సంక్రాంతి ఫుడ్ : నాటుకోడి పులుసు, సూరన్‌ వడలు తయారీ ఎలా

Submitted on 12 January 2019
Sankranthi Festival Special Food Items

బాయిలర్ చికెన్ తిని తినీ ఎప్పుడో బోర్ కొట్టేసిందా. ఇక గట్టిగా మసాలా దట్టించిన నాటుకోడిని ఎలా చెస్తారో చూసేద్దామా..?
నాటుకోడి పులుసు:

కావలసిన పదార్దాలు:
నాటుకోడి ముక్కలు 200 గ్రా, గసగసాలు 150 గ్రా, ఎండుకొబ్బరి పొడి 100 గ్రా, నూనె 4 టేబుల్ స్పూన్లు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు 2, టొమాటో 1, జిలకర్ర టీ స్పూన్, పచ్చిమిర్చి 3, పసుపు పావు టీ స్పూన్, మిరప కారం టీ స్పూన్, తగినంత ఉప్పు, గరం మసాలా అర టీ స్పూన్, ధనియాల పొడి అర టీ స్పూన్, కొత్తిమీర టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం:
గసగసాలు వేయించి ఎండుకొబ్బరి పొడి కలిపి ముద్ద చేసి ఉంచి నాటుకోడి ముక్కలలో అల్లం వెల్లుల్లి, పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలిపి అరగరట పక్కనుంచాలి. స్టవ్ మీద బాణలిలో నూనె వేసి జిలకర్ర, ఉల్లి తరుగు వేసి కలిపిన తరవాత అల్లం వెల్లుల్లి మిశ్రమంలో ఉంచిన నాటుకోడి ముక్కలను వేసి కలియబెట్టాలి. కొద్దిగా ఉడికిన తరవాత కారం, ఉప్పు, గసగసాలు, చింతపండు గుజ్జు వేసి కలపాలి. ముక్క ఉడికాక మంట తగ్గించి గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర వేసి మూడు నిమిషాలు ఉంచి దించాలి.

మామిడికాయ బొబ్బట్లు:
కావలసిన పదార్దాలు: 
పచ్చి మామిడికాయలు  2, బొంబాయి రవ్వ ఒక కప్పు,  పంచదార ఒక కప్పు, మైదా పిండి ఒక కప్పు, ఉప్పు చిటికెడు, నూనె అర కప్పు,  నెయ్యి 3 టేబుల్‌ స్పూన్లు, ఏలకుల పొడి అర టీ స్పూను.
తయారీ విధానం:
మామిడికాయలను శుభ్రంగా కడిగి తొక్క తీసి, సన్నగా తురుముకుని పక్కన ఉంచాలి. స్టవ్ మీద బాణలి వేడెక్కిన తరవాత బొంబాయి రవ్వ వేసి వేయించి పక్కన ఉంచాలి. ఒక టేబుల్‌ స్పూను నెయ్యి వేసి కరిగించి పచ్చి మామిడికాయ తురుము వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి ఐదు నిమిషాల తరవాత రెండు కప్పుల నీళ్లు, పంచదార జత చేసి, పంచదార కరిగేవరకు కలుపుతుండాలి. పంచదార పూర్తిగా కరిగాక, వేయించిన బొంబాయి రవ్వ కొద్దికొద్దిగా జత చేస్తూ ఆపకుండా కలుపుతుండాలి. నెయ్యి, ఏలకుల పొడి జత చేసి కలిపి దింపి చల్లారిన తరవాత ఉండలు చేసి పక్కన ఉంచాలి. ఒక పాత్రలో మైదా పిండి, కొద్దిగా నెయ్యి, చిటికెడు ఉప్పు వేసి కలపాలి. పిండిని చిన్నచిన్న ఉండలుగా తీసుకుని, చేతితో చిన్న పూరీలా ఒత్తి, ఒక ఉండను ఉంచి, అంచులు మూసేయాలి. అరటి ఆకు మీద కాని, ప్లాస్టిక్‌ పేపర్‌ మీద కాని కొద్దిగా నెయ్యి పూసి ఈ ఉండను దాని మీద ఉంచి చేతితో బొబ్బట్లు మాదిరిగా ఒత్తాలి. స్టవ్ మీద పెనం వేడయ్యాక కొద్దిగా  నెయ్యి వేసి తయారుచేసి ఉంచుకున్న బొబ్బట్లును వేసి రెండువైపులా నెయ్యి వేసి దోరగా కాల్చి తీసి వేడివేడిగా అందించాలి.

సూరన్‌ వడలు:
కావలసిన పదార్దాలు:
కంద పావు కేజీ, నిమ్మ రసం అర టీ స్పూను, అల్లం తురుము ఒక టీ స్పూను, తరిగిన పచ్చి మిర్చి 1, కరివేపాకు తరుగు ఒక టీ స్పూను, బియ్యప్పిండి 3 టేబుల్‌ స్పూన్లు, నూనె సరిపడా, ఉప్పు  తగినంత. జీలకర్ర అర టీ స్పూను, మెంతులు 4 గింజలు,  లవంగాలు 2.
తయారీ విధానం:
కందను శుభ్రంగా కడిగి, తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి తగినన్ని నీళ్లు కుకర్‌లో ఉంచి ఉడికించి దింపేయాలి. విజిల్స్‌ వచ్చాక నీళ్లు వేరు చేసి, ముక్కలను చల్లారబెట్టాలి. మిక్సీ జార్‌లో మిరియాలు, జీలకర్ర, లవంగాలు వేసి రవ్వలాగ వచ్చేలా పొడి చేసి ఒక పాత్రలో కంద ముక్కలు, మిరియాల పొడి మిశ్రమం, కొద్దిగా బియ్యప్పిండి, నిమ్మ రసం, అల్లం తురుము, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసి గారెల పిండిలా కలుపుకోవాలి. స్టవ్ మీద పాన్‌ ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి సిద్ధంగా ఉన్న కంద మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేతిలోకి తీసుకుని, వడల మాదిరిగా చేతితో ఒత్తి, నూనెలో వేసి రెండువైపులా దోరగా వేగిన తరవాత, కిచెన్‌ పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి.

Sankranthi festival
Special Food Items

మరిన్ని వార్తలు