అనర్హతకు గురైన ఎమ్మెల్సీలకు హైకోర్టులో ఊరట

Submitted on 9 May 2019
relief to Disqualified mlcs in high court

అనర్హతకు గురైన ఎమ్మెల్సీలకు హైకోర్టులో ఊరట లభించింది. మే15, 2019వ తేదీ వరకు ఎమ్మెల్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయొద్దని కోర్టు సూచించింది. తమను అన్యాయంగా పదవి నుంచి తొలగించారని అనర్హతకు గురైన రాములు నాయక్‌, యాదవ్‌రెడ్డి, భూపతిరెడ్డిలు హైకోర్టును ఆశ్రయించారు. వీరు వేసిన పిటీషన్లపై న్యాయవాది ప్రకాశ్ రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తదుపరి విచారణను (మే15, 2019)వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు కోర్టు ఇచ్చిన తీర్పును పాటిస్తామని ఈసీ తెలిపింది. 

గవర్నర్ కోటాలో రాములు నాయక్, ఎమ్మెల్యేల కోటాలో యాదవరెడ్డి, స్థానిక సంస్థల కోటాలో భూపతిరెడ్డి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. శాసన మండలి ఛైర్మన్‌ జనవరి 16న తమపై అనర్హత వేటు వేస్తూ వెలువరించిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమంటూ మాజీ ఎమ్మెల్సీలు కె.యాదవరెడ్డి, రాములునాయక్‌, భూపతిరెడ్డిలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టింది. 

యాదవరెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ గతేడాది సెప్టెంబరు 14న ఢిల్లీ వెళ్లి రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరినట్లు టీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. అయితే ఆ రోజు పిటిషనర్‌ ఢిల్లీ వెళ్లలేదని చెప్పారు. 23న మేడ్చల్‌లో సోనియాగాంధీ ర్యాలీలో పాల్గొన్నట్లు పేర్కొన్నారని, అయితే పిటిషనర్‌ ఉద్యమాల్లో పాల్గొన్నందున, రాష్ట్రం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్లారని తెలిపారు. దీన్ని మీడియా తప్పుగా అర్థం చేసుకుని వార్తలు ప్రచురించిందని, వాటి ఆధారంగా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు.

Relief
Disqualify
mlcs
High Court
Hyderabad

మరిన్ని వార్తలు