‌కు అధికారం ఇస్తే... రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామన్నారు స్పష్టం చేశారు కేసీఆర్‌. ప్రజల దీవెనలతో మళ్లీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు గులాబీ దళపతి.

కొంగరకలాన్‌లో జరిగిన ప్రగతి నివేదన సభకు జనం భారీగా తరలిరావడంతో సీఎం కేసీఆర్‌ ఉప్పొంగి పోయారు. సభ ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో హెలిక్యాప్టర్‌లోంచి ప్రజలకు అభివాదం చెప్పారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - టీఆర్ఎస్