చెన్నూరు

09:43 - October 14, 2018

మంచిర్యాల:మాజీ మంత్రి టీఆర్ఎస్ నాయకుడు జి.వినోద్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మాజీ మంత్రి ఐనప్పటికీ తనకు టీఆర్ఎస్ పార్టీలో తగిన ప్రాధాన్యం లభించటం లేదనే అసంతృప్తితో ఉన్న వినోద్ 1,2 రోజుల్లో  ఏఐసీసీ అధ్యక్షుడు  రాహుల్  గాంధి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. తన తండ్రి జి.వెంకటస్వామి హయాం నుంచి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన వినోద్ గత ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వస్తున్న వినోద్ చెన్నూరు లేదా బెల్లంపల్లి టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే ఆయన ఢిల్లీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. 

 

08:17 - September 14, 2018

మంచిర్యాల : ముందస్తుకు ముందువరుసలో ఉన్న టీఆర్‌ఎస్‌.. అసమ్మతిలోనూ మొదటి స్థానంలో ఉంది. రాష్ర్టవ్యాప్తంగా ఆ పార్టీలో అసమ్మతి జ్వాలలు రేగుతున్నాయి. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే ఓదెలు అనుచరుడి ఆత్మహత్యాయత్నం ఇందుకు పరాకాష్ట. చెన్నూరులో ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న వివాదానికి కేసీఆర్‌ చెక్‌ పెట్టారు. అసంతృప్త నేతలనూ ఆయన బుజ్జగించే పనిలో పడ్డారు. టీఆర్ఎస్‌ ముందస్తు ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించడంతో.. రాష్ర్టవ్యాప్తంగా ఆ పార్టీలో అసమ్మతి భగ్గుమంటోంది. టికెట్‌ ఆశించి భంగపడ్డ టీఆర్‌ఎస్‌ నేతలు మండిపడుతున్నారు. కొంతమందైతే బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. అక్కడక్కడా నిరసనలకు దిగుతున్నారు. సమస్య అంతటితో అంతమవ్వలేదు...  ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు.. అనుచరుడైతే.. ఏకంగా ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. దీంతో నల్లాల ఓదెలు, బాల్క సుమన్‌ మధ్య వివాదం తలెత్తింది. నేతలు బహిరంగ విమర్శలకు దిగారు. దీంతో పార్టీలో ఏం జరుగుతుందో తెలియక కార్యకర్తలు ఆందోళనలో పడ్డారు. 

ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశించి బంగపడ్డవారంతా నిరసన తెలుపుతుండడంతో గులాబీ బాస్‌ అలర్ట్‌ అయ్యారు. వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. కేసీఆర్‌ ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫోన్‌ చేసి మాట్లాడుతున్నారు. అసంతృప్తులను బుజ్జగించే బాధ్యత తనదేనని.. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ పార్టీ నేతలకు చెప్పినట్లు సమాచారం. పార్టీలో అసమ్మతి గురించి పట్టించుకోకుండా... ఎన్నికలకు సన్నద్ధం కావాలని సీఎం కేసీఆర్‌ అభ్యర్థులకు సూచించినట్లు తెలుస్తోంది. 

కేసీఆర్‌ అన్నంత పనిచేస్తున్నారు. అసంతృప్త నేత మాజీ ఎమ్మెల్యే ఓదెలుతో మాట్లాడి దారికి తెచ్చారు. ప్రగతి భవన్‌లో  కేసీఆర్‌ను కలుసుకున్నాక ఓదెలు కాస్త మెత్తబడ్డారు. మాటతీరులోనూ మార్పు వచ్చింది. కేసీఆర్‌ మాటే తనకు శిరోధార్యమన్న ఓదెలు. బాల్కసుమన్‌ విజయానికి కృషి చేస్తానన్నారు. తొందరపాటు చర్యలు తీసుకోకుండా.. పార్టీ వెంటే నడవాలని కార్యకర్తలను కోరారు ఓదేలు. 

బుజ్జగింపుల పర్వానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్‌..  టికెట్లు కేటాయించిన అభ్యర్థులకు గురువారం ఫోన్‌ చేసి మాట్లాడినట్లు సమాచారం. ముఖ్యంగా ఓటర్ల నమోదుపై సీరియస్‌గా దృష్టి సారించాలని సూచించినట్లు తెలుస్తోంది. బూత్ కమిటీల నియామకాలు, పార్టీ నేతల సమన్వయంతోపాటు.. ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ చెప్పినట్లు తలాడించిన ఓదెలుకు కార్యకర్తలనుంచి వ్యతిరేకత ఎదురైంది. ఆయనకు మద్ధతుగా ఆత్మహత్యకు యత్నించిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్ళిన ఓదెలును అడ్డుకున్నారు.  గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. 

12:56 - September 12, 2018

తమ నేతకు ఎందుకు టికెట్ కేటాయించలేదంటూ తెలంగాణ రాష్ట్రంలో పలువురు అనుచరులు ఆందోళనలు..నిరసనలు చేపడుతున్నారు. ఇది కాస్తా తారాస్థాయికి చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం...105 మంది అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో టికెట్ ఆశించిన పలువురు ఆశావాహులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పలువురు ఇతర పార్టీల్లోకి వెళ్లడానికి మార్గాలు వెతుకుతుండగా మరికొందరు టికెట్ ఇవ్వాలంటూ టీఆర్ఎస్ అధిష్టానంపై వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 

మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు టికెట్ ను ఎంపీ బాల్క సుమన్ కు కేసీఆర్ ఖరారు చేశారు. దీనితో తాజా, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఆగ్రహానికి గురయ్యారు. తనకు టికెట్ కేటాయించాలంటూ అభ్యర్థించారు. ఆయన అనుచరులు కూడా ఆందోళనలు..నిరసనలు కొనసాగించారు. బాల్క సుమన్ కు మద్దతిచ్చేది లేదని..తనకు టికెట్ కేటాయించే వరకు ఇంట్లోనే ఉంటానంటూ గృహనిర్భందం చేసుకున్నారు. 

బుధవారం ఎంపీ బాల్క సుమన్ ఇందారంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ విషయం నల్లాల ఓదేలు అనుచరుడు గట్టయ్యకు తెలిసింది. అక్కడకు వెళ్లిన అతను ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకున్నాడు. ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. మంటలు ఇతరులకు కూడా అంటుకున్నాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

13:52 - September 11, 2018
కరీంనగర్ : టీఆర్ఎస్ తనకు టికెట్ కేటాయించలేదని ఓ నేత గృహ నిర్భందం చేసుకున్నారు. ఆయన ఎవరో కాదు..కేసీఆర్ పై తనకు అపారమైన నమ్మకం  ఉందని...బాల్క సుమన్ కు సపోర్టు ఇచ్చేది లేదని స్పష్టం చేసిన తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు. ఇటీవలే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అంతేగాకుండా ఏకంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియజకవర్గ టికెట్ బాల్క సుమన్ కు దక్కింది. దీనితో నల్లా ఓదేలు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. వెంటనే తనకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. అధిష్టానం స్పందించకపోయే సరికి గృహ నిర్భందం విధించుకున్నారు. స్పష్టమైన హామీనిస్తే గాని గృహ నిర్భందం విరమిస్తానని తేగేసి చెబుతున్నారు. స్థానిక నేతలు, కార్యకర్తలు నల్లాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో సిట్టింగులు అందరికీ టికెట్లు కేటాయించి తనకు ఇవ్వకపోవడం బాధించిందని, బాల్క సుమన్ వల్లే తనకు టికెట్ రాలేదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. 
16:14 - September 9, 2018

కరీంనగర్ : టీఆర్ఎస్ లో విబేధాలు పొడచూపుతున్నాయి. టికెట్లు రాని వ్యక్తులు అసంతృప్తులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నిరుత్సాహం వ్యక్తం చేస్తూ ఇతర పార్టీల వైపుకు వెళ్లేందుకు చూస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ రద్దు చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం..వెంటనే 105 మందితో కూడిన అభ్యర్థుల జాబితా కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై టికెట్ వస్తుందని ఆశించిన కొంతమంది అసంతృప్తులు వ్యక్తం చేశారు. వీరిని బుజ్జగించాలని కేసీఆర్ ఆదేశించారు.

మంచిర్యాల చెన్నూరు టికెట్ ను ఎంపీగా ఉన్న బాల్క సుమన్ కు కేటాయించారు. దీనితో టికెట్ వస్తుందని ఆశించిన నల్లాల ఓదేలుకు షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నుండి టీఆర్ఎస్ ను అంటి పెట్టుకుని ఆయన ఉన్నారు. కానీ టికెట్ రాకపోవడం పట్ల ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కానీ బాల్క సుమన్ విజయానికి నల్లాల ఓదేలు సహకరిస్తారని ప్రచారం జరిగింది. దీనిపై ఆదివారం ఓదేలు స్పందించారు. తనను బాల్క సుమన్ కలిశారని, తనకు మద్దంతు తెలియచేయాలని కోరడం జరిగిందన్నారు. బయటకు వెళ్లిన అనంతరం తనకు ఓదేలు మద్దతు తెలియచేశారని బాల్క సుమన్ వెల్లడించారని, ఇది అసత్యమని కొట్టిపారేశారు. కేసీఆర్ పై నమ్మకం ఉందని..తనకే టికెట్ ఇస్తారని..ఆశాభావం వ్యక్తం చేశారు. 

13:08 - August 26, 2018

మంచిర్యాల : జిల్లాలోని చెన్నూరు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్వాకంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిబ్బంది తక్కువగా ఉన్నారనే నెపంతో అధికారులు... రోజువారీ వేతనంతో వేరే వ్యక్తులతో పనులు కానిచ్చేస్తున్నారు. అయితే.. ఎలాంటి వైద్య పరిజ్ఞానం లేని.. ఓ టీ స్టాల్‌ నిర్వహించే వ్యక్తితో రోగులకు వైద్య సేవలు అందించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులని రోగుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆస్పత్రికి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. రోగులు, బంధువులు భయాందోళనలో ఉన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

12:22 - August 5, 2018

మంచిర్యాల : జిల్లా చెన్నూరులో డెంగ్యూ జ్వరాలు ప్రబలుతున్నాయి. పట్టణంలో జ్వరాలు ప్రబలుతున్నా..పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదు. మురుగు కాల్వల్లో పూడికతీత, క్లోరినేషన్, దోమల నివారణ మందు పిచికారి చేపట్టకపోవడంతో పలు కాలనీల్లో దోమల బెడద అధికమైంది. దీంతో సాయంత్రం అయితే చాలు కిటికీలు, తలుపులు మూసి ఉంచాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చెన్నూరు పట్టణంలోని ఇందిరానగర్ లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. మురుగు కాల్వలు లేక పోవడంతో ఇళ్ల మధ్యలో మురుగునీళ్లు నిలిచి ఉంటున్నాయి. దీంతో చిన్నపాటి వర్షం పడితే చాలు కాలనీ ప్రజలు నరకయాతన పడుతున్నారు. మురుగు నీటి మధ్యలోనే బోరుపంపు ఉండడంతో నీళ్లు కలుషితమై వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని గ్రామస్తులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టణంలోని బట్టిగూడెం, లైన్ గడ్డ, మార్కెట్ రోడ్, తదితర ప్రాంతాల్లో డెంగీ జ్వరాలతో బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. అయితే తెల్ల రక్త కణాలు తగ్గిపోవడంతో బాధితులు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. స్థానికంగా చికిత్స పొందినా..జర్వం తగ్గుముఖం పట్టకపోవడంతో పలువురు మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లి చికిత్స పొందుతున్నారు.

బట్టిగూడెంలో మురుగుకాల్వలు కంపుకొడుతున్నాయి. అందులో పందులు సైతం సంచరిస్తున్నాయి. దీంతో దోమల బెడద అధికమై పలువురు జ్వరాల బారినపడ్డారు. దీంతో మంచిర్యాలలో నలుగురు డెంగీ బాధితులు కరీంనగర్ లో చికిత్స పొందుతున్నారు. అలాగే లైన్ గడ్డ ప్రాంతంలో కాల్వలు నిండిపోయి మురుగునీళ్లు రోడ్డుపై పారుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో కూడా ఐదుగురు విషజ్వరాలతో ఆస్పత్రి పాలయ్యారు. పట్టణంలో జ్వరాలు ప్రబలడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. 

Don't Miss

Subscribe to RSS - చెన్నూరు