ఆఫర్‌ అన్నారు.. ఆస్పత్రికి పంపారు

Submitted on 16 February 2019
Stampede at shopping malls in Siddipeta

సిద్దిపేట : సిద్దిపేటలో ఓ షాపింగ్ పెట్టిన ఆఫర్‌.. మహిళల ప్రాణాల మీదకు తెచ్చింది. షాప్‌ యాజమాన్యం నిర్లక్ష్యంతో తొక్కిసలాట జరిగింది. 20 మందికి పైగా మహిళలకు గాయాలయ్యాయి. పలువురు మహిళలు అక్కడే సొమ్మసిల్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు.. షాపింగ్ మాల్‌పై కేసు నమోదు చేశారు.

పది రూపాయలకే చీర.. ముందు వచ్చిన వారికి ప్రాధాన్యత అంటూ సిద్ధిపేటలో ఓ షాపింగ్‌ మాల్‌ యాజమాన్యం ప్రచారం చేసింది. దీంతో మహిళలు భారీగా తరలివచ్చారు. షాప్‌ యాజమాన్యం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా.. షాప్‌ షట్టర్‌ ఓపెన్‌ చేయడంతో.. మహిళలంతా ఒక్కసారిగా లోపలికి చొచ్చుకుపోయారు. దీంతో తొక్కిసలాట జరిగి 20 మందికి పైగా మహిళలకు గాయాలయ్యాయి. పలువురు వృద్ధులు సొమ్మసిల్లారు.

తొక్కిసలాట సమయంలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు.  ఓ మహిళ నుంచి దుండగులు 5 తులాల బంగారం చోరీ చేశారు. ఏటీఎం కార్డు, నగదును అపహరించారు. యాజమాన్యం ఆఫర్లంటూ ఊదరగొట్టి..  కనీసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదంటూ మహిళలు మండిపడుతున్నారు. తమ ప్రాణాలతో చెలగాటమాడారని దుమ్మెత్తిపోస్తున్నారు. షాపింగ్ మాల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. తమకు ఆస్పత్రి ఖర్చులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

Stampede
shopping malls
siddipeta

మరిన్ని వార్తలు