డేంజర్ బెల్స్ : తెలంగాణకు సమ్మర్ లో నీటి కష్టాలు

Submitted on 11 February 2019
Special Story on Groundwater Levels Decreases in Telangana

- పాతాళానికి పడిపోతున్న జలం
- భూమిలో తగ్గిపోతున్న తేమ
- సకల ప్రాణరాశులకు నీటి కొరతతో ముప్పు 
- ఫ్లోరైడ్ శాతం పెరిగే ప్రమాదం
- 600 అడుగుల వరకు బోర్లు వేసినా నీటి జాడలేదుహైదరాబాద్ : తెలంగాణలో భూగర్భజలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. జలాశయాలు, బావులు, చెరువులు ఎండిపోతున్నాయి. బోర్లలో నీళ్లు పాతాళానికి పడిపోయాయి. ఓ పక్క వర్షాభావ పరిస్థితులు.. మరోపక్క రోజురోజుకు పెరుగుతున్న నీటి అవసరాలతో భూగర్భజలాలు వేగంగా అడుగంటుతున్నాయి. వేసవికి ముందే అసాధారణంగా తగ్గుతున్న గ్రౌండ్ వాటర్ లెవల్స్  ఆందోళన కలిగిస్తున్నాయి. సకలకోటి ప్రాణికి జీవనాధారం నీరు. మానవాళి జీవితమంతా నీటితోనే ముడిపడి ఉంటుంది. అలాంటి నీరు మనకు వర్షం ద్వారా మాత్రమే లభిస్తుంది. ఆ తర్వాత ప్రజల అవసరాలు తీర్చేవి భూగర్భ జలాలే. అంతటి ప్రాముఖ్యత ఉన్న నీరు ప్రమాదకరస్థాయిలో పాతాళానికి పడిపోతోంది. ఈసారి వర్షాలు తగినంత కురవకపోవడంతో భూగర్భ జలాలపై ఎఫెక్ట్ పడింది. నీరు రోజురోజుకు అడుగంటుతుండటంతో భూమిలోని తేమ తగ్గిపోతోంది. అంటే.. మానవాళితోపాటు సకల ప్రాణరాశులకు ముప్పు పొంచివున్నట్లే. నీరు పాతాళానికి పడిపోతున్నకొద్దీ ఫ్లోరైడ్ శాతం పెరిగే ప్రమాదం కూడా ఉంది. మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్‌తో పాటు పలు జిల్లాల్లో 400 నుంచి 600 అడుగుల లోతువరకు బోర్లు వేసినా జలం జాడ చిక్కడం లేదంటే ఎంతటి డేంజర్ బెల్స్ మోగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణలో మొత్తం 22 జిల్లాల్లో గ్రౌండ్ వాటర్ లెవల్స్ తగ్గిపోయాయి. గతేడాదితో పోల్చితే అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 7.49మీటర్ల అదనపు తగ్గుదల నమోదైనట్లు భూగర్భ జలశాఖ నివేదిక విడుదల చేసింది.
 

- సంగారెడ్డి జిల్లాలో గరిష్ఠంగా 45శాతం లోటు వర్షపాతం
- సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 7.49మీటర్ల తగ్గుదల
- 16 జిల్లాల్లో 20 నుంచి 45శాతం లోటు వర్షపాతం
- రాష్ట్రంలో 11.91 మీటర్ల లోతున నీరు లభ్యంగతేడాది జూన్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు మొత్తం 16 జిల్లాల్లో... 20 నుంచి 45శాతం లోటు వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లాలో గరిష్ఠంగా 45శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో భూగర్భ జలాలపై ప్రభావం పడింది. రాష్ట్రంలో సగటున 12 మీటర్ల లోతున నీరు లభ్యమౌతుండగా... మెదక్ జిల్లాల్లో 21 మీటర్ల లోతుకు వెళ్తేనే నీటి తడి కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాలో మాత్రం 6 మీటర్ల లోతులోనే నీరు లభ్యమవుతోంది. 


వర్షాభావ పరిస్థితులతో తెలంగాణలోని పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో భూగర్భ జలాలు భారీగా తగ్గగా... నాగర్‌కర్నూలు, భద్రాద్రితోపాటు 11 జిల్లాల్లో మాత్రం స్వల్పంగా పెరిగాయి. అత్యధికంగా భద్రాద్రిలో 1.56మీటర్ల పెరుగుదల నమోదైంది. అయితే.. వేసవి కాలానికి ముందే గ్రౌండ్ వాటర్ ప్రమాద ఘంటికలు మోగిస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వేసవిలో ప్రజలు తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతోంది. 


-  మెదక్ జిల్లాల్లో 20.95 మీటర్ల లోతులో నీరు
-  ఖమ్మం జిల్లాలో 5.57 మీటర్ల లోతులోనే నీరు 
-  పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో భారీగా తగ్గిన భూగర్భ జలాలు
- 11 జిల్లాల్లో స్వల్పంగా పెరిగిన భూగర్భ జలాలు
-  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1.56మీటర్ల పెరుగుదల

Special
Groundwater
Levels
Decreases
Telangana

మరిన్ని వార్తలు