ఎమ్మెల్యే త్యాగం : కర్నూలు సీటు లోకేష్‌కి ఇస్తానన్న ఎస్వీ

Submitted on 17 February 2019
SV Mohan Reddy Intersting Comments On Nara Lokesh

కర్నూలు: టీడీపీ నేత, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి లోకేష్ పోటీ చేయాలని అనుకుంటే.. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఎస్వీ కోరారు. లోకేష్ కోసం తన సీటుని త్యాగం చేస్తానని చెప్పారాయన. తనను కర్నూలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన లోకేష్‌పై ఉన్న అభిమానం, గౌరవంతో సీటుని త్యాగం చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. కర్నూలు నుంచి లోకేష్ పోటీ చేస్తే తాను మరోస్థానం నుంచి టికెట్ అడగబోనని స్పష్టం చేశారు. అయితే లోకేష్‌కు తప్ప మరెవరికి తాను సీటు త్యాగం చేయనని ఎస్వీ తేల్చి చెప్పారు.

 

రాష్ట్రంలో మొట్టమొదట కర్నూలు నుంచి టీడీపీ అభ్యర్థిని లోకేష్ ప్రకటించిన విషయాన్ని ఎస్వీ మోహన్ రెడ్డి గుర్తు చేశారు. భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని లోకేష్ పిలుపునిచ్చారని, రాష్ట్రంలోనే నాకొక గౌరవప్రదమైన గుర్తింపు ఇచ్చారని ఎస్వీ చెప్పారు. ఆ అభిమానంతోనే కర్నూలు నుంచి లోకేష్ పోటీ చేయాలని తాను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని ఎస్వీ అన్నారు. లోకేష్ కర్నూలులో కంటెస్ట్ చేస్తే తాను ఎక్కడా సీటు కూడా అడగను అని చెప్పారు. లోకేష్ గెలుపు కోసం తాను, తన కుటుంబసభ్యులు, నాయకులు,   కార్యకర్తలు కృషి చేస్తామని ఎస్వీ చెప్పారు.

 

లోకేష్ కనుక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటే.. కర్నూలు నుంచి పోటీ చేయాలని, లోకేష్ కోసం తన సీటుని త్యాగం చేస్తానని ఎస్వీ చేసిన వ్యాఖ్యలు కర్నూలు టీడీపీ వర్గాల్లో  చర్చనీయాంశంగా మారాయి. కర్నూలు అసెంబ్లీ సీటు కోసం టీడీపీలో చాలా పోటీ ఉంది. టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ సహా పలువురు నాయకులు కర్నూలు టికెట్ కోసం తీవ్రంగా  పోటీపడుతున్నారు. పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. తనకే టికెట్ ఇవ్వాలని టీజీ భరత్ ఏకంగా సీఎం చంద్రబాబుతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ తరుణంలో ఎస్వీ చేసిన కొత్త  చర్చకు తెరలేపాయి.

kurnool mla sv mohan reddy
TDP
Nara Lokesh
tg bharat
nara lokesh contest
assembly elections
kurnool seat for lokesh

మరిన్ని వార్తలు