• Sharebar

రాజకీయ ఖిల్లా గుంటూరు జిల్లా

21:27 - March 11, 2014
 
00:00

          వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన గుంటూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రధాన రాజకీయ కేంద్రం. ఇక్కడి నుండి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన నేతలు రాష్ట్రంతోపాటు, దేశ స్థాయి రాజకీయాల్లో కీలకమైన వ్యక్తులుగా గుర్తింపు పొందుతారన్న నానుడి ఉంది. కాంగ్రెస్ పార్టీ జెండాను రాష్ట్రంలో రెపరెపలాడించిన నియోజకవర్గాల్లో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఒకటి. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పడగా, ఇప్పటి వరకు జరిగిన 15 పార్లమెంట్ ఎన్నికల్లో 12 సార్లు కాంగ్రెస్ గెలిచింది. రెండుసార్లు టిడిపి, ఓసారి ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. 2004 ఎన్నికల తీరును పరిశీలిస్తే అభ్యర్థి రాయపాటి సాంబశివరావు 1,29,792 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాయపాటి 2009 ఎన్నికల్లోను తిరిగి విజయబావుటా ఎగురవేశారు. 2009లో మారిన రాజకీయ సమీకరణాల్లో రాయపాటి 39,355 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 6 సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా పొన్నూరు అసెంబ్లీ స్థానంలో టిడిపి అభ్యర్థి ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ గెలుపొందారు.
రాయపాటి అభివృద్ధి కార్యక్రమాలు
       
గడచిన నాలుగున్నరేళ్ళ కాలంలో గుంటూరు ఎంపిగా ఉంటూ రాయపాటి సాంబశివరావు ఎంపి నిధుల ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేశారు. ఉన్నది ఉన్నట్లు నిక్కచ్చిగా చెప్పే వ్యక్తిత్వం రాయపాటిది కావటంతో ఆయనకు నియోజకవర్గ ప్రజల్లో మంచి ఇమేజే ఉంది. మంత్రి కన్నాతో నెలకొన్న వైరం మినహా పార్టీలోని ఇతర నేతలందరితో ఆయన సఖ్యతగానే వ్యవహరిస్తారన్న పేరుంది.
ఈసారి కూడా త్రిముఖ పోటీ
     
ప్రస్తుతం 2014 ఎన్నికలకు కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటికే కొత్త ముఖాలు రాజకీయ తెరంగేట్రం చేసి గుంటూరు పార్లమెంట్ నుండి బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈసారి కూడా త్రిముఖ పోటీ కొనసాగబోతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరపున సినీనటుడు కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ దాదాపుగా ఖరారు చేయగా, వైకాపా ఇప్పటికే తమ పార్టీ అభ్యర్ధిగా మాజీ ఎంపి వల్లభనేని బాలశౌరి పేరును ఖరారు చేసింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎంపి రాయపాటి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ పెద్ద ఎత్తున అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈ నేపథ్యంలో పార్టీలో సీనియర్ గా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను ఎంపీగా ఆ పార్టీ బరిలోకి దించుతుందా? లేక కుల సమీకరణలో భాగంగా వైకాపా కాపు అభ్యర్థిని, టిడిపి కమ్మ అభ్యర్థిని రంగంలోకి దించిన నేపధ్యంలో వీరందరిని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలీని బరిలోకి దించుతుందా? అన్నది చర్చనీయాంశంగా వుంది. ఇక గెలుపు అవకాశాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలే లేవు. ప్రధానంగా పోటీ అంటూ ఉంటే వైకాపా, తెలుగుదేశం పార్టీ నడుమే సాగనుంది. ఈ రెండు పార్టీల అభ్యర్థులు ఎన్నికలను ఎదుర్కొనేందుకు ముందస్తు వ్యూహంతోనే కదులుతున్నారు. ఎవరికి వారే గెలుపుపై ధీమాలో ఉన్నారు. అర్థికంగా ఇద్దరు నేతలు బలవంతులు కావటంతో డబ్బుకూడా ఏరులై పారే అవకాశం లేకపోలేదు. వైఎస్ చేపట్టిన కార్యక్రమాలు, జగన్ ఛరిష్మా తన గెలుపుకు దోహదం చేస్తాయని వైకాపా అభ్యర్ధి వల్లభనేని బాలశౌరి బలంగా విశ్వసిస్తున్నారు. ఇక టిడిపి అభ్యర్థి గల్లా జయదేవ్ కూడా సూపర్ స్టార్ కృష్ణ సొంత గ్రామం గుంటూరు పార్లమెంట్ పరిధిలోనే ఉండటంతో ఆయన ఇమేజ్ తోపాటు, కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత తనకు లాభిస్తుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున తిరిగి రాయపాటి బరిలోకి దిగే పక్షంలో మూడు పార్టీల అభ్యర్థుల మధ్య పోరు హోరాహోరీగా ఉండే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

Tags: 

టాప్ స్టోరీస్