కరీంనగర్

15:47 - November 15, 2018

కరీంనగర్ : అందరూ ఊహించినట్టే జరిగింది. చొప్పదండి టికెట్ ఆశించిన బొడిగె శోభ గులాబీ కండువా వదిలి కాషాయ కండువా కప్పుకున్నారు. టికెట్ రాకపోవడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురై బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ అధిష్టానం కూడా ఆమెకు చొప్పదండి టికెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 15వ తేదీన గురువారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, పార్టీ ఎమ్యెల్యే అభ్యర్థి కిషన్ రెడ్డి సమక్షంలో బొడిగె శోభ బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ...తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారిణిగా..దళిత బిడ్డనైనా తనకు అవమానం ఎదురైందని, కార్యకర్తల ఒత్తిడి మేరకు బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ సడ్డకులు రవీంద్ర రావు, ఎంపీగా కొనసాగుతున్న సంతోష్ వల్ల తాను అవమానానికి గురయ్యాయన్నారు. బీజేపీ నాయకత్వంలో అభివృద్ధి చేసుకోవాలని లక్ష్యంతో తాను చేరినట్లు చెప్పారు బొడిగె శోభ.. 
పార్టీ టికెట్ కోసం బొడిగె శోభ తీవ్రంగా ప్రయత్నించారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలువాలని ప్రయత్నించినా అది వీలు కాలేదు. ఇటీవలే కేటీఆర్ ను కలిసినా టికెట్ పై స్పష్టమైన హామీనివ్వలేదు. కాంగ్రెస్ పెద్దలు పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లుగా ప్రచారం జరిగింది. చివరకు కార్యకర్తలతో సమావేశమైన బొడిగె బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం చొప్పదండి బరిలో ఎవరు గెలుస్తారు ? అనేది చూడాలి. 

14:00 - November 13, 2018

కరీంనగర్ : జిల్లాలోని కాంగ్రెస్‌లో అలకలు, అసంతృప్తులు మొదలయ్యాయి. తొలి జాబితాలో చోటు దక్కని ఆశావహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి సుద్దాల దేవయ్యకు కాంగ్రెస్ మొండిచేయి చూపింది. చొప్పదండి టికెట్ ఆశించిన ఆయనకు టికెట్ దక్కలేదు. మేడిపల్లి సత్యంకు చొప్పదండి టికెట్‌ను కేటాయించారు. సుద్దాల దేవయ్య, మేడిపల్లి సత్యంతోపాటు గజ్జెల కాంతం చొప్పదండి టికెట్ ఆశించారు. కానీ ఫైనల్‌గా మేడిపల్లి సత్యంకు టికెట్ కేటాయించారు.

అయితే గతకొంత కాలంగా చొప్పదండి టికెట్ తనకే వస్తుందని దేవయ్య ధీమాతో ప్రచారం కూడా చేశారు. టికెట్ తనకు కేటాయించకపోవడంతో దేవయ్య అలకబూనారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మేడిపల్లి సత్యంకి టికెట్ ఇవ్వడంపై దేవయ్య కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. టికెట్లు అమ్ముకున్నారంటూ కాంగ్రెస్ పెద్దలపై దేవయ్య విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. దేవయ్య ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నారు. కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత ఇల్లు, స్థలాలు, డబ్బులు నష్టపోయాయని వాపోయారు. 

 

12:51 - November 3, 2018

కరీంనగర్ : కోదండరాంకు టీఆర్ఎస్ నేత, తాజా మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ సవాల్ విసిరారు. దమ్ముంటే కోదండరాం రామగుండంలో పోటీ చేయాలన్నారు. ఈమేరకు రామగుండంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో సత్యనారాయణ పాల్గొని, మాట్లాడారు. గెలిస్తే కోదండరాంపైనే గెలవాలన్నారు. 

 

10:27 - November 1, 2018

కరీంనగర్ : టీఆర్ఎస్‌లో అసమ్మతి సెగ రగులుతోంది. సీటు ఆశించిన ఆశావహులు జాబితాలో పేరు రాకపోవడంతో నిరసన గళం వినిపిస్తున్నారు. అభ్యర్థుల జాబితాలో పేరు ప్రకటించకపోవడంతో కొండా సురేఖ దంపతులు, బాబుమోహన్‌తోపాటు పలువురు నేతలు టీఆర్ఎస్‌, కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసి పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా గులాబీ పార్టీలో మరో అసమ్మతి స్వరం వినిపిస్తోంది. చొప్పదండి ప్రచారంలో బొడిగ శోభ కీలక వ్యాఖ్యలు చేశారు. చొప్పదండి నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతానని ఆమె స్పష్టం చేశారు. 60 రోజులు ఓపిక పట్టానని తెలిపారు. తన మీద ఫిర్యాదు చేసిన వారికి టికెట్ ఇస్తే సహించే ప్రస్తక్తే లేదని తేల్చి చెప్పారు. చొప్పదండి నుంచి దళిత బిడ్డకు అవకాశం ఇవ్వాలని.. అది కూడా తనకు (బొడిగ శోభ)కు ఇవ్వాలని సీఎంను కోరారు. 

తనతో లబ్ధి పొందిన నాయకులే తనను దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 18 సంవత్సరాలు టీఆర్ఎస్‌లో పని చేశానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అరెస్టు చేసినప్పుడు తాను కారం పొడి పట్టుకుని నిలబడ్డానని తెలిపారు. కేసీఆర్ ప్రకటించిన 107 మంది అభ్యర్థులలో ఒక్క దళిత మహిళ కూడా లేరని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పిలుపు కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఎంపీ కవిత, కేశవరావు, మంత్రి హరీష్‌రావు, మంత్రి ఈటెల రాజేందర్‌ను కలిశానని తెలిపారు. తన పని ప్రకారం సీటు ఇవ్వాలనకుంటే.. చొప్పదండి సీటు తనకే ఇవ్వాలన్నారు. ఒక మాదిగ బిడ్డను అభ్యర్థిగా ప్రకటించడంలో ఇంత జాప్యమా అని వాపోయారు. ఓట్ల దగ్గర దళిత మహిళల అవసరం ఉంటుంది... కానీ ఒక దళిత మహిళ అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఆలస్యం చేస్తారా? ఇది ఏ విధంగా ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందని ప్రశ్నించారు. 

12:35 - October 28, 2018

కరీంనగర్ : హీరోయిన్ హాన్సిక కరీంనగర్‌లో సందడి చేసింది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 250వ షోరూం ను ప్రారంభించిన హన్సిక సంతోషం వ్యక్తం చేసింది. 25ఏళ్ల ప్రస్థానంలో 250వ షోరూంను సంస్థ ఏర్పాటు చేయడం, ప్రారంభోత్సవానికి కరీంనగర్ రావడం ఆనందంగా ఉందన్నారు హన్సిక. తొలి కస్టమర్‌కు హన్సిక చేతుల మీదుగా ఆభరణాలు అందించారు షో రూం యాజమాన్యం..ఈ సందర్భంగా పెద్ద ఎత్తున స్థానికులు, అభిమానులు తరలివచ్చారు..

 

11:13 - October 26, 2018

కరీంనగర్ : కొండగట్టు బస్సు ప్రమాద బాధితులకు అందించే పరిహారంపై ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం ప్రక‌టించిన పరిహారం అందించేందుకు ఇన్నాళ్లు కోడ్ అడ్డువ‌చ్చింది. మాన‌వ‌త్వం కోణంలో ప‌రిగ‌ణించిన సీఈసీ ఎట్టకేలకు పరిహారం అందించేందుకు అనుమ‌తినిచ్చింది. ఆర్టీసి చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదంగా నిలిచిన జగిత్యాల జిల్లా కొండగట్టు సంఘటన జరిగి 45  రోజులు దాటింది. అయితే ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు గానీ.. క్షతగాత్రులకు గానీ ఇంత వరకు పరిహారం అందించలేదు ప్రభుత్వం. మృతులకు 5 లక్షలు, క్షతగాత్రులకు రెండున్నర లక్షలు ప్రభుత్వం తరుపున సాయం అందిస్తామని సంఘటన స్ధలాలనికి వెళ్ళిన మంత్రులు, అధికారులు ప్రకటించారు. కానీ ఇంత వరకు ఒక్కరికి కూడా పైసా రాలేకపోవడంతో ఇది రాజకీయ విమర్శలకు దారి తీసింది.
ఇదిలా ఉంటే కొండగట్టు ప్రమాదం సెప్టెంబర్ 11న జరిగింది. అప్పటికి తెలంగాణలో ప్రభుత్వం రద్దై ఐదు రోజులు అయ్యింది. అంటే సెప్టెంబర్ 6న కేసిఆర్ అసెంబ్లీ రద్దు చేసి అపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అంటే అప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో  నష్ట పరిహారం చెల్లింపుపై అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. అయితే తెలంగాణ ప‌ర్యట‌న‌లో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘంతో రాష్ట్ర అధికారులు చర్చించి ఎట్టకేలకు పరిహారం చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నారు. 

10:30 - October 26, 2018

కరీంనగర్ : ఎన్నికల వేళ నగదు తరలింపుపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించినా కొందరు భారీ మొత్తంలో నగదును తరలిస్తున్నారు. గత కొద్ది రోజులుగా పోలీసులు చేస్తున్న తనిఖీల్లో లక్షలకు లక్షలు డబ్బుల కట్టలు బయటపడుతున్నాయి. డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగునున్న సంగతి తెలిసిందే. అధికారంలోకి రావాలని..తమ అభ్యర్థి..పార్టీ గెలవాలని ఓటర్లను ఆకర్షించేందుకు అక్రమాలకు తెగబడుతున్నారు. 
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టిన  పోలీసులు...ఎలాంటి ఆధారాలులేని 22 లక్షల రూపాయలను పట్టుకున్నారు. హుస్నాబాద్‌లో నివాసం ఉండే అలిగివెల్లి కృష్ణారెడ్డి అనే వ్యక్తి నుంచి 20లక్షలు, గుర్రాల మహీపాల్  నుంచి 2లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్‌లోని రైల్వేస్టేషన్‌లో పోలీసులు విస్త‌ృత తనిఖీలు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్, బాంబ్ డిస్పోజుల్ స్వ్కాడ్‌లతో పో్లీసులు తనిఖీలు నిర్వహించారు. 

22:25 - October 23, 2018

కరీంనగర్ : జిల్లా డిప్యూటీ కలెక్టర్ కార్యాలయాన్ని జప్తు చేయడానికి ఓ సామాన్యుడు వచ్చాడు. అతన్ని చూసి సిబ్బంది తాళాలు వేసుకుని వెళ్లి పోయింది. కరీంనగర్ జిల్లాలో వెంకటేష్ అనే వ్యక్తి ఎస్సారెస్పీ కాలువ విస్తరణ పనుల్లో తన  భూమిని కోల్పోయాడు. పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. 35 ఏళ్లుగా వెంకటేష్ న్యాయపోరాటం చేస్తున్నాడు. కోర్టు ఆదేశాలతో కార్యాలయాన్ని జప్తు చేయడానికి వెంకటేష్ వచ్చాడు. అయితే వెంకటేష్‌ను చూసి కార్యాలయ సిబ్బంది తాళాలు వేసుకుని వెళ్లి పోయింది.

 

20:31 - October 17, 2018

కరీంనగర్ : సద్దుల బతుకమ్మ సందర్భంగా కరీంనగర్ మార్కెట్ పూల వనంగా మారింది. ప్రకృతి సిద్దంగా పూచిన పూలను వ్యాపారులు మార్కెట్‌కి తీసుకురావడంతో ఆడపడుచులు  పెద్ద ఎత్తున పూల కొనుగోలు చేస్తున్నారు. పూల కోసం వచ్చిన మహిళలతో మార్కెట్ అంతా కిక్కిరిసిపోయింది. నిన్నటి వరకు తక్కువ ధరకు లభించిన పూలకు ధరలు పెంచేశారు వ్యాపారులు. గునుగు, తంగెడు, కట్లపూలు , పుట్టు కుచ్చులు, గుమ్మడిపూలు, టేకు పూలు ఇలా చాలా రకాల పూలను అందుబాటులో ఉంచారు వ్యాపారులు.. అయితే గతేడాదితో పోల్చితే ఈ సారి వర్షాభావం కారణంగా పూల వ్యాపారం లాభసాటిగా లేదంటున్నారు వ్యాపారులు..
 

11:38 - October 15, 2018

కరీంనగర్ : జిల్లాలో మహిళా ఓటర్లు కీలకం కానున్నారు. ఎందుకంటే వారి సంఖ్య ప్రస్తుతం అధికంగా ఉంది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఇప్పటి వరకు నమోదైన జాబితాలో 8,90,229 ఓటర్లున్నారని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ ప్రకటించారు. అందులో 4,43,342 మంది పురుషులుండగా 4,46,832 మంది మహిళలున్నారని వెల్లడించారు. 55 మంది ఇతర ఓటర్లున్నారని, ఓటర్ల జాబితా ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో ఉంచామనీ తెలిపారు. ఇటీవలే ఓట్లు గలంతయ్యాయని కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం..దీనిపై కోర్టు విచారించడం జరిగిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్ ఓటర్ల జాబితాను విడుదల చేశారు. గత నెల 10వ తేదీన విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం 8,08,282 ఓటర్లుంటే ప్రత్యేక ఓటర్ల నమోదు..సవరణల అనంతరం జిల్లా వ్యాప్తంగా 81,947 ఓటర్లు పెరిగారు. 
Image result for collector sarfarazసెప్టెంబర్ 10 వరకు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 4,06,825 మంది పురుషులు ఉండగా 4,01,420 మంది మహిళలున్నారు. కొత్తగా ఓటర్లకు అవకాశం కల్పించడంతో పలువురు దరఖాస్తు చేసుకున్నారు. 1,01,682 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీటిని విచారణ అనంతరం 19,735 అనర్హులని తొలగించారు. మొత్తంగా 8,90,229 మంది ఓటర్లున్నారు. చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఓటర్ల నమోదులో మహిళలు తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. Image result for collector sarfaraz meeting voters list
మరోవైపు ఓటరు జాబితాలో పేర్లు లేని వారికి నామినేషన్ల చివరి రోజు (నవంబర్ 19) వరకు కూడా ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకు ఓటరు నమోదు కొనసాగుతుందని అధికారులు పేర్కొనడంతో ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సప్లమెంటరీ-2 జాబితాలో చేర్చి తుది జాబితాను విడుదల చేస్తారు. 
ఇదిలా ఉంటే ప్రతిపక్షాలు ఓటర్ల సంఖ్యపై పలు విమర్శలు గుప్పించాయి. కరీంనగర్ నియోజకవర్గంలోనే 95వేల ఓట్లు మాయమయ్యాయని కాంగ్రెస్ ఆరోపించింది. 2014లో 15,50,834 ఓటర్లు ఉంటే, ప్రస్తుతం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 13,23,433 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారని, మిగతా 2 లక్షల పైచిలుకు ఓట్లు ఎక్కడికి పోయాయని ఆ పార్టీ నేత పొన్నం ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
- తూపురాణి మధుసూధన్

Pages

Don't Miss

Subscribe to RSS - కరీంనగర్