ఇసుక మాఫియాకు పెనాల్టీలు ఉండవా

Submitted on 25 April 2019
Sand Mafia in ap

ఇసుక అక్రమార్కుల కోరలు పీకుదామనుకున్న జాతీయ హరిత ట్రిబ్యూనల్  ఆదేశాలు .. ఇప్పుడు అమలౌతాయా లేదోనన్న అనుమానాలు వ్యక్తం అవుతోంది. జరిమానా చెల్లించేందుకు ఇంకా పదిరోజులు మాత్రమే సమయం ఉండడంతో .. సంబంధిత శాఖలు నోటీసులు ఇవ్వాలా వద్దా అని .. మీన మేషాలు లెక్కిస్తున్నాయి. అటు ఇసుక మాఫియా మధ్య అధికారులు నలిగిపోతున్నారు. నోటీసులిస్తే నేతలతో తంటా.. ఇవ్వకపోతే కోర్టు ధిక్కార నేరం కింద వస్తుందని ఇప్పుడు సతమతమవుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో.. కేసు కొత్త మలుపు తిరిగింది..

కృష్ణా నదిలో విధ్వంసం సృష్టించి, ఇసుకను దోచుకున్న అక్రమార్కుల నుంచి నెలలోగా వంద కోట్ల జరిమానా వసూలు చేయాలని .. జాతీయ హరిత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. మరో 10 రోజుల్లోగా ఎన్జీటీ వద్ద ఈ మొత్తాన్ని డిపాజిట్‌ చేయాల్సి ఉంది. దీంతో అక్రమార్కుల నుంచి జరిమానా వసూలు చేయడానికి .. గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారుల సిద్ధమయ్యారు.  అయితే వారిపై ఇసుక బకాసురులు, రాజకీయ నాయకులు తీవ్ర వత్తిడి తీసుకురావడంతో .. నోటీసులు ఇంత వరకూ ఇవ్వలేదు. మే 7లోగా వంద కోట్ల రూపాయలు డిపాజిట్‌ చేయకపోతే .. ఎన్జీటీ తీర్పును ధిక్కరించినట్లు అవుతుందని.. జరిమానా వసూలుకు నోటీసులు జారీచేస్తే నేతలు ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని .. అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో కృష్ణా నదిలోని 37 ఇసుక రీచ్‌లను స్ధానిక రాజకీయ నేతలు తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. నదీ పరిరక్షణ చట్టం, పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. భారీ యంత్రాలను దించి మరీ 20, 30 మీటర్ల లోతు వరకూ ఇసుక తవ్వుతూ.. భారీఎత్తున ఇసుక అక్రమంగా రవాణా చేశారు. అంతేకాదు ఇసుక అక్రమ రవాణాతో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు ఇసుక స్మగ్లర్లకు నోటీసులు జారీచేసి జరిమానా వసూలుకు.. కాలుష్య నియంత్రణ మండలి, గనుల శాఖ అధికారులు సిద్ధమయ్యారు. రాజధాని ప్రాంత రైతు కూలీల హక్కుల పరిరక్షణ సంఘం నేతలు, విజిలెన్స్‌ విభాగం అధికారుల సహకారంతో .. స్మగ్లర్లను గుర్తించే ప్రక్రియను చేపట్టారు. 

రాజకీయ నాయకులే.. ఇసుక స్మగ్లర్లుగా రూపాంతరం చెందడాన్ని అధికారులు గుర్తించారు. నేడో రేపో నోటీసులు జారీచేస్తారనే సమాచారం అందుకున్న ఇసుక స్మగ్లర్లు .. అప్రమత్తమయ్యారు.  అధికారులపై తీవ్ర వత్తిడి తీసుకొస్తున్నారు. రాజధానిలో రహదారులు, భవనాల నిర్మాణం కోసమే వారు ఇసుకను తీసుకెళ్లారని.. ఎక్కడా అక్రమ రవాణా చేయలేదని.. జరిమానా వసూలుకు మీరెలా నోటీసులు జారీచేస్తారంటూ .. అధికారులపై వారు విరుచుకుపడినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్జీటీ ఇచ్చిన తీర్పు గురించి వివరించినా వారు వెనక్కు తగ్గలేదు. దీంతో నోటీసుల జారీ ప్రక్రియకు ఫుల్ స్టాప్ పడినట్టు తెలుస్తోంది. 

మరోవైపు కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాల వల్ల పర్యావరణానికి జరిగిన నష్టాన్ని సరిదిద్దడానికి .. రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు డిపాజిట్‌ చేయాలంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును .. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌చేసింది. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా, ప్రభుత్వ వాదనలు వినకుండా, ఎన్‌జీటీ ఇచ్చిన తీర్పును నిలుపుదల చేయాలని కోరింది. ప్రకాశం బ్యారేజీ పరిధిలో పూడికతీత పనులు మినహాయించి .. ఎలాంటి అక్రమ ఇసుక తవ్వకాలు జరగలేదని ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఇచ్చింది. 

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. పూడికతీత పేరుతో అక్రమార్కులకు ప్రభుత్వం వంత పాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాధారాలతో సహ జాతీయ హరిత ట్రిబ్యూనల్‌లో కేసువేశామని.. దానిని సమర్ధిస్తూ కోర్టు పెనాల్టీ విధించిందని చెబుతున్నారు. ఇక దీన్ని కూడా నీరుగార్చేందుకు ఏపీ ప్రభుత్వం చూస్తోందని మండిపడుతున్నారు. హరిత ట్రిబ్యునల్ పెనాల్టీ విషయంపై సిఎస్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు .. ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది. ఇసుకాసులకు గొడుగుపట్టే చర్యలు రాష్ట్ర ప్రభుత్వమే చేయడమేంటని ..  అటు పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

Sand Mafia
AP
krishna river

మరిన్ని వార్తలు