ఢిల్లీకి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Submitted on 16 June 2019
T Congress MLA Komatireddy Rajagopal Reddy May Join BJP

నల్లగొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. జూన్ 17వ తేదీ సోమవారం ఢిల్లీ వెళ్లనున్న రాజగోపాల్‌రెడ్డి.. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాను కలిసి కమలదళంలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.  

అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమికి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వమే కారణమని  విమర్శించిన రాజగోపాల్‌రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదన్న నిర్ణయానికి వచ్చారు. దేశప్రజలంతా బీజేపీ, ప్రధాని మోదీ వైపు చూస్తున్నారన్న వాదాన్ని వినిపించారు. 

కాంగ్రెస్‌ అధినాయకత్వం  తెలంగాణ ఇచ్చినా నాయకత్వ లోపం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలోపేతం కావడం లేదన్న అభిప్రాయంతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రి  కేసీఆర్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయడం కాంగ్రెస్‌ వల్ల కాదన్న అంచనాకు వచ్చారు.  ఇది పార్టీపై చూపుతోందన్న బాధ, అసంతృప్తి, ఆవేదనతో రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు.  

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయమన్న గట్టి నిర్ణయానికి వచ్చిన రాజగోపాల్‌రెడ్డి.. కమలదళంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌  కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని పార్టీ అధిష్ఠానం మార్చకపోవడంతోనే కాంగ్రెస్‌కు  ఈ దుస్థితి పట్టిందని ఘాటు విమర్శలు చేశారు.

కాంగ్రెస్ టికెట్‌పై  గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరినా రాష్ట్ర నాయకత్వం స్పందించకపోవడాన్ని కోమటిరెడ్డి తప్పుపట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో  కాంగ్రెస్‌  ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ  ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాజీనామాకు సిద్ధమైన విషయాన్ని గుర్తు చేశారు.

పీసీసీ నాయకత్వం మాత్రం పదవులను పట్టుకొని వేలాడుతోందని మండిపడ్డారు. రాహుల్‌గాంధీ  నాయకత్వంలో దేశంలో కాంగ్రెస్‌  బలహీనపడిందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయన్నది రాజగోపాల్‌రెడ్డి వాదన. మరి ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా ? లేదా ? అనేది వెయిట్ అండ్ సీ.

t congress
MLA Komatireddy Rajagopal
Join BJP
Jaggareddy
Sangareddy MLA


మరిన్ని వార్తలు