చంద్రబాబు

20:46 - September 21, 2018

అమరావతి : ఏసీ సీఎం చంద్రబాబు నాయుడికి ఐక్యరాజ్యసమితి అరుదైన గౌరవాన్ని అందించింది. ఐక్యరాజ్యసమితిలో ప్రసగించాల్సిందిగా చంద్రబాబును కోరుతు ఐక్యరాజ్యసమితి ఆహ్వానంపంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 22న అమెరికా పర్యటనకు బయల్దేరుతున్నారు. 28వ తేదీ వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. 24వ తేదీన ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రసంగించనున్నారు. 'సుస్థిర వ్యవసాయాభివృద్ధిలో ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లు-ఏపీలో సహజ వ్యవసాయాభివృద్ధి విధానాలు' అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. 
అనంతరం 25న వరల్డ్ ఎకనామిక్ ఫోరం-ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. 26న కొలంబియా యూనిర్శిటీలో 'గవర్నెన్స్ ఇన్ ది ఏజ్ ఆఫ్ టెక్నాలజీ అనే అంశంపై ప్రసంగిస్తారు. అమెరికాకు చంద్రబాబుతో పాటు మంత్రి యనమల, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, మరో ఆరుగురు అధికారులు కూడా వెళ్తున్నారు.

 

20:29 - September 20, 2018

విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏపీ సీఎం చంద్రబాబుపై వున్న నాన్‌బెయిలబుల్ కేసు ధర్మాబాద్ కోర్టు తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం ధర్మాబాద్ కోర్టులో సీఎం చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ కేసు విచారణకు రానుంది. హైదరాబాద్ నుంచి ధర్మాబాద్ కోర్టుకు న్యాయవాది సుబ్బారావును పంపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బాబ్లీ కేసులో వాయిదాలు, నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినా తమకు నోటీసులు అందలేదని న్యాయవాదుల బృందం కోర్టుకు విన్నవించనున్నారు. ఎఫ్ఐఆర్, చార్జ్‌షీట్, నాన్‌బెయిలబుల్ వారెంట్ కాపీలను అధికారికంగా న్యాయవాదులు తీసుకోనున్నారు. చంద్రబాబుతో పాటు 15మంది తరపున లాయర్ల బృందం పిటిషన్ వేయనుంది. 
2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు వెళ్లిన వారిలో చంద్రబాబుతో పాటు 15 మందికి ధర్మాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న చంద్రబాబుతో పాటు 15 మందిని కోర్టులో హాజరుపర్చాల్సిందిగా కోర్టు ఆదేశించింది. చంద్రబాబు, దేవినేని ఉమా మహేశ్వరరావు, టి .ప్రకాష్ గౌడ్, నక్కా ఆనంద బాబు, గంగుల కమలాకర్, కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, చింతమనేని ప్రభాకర్, నామా నాగేశ్వరరావు,జి.రామానాయుడు,.హెచ్.విజయరామారావు, ముజఫరుద్దీన్ అన్వరుద్దీన్, హన్మంత్ షిండే, పి.అబ్దుల్ ఖాన్ రసూల్ ఖాన్, ఎస్. సోమోజు, ఏఎస్.రత్నం, పి.సత్యనారాయణ శింభులకు ధర్మాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది.

19:55 - September 17, 2018

అమరావతి : తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించిన పరువు హత్య ప్రణయ్ దారుణ హత్యపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా  స్పందించారు. ప్రణయ్ హత్యపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కులమతాలకు అతీతంగా పిల్లలకు పెళ్లి చేయించాల్సిన బాధ్యత పెద్దలపై ఉందన్నారు. అహంకారం, అహంభావంతో మనుషులను చంపే స్థితికి దిగజారడం ఆందోళనకరమైన విషయమన్నారు. తాము పెళ్లికానుక పథకాన్ని తీసుకురావడం వెనకున్న ముఖ్య ఉద్దేశం కులాంతర వివాహాలను ప్రోత్సహించడమేనని చంద్రబాబు తెలిపారు. పెళ్లికానుక పథకంలో కులాంతర వివాహాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. 
తక్కువ కులం ఉన్న వ్యక్తిని కూతురు పెళ్లి చేసుకుందనే ఉద్దేశంతో కన్నకుమార్తె భర్తను కన్న తండ్రే చంపించాడంటే... ఈ సమాజంలో ఎంతటి అహంకారం పేరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చన్నారు. అబ్బాయి యోగ్యుడు అయి..అమ్మాయికి నచ్చినప్పుడు, పెళ్లి చేసుకుని వారిద్దరూ సంతోషంగా ఉంటారనే నమ్మకంతో తల్లిదండ్రులు వారివురికి వివాహం చేసి ఆశీర్వదించాలని..ఒకవేళ  వారి వివాహం కన్నవారికి ఇష్టం లేకపోతే..వారి మానాన వారిని వదిలేయాయని...ఇలా దారుణంగా హతమార్చడం అనాగరిక చర్య అని అన్నారు. ఈ హత్య వల్ల అమ్మాయి తండ్రి సాంధించింది ఏమీ లేదని ఇకనైనా తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవుసరం వుందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.

 

17:11 - September 16, 2018

ప్రకాశం : కరువు కోరల్లో చిక్కుకున్న ప్రకాశం జిల్లా పంటపొలాల్లో పచ్చదనం పరచుకోనుంది. సాగునీటికి భరోసా కల్పించే మహత్తర ప్రణాళిక ఖరారైంది.  దశాబ్దానికిపైగా నత్తనడకన నడిచిన గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మాణ పనులు తుదిదశకు చేరడంతో.. భూములు సస్యశ్యామలం కానున్నాయి. మత్స్య, పాడి, పర్యాటక రంగాలు అభివృద్ది చెందనున్నాయి.  ఈనెలాఖరులో ముఖ్యమంత్రి చంద్రబాబు  ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు సమాచారం. దీంతో మోడువారిన రైతుల మోముల్లో వెలుగులు పూస్తున్నాయి.

కరవు కోరల్లో చిక్కుకున్న ప్రకాశం జిల్లా పొలాల్లో సాగునీరు గలగలా పారనుంది. వెలుగొండ తరువాత అత్యంత ప్రాధాన్యతగల కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ జలాశయం ద్వారా సాగు నీరందించేందుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  గుండ్లకమ్మ నదిపై మద్దిపాడు మండలం మల్లవరం వద్ద నిర్మించిన ఈ ప్రాజెక్టుతో.. పరిసర ప్రాంత ప్రజలు, రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. 2003లో సీఎంగా ఉన్న  చంద్రబాబు తెరపైకి తెచ్చిన ఈ ప్రాజెక్టును.. ఆతర్వాత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అత్యంత వేగంగా నిర్మించారు. 

దివంగత సీఎం వైయస్సార్‌ అకాల మరణంతో ఈ ప్రాజెక్టుపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి.  పైగా కోర్టు కేసులతో కూడా పనుల్లో జాప్యం జరిగింది.  లోటు బడ్జెట్‌లో ఉన్నా... జిల్లాలో కరవు పరిస్థితులను గుర్తించిన సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టు కోసం చాలా కృషిచేశారని అధికార పార్టీ నేతలు అంటున్నారు. గుక్కెడు తాగునీరు లేని పరిస్థితుల్లో ప్రాజెక్టును ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందంటున్నారు.

ఆరుతడి పంటలు సైతం వేసుకోలేని పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టుకు నీరు ఇస్తారన్న సమాచారంతో ఆప్రాంత రైతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ ధీన పరిస్థితులను అర్ధం చేసుకుందంటూ..సీఎంకు తజ్ణతలు తెలుపుతున్నారు.గుండ్ల కమ్మ ప్రాజెక్టు పర్యాటక ప్రదేశంగానూ ఆకట్టుకుంటోంది. ఈ ప్రాజెక్టును సందర్శించేందుకు  పొరుగు జిల్లాలైన గుంటూరు, నెల్లూరు జిల్లా పర్యాటకులు వస్తున్నారు.బోటింగ్, ఫిషరీ,  పచ్చదనం పరచుకున్న అహ్లాదకర వాతావరణంతో ప్రజలను అమితంగా ఆకట్టుకుంటోంది.నిండుకుండను తలపిస్తున్న ప్రాజెక్టులో  పర్యాటకులతో  సందడి నెలకొంది. దశాబ్దాలుగా బీటలు వారిన పంటపొలాల్లో గుండ్లకమ్మ ప్రాజెక్టు వల్ల పచ్చదనం పరచుకోనుంది. పంటలు లేక బక్కచిక్కిన రైతుల ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి.

15:11 - September 16, 2018

విజయవాడ : మోసం, మాయ, దగ చంద్రబాబు ఇంటిపేర్లని విమర్శించారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. వెన్నుపోటు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. నాలుగేళ్లుగా విశ్రాంతి తీసుకోకుండా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 22 సార్లు కోర్టుకు వెళ్లకపోతే వారెంట్‌ జారీ చేయడంలో తప్పేముందని.. వారెంట్‌కి కూడా రాజకీయ రంగు పులిమి లబ్ది పొందాలని చూస్తున్నారన్నారు బొత్స సత్సనారాయణ.

08:29 - September 16, 2018

విజయవాడ : అమరావతి నగర భవిష్యత్ కు భరోసా ఇచ్చే...కొండవీటి వాగు ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వందల కోట్ల రూపాయల వ్యయంతో...నిర్మించిన కొండవీటివాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం ప్రారంభించనున్నారు. ప్రకాశం బ్యారేజ్ కి పడమటి దిక్కున వేలాది క్యూసెక్కుల నీటిని....కృష్ణాలోకి ఎత్తిపోసేందుకు లిఫ్ట్ ల నిర్మాణం పూర్తయింది.కృష్ణా తీర గ్రామాల్లో....వేలాది ఎకరాల పంట పొలాలను నీట ముంచుతున్న వాగుల ప్రవాహాన్ని మళ్లించనుంది. 14 మొటార్లు, 14 పంప్ లతో ఉరకలు వేసే కొండవీటి వాగు నీటిని...కృష్ణానదిలోకి ఎత్తిపోయనున్నారు. రాజధాని నిర్మాణం జరుగుతున్న అనంతవరం నుంచి దాదాపు 20కిలోమీటర్లు ప్రవహించి...ఉండవల్లి గ్రామం వద్ద కృష్ణానదిలో కొండవీటి వాగు కలుస్తుంది. 

1964లో వాగునీరు నదిలోకి కలిసే చోట రెగ్యులేటర్ నిర్మాణం జరిగింది. అయితే వర్షాకాలంలో కృష్ణానదిలో నీటి ప్రవాహం ఉంటే....వాగు నీరు నదిలోకి వెళ్లే అవకాశం ఉండదు. దీనికి తోడు విజయవాడ థర్మల్ పవర్ ప్లాంట్ లో...విద్యుత్ ఉత్పత్తి జరగాలంటే ప్రకాశం బ్యారేజ్ వద్ద ఎప్పుడు 12 అడుగుల నీటి మట్టం కొనసాగించాల్సి ఉంటుంది. రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన తర్వాత....రాజధాని ముంపు గ్రామాలకు పొంచి ఉన్న ముంపు తొలిసారి తెరపైకి వచ్చింది. దీంతో ప్రభుత్వం కొండవీటి వాగు నిర్మాణం చేపట్టింది. నెదర్లాండ్స్ సాంకేతిక పరిజ్జానంతో టాటా కన్సల్టెన్సీ వాగుల ప్రవాహాన్ని డిజైన్ చేసింది. 19.85 కిలోమీటర్ల దూరం ప్రవహించే కొండవీటి వాగును...8 మీటర్ల వెడల్పు నుంచి 20 మీటర్లకు పెంచుతున్నారు. వైకుంఠపురం వద్ద కృష్ణానదిలో కలిసే వాగు వెడల్పును 10 మీటర్ల నుంచి 45 మీటర్లకు పెంచుతారు.

ఉండవల్లి వద్ద 12వేల క్యూసెక్కుల నీటిని మోటర్ల సాయంతో కృష్ణానదిలోకి ఎత్తిపోస్తారు. 4వేల 5వందల క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ వెనుక నుంచి బకింగ్ హమ్ కెనాల్ కు మళ్లిస్తారు. వందేళ్లలో కొండవీటి వాగు 16వేల 575 క్యూసెక్కుల ప్రవాహం నమోదు చేసుకుంటే...ప్రస్తుతం 21 వేల క్యూసెక్కుల ప్రవాహనికి అనుగుణంగా డిజైన్ చేశారు.

 

08:11 - September 15, 2018

హైదరాబాద్: బాబ్లీ కేసులో...ధర్మాబాద్ కోర్టు ఇచ్చిన నోటీసులపై చంద్రబాబు వ్యూహామేంటీ ? సీఎం సహా 16 మందికి నోటీసులు జారీ చేయడంతో....చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ధర్మాబాద్ కోర్టుకు చంద్రబాబు వెళితే మంచిందని మెజార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు సీఎం చంద్రబాబు....కోర్టు హాజరు కావాలా వద్దా అన్న అంశంపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఐదారు రోజుల్లో ధర్మాబాద్ కోర్టులో లొంగిపోతే రాజకీయంగా తెలంగాణలో మరింత ఉపయోగకరంగా ఉంటుందని దేశం నేతలు యోచిస్తున్నారు.

దీంతో వచ్చే మైలేజీతో కాంగ్రెస్ తో సీట్ల బేరం మరింత సమర్థవంతంగా చేయొచ్చన్న ఆలోచన దేశం శ్రేణులు చేస్తున్నట్టు సమాచారం. బాబ్లీ ప్రకంపనలు ఏపీలో అంతగా ఉపయోగపడకపోయినా తెలంగాణలొ దాని ప్రభావం ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అనుకూలంగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు ఆశిస్తున్నారు. ఈ నెల 21న లేదా కొంచెం ముందుగా చంద్రబాబు ధర్మాబాద్ లో ముందస్తుగా లొంగిపోయేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నట్టు సమాచారం.   

          బాబ్లీ విషయంలో చంద్రబాబు, టీడీపీ నేతలకు ధర్మాబాద్ కోర్టు నోటీసులు ఇవ్వడంతో...తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. నోటీసులపై చంద్రబాబు, సహచర మంత్రులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏళ్ల క్రితం జరిగిన బాబ్లీ ఇష్యూను తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ మరచిపోయారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఎనిమిది ఏళ్ల తర్వాత అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో....నోటీసుల వెనుక ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పాత్ర ఉందంటూ తెలుగు తమ్ముళ్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు....పార్టీ సీనియర్ నేతలు, న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపారు. కేసు పూర్వాపరాలను పరిశీలించాలని అధికారులు, న్యాయనిపుణులను ఆదేశించారు. రాజకీయ ఎత్తుగడతోనే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

          రాజకీయ కుట్ర దాగి ఉందన్న నిర్ణయానికి వచ్చిన టీడీపీ....సమర్థవంతంగా తిప్పి కొట్టేందుకు రెడీ అవుతోంది. రాజకీయ కుట్రతోనే నోటీసులు జారీ చేశారన్న అంశాన్ని....ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ వ్యూహాంగా తెలుస్తోంది. తెలంగాణలో కేసీఆర్-బీజేపీ, ఏపీలో జగన్-బీజేపీల మైత్రిని ప్రజలకు అర్థమయ్యే రీతిలో మరింత ఎదురుదాడికి దిగాలని టీడీపీ సిద్ధమైంది. ఏపీలో బీజేపీ-వైసీపీ ఒక్కటేనన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా సఫలమయ్యామన్న భావన టీడీపీ శ్రేణుల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీ మైత్రి బంధాన్ని ఎండగట్టాలంటే ధర్మాబాద్ కోర్టులో చంద్రబాబుతో పాటు ఇతర 16 మంది నేతలు లొంగిపోతే తెలంగాణలో పార్టీ పట్టు పెంచుకోవచ్చని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇటు పవన్ కానీ.. అటు జగన్ కు కానీ తెలంగాణలో అసలు

పట్టేలేదు కాబట్టి..బాబ్లీ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని టీ-టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు.

12:20 - September 14, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్ ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. 2010లో బాబ్లీ ప్రాజెక్టు సందర్శన..అక్కడ ఆందోళనలు చేసిన నేపథ్యంలో 2018లో కోర్టు వారెంట్ జారీ చేయడంపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుట్రలో భాగంగానే బీజేపీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతుందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. 

చంద్రబాబు తిరుమలలో ఉండగానే వారెంట్ పై బాబు సమాచారం అందుకున్నారు. కోర్టుకు హాజరయ్యే విషయంపై బాబు సమాలోచనలు జరుపుతున్నారు. ఐపీసీ సెక్షన్లు 353, 324, 332, 336, 337, 323, 504, 506, 109  కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే అత్యవసరంగా టీటీడీపీ నేతలు భేటీ అయ్యరు. కోర్టుకు హాజరయితే తెలంగాణ పార్టీకి సానుకూలత వచ్చే అవకాశం ఉందని..కానీ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు వారెంట్ జారీ చేయడం ఏంటీ ? అని నిలదీస్తున్నారు. మరి ఆయన కోర్టుకు హాజరవుతారా ? లేదా ? అనేది చూడాలి. 

09:16 - September 14, 2018

నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘ఎన్టీఆర్’పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ సినిమాను చాలా మంది దృష్టి పెట్టారు. నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా క్రిష్ డైరెక్షన్ ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఇటీవలే ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన చిత్రాలు విడుదలై హల్ చల్ చేస్తున్నాయి. 

ఎన్బీకే ఫిలింస్‌, వారాహి చలనచిత్రం, విబ్రీ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతమందిస్తున్నారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా చిత్ర యూనిట్ లుక్ ను విడుదల చేసింది. ఎన్టీఆర్, చంద్రబాబు క్యారెక్టర్లకు సంబంధించిన లుక్  ను రిలీజ్ చేశారు. ఈసారి మామా అల్లుళ్లు కలిసే వచ్చారు. పోస్టర్‌ లో ఎన్టీఆర్ తన అల్లుడిపై ప్రేమగా చెయ్యివేసి మాట్లాడుతున్నట్లుగా చూపించారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం క్యారెక్టర్ లో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలనాటి నటుడు అక్కినేని నాగేశ్వరరావుగా.. ఆయన మనవడు సుమంత్‌ నటిస్తున్నారు.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది సినిమా యూనిట్. తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

08:31 - September 12, 2018

పశ్చిమ గోదావరి : ఏపీలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్టులో మంత్రులు, అధికారులు, వారి కుటుంబసభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు బుధవారం నడవనున్నారు. నాగార్జునసాగర్ డ్యాం నిర్మించినప్పుడు... అప్పటి  దేశ ప్రధాని  జవహర్ లాల్ నెహ్రూ.. సాగర్ స్పిల్‌వే వాక్ నిర్వహించి చరిత్రలో నిలిచిపోయారు. ఇప్పుడలాగే.. భారీ స్థాయిలో చేపట్టిన పోలవరంలో నిర్వహించనున్న స్పిల్‌వే వాక్‌తో సీఎం చరిత్రను తిరగరాయనున్నారు. వచ్చే ఏడాది మే నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో వేగంగా పనులు చేస్తున్నారు. కేంద్రం సహకరించకున్నా.. డయాఫ్రం వాల్‌, స్పిల్‌వే నిర్మాణం పూర్తి దశకు తెచ్చారు. వైద్యబృందంతో కలిసి నడవనున్న సీఎం.. 48వ బ్లాక్ వద్ద పైలాన్ ఆవిష్కరించనున్నారు. తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నడవనున్నారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు.. 

1148 మీటర్ల పొడవు, రెండున్నర మీటర్ల ఎత్తు, రెండు మీటర్ల వెడల్పుతో దీని నిర్మాణం చేపట్టారు. 52 బ్లాకులకు గాను 48 బ్లాకుల్లో గ్యాలరీ నిర్మాణం పూర్తయ్యింది. ప్రాజెక్టు మొత్తం పనుల్లో 58 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులను మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. అత్యంత అధునాతన జపాన్, జర్మన్ టెక్నాలజీతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టులో పండుగ వాతావరణం సంతరించుకోనుంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - చంద్రబాబు