లోకేష్‌ను ఇరికించారు : కర్నూలు నుంచి పోటీ చేయాలన్న ఎస్వీ

Submitted on 17 February 2019
Sv Mohan Reddy Vs TG Bharat, Kurnool TDP Ticket Politics

కర్నూలు: ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ కర్నూలు జిల్లా టీడీపీలో రాజకీయం వేడెక్కింది. సొంత పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుతోంది. టీడీపీ నుంచి కర్నూలు అసెంబ్లీ సీటు ఆశిస్తున్న ఇద్దరు నేతలు.. కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీని ద్వారా తమకు సీటు రాకపోయినా ఫర్వాలేదు కానీ.. ప్రత్యర్థికి మాత్రం రాకూడదని గట్టిగా కోరుకుంటున్నారు. కర్నూలు అసెంబ్లీ సీటును సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, టీజీ భరత్‌ ఆశిస్తున్నారు. గతంలో ఓసారి కర్నూలు పర్యటన సందర్భంగా మంత్రి లోకేశ్‌.. ఎస్వీ మోహన్‌రెడ్డి కర్నూలు నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. అప్పటి నుంచి కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో.. ఎస్వీ, టీజీ కుటుంబాల మధ్య వివాదం రాజుకుంది. కర్నూలు సీటును ఎలాగైనా దక్కించుకునేందుకు.. ఇద్దరు నేతలు ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరూ కర్నూలు టౌన్‌లో పర్యటిస్తూ.. నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐవీఆర్‌ఎస్‌ సర్వే చేసి తనకు సీటు కేటాయించాలని టీజీ భరత్ అంటుంటే.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రజల్లో తనకే బలముందని ఎస్వీ మోహన్‌రెడ్డి చెబుతున్నారు. ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ఎప్పటికపుడు వ్యూహాలు రచిస్తున్నారు.

 

కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. మంత్రి లోకేష్ పేరుని తెరపైకి తెచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని లోకేశ్ అనుకుంటే‌.. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని ఎస్వీ కోరారు. లోకేష్ కోసం తన సీటుని త్యాగం చేస్తానని ఆయన చెప్పారు. తనను ఎమ్మెల్యేగా ప్రకటించిన లోకేశ్‌పై ఉన్న అభిమానం, గౌరవంతో సీటును లోకేశ్‌ కోసం త్యాగం చేస్తున్నట్లు ఎస్వీ మోహన్‌రెడ్డి తెలిపారు. కర్నూలు నుంచి లోకేశ్‌ పోటీ చేస్తే.. మరో స్థానం నుంచి టికెట్‌ అడగబోనన్నారు. కేవలం లోకేశ్‌‌కు మాత్రమే సీటు ఇస్తాను తప్ప.. వేరే వారికి మాత్రం అవకాశం ఇవ్వబోనని ఎస్వీ తేల్చి చెప్పారు.

 

ఎస్వీ మోహన్‌ వ్యాఖ్యలకు టీజీ భరత్ కౌంటర్ ఇచ్చారు. ఆయన మరో కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. లోకేశ్‌ను కర్నూలు పోటీ చేయమని ఎస్వీ మోహన్‌రెడ్డి ఇప్పుడు చెబుతున్నారని... గతంలోనే తాను సీఎం చంద్రబాబును కర్నూలు నుంచి పోటీ చేయాలని కోరానని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు కర్నూలు నుంచి పోటీ చేస్తే....జిల్లా బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. చంద్రబాబు కర్నూలు నుంచి పోటీ చేస్తే...75వేల ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. లోకేశ్‌ కుప్పం నుంచి, చంద్రబాబు కర్నూలు నుంచి పోటీ చేయాలని టీజీ భరత్ కోరారు.

 

ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు...ఒకే సీటు కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతుండటంతో చంద్రబాబు సమస్యను ఎలా పరిష్కరిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎస్వీ మోహన్‌ రెడ్డి, టీజీ భరత్‌లను కాదని...కేఈ చెప్పినట్లు కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి కుటుంబానికి ఇస్తారా అన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

kurnool assembly ticket
TDP
sv mohan reddy
tg bharat
Nara Lokesh
cm chandrababu
andhra politics
ap assembly elections

మరిన్ని వార్తలు