ఏపీ సీఎస్ గా నీలం సహానీ ?

Submitted on 11 November 2019
Social Justice Secretary Nilam Sawhney sent back to Andhra Pradesh as CS

కేంద్ర సామాజిక న్యాయశాఖ కార్యదర్శిగా పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సహానీని కేంద్రం రిలీవ్ చేసింది. 1984 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన నీలం సహానీని ఏపీ కి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.  రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు నీలం సహానీని రాష్ట్రానికి బదిలీ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం. ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ బాధ్యతలు చేపడితే.. నవ్యాంధ్రలో తొలి మహిళా సీఎస్‌గా సాహనీ రికార్డ్ క్రియేట్ చేయనున్నారు. నీలం సహానీ 2020  జూన్ నెలాఖరు వరకు ఆమె సర్వీసులో ఉండనున్నారు. 

ఎపీ సీఎస్ గా పని చేస్తున్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను  బదిలీ చేస్తూ నవంబర్4న ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన స్థానంలో నీరబ్ కుమార్‌కి తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యం అనూహ్యంగా బాధ్యతల్లోకి వచ్చారు. ఆయన నీరబ్ కుమార్ కు బాధ్యతలు అప్పచెప్పి రిలీవ్ అయ్యారు. 

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం  ఎల్వీ సుబ్రహ్మణ్యాన్నిసీఎస్ గా నియమించింది. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా అధికార పగ్గాలు చేపట్టాక కూడా ఎల్వీ ని  సీఎస్ గా కొనసాగించారు. అనూహ్యంగా నవంబర్ 4న సీఎస్ ను బదిలీ చేస్తూ సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి హోదాలో కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ జీవో జారీ చేయటంతో సర్వత్రా విమర్శలు తలెత్తాయి. 


మరిన్ని వార్తలు