జగిత్యాల

08:47 - November 9, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో అత్యంత గౌరవమైన వ్యక్తుల్లో జీవన్ రెడ్డి ఒకరు. ఆయన వస్త్రధారణ రైతన్నను గుర్తుచేస్తాయి. ఆయన  మాట్లాడే తీరు గౌరవభావాన్ని కలిగిస్తాయి. సౌమ్యంగా మాట్లాడినా ముఖ్యమైన పాయింట్స్ మాట్లాడటంలో ఆయన దిట్టగా పేరు. అటువంటి జీవన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నేతలపై ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంలోని వ్యక్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతు..అసలు అబద్ధాలు అనేవి కల్వకుంట్ల డీఎన్ఏలోనే ఉన్నాయని ఆయన విమర్శించారు. కేసీఆర్ కంటే సీఎం పదవికి కడియం ఉత్తమమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రజాకూటమితోనే బంగారు తెలంగాణ సాధ్యమని జీవన్ రెడ్డి  స్పష్టం చేశారు. గొప్పతనమన్నారు. టీఆర్ఎస్ లో కేవలం కేసీఆర్, కేటీఆర్ మాత్రమే సీఎం అవుతారనీ.. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారంతా సీఎం పదవికి అర్హులేనని..జీవన్ రెడ్డి పోటీలో ఉంటే కేసీఆర్, కవితకు భయమెందుకు వేస్తుందని ప్రశ్నించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతామని ధీమా వ్యక్తం చేశారు. 
 

 

11:13 - October 26, 2018

కరీంనగర్ : కొండగట్టు బస్సు ప్రమాద బాధితులకు అందించే పరిహారంపై ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం ప్రక‌టించిన పరిహారం అందించేందుకు ఇన్నాళ్లు కోడ్ అడ్డువ‌చ్చింది. మాన‌వ‌త్వం కోణంలో ప‌రిగ‌ణించిన సీఈసీ ఎట్టకేలకు పరిహారం అందించేందుకు అనుమ‌తినిచ్చింది. ఆర్టీసి చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదంగా నిలిచిన జగిత్యాల జిల్లా కొండగట్టు సంఘటన జరిగి 45  రోజులు దాటింది. అయితే ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు గానీ.. క్షతగాత్రులకు గానీ ఇంత వరకు పరిహారం అందించలేదు ప్రభుత్వం. మృతులకు 5 లక్షలు, క్షతగాత్రులకు రెండున్నర లక్షలు ప్రభుత్వం తరుపున సాయం అందిస్తామని సంఘటన స్ధలాలనికి వెళ్ళిన మంత్రులు, అధికారులు ప్రకటించారు. కానీ ఇంత వరకు ఒక్కరికి కూడా పైసా రాలేకపోవడంతో ఇది రాజకీయ విమర్శలకు దారి తీసింది.
ఇదిలా ఉంటే కొండగట్టు ప్రమాదం సెప్టెంబర్ 11న జరిగింది. అప్పటికి తెలంగాణలో ప్రభుత్వం రద్దై ఐదు రోజులు అయ్యింది. అంటే సెప్టెంబర్ 6న కేసిఆర్ అసెంబ్లీ రద్దు చేసి అపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అంటే అప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో  నష్ట పరిహారం చెల్లింపుపై అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. అయితే తెలంగాణ ప‌ర్యట‌న‌లో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘంతో రాష్ట్ర అధికారులు చర్చించి ఎట్టకేలకు పరిహారం చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నారు. 

11:42 - October 20, 2018
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ కరెన్సీ నోట్ల కలకలం చెలరేగింది. కరెన్సీ నోట్లు కట్టలుకట్టలుగా బయటపడుతున్నాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు చేస్తున్న తనిఖీల్లో కోట్లాది రూపాయల హవాలా నగదు పట్టుబడుతోంది. భారీగా హవాలా నగదు పట్టుబడటం సంచలనంగా మారింది. ఈ వ్యవహారం కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. ఓటర్లను కొనుగోలు చేసేందుకు ఏపీ నుంచి హవాలా డబ్బు తీసుకొచ్చారని, దీని వెనుక టీడీపీ నాయకుల హస్తం ఉందని నమస్తే తెలంగాణలో కథనాలు వచ్చాయి. 
 
హైదరాబాద్ నుంచి జగిత్యాలకు కారులో డబ్బు తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కాగా, ఆ కారు టీడీపీ నేతది కావడంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ కార్యదర్శి వల్లభనేని అనిల్‌కుమార్ కారులో తరలిస్తున్న రూ.59 లక్షల నగదు పట్టుబడటం సంచలనం రేపుతున్నది. అనిల్‌కుమార్ డ్రైవర్ మహేష్.. ఏజెంట్లకు అప్పగించేందుకు ఆ డబ్బుని తీసుకెళ్తున్నట్టు పోలీసులు గుర్తించారు. నమస్తే తెలంగాణ కథనాల ప్రకారం ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణకు అనిల్‌కుమార్ అత్యంత సన్నిహితుడిగా చెబుతున్నారు. తెలంగాణలో పంచేందుకు ఏపీ నుంచి ఆ డబ్బు తీసుకొచ్చారని ఆరోపణలు చేస్తున్నారు. సొమ్మును క్షేత్రస్థాయిలోని నాయకులకు హవాలా మార్గంలో పంపి.. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఉద్దేశించారని చెబుతున్నారు.
Chandrababuకోఠీలోని పూజ ఫ్యాషన్స్‌లో హవాలా కార్యకలాపాలు జరుగుతున్నట్టు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చెబుతున్నారు. హవాలా దందాలో డబ్బు మార్పిడి చేసుకుంటుండగా సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడిచేసి, ఐదుగురిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరిలో వల్లభనేని అనిల్‌కుమార్ డ్రైవర్ పుప్పల్ల మహేశ్, పూజ ఫ్యాషన్ షోరూం నిర్వాహకులు గమాన్‌సింగ్ రాజ్‌పురోహిత్, నేపాల్ సింగ్ అలియాస్ మైపాల్ (తండ్రీకొడుకులు), విజయవాడకు చెందిన దమాలూరి శ్రీనివాసరావు, బౌండరీస్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సిరిసిల్ల అవినాశ్ ఉన్నారు. వీరి నుంచి రూ.59లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
 
అనిల్‌కుమార్ తన వెర్నా కారు (ఏపీ 09సీఎఫ్ 1144)లో రూ.59 లక్షలుపెట్టి డ్రైవర్‌కు అప్పగించాడని, ఈ డబ్బును అనిల్‌కుమార్ స్నేహితుడైన వర్మ ఆదేశాలతో కోఠీలోని పూజ ఫ్యాషన్స్‌లో ఇచ్చేందుకు శ్రీనివాస్ అనే వ్యక్తితో కలిసి డ్రైవర్ మహేశ్ పూజ స్టోర్స్‌కు వెళ్లాడని పోలీసులు తెలిపారు. పూజ ఫ్యాషన్స్ నిర్వాహకులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 0.6% నుంచి 08% కమిషన్‌తో హవాలా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. నగదుతోపాటు డబ్బు తరలింపునకు వాడిన కారును స్వాధీనం చేసుకున్నామని, పట్టుబడిన ఐదుగురిని ఆదాయపన్ను శాఖకు అప్పగిస్తున్నామని డీసీపీ వివరించారు. 
Ramana
 
కాగా, ఈ డబ్బు ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు హవాలా మార్గంలో తరలిస్తున్నట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయని డీసీపీ చెప్పారు. అనిల్‌కుమార్ స్నేహితుడు వర్మ ద్వారా డబ్బుని జగిత్యాల జిల్లాకు తరలించేందుకు సన్నాహాలు చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ డబ్బు ఎవరిది? అనిల్‌కుమార్‌కు ఆ డబ్బుతో సంబంధం ఉందా? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అనే వివరాలు కనుగొనే పనిలో పోలీసులు ఉన్నారు. అనిల్‌కుమార్ డ్రైవర్‌ను విచారిస్తే హవాలాకు సంబంధించిన మరింత సమాచారం వచ్చే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. మొత్తంగా డబ్బు తరలింపునకు టీడీపీ నేత వల్లభనేని అనిల్‌కుమార్ కారు వినియోగించడం అనేక అనుమానాలకు దారితీసింది.
21:42 - October 16, 2018

జగిత్యాల: ప్రేమ జగడాలు విషాదానికి దారితీస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు... ప్రాణాలు హరిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు యువకులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన మరువకముందే మరో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో ఇద్దరు డిగ్రీ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి హత్యకు దారితీసింది.
 పుస్తకాలు పట్టాల్సిన చేతులు కత్తులు పడుతున్నాయి. చదువుకోవాల్సినవారు ప్రేమ వ్యవహారాల్లో తలదూర్చి చిక్కుల్లో పడుతున్నారు. ఆవేశకావేశాలకు లోనై ప్రాణాలు తీసుకుంటున్నారు. జగిత్యాల జిల్లాలో పక్షం రోజుల వ్యవధిలో ముగ్గురి యువకుల ప్రాణాలు ప్రేమ వ్యవహారాలకు బలికావడం తీవ్ర కలకలం రేపింది.

జగిత్యాల జిల్లా తాటిపల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సాధినేని నవీన్, శ్రవణ్ అనే యువకులు మద్యం సేవించారు. తర్వాత మాటమాట పెరగడంతో ఇరువురు కత్తులతో పరస్పరం దాడికి దిగారు. ఘటనలో నవీన్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత శ్రవణ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.ఘటనాస్థలిని డీఎస్పీ వెంకటరమణ పరిశీలించారు.  కాగా నవీన్‌ను చంపడానికి ఉపయోగించిన కత్తిని శ్రవణ్‌ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడని తేలింది. గతంలో రెండుసార్లు శ్రవణ్, నవీన్ మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో శ్రవణ్ ఆన్‌లైన్‌లో కత్తిని బుక్‌చేసి తెప్పించుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

 

17:26 - October 16, 2018

మంచిర్యాల : తొలివిడతగా గులాబీ బాస్ కేసీఆర్ 105 మంది  అభ్యర్థులను ప్రకటించేసారు. కానీ ఇప్పటివరకూ మహాకూటమి గానీ..బీజేపీ గానీ ఇప్పటివరకూ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. కాని ఇప్పటివరకూ ప్రకటించిన మంచిర్యాల జిల్లా అభ్యర్థులపై కేసీఆర్ కన్నేసారు. ఆయా నియోజకవర్గాల్లో నియమించిన ప్రత్యేక వేగుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. అంతేకాదు అభ్యర్థులకు ఉన్నట్టుండి ఫోన్‌ చేసి, ‘ఎక్కడ ఉన్నావ్‌.. ప్రచారం ఎలా సాగుతోంది? ఎక్కడెక్కడ ప్రచారం పూర్తయింది? సహకరిస్తున్నవారెందరు? ప్రచారానికి సహకరించినవారెవరు? వంటి పూర్తి వివరాలు కేసీఆర్ సేకరిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల సమాచారం. అభ్యర్థులు ప్రచారంలో వుండగానే కేసీఆర్‌ ఫోన్‌చేసి..ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే అభ్యర్థులకు చెమటలు పడుతున్నట్లు సదరు అభ్యర్థుల అనుచరులు పేర్కొంటున్నారు.
 ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జిలుగా కొనసాగుతున్న నేతలపై కూడా కేసీఆర్‌ నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. వారికి కూడా ఫోన్‌ చేసి ప్రతీ అంశంపై పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. నియోజకవర్గాలలో అసమ్మతి నేతలు, అసంతృప్తివాదుల తీరుపైనా వాకబు చేస్తున్నట్లు సమాచారం. వారు ప్రచారంలో పా ల్గొంటున్నారా? లేదా? అని ఆరా తీస్తున్నట్లుగా అభ్యర్థులు, ఇన్‌చార్జిల ద్వారా వివరాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం. కాగా గులాబీ బాస్ నియమించిన సీక్రెట్ ఏజెంట్స్  ద్వారా అందిన సమాచారాన్ని బట్టి చూస్తే అభ్యర్థుల్లో దడ మొదలైంది. టిక్కెట్ సంపాదించటం ఒక ఎతైతే ఎన్నికల్లో గెలిచి కేసీఆర్ ప్రాపకం పొందటం మరో ఎత్తు. మరి దీంతో మరింత జాగ్రత్తగా తమ తమ నియోజక వర్గాల ప్రచారంలో నేతలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఎప్పుడు ఎవరికి ఫోన్ వస్తుందోనని నేతలంతా హడలిపోతున్నారు.

09:35 - October 16, 2018

జగిత్యాల : జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి స్నేహితుడిని హత మార్చాడు. తాటిపెల్లిలో నివాసముంటున్న నవీన్, శ్రవణ్ స్నేహితులు. ఇద్దరూ డిగ్రీ చదువుతున్నారు. నిన్న అర్ధరాత్రి మద్యం మత్తులో నవీన్, శ్రవణ్ గొడవ పడ్డారు. శ్రవణ్ పెన్ కత్తితో నవీన్‌ను పొడిచాడు. చాతీపై ఎక్కువగా కత్తి పొట్లు పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. నవీన్‌ను చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించి యవకుడు మృతి చెందాడు. నవీన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నవీన్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిందితుడు శ్రవణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు. 

 

 

20:18 - October 15, 2018

హైదరాబాద్ : జబర్దస్త్ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తు ఎన్నాళ్టినుండో మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మహిళలను కించపరుస్తు ఈ కార్యక్రమంలో స్కిట్స్ వున్నాయంటు మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గల్ఫ్ కార్మికులను, వారి కుటుంబ సభ్యులను, మహిళలను అవమానపరిచే విధంగా నటిస్తూ అసభ్యకరమైన పదజాలంతో స్కిట్ చేయడాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ గల్ఫ్, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
ఆ స్కిట్ చేసిన జబర్దస్త్ కమెడియన్లు అవినాష్, కార్తీక్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని జగిత్యాల టౌన్‌ సీఐ ప్రకాశ్‌కు తెలంగాణ గల్ఫ్‌ కార్మిక సంఘాలు ఫిర్యాదు చేశాయి. జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజా, యాంకర్ రష్మిలపై కూడా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
 

 

18:51 - October 13, 2018

ఆదిలాబాద్ : జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో విషాదం నెలకొంది. విహారయాత్రకు వెళ్లి మృత్యులోకాలకు వెళ్లారు. చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు, కాలువలో స్నానానికి వెళ్లి ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలతో రెండు జిల్లాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో అన్నదమ్ములు తరుణ్, అరుణ్ పిక్నిక్‌కు వెళ్లారు. అన్నదమ్ములు ఇద్దరూ మత్తడిగూడ చెరువులో ఈతకు వెళ్లారు. ఈత పూర్తిస్థాయిలో రాకపోవడంతో ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయి అన్నదమ్ములిద్దరూ మృతి చెందారు. స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. వీరి మృతితో గ్రామం విషాదఛాయలు అలుముకున్నాయి. 

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఏకీన్పూర్ శివారులోని ఎస్సారెస్పీ కాల్వలో ఇద్దరు బాలికలు స్నానాకి వెళ్లారు. వీరిలో అర్చన (13) మృతి చెందింది. మరో బాలిక గల్లంతు అయ్యింది. గల్లంతైన బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మృతురాలు కథలాపూర్‌కు చెందిన అర్చనగా గుర్తించారు. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

 

16:28 - October 13, 2018

జగిత్యాల : ఆత్యాధునికయుగంలో ఉన్నాం.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నాం. రాకెట్‌లను అంతరిక్షంలోకి పంపుతున్నాం. కానీ సాటి మనిషిని మనిషిగా చూడడం లేదు. కొంతమంది కుల, మతాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంకా కుల వివక్షత కొనసాగుతూనే వుంది. ప్రతి రోజు దేశంలో ఏదో ఒక మూలన కుల దురహంకార హత్యలు, దాడులు, అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. మిర్యాలగూడ ప్రణయ్ హత్య, హైదరాబాద్‌లో ప్రేమ జంటపై దాడి ఘటనలు మరువక ముందే తాజాగా జగిత్యాల జిల్లాలో మరో కుల దురహంకార ఘటన చోటుచేసుకుంది. సారంగపూర్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం కుల బహిష్కరణకు గురైంది. వేరే కులం యువకుడిని ప్రేమించిందని మైనర్ బాలిక కుటుంబాన్ని కుల పెద్దలు వెలి వేశారు.

సారంగపూర్‌లోని రేచపల్లి తాండాలో కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు. వేరే కులం యువకుడిని ప్రేమించిందని మైనర్ బాలిక కుటుంబాన్ని కుల పెద్దలు కులం నుంచి వెలి వేశారు. మహిళను ప్రేమించిన యువకుడిని పోలీసులకు అప్పగించి, అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయించారు. ఆ తర్వాత వెలి వేసిన కుటుంబాన్ని కులంలో కలుపుకోవడానికి 20 వేల రూపాయల జరిమానా విధించారు. అంతేకాకుండా అమ్మాయికి గుండు గీయించి, పంది రక్తంతో స్నానం చేయించి, చెప్పుల దండ వేయించే కార్యక్రమానికి కుల పెద్దలు పూనుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ అమ్మాయిని రక్షించారు.

 

15:16 - October 7, 2018

జగిత్యాల : తెలంగాణలోనే ప్రసిద్దిగాంచిన గ్రామంలో స్మశాన వాటికకు గతి లేదు.. దక్షిణ కాశీగా పేరొందిన ధర్మపురిలో దహన సంస్కారాలు చేయలేని దుస్థితి నెలకొంది. పాలకులు, అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో.. మా ఊరి స్మశానం మేమే నిర్మించుకుంటామంటూ యువత ముందుకొచ్చి వినూత్నరీతిలో నిరసన తెలిపింది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నచందంగా ఉన్న ధర్మపురిపై 10టీవీ కథనం..

జగిత్యాల జిల్లా ధర్మపురి దక్షిణ కాశీగా పేరొందింది. కానీ అక్కడి వాస్తవ పరిస్థితి మాత్రం  పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది.  ఇక్కడ కాటిలో కష్టాలు తిష్టవేశాయి. శవాలకు అంతిమ సంస్కారం కూడా చేయలేని దుస్థితి నెలకొంది. ఈ సమస్యను స్థానికులు ఎన్నోసార్లు అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తిసుకెళ్ళినా స్పందన లేదు. దీంతో.. విసిగివేసారిన  స్థానిక యువత 'నా ఊరి స్మశాన వాటిక నేనే నిర్మించుకుంటా' అన్న నినాదంతో  భిక్షాటన  చేపట్టారు...   
 
గతంలో అక్కడున్న గోదావరి నదిలోనే అంతిమ సంస్కారాలు చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు... ఎందుకంటే..  ఎల్లంపల్లి ప్రాజెక్టునుంచి  భారీగా వరద నీరు.. ధర్మపురిలోని పుష్కర ఘాట్లకు చేరడంతో సమస్య జఠిలమైంది. దీంతో శ్మశాన వాటిక నిర్మాణం కోసం యువత కదిలింది.. తప్పనిసరి పరిస్థితిలో సుమారు 500 మంది యువకులు భిక్షమెత్తి.. దాదాపు 30 వేల రూపాయలు సేకరించారు. 

సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న దేశ విదేశీయులు స్పందిస్తున్నారు.  వారంతా విరాళాలిచ్చేందుకు సైతం ముందుకొస్తున్నారు.  ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ఓ స్మశాన వాటికను నిర్మాణం చేసేలా చూడాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - జగిత్యాల