నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ : ఏప్రిల్ 20 నుంచి SI రాత పరీక్షలు

Submitted on 13 April 2019
si exams schedule released

ఎస్ఐ రాత పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ఏప్రిల్ 20 నుంచి తుది పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 15వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 18వ తేదీ అర్ధరాత్రి వరకు అభ్యర్థులు http://www.tslprb.in వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) తెలిపింది. ఎస్‌ఐ సివిల్, టెక్నికల్‌ రాత పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. దేహదారుఢ్య పరీక్షలో ఉత్తీర్ణులైన 1,05,061 మంది తుదిరాత పరీక్షకు ఎంపికయ్యారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌ నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పరీక్ష కేంద్రాలు, బయోమెట్రిక్‌ యంత్రాలు, హాల్‌ టికెట్లను సిద్ధం చేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతిచ్చేది లేదని బోర్డు స్పష్టం చేసింది. అభ్యర్థులు వాచ్ లు, కాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు తీసుకురావొద్దని ఆదేశించారు.

హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌లో ఇబ్బందులుంటే:
* బోర్డు అధికారులను [email protected]కు ఈ మెయిల్‌ ద్వారా సంప్రదించాలి
* 9393711110, 9391005006 ఫోన్‌ నెంబర్లకు కాల్ చేయాలి

పోలీసు శాఖలో 3వేల మంది కానిస్టేబుళ్లు ఎస్‌ఐ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,500 మందికిపైగా తుదిరాత పరీక్షకు అర్హత సాధించారు. తుది రాత పరీక్ష రాసేందుకు తగినంత సమయం లేదని మొదటినుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాతపరీక్షల తేదీని మార్చాలని అభ్యర్థించారు. షెడ్యూల్ లో మార్పు లేకపోవడంతో టెన్షన్ పడుతున్నారు. పోలింగ్, ఈవీఎం స్ట్రాంగ్‌ రూమ్‌లు, శ్రీరామనవమి వేడుకలకు బందోబస్తు కోసం కానిస్టేబుళ్లు డ్యూటీల్లో ఉన్నారు. దీంతో తమకు చదువుకునే సమయం ఎక్కడిదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెలవులు పెట్టి చదువుకుంటున్న కానిస్టేబుళ్లకు డీజీపీ కార్యాలయం నోటీసులు పంపి మరీ డ్యూటీకి వచ్చేలా చేసింది. ఎన్నికల సమయంలో ఎవరికీ సెలవులు లేవని, ఏప్రిల్‌ 1లోగా రిపోర్టు చేయాలని ఆదేశించింది. దీంతో వారంతా వచ్చి ఎన్నికల విధుల్లో చేరారు.

ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ భాషా పేపర్లలో అభ్యర్థులు తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాలని, ఈ పేపర్లలో నెగటివ్‌ మార్కులు ఉంటాయని అధికారులు తెలిపారు. భాషా పరీక్షల్లో 2 విభాగాలుంటాయని, పార్ట్‌-ఏలో ఆబ్జెక్టివ్‌కు 50 మార్కులు ఉంటాయన్నారు. ఒక్కో ప్రశ్నకు అరమార్కు ఉంటుందని, తప్పుడు సమాధానానికి పావు మార్కును తగ్గిస్తారు.

si exams
schedule
hall tickets
constables
Telangana
Police
Sub Inspector

మరిన్ని వార్తలు