అఫ్జల్ గురూని బలిపశువుని చేశారు..అలియా భట్ తల్లి వివాదాస్పద వ్యాఖ్యలు

Submitted on 21 January 2020
Soni Razdan calls Afzal Guru scapegoat, clarifies later

2001లో ఢిల్లీలోని భారత పార్లమెంట్ పై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురూని ఫిబ్రవరి-9,2013న తీహార్ జైళ్లో ఉరి తీసిన విషయం తెలిసిందే. అయితే అఫ్జల్ గురూ ఉరిపై బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ తల్లి సోనీ రజ్దాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అఫ్జల్‌ గురూను బలిపశువును చేశారని ఆమె అన్నారు. న్యాయం ఎలా అపహాస్యమవుతుందనేందుకు ఇదే ఉదాహరణని అంటూ అఫ్జల్‌ గురూ అమాయాకుడైతే పోయిన అతడి ప్రాణాన్ని ఎవరు తీసుకురాగలరని ప్రశ్నించారు. అందుకే మరణ శిక్షను అంత తేలికగా విధించరాదని, ఈ కారణంచేతే అఫ్జల్‌ గురూను ఎందుకు బలిపశువును చేశారనే దానిపై విచారణ చేపట్టాలని ఆమె ట్వీట్‌ చేశారు.

అయితే రజ్దాన్ తల్లి ట్వీట్ పై తీవ్ర విమర్శలుె వ్యక్తమయ్యాయి. ఆమెపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అయ్యారు. అఫ్జల్ గురూ నీ దృష్టిలో అమాయకుడా అంటూ ఆమెపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. దీంతో ఆమె తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూ మరో ట్వీట్ చేయాల్సి వచ్చింది. అఫ్జల్ గురూ అమాయకుడని ఎవ్వరూ చెప్పడం లేదని కశ్మీర్‌ నుంచి ఢిల్లీకి ఓ ఉగ్రవాదిని తీసుకువచ్చి అతడికి ఆశ్రయం కల్పించాలని జమ్ము కశ్మీర్‌ డీఎస్పీ దేవీందర్‌ సింగ్‌ తనను తీవ్రంగా వేధించారని అఫ్జల్‌ గురూ తన లాయర్ కు రాసిన లేఖలో తెలిపాడని, ఆ ఉగ్రవాదే తర్వాత పార్లమెంట్‌పై దాడికి తెగబడ్డాడని అదే లేఖలో పొందుపరిచాడని రజ్దాన్‌ తెలిపారు. దీనిపై పూర్తిగా దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదా అని ఆమె ప్రశ్నించారు. డీఎస్పీ డేవేందర్ సింగ్ పై అఫ్జల్ చేసిన ఆరోపణలను ఎవ్వరూ కూడా ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. కాగా ప్రస్తుతం జమ్ము కశ్మీర్‌ పోలీసుల కస్టడీలో ఉన్న దేవీందర్‌ సింగ్‌ను ఎన్‌ఐఏ త్వరలో విచారించనుంది.

2004లో తీహార్ జైలు నుంచి అప్జల్ గురు తన లాయర్ కు ఓ లేఖ రాశారు. అందులో పార్లమెంట్‌ దాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఓ కేసులో దేవేందర్ తనను అరెస్టు చేసి తీవ్రంగా హింసించాడని,ఆ తర్వాత ఓ వ్యక్తిని ఢిల్లీకి రప్పించి అక్కడ అతడికి నివసించే ఏర్పాట్లు చేయాలని దేవేందర్ తనను ఆదేశించాడని అఫ్జల్ గురు తెలిపారు. 2001లో పార్లమెంట్ పై దాడి సమయంలో పోలీసుల కాల్పుల్లో మరణించిన ఒక తీవ్రవాదే దేవేందర్ సూచించిన ఆ వ్యక్తి అని అఫ్జల్ తెలిపారు. పార్లమెంట్‌ దాడి ఘటనలోనే దేవేందర్ సింగ్‌ పేరు చెప్పాడు అఫ్జల్ గురు. అయితే దానికి సరైన ఆధారాలు లేకపోవడంతో.. పోలీసులు దేవేందర్ పై చర్యలు తీసుకోలేకపోయారు. 

అయితే అఫ్జల్ గురూ ఆరోపణలు చేసిన జమ్మూకశ్మీర్ డీఎస్పీ దేవేందర్ సింగ్ ...ఉగ్రవాదులతో కలిసి డీఎస్పీ కారులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసు ఉన్నతాధికారులు మాటు వేసి వారిని పట్టుకున్న విషయం తెలిసిందే. డీఎస్పీని అరెస్ట్ చేసిన పోలీసులు కీలక వివరాలను రాబట్టారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ సయ్యద్ నవీద్ ముస్తాఖ్, టెర్రరిస్ట్ రఫీని బనిహాల్ టన్నెల్‌ను సురక్షితంగా దాటించేందుకు డీఎస్పీ ఉగ్రవాదులతో 12లక్షల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది. రూ.12 లక్షల ఇస్తామనడంతో ఉగ్రవాదులను బనిహాల్ సొరంగాన్ని దాటించేందుకు అతడు సాయం చేశాడని ప్రాథమిక విచారణలో తేలింది. డీఎస్సీ వాహనంలో వెళ్తే ఎవరూ సెక్యూరిటీ సిబ్బంది ఎవరూ ఆపరని స్కెచ్ వేశారు. కానీ తనిఖీల్లో ముగ్గురూ అడ్డంగా దొరికిపోయారు. 

అయితే చాలా కాలం క్రితమే దేవేందర్ పై అరోపణలు వచ్చాయి. ఉగ్రవాదులకు సాయం చేస్తూ కశ్మీర్‌లో పౌరులను హింసిస్తున్నారని 2001లో విమర్శలు వచ్చాయి. అప్పుడే అతడిని అరెస్టు చేయాల్సి ఉండగా.. బదిలీతో సరిపెట్టారు. ఎస్‌ఓజీ డీఎస్పీ స్థాయి నుంచి సెంట్రల్‌ కశ్మీర్‌లో ఇన్‌స్పెక్టర్‌గా మార్చారు. అయితే ఆ తర్వాత దేవేందర్ ఆధ్వర్యంలో అనేక కస్టోడియల్‌ మరణాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.

Afzal Guru
Alia Bhat
mother
soni razdan
scapegoat
death penalty
parliament attack
convict
DSP
devender singh
Investigation

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు