ఎన్ కౌంటర్లపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే సంచలన వ్యాఖ్యలు

Submitted on 7 December 2019
Supreme Court Chief Justice Bobde Sensational Comments on encounters

దిశ నిందితుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీకారం తీర్చుకోవడమే న్యాయం చేయడం కాదన్నారు. పగ తీర్చుకోవడం వల్ల న్యాయానికి ఉన్న గుణం పోతుందని చెప్పారు. రాజస్థాన్ హైకోర్టులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన బాబ్డే ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయ విచారణ జరిగాకే శిక్షలు విధించాలన్నారు. తక్షణ న్యాయం అడగడం సరికాదని చెప్పారు.

దిశ హత్యాచారం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దిశ కేసు విషయం సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. న్యాయవాదులు జీఎస్. మణి, ప్రదీప్ కుమార్‌లు శనివారం (డిసెంబర్7, 2019) పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్ కౌంటర్ ఘటనలపై 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్ కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

(డిసెంబర్6, 2019) తెల్లవారుజామున షాద్ నగర్‌ దగ్గర చటాన్ పల్లిలో నిందితులు దాడి చేసి పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో నలుగురు నిందితులు (ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్న కేశవులు)లు చనిపోయారు. ఘటన జరిగిన అనంతరం దిశకు న్యాయం కలిగిందని సమాజం చెబుతోంది. ఎన్ కౌంటర్‌కు సంబంధించిన అంశాలు వెలుగులోకి రావాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. దీంతో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పిటిషనర్లు నలుగురిని ప్రతివాదులుగా చేర్చారు. కేంద్ర హోం శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ డీజీపీ, పోలీసు కమీషనర్ సజ్జనార్‌లను ప్రతివాదులుగా చేర్చారు. మహారాష్ట్రలో జరిగిన ఓ ఎన్ కౌంటర్‌కు సంబంధించి సుప్రీంకోర్టు 16 మార్గదర్శకాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. అత్యవసర పరిస్థితుల్లో అనుకోకుండా ఎన్ కౌంటర్ జరిగిందా ? జీవించే హక్కుకు భంగం కలిగించే విధంగా ఎన్ కౌంటర్ జరిగిందా ? అన్న అంశాలను ప్రస్తావించారు. సమగ్ర విచారణ జరిగే విధంగా ఆదేశాలు ఇవ్వాలని, సిట్, సీబీఐ, సీఐడీ చేత దర్యాప్తు చేయించాలని కోరారు. 

దిశ హత్యాచార నిందితులను పోలీసులు శుక్రవారం(డిసెంబర్ 6, 2019) తెల్లవారు జామున ఎన్‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి దగ్గర క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. (నవంబర్27, 2019) దిశపై నలుగురు నిందితులు అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం మృతదేహాన్ని చటాన్‌పల్లి బ్రిడ్జి దగ్గర కాల్చివేశారు. దిశ కేసులో నిందితులను గురువారం (డిసెంబర్5, 2019) పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.


 

Supreme Court
Chief Justice
Bobde
Sensational
Comments
encounters
disha accused

మరిన్ని వార్తలు