అసెంబ్లీ

19:55 - September 17, 2018

అమరావతి : తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించిన పరువు హత్య ప్రణయ్ దారుణ హత్యపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా  స్పందించారు. ప్రణయ్ హత్యపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కులమతాలకు అతీతంగా పిల్లలకు పెళ్లి చేయించాల్సిన బాధ్యత పెద్దలపై ఉందన్నారు. అహంకారం, అహంభావంతో మనుషులను చంపే స్థితికి దిగజారడం ఆందోళనకరమైన విషయమన్నారు. తాము పెళ్లికానుక పథకాన్ని తీసుకురావడం వెనకున్న ముఖ్య ఉద్దేశం కులాంతర వివాహాలను ప్రోత్సహించడమేనని చంద్రబాబు తెలిపారు. పెళ్లికానుక పథకంలో కులాంతర వివాహాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. 
తక్కువ కులం ఉన్న వ్యక్తిని కూతురు పెళ్లి చేసుకుందనే ఉద్దేశంతో కన్నకుమార్తె భర్తను కన్న తండ్రే చంపించాడంటే... ఈ సమాజంలో ఎంతటి అహంకారం పేరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చన్నారు. అబ్బాయి యోగ్యుడు అయి..అమ్మాయికి నచ్చినప్పుడు, పెళ్లి చేసుకుని వారిద్దరూ సంతోషంగా ఉంటారనే నమ్మకంతో తల్లిదండ్రులు వారివురికి వివాహం చేసి ఆశీర్వదించాలని..ఒకవేళ  వారి వివాహం కన్నవారికి ఇష్టం లేకపోతే..వారి మానాన వారిని వదిలేయాయని...ఇలా దారుణంగా హతమార్చడం అనాగరిక చర్య అని అన్నారు. ఈ హత్య వల్ల అమ్మాయి తండ్రి సాంధించింది ఏమీ లేదని ఇకనైనా తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవుసరం వుందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.

 

15:44 - September 10, 2018

విజయవాడ : పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల అన్ని వర్గాలకు భారంగా మారిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో ఆయన ఓ ప్రకటన చేశారు. పెట్రోల్ ధరలపై రూ. 2 వ్యాట్ ను తగ్గించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దాదాపు రూ. 1200 కోట్ల భారం ప్రభుత్వంపై పడనుందని తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ప్రస్తుతం రూ. 4లను ప్రభుత్వం వసూలు చేస్తోంది. ఇంధన ధరలు తగ్గించేందుకు నాలుగేళ్లుగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కేంద్రం బాధ్యతగా వహించి ఎక్సైజ్ పన్నును తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగానే ఉన్నాయని, రూ. 20 లక్షల కోట్లకు పైగా ప్రజలపై కేంద్రం అదనంగా భారం వేస్తోందన్నారు. 

09:14 - September 10, 2018

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలతో ఆయన సోమవారం సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. సభకు ఎవరూ గైర్హాజర్ కావొద్దని, చర్చలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ సమావేశాలకు వైసీపీ గైర్హాజర్ అయిన సంగతి తెలిసిందే. 

09:50 - September 8, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్దుతో ముందస్తు ఎన్నికలకు తెరలేసింది. రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయ సమీకణలు శరవేగంగా మారుతున్నాయి. అసలు కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి..ముందస్తుకు ఎందుకు వెళ్తున్నారు? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌... నమ్మకమే జీవితమన్నది ఆయన సూత్రం. అయితే తన మీద, తన పనితీరు మీద కాకుండా జాతకాలు, తిథులు, నక్షత్రాలు, రాశుల మీద నమ్మకం పెట్టుకోవటం ఆయన రివాజు. వాటి ప్రకారం నడుచుకోవటం.. నిర్ణయాలు తీసుకోవటమే కేసీఆర్‌కు పరమావధి. శాసనసభను రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనకు దేవుళ్లు, జాతకాలపై ఉన్న నమ్మకం తీవ్ర చర్చనీయాంశమవుతున్నది. ఫామ్‌హౌజ్‌లో చండీయాగం చేయటంతోపాటు ఇతర యాగాలను నిర్వహించటం, తెలంగాణతోపాటు ఏపీలోని పలు దేవాలయాలను సందర్శించి.. అక్కడి దేవుళ్లకు మొక్కులు చెల్లించటం, ఇందుకు ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలు వెచ్చించటం తదితర పరిణామాలన్నీ ఈ కోవలోకి చెందినవే. పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులను కలిసినప్పుడు ఆయన అనేకమార్లు వారి కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేసిన విషయం విదితమే. 
పక్కా ప్రణాళిక ప్రకారం శాసనసభ రద్దు
గురువారం గవర్నర్‌ను కలిసిన అనంతరం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో 'రాష్ట్రం బాగు కోసమే...' శాసనసభను రద్దు చేశామంటూ కేసీఆర్‌ ప్రకటించినప్పటికీ 'జాతకాలు, నమ్మకాలే...' ఇందుకు కారణమన్నది నిర్వివాదాంశం. ఆ రోజు ప్రగతి భవన్‌లో నిర్వహించిన మంత్రివర్గ సమావేశానికి ముందు కేసీఆర్‌ వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అంటే పక్కా ప్రణాళిక ప్రకారం.. జాతకాన్ని చూసుకునే కేసీఆర్‌ శాసనసభను రద్దు చేశారని విదితమవుతున్నది. మరోవైపు సెప్టెంబరులోనే ఆయన సభను రద్దు చేయటానికిగల కారణాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. గతంలో సిద్ధిపేట ఎమ్మెల్యేగాను, ఆ తర్వాత కరీంనగర్‌గా ఎంపీగానూ పనిచేసిన కేసీఆర్‌.. ఉప ఎన్నికల సందర్భంగా ఆయా పదవులకు రాజీనామా చేసింది కూడా సెప్టెంబరులోనే. అంటే ఆ నెల తనకు బాగా అచ్చొచ్చిందని ఆయన భావించారు. అందుకనుగుణంగానే సెప్టెంబరులోనే సభను రద్దు చేశారని విదితమవుతున్నది. మరోవైపు అసెంబ్లీని రద్దు చేసినప్పటి నుంచి ఆయన అపర చాణుక్యుడు.. మంచి వ్యూహకర్త అంటూ మీడియా ఆకాశానికెత్తేసిన తరుణంలో... వీటికంటే మించి పలు పథకాల్లోని వైఫల్యాలే కేసీఆర్‌ను ముందస్తుకు వెళ్లేలా ముందుకు నెట్టాయని ఓ కీలక అధికారి వ్యాఖ్యానించారు.
ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత 
పైకి కేసీఆర్‌ ఎంతో ధైర్యంగా ఉన్నట్టు కనబడుతున్నా అనేక ప్రతిష్టాత్మక పథకాలు పూర్తి కాకపోవటం ఆయన్ను మానసికంగా ఇబ్బందికి గురి చేస్తున్నదని సమాచారం. దీనికితోడు పదిహేను రోజులకొకసారి, నెల రోజులకొకసారి వాటిపై సుదీర్ఘ సమీక్షలు నిర్వహించటం.. ఆ తర్వాత నిర్ణీత గడువులోగా వాటిని పూర్తి చేయాలని ఆదేశించటం ఆయనకు ఆనవాయితీగా మారింది. ఇదే సమయంలో వాటిని పూర్తి చేసేందుకు నిర్దిష్టంగా కొన్ని తేదీలను కూడా ఆయన ప్రకటించేవారు. గత నెలలో మిషన్‌ భగీరథ మీద ఆయన రివ్యూ నిర్వహించారు. ఆగస్టు 15 అర్థరాత్రి నుంచి రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా నీటిని అందిస్తామంటూ ఆ సందర్భంగా ప్రకటన విడుదల చేశారు. దీనిపై ఇప్పుడు ఆయన నోరెత్తటం లేదు. రాజీనామా అనంతరం అపద్ధర్మ ముఖ్యమంత్రిగా తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలోనూ ఆయన దాని గురించి ప్రస్తావించకపోవటం గమనార్హం. దీంతోపాటు పెన్షన్ల పంపిణీ కూడా కేసీఆర్‌కు ఇబ్బందికరంగా మారింది. తెలంగాణ వచ్చిన తర్వాత వీటిని భారీ స్థాయిలో పెంచిన సంగతి తెలిసిందే. తొలుత ప్రతినెలా మొదటి వారంలో చేతికందిన పెన్షన్లు.. ఇప్పుడు చివరి వారానికిగానీ రావటం లేదన్నది బాధితుల ఆవేదన. వీటితోపాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ సమస్య కూడా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెద్ద ఇబ్బందిగా మారింది. షరా మామూలుగా దళితులకు మూడెకరాల భూ పంపిణీ, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, లక్షలాది ఉద్యోగులు... ఇవన్నీ తీరని సమస్యలుగా ఉన్నాయి. వీటిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది. ఇది ఇంకా పెరగకముందే ముందస్తుకు వెళ్లాలని కేసీఆర్‌ యోచించారు. అందులో భాగంగానే ఆర్నెళ్ల క్రితం నుంచే తన పరివారంతో సమాలోచనలు జరిపారు. తనకు జాతకాల మీదున్న నమ్మకంతో పక్కా వ్యూహం ప్రకారం.. సెప్టెంబరులోనే శాసనసభను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న కేసీఆర్‌ను లోన మాత్రం పథకాల వైఫల్యాల భయం వెంటాడుతున్నదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు సంఖ్యా శాస్త్రం దృష్ట్యా కూడా కేసీఆర్‌ 'ఆరు' అనే అంకెను అదృష్ట సంఖ్యగా భావిస్తారు. ఈ క్రమంలోనే 105 మంది అభ్యర్థుల జాబితాను ఆయన ప్రకటించారు. ఇక్కడ ఒకటి, సున్న, ఐదులను కలిపితే 'ఆరు' వస్తుంది. ఈ జాబితాను ప్రకటించిన తేదీ కూడా ఆరే కావటం గమనార్హం.

 

19:49 - September 7, 2018

ఢిల్లీ : సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సీపీఐ నేత నారాయణ మరోసారి తన సహజశైలితో తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రిపై తనదైన శైలిలో విమర్శలు చేసారు. శోభనం పెళ్లికొడుకుతో కేసీఆర్ ను పోల్చిన నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీని రద్దు చేసి హడావిడి చేస్తున్న కేసీఆర్ వ్యవహారశైలిపై ఆయన విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లక్ష్మణ రేఖ దాటారని..ముందస్తు ఎన్నికల కోసం కేసీఆర్ చేస్తున్న హడావిడి ఎలా వుందంటే..అంటు దీర్ఘం తీసిన నారాయణ ''శోభనం గది నుంచి మధ్య రాత్రి పారిపోయిన పెళ్లికొడుకు, ఇప్పుడు మళ్లీ పెళ్లి చేయండి సత్తా చాటుతా'' అన్నట్టుగా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

14:59 - September 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ మాజీ సీఎంగా ప్రజల చేత ఎన్నుకోబడిన కేసీఆర్ అనుకున్నదే చేశారు. తాను అనుకున్న ప్రకారం తన పంతాన్ని నెగ్గించుకున్నారు. రాజ్యాంగపరంగా ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్న కేసీఆర్ కొనసాగిస్తున్నట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి నోటిఫికేషన్ జారీ చేశారు. కేసీఆర్ ను ఆపద్ధర్మ సీఎంగా కొనసాగిస్తూ, జీవో నెంబర్ 134ను జోషి జారీ చేశారు. కాగా తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయాలంటూ కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు. అనంతరం మీడియాకు గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ హర్ ప్రీత్ సింగ్ తరపున ప్రెస్ రిలీజ్ అందింది.

10:43 - September 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలపై సస్పెన్షన్ కొనసాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ రద్దుకు నేడు ముహూర్తం ఖరారు అయింది. మధ్యాహ్నం అసెంబ్లీ రద్దుపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. మధ్యాహ్నం 1.30లోపు అసెంబ్లీ రద్దు తీర్మానం చేయనుంది. అనంతరం సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. కేబినెట్ సిఫారసు లేఖను కేసీఆర్ గవర్నర్ నరసింహన్ కు అందించనున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడంపై వివరణ ఇవ్వనున్నారు. అనంతరం మంత్రులతో కలిసి కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

మంత్రులకు అధికారిక సమాచారం అందింది. మంత్రుల వద్ద పెండింగ్ ఫైళ్లన్నీ క్లియర్ చేయనున్నారు. స్పీకర్ మధుసూదనాచారి భూపాలపల్లి పర్యటనను రద్దు చేసుకొని తిరిగి హైదరాబాద్ కు చేరారు. ఉదయం నుంచి కేబినెట్ భేటీపై సస్పెన్స్ నెలకొంది. ఇవాళ ఉదయం 6.30 గంటలకు కేబినెట్ సమావేశం ఉంటుందని అనుకున్నా...జరగలేదు. ఇప్పటివరకు మంత్రివర్గం సమావేశం కాలేదు. మధ్యాహ్నం 1.30లకు సమయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. మొత్తంగా కేబినెట్ భేటీపై ఉత్కంఠ నెలకొంది. 

 

17:17 - September 5, 2018

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కంటే హీట్ ను పెంచుతున్నాయి. ఈ సారి కూడా వైసీపీ సభకు హాజరవుతుందా ? లేదా ? అనే చర్చ జరుగుతోంది. సమావేశాలకు హాజరుపై వైసీపీ ఓ లేఖ రాసింది. స్పీకర్ కోడెల, సీఎం చంద్రబాబు నాయుడులకు వైసీపీ నాలుగు పేజీల లేఖ రాసింది. స్పీకర్ కోడెల విజ్ఞాపన మేరకు ఈ లేఖను రాస్తున్నామని, పార్టీ ఫిరాయించిన మంత్రులను, 22 మంది ఎమ్మెల్యేలను తక్షణం తొలగించాలని లేఖలో డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని, ఈ విషయాన్ని 2017 అక్టోబరులో శాసనసభ సమావేశాల సందర్భంగా చెప్పామని గుర్తు చేశారు. వెంటనే వారిని తొలగిస్తే తాము సమావేశాలకు హాజరవుతామని కండీషన్ పెట్టింది. ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న ఈ అంశాలను ప్రభుత్వం, స్పీకర్ పరిష్కరిస్తారా ? అనేది వేచి చూడాలి. 

14:07 - September 5, 2018

ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుండి ప్రారంభం కానున్నాయి. 10-15 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం స్పీకర్ కోడెల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. స్పీకర్ కోడెల వేర్వేరుగా ఈ సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో అధికారులకు స్పీకర్ కోడెల పలు సలహాలు సూచనలు చేశారు.

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బందోబస్తు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశాలకు మీడియా పాస్‌లు ఉన్నవారిని మాత్రమే లోపలికి రానివ్వాలని, సమావేశాల సందర్భగా భోజనాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సభ్యులు అడిగే ప్రతీ ప్రశ్నకు సమాధానం అందించే విధంగా చూడాలని అన్నారు. 

13:54 - August 13, 2018

నిజామాబాద్ : క్రమ శిక్షణకు ఆయన మారుపేరు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి స్పీకర్‌గా మెప్పించారు. అయినా గత రెండు ఎన్నికల్లో ఆయన ఓటమిచెందారు. లోకల్‌ నియోజకవర్గాన్ని కాదని వెళ్లిన ఆయనకు గడ్డు పరిస్థితి ఎదురైంది. దీంతో మరోసారి లోకల్‌ నియోజకవర్గంపై దృష్టి సారించారు.  బాల్కొండ నుంచి మరోసారి బరిలోకి దిగాలని యోచిస్తున్న సురేష్‌రెడ్డి పాలిటిక్స్‌పై కథనం..
సురేష్‌రెడ్డి ఎన్నికల పోటీపై ఆసక్తి 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన సురేష్‌రెడ్డి ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తి రేపుతోంది. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ఆయన.. అదే నియోజకవర్గం నుంచి వరుసగా 1989, 1994,1999,2004 ఎన్నికల్లో గెలుపొందారు.నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో స్పీకర్‌గా పనిచేసి మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ అనిపించుకున్నారు. 2009 ఎన్నికల్లో సురేష్‌రెడ్డి బాల్కొండ నియోజకవర్గాన్ని వదిలి ఆర్మూర్‌ నియోజకవర్గానికి షిఫ్ట్‌ అయ్యారు. అంతే  అప్పటి వరకు కొనసాగిన ఆయన జైత్రయాత్ర అక్కడితో ఫుల్‌స్టాఫ్‌ పడింది. 2009,2014 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఓడిపోయారు.  9ఏళ్లుగా ఆర్మూర్‌ నియోజకవర్గ ఇంచార్జీగా కొనసగుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లోకీలకనేతగా ఉంటూ... జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గాలపై కన్నేసిన ఆయన... రెండు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఏ నియోజకవరగం నుంచి పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. ఫలితంగా కాంగ్రెస్‌ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. నాలుగుసార్లు గెలిచిన బాల్కొండ సేఫ్‌ జోన్‌గా ఉంటుందా.. లేక రెండుసార్లు ఓడిపోయిన ఆర్మూర్‌ లో సానుభూతి వర్కవుట్‌ అవుతుందా అన్నది ఆయన తేల్చుకోలేక సతమతమవుతున్నారు. 
బాల్కొండపై కన్నేసిన ఈరపతి అనిల్‌
సురేష్‌రెడ్డి ఆర్మూర్‌కు షిఫ్ట్‌కాగానే... బాల్కొండ నియోజకవర్గంలో ఈరపతి అనిల్‌ జెండా పాతారు. నియోజకవర్గ ఇంచార్జీగా కాంగ్రెస్‌లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆర్మూర్‌ నియోజకవర్గం ఇంచార్జీగా ఉన్న సురేష్‌రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలోని తన అనుచరులకు పదవుల ఇప్పించుకోవడం, సొంత నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం, బాల్కొండ నుంచే  సురేష్‌రెడ్డి పోటీ చేస్తారన్న  ప్రచారం జోరుగా సాగుతోంది. సురేష్‌రెడ్డి ఆర్మూర్‌లో కాకుండా బాల్కొండపై ఫోకస్‌ పెట్టడంతో నియోజకవర్గ ఇంచార్జీ అనిల్‌ అతనిపై గుర్రుగా ఉన్నారు. తన నియోజకవర్గంలో ఆయన పెత్తనం ఏంటంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ మధ్యే కాంగ్రెస్‌లోచేరిన రాజారాం యాదవ్‌ సైతం బాల్కొండ టికెట్‌ ఆశిస్తున్నారు.  అనిల్‌, సురేష్‌రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతుండడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.  మరోవై
ఆర్మూర్‌పై దృష్టిపెట్టిన ఆకుల లలిత
ఆర్మూర్‌ నుంచి బాల్కొండకు సురేష్‌రెడ్డి షిఫ్ట్‌ అవుతారనే  సమాచారంతో ఎమ్మెల్సీ ఆకుల లలిత ఆర్మూర్‌పై కన్నేసింది. మరో సీనియర్‌ నాయకురాలు తన వారసుడిని నిలబెట్టి ఎమ్మెల్యే చేయడానికి టిక్కెట్టు కోసం పట్టుబడుతున్నారు. మొత్తానికి సురేష్‌రెడ్డి ఏ నియోజకవర్గం నుంచి సార్వత్రిక సమరంలో పోటీ చేస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది.

 

Pages

Don't Miss

Subscribe to RSS - అసెంబ్లీ