అద్భుత ఆవిష్కరణ : జాతీయ సైన్స్ ఎగ్జిబిషన్‌లో సిరిసిల్ల కుర్రాడి సత్తా

Submitted on 16 February 2019
Siricilla Student Gets Third Prize At Inspire Science Expo

సిరిసిల్ల: చదువుతున్నది 9వ తరగతే. కానీ అద్భుతమైన టాలెంట్ ఆ పిల్లాడి సొంతం. తన ప్రతిభతో జాతీయ స్థాయిలో మెరిశాడు. ఏకంగా 3వ స్థానంలో నిలిచి శెభాష్ అనిపించుకున్నాడు. అతడే  మర్రిపల్లి అభిషేక్. లక్ష్మీరాజం, రాజవ్వ దంపతుల కుమారుడైన అభిషేక్‌.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడల మండలం హన్మాజీపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 9వతరగతి  చదువుతున్నాడు. ధాన్యాన్ని బస్తాల్లో నింపేందుకు.. తల్లి పడుతున్న కష్టం అభిషేక్‌ను కదిలించింది. తల్లి కష్టాన్ని దూరం చేయాలని నిర్ణయించుకున్న అభిషేక్.. బుర్రకి పదును పెట్టాడు.  అద్భుతమైన ఓ యంత్రాన్ని ఆవిష్కరించాడు. ప్యాడీ ఫిల్లింగ్ మెషిన్ అని దానికి పేరు పెట్టాడు. ఈ పరికరంతో చాలా సులభంగా ధాన్యాన్ని బస్తాల్లో నింపొచ్చు. దీని ద్వారా రైతులకు చాలా వరకు  ఇబ్బందులు తప్పుతాయని అభిషేక్ చెప్పాడు.

 

ఈ యంత్రమే అభిషేక్‌కి జాతీయ స్థాయి బహుమతి తెచ్చిపెట్టింది. సంచుల్లో ధాన్యం నింపే యంత్రం రూపకల్పన ఆలోచనను జిల్లా సైన్స్‌ ఎగ్జిబిషన్‌ సందర్భంగా స్కూల్‌లో సైన్స్‌ టీచర్‌తో అతడు  పంచుకున్నాడు. వారిచ్చిన ప్రోత్సాహంతో ఓ యంత్రాన్ని రూపొందించి జిల్లా, రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్‌ ఎగ్జిబిషన్లలో ప్రదర్శించాడు. ఫస్ట్ ప్రైజ్ సాధించాడు. ఢిల్లీలో ఫిబ్రవరి 14, 15 తేదీల్లో జరిగిన  జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌ సైన్స్‌ ఎగ్జిబిషన్‌లోనూ అభిషేక్ తన ఆవిష్కరణను ప్రదర్శనకు ఉంచాడు. అతడి టాలెంట్‌ను నిర్వాహకులు మెచ్చుకున్నారు. అక్కడ మూడో బహుమతి అందుకున్నాడు.

Innovation
Inspire Science Expo
siricilla student
abhishek
paddy filling machine
Farmers

మరిన్ని వార్తలు