ఆంధ్రప్రదేశ్

15:05 - November 19, 2018

గుంటూరు : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి అయ్యే ఛాన్స్ ఉందని ఆ పార్టీకి చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 19వ తేదీ సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీ సీట్లు ఎక్కువ గెలిస్తే మూడో ఫ్రంట్‌‌లో చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వెలిబుచ్చారు. గతంలో దేవెగౌడ ప్రధాని ఎలా అయ్యారో గుర్తు చేశారు. తక్కువ ఎంపీ సీట్లు గెలిచినా దేవెగౌడ ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. ఎక్కడి నుండి పోటీ చేస్తారనే దానిపై స్పష్టత ఇచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను నరసరావు పేట నుంచి ఎంపీగా పోటీ చేస్తానని రాయపాటి తెలిపారు. 
ఇదిలా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్డీయే నుండి బయటకు వచ్చిన అనంతరం బాబు కేంద్రంపై దాడి తీవ్రతరం చేశారు. మూడో కూటమి ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పలు జాతీయ పార్టీ నేతలతో బాబు సమాలోచనలు జరిపారు. నవంబర్ 19వ తేదీ సోమవారం కోల్ కతాకు వెళ్లి మమతతో భేటీ కానున్నారు. మరి రాయపాటి జోస్యం ఫలిస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

11:51 - November 15, 2018

హైదరాబాద్ : మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఏపీ రాష్ట్రంలో ఐటీ సోదాలు ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. తమపై కేంద్రం వివక్ష చూపిస్తోందని..అందులో భాగంగానే తమ పార్టీకి చెందిన నేతలపై ఈడీ, ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారని స్వయంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఉమ్మడి రాష్ట్రంలో హోం మంత్రిగా పనిచేసిన దేవేందర్ గౌడ్, అతని కుమారుడు వీరేంద్ర నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. నవంబర్ 15వ తేదీ గురువారం ఉదయం 20 బృందాలుగా వచ్చిన ఐటీ అధికారులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తుండడం సంచలనం సృష్టిస్తోంది. డ్యూక్ బిస్కెట్ కంపెనీ, డీఎస్ఏ బిల్డర్స్ కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. 
లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని, ఐటీ చెల్లింపులు సక్రమంగా చెల్లించడం లేదనే ఆరోపణలతో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. అంతేగాకుండా రవి ఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్, డీెఎస్ఏ బిల్డర్స్ అండ్ కన్ స్ట్రక్షన్స్, శాంతారామ్ కన్ స్ట్రక్షన్స్ లపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. దీనిపై పూర్తి వివరాలు కాసేపట్లో తెలియనున్నాయి. 

13:35 - November 11, 2018

అమరావతి: ఆంద్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ ఆదివారం జరిగింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసంలోని ప్రజావేదికలో వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.  కొత్త మంత్రులుగా ఎన్ఎమ్డీ ఫరూక్, కిడారి శ్రావణ్ కుమార్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఫరూక్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా, శ్రవణ్ ఇంగ్లీషులో ప్రమాణం చేశారు.  ఈమంత్రి వర్గ విస్తరణతో చంద్రబాబు మంత్రివర్గంలో ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి కూడా క్యాబినెట్‌లో అవకాశం దక్కింది. కాగా 14 ఏళ్ల తర్వాత ఫరూక్ మళ్లీ చంద్రబాబు మంత్రి వర్గంలో స్ధానం సంపాదించుకున్నారు. నక్సల్స్ కాల్పుల్లో మరణించిన విశాఖజిల్లా అరకు ఎమ్మెల్యే  కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రవణ్ కు ముఖ్యమంత్రి కేబినెట్ లో స్ధానం కల్పించారు. శ్రవణ్ వారణాశి ఐఐటీలో మెటలార్జీ పూర్తి చేసి,సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నారు. మైనార్టీ సంక్షేమం, వైద్యా ఆరోగ్యశాఖను ఫరూక్ కు, గిరిజన సంక్షేమ శాఖను శ్రవణ్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. 

 

14:16 - November 10, 2018

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల సముదాయం "హ్యాపీనెస్ట్"కు మంచి స్పందన లభించింది. ఫ్లాట్ల బుకింగ్ కోసం ఆన్ లైన్లో  నమోదు చేసుకునేందుకు, కేవలం  300 ప్లాట్ల కోసం లక్ష మంది దాకా పోటీ పడ్డారు.  బుకింగ్ ప్రాంరంభించగానే ప్రపంచ వ్యాప్తంగా లక్ష మందికి పైగా పోటీ పడటంతో సర్వర్లు మొరాయించాయి. చాలామందికి ఆన్ లైన్ లో నమోదుకావటమే కష్టం అయ్యింది. డిసెంబర్  2020 నాటికి 1500 ఇళ్లు సిధ్ధం చేసేందుకు సీఆర్డీఎ అధికారులు యత్నాలు చేస్తున్నారు. మొదటి  రోజు బుకింగ్ చూస్తే ప్రపంచ వ్యాప్తంగా అమరావతిపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తెలియచేస్తోందని, నవంబర్ 15న రెండో విడత బుకింగ్ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. 

14:03 - October 31, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ కోడ్ లను ఎత్తివేశారు. ఏపీ రవాణా శాఖ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కోడ్ అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని బుధవారం మంత్రి అచ్చెన్నాయుడు తెలియచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే కోడ్ తో వాహనాల రిజిస్ట్రేషన్ చేపట్టనున్నట్లుచ, 39 నంబర్ సిరీస్ తో మరో 15  రోజుల్లో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించారు. కొత్త వాహనాలకు ఇకపై జిల్లాకు ప్రత్యేక కోడ్ ఉండదని, ఒకే కోడ్ తో వాహన రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. ఎలక్ట్రిక్ బస్సులకు నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. రెండున్నర రోజుల్లోనే అంకెల సిరీస్ మారిపోతుందని రవాణా శాఖ కమిషనర్ తెలిపారు. 15 రోజుల్లో కొత్త విధానం అమల్లోకి వస్తుందన్నారు. 

11:00 - October 29, 2018

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న కీలక నిర్ణయాన్ని కేటీఆర్ వెల్లడించారు. అమరావతి నిర్మాణానికి 100 కోట్లు ప్రకటించాలని మంత్రివర్గం సమ్మతితో కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. శంకుస్థాపన సమయంలో అమరావతికి  ప్రకటించాలని భావించారని...కానీ, ప్రధాని మోడీ ఏమీ ప్రకటించకపోవడంతో మౌనంగా ఉండిపోయారని పేర్కొన్నారు. ఒకవేళ తాను వంద కోట్లు ప్రకటించి.. ప్రధాని మోడీ ప్రకటించకపోతే వివాదం రాజుకుంటుందనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు కేటీఆర్ వివరించారు.
ఇక హైదరాబాద్‌లో నివసించే కోస్తా, రాయలసీమ ప్రజలకు తాను వ్యక్తిగతంగా అండగా ఉంటానని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కోస్తా, రాయలసీమ ప్రజలను ఇబ్బంది పెట్టే  పనులు టీఆర్ఎస్‌ ఏమీ చేయలేదని అన్న కేటీఆర్... అలాగే ఇబ్బంది పెట్టే పనులు చేయోద్దొంటూ కేటీఆర్ వారిని కోరారు.  

11:01 - October 25, 2018
శ్రీకాకుళం : ఏపీలో మరోసారి ఐటీ దాడుల కలకలం చెలరేగింది. ఈసారి ఉత్తరాంధ్ర ప్రాంతంపై ఐటీ అధికారులు ఫోకస్ చేశారు. విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలలో ఐటీ దాడుల కలకలం చెలరేగింది. వ్యాపారులు, రియల్ ఎస్టేట్ సంస్థలే టార్గెట్‌గా ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచి ఆదాయ పన్నుశాఖ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. 8 బృందాలుగా విడిపోయిన అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. 
 
ఉక్కునగరం విశాఖలోనే కాదు శ్రీకాకుళం జిల్లాలోనూ ఐటీ దాడుల కలకలం చెలరేగింది. రణస్థలం మండలం బంటుపల్లిలో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ డైరెక్టర్ ఈశ్వరరావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.
 
అటు విశాఖ జిల్లా గాజువాక మండలం దువ్వాడ ఎస్‌ఈజెడ్‌లో అధికారులు విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు. దువ్వాడలోని టీజీఐ, ట్రాన్స్‌వరల్డ్ బీచ్ శాండ్ కంపెనీలలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఉషోదయాలు చార్టెడ్ అకౌంట్ ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. తమిళనాడులోని మినరల్ కంపెనీకి చెందిన కొన్ని అకౌంట్లు ఇక్కడ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. నగంరలోని పలు కంపెనీలపైనా అధికారులు నిఘా పెట్టారు.
 
* విశాఖలో తెల్లవారుజాము నుంచి ఐటీ దాడులు
* దువ్వాడ ఎస్ఈజెడ్‌లో విస్తృత తనిఖీలు 
* 8 బృందాలుగా విడిపోయి తనిఖీలు
* గాజువాక మండలం దువ్వాడలోని టీజీఐ కంపెనీలో దాడులు
* నగరంలోని పలు కంపెనీలపైనా నిఘా
* ట్రాన్స్‌వరల్డ్ బీచ్ శాండ్ కంపెనీలో సోదాలు
* ఉషోదయాలు చార్టెడ్ అకౌంట్ ఇంట్లో సోదాలు 
* తమిళనాడులోని మినరల్ కంపెనీకి చెందిన కొన్ని అకౌంట్లు ఇక్కడ ఉన్నట్టు సమాచారం
* రియల్ ఎస్టేల్ కార్యాలయాల్లోనూ దాడులు
* రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ డైరెక్టర్ ఈశ్వరరావు ఇంట్లో సోదాలు
15:44 - October 23, 2018

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులోఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగిస్తూ ప్రభుత్వం ఈఏడాది ఆగస్టు 1న జారీ చేసిన జీవో నెంబరు 90ని  హైకోర్టు మంగళవారం కొట్టి వేసింది. వచ్చే 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఉమ్మడి హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్పెషల్ ఆఫీసర్ల పాలనను వ్యతిరేకిస్తూ మాజీ సర్పంచ్ లు  దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు ఈమేరకు తీర్పు ఇచ్చింది. స్పెషల్ ఆఫీసర్లుగా ప్రభుత్వం దిగువ కేడర్ ఉద్యోగులను నియమిస్తోందని, వారికి పాలనా అనుభవం లేకపోవటంవల్ల  గ్రామాల్లో  అభివృధ్ది కుంటుపడుతోందని, మాజీ సర్పంచ్ లు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాల పరిమితి ముగిసిన పంచాయతీలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్  ఆఫీసర్ల పాలనతో ఎంతకాలం పాలన సాగిస్తారని  వారు పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై వాదోపవాదాలు విన్న హైకోర్టు  వచ్చే 90 రోజుల్లోగా రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది. 

15:34 - October 21, 2018

హైదరాబాద్: మళ్లీ ఎన్నికలు వచ్చేశాయి.. నోట్ల ప్రవాహం మొదలయ్యింది. దేశవ్యాప్తంగా చూస్తే, ఎన్నికలకు అత్యధిక ఖర్చు పెట్టేది తెలుగు రాష్ట్రాల్లోనే అంటూ వెల్లడైన వివరాలు కలకలం రేపుతున్నాయి. ఎన్నికల ఖర్చులో తొలి రెండు స్థానాలను తెలుగు రాష్ట్రాలే ఆక్రమించగా.. మూడో స్థానాన్ని కర్నాటక, నాలుగో స్థానాన్ని తమిళనాడు ఆక్రమించాయి. 

2014 ఎన్నికలపై జాతీయ మీడియా చేసిన విశ్లేషణ ఆధారంగా చూస్తే.. ఎన్నికలకు అత్యధికంగా ఖర్చు పెడుతున్న అభ్యర్థుల్లో 60 శాతం మంది ..ఏపీ, తెలంగాణ, కర్నాటకల్లోనే ఉన్నారు. టికెట్ దగ్గర నుంచి ఓటు వరకూ ప్రతీ చోట నోట్ల ప్రవాహాన్ని పారించి.. ఎన్నికలను.. నోట్లు, సీట్లు, ఓట్లుగా మార్చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే.. ఓటర్లు ఎన్నుకుంటున్నారా... నేతలు ఓటర్లను కొనుక్కుంటున్నారా అన్న సందేహం కలగకమానదు.

ఎన్నికల ఖర్చు పై ఈసీ 28 లక్షలే పరిమితిని విధించినా.. దానికి ఎన్నో రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. తెలంగాణలో గత ఎన్నికల కంటే.. ఈ సారి 30 నుంచి 40 శాతం అధిక వ్యయం అవుతుందని అంచనా. ఒక్కో అభ్యర్థి సగటున 15 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని తెలుస్తోంది. పోటీ ఎక్కువగా ఉండదని భావించే రిజర్వ్‌డ్‌ స్థానాల్లోనే ఈసారి ఖర్చు 10 కోట్లను దాటిపోనుంది.


హైదరాబాద్‌ శివారు నియోజకవర్గాల్లో అయితే.. ఏకంగా 25 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అంచనా. అభ్యర్థుల ఖర్చు విషయంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా చేతులెత్తేస్తుండగా.. జాతీయ పార్టీలు ఏదో కొద్దిగా ఇస్తున్నాయి. కనీసం 25 కోట్లైనా ఖర్చు పెట్టే స్థోమత ఉంటేనే బరిలోకి దిగాలంటూ పార్టీలు కండిషన్‌ కూడా పెట్టేస్తున్నాయి. ఈ ఖర్చును భరించడానికి ఆస్తుల్ని అమ్ముకుని, భారీగా అప్పులు చేసి అభ్యర్థులు ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు.

11:49 - October 17, 2018

విజయవాడ : తిత్లీ తుపాను సాయంపై కేంద్రంపై టీడీపీ ఒత్తిడి పెంచుతోంది. తిత్లీ తుపాను ప్రభావంతో అతలాకుతలమైన  శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను ఆదుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు .. కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు ఓ లేఖను రాశారు. రెండు జిల్లాలను ఆదుకోవడానికి తక్షణ సాయంగా 1200 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కోరారు.  టీడీపీ ఎంపీలు  కేశినేని నాని, కొనకళ్ల  నారాయణ, మాగంటి బాబుతో పాటు మంత్రులు దేవినేని ఉమా, సోమిరెడ్డి గన్నవరం విమానాశ్రయంలో రాజ్‌నాథ్‌ను కలిశారు. సీఎం చంద్రబాబు రాసిన లేఖను ఆయనకు అందజేశారు. తుఫానుతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మొత్తం 3,435.29 కోట్ల నష్టం వాటిల్లినట్టు రాజ్‌నాథ్‌ దృష్టికి తీసుకొచ్చారు. నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని వెంటనే పంపాలని కోరారు.
శ్రీకాకుళం జిల్లాలోనే మకాం వేసిన ఏపీమంత్రి నారా లోకేష్‌.... సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వకున్నా... తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నడూ లేని విధంగా సహాయం అందిస్తున్నామన్నారు. రాజకీయాలకు ఇది సమయం కాదని,  పునరావాసం కల్పించడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టం అంచనాకు కేంద్ర బృందాలను వెంటనే పంపాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. రాజ్‌నాథ్‌ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లింది. మరి దీనిపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Pages

Don't Miss

Subscribe to RSS - ఆంధ్రప్రదేశ్