ఎపికి

13:54 - September 19, 2016

ఢిల్లీ : ప్యాకేజీతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్రమంత్రి సుజనాచౌదరి అన్నారు. ప్యాకేజీ పట్ల ఏపీ ప్రజలు సానూకూలంగానే ఉన్నారని చెప్పారు. కేంద్రప్రభుత్వ సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం సూచన కారణంగానే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని అన్నారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం 100 శాతం నిధులు ఇవ్వడం చరిత్రాత్మక విషయమని చెప్పారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తుందని అన్నారు. త్వరలో రైల్వేజోన్‌ విషయంలో  నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

20:53 - August 5, 2016

ఢిల్లీ : ప్రత్యేక హోదా బిల్లును బీజేపీ కోల్డ్‌ స్టోరేజీలో పడేసింది. కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లును మనీ బిల్లు అంటూ  ఆర్థికమంత్రి జైట్లీ అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ  నేపథ్యంలో బిల్లును లోక్‌సభ స్పీకర్‌కు నివేదిస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్‌ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రత్యేక హోదా బిల్లుపై బీజేపీ ఏపీని మోసం చేసిందంటూ ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి.
మరోసారి సభ ముందుకు కెవిపి ప్రైవేట్ బిల్లు  
ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి మరోసారి బీజేపీ హ్యాండిచ్చింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న బిల్లును మనీ బిల్లుగా పేర్కొంటూ తప్పించుకుంది. కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు మరోసారి సభ ముందుకు వచ్చింది. చర్చలో  విభజన సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసి సభా గౌరవాన్ని కాపాడాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ కోరారు. ప్రైవేటు బిల్లు సభ్యుడి హక్కు అని...బిల్లుపై చర్చ పూర్తైనప్పటికీ కోరం లేకపోవడంతో ఓటింగ్ వాయిదా పడిందని కేవీపీ అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి చట్టం అక్కర్లేదని కేవీపీ అన్నారు.
ఈ బిల్లుపై రాజ్యాసభలో ఓటింగ్ చేపట్టలేం : అరుణ్ జైట్లీ
అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఈ బిల్లుపై రాజ్యాంగ ప్రకారం రాజ్యసభలో ఓటింగ్ చేపట్టలేమని అన్నారు. మనీ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం లోక్‌సభలోనే ఉందని, మనీ బిల్లు అవునా కాదా అని తేల్చే అధికారం స్పీకర్‌కే ఉందని జైట్లీ పేర్కొన్నారు.
జైట్లీ వ్యాఖ్యలపై విపక్షాలు అభ్యంతరం 
జైట్లీ వ్యాఖ్యలపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. నాటి ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేరుస్తారో లోదో చెప్పాలని.. సీపీఎం ఎంపీ సీతారాం ఏచూరి సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందనడం అవాస్తవమని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్‌ పేర్కొన్నారు. తాను ఇది నిరూపిస్తానని, అరుణ్‌జైట్లీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేటు బిల్లును జైట్లీ మనీ బిల్లు అనడాన్ని ఎంపీ కపిల్‌ సిబల్‌ తప్పుబట్టారు. ప్రతి బిల్లు ఏదో ఒక రకంగా డబ్బుతో ముడిపడి ఉంటుందని, ఆ విధంగా చూస్తే ఏ బిల్లును రాజ్యసభలో పెట్టలేమన్నారు. ఆర్థికలోటు పూడ్చాలని తీసుకున్న బిల్లు మనీ బిల్లు కాదని స్పష్టం చేశారు.
ఈ అంశం లోక్‌సభ స్పీకరే తేలుస్తారన్న కురియన్  
కేవీపీ ప్రైవేటు బిల్లు.. మనీ బిల్లు అని అభ్యంతరాలు రావడంతో ఇక ముందుకు వెళ్లలేమని డిప్యూటీ స్పీకర్‌ కురియన్‌ ప్రకటించారు. ప్రైవేటు మెంబర్ బిల్లుపై చర్చ పూర్తయి ఓటింగ్‌కు సిద్ధంగా ఉందని, అయితే మనీ బిల్లు అవునా కాదా నిర్ణయించే అధికారం రాజ్యాంగం ప్రకారం రాజ్యసభకు లేదన్నారు. ఈ అంశం లోక్‌సభ స్పీకరే తేలుస్తారని చెప్పారు.
కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళన 
దీనిపై కాంగ్రెస్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభలో ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ సభ్యుల ఆందోళనతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను సోమవారానికి వాయిదా వేశారు.
బీజేపీ సభ్యులతో జతకట్టిన సుజనా చౌదరి..?
ఏపీ ప్రత్యేక హోదా బిల్లుపై ఓటింగ్‌కు వెళ్లకుండా యూటర్న్ తీసుకున్న నేపథ్యంలో విపక్ష సభ్యులంతా నినాదాలు చేస్తూ పోడియంలోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. కానీ బీజేపీ సభ్యులు మాత్రం బల్లలు చరిచి సంతోషం వ్యక్తం చేశారు. అయితే వారితో పాటు తాళం కలుపుతూ టీడీపీ ఎంపీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి సైతం కంటపడ్డారు. ఏపీకి శరాఘాతం లాంటి ఈ నిర్ణయంపై సుజనా బల్ల చరచడం వివాదంగా మారింది. 

17:30 - August 2, 2015

కర్నూలు: ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీల కోసం కేంద్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాటం చేయాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు డిమాండ్‌ చేశారు. ఈవిషయంలో ప్రతిపక్షాలను కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. రాష్ర్టంలో అభివద్ధి వికేంద్రీకరణ జరగాలని... అందుకోసం ఈ నెలలో సీపీఎం ఉద్యమం చేపడుతుందని తెలిపారు.

 

Don't Miss

Subscribe to RSS - ఎపికి