కడపలో రికార్డులే రికార్డులు : జగన్ తోపాటు అందరికీ భారీ మెజారిటీ

Submitted on 24 May 2019
Records create in Kadapa in the election results of AP

ఏపీ ఎన్నికల ఫలితాల్లో కడపలో రికార్డుల మోత మోగింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌ అత్యధిక మెజార్టీ సాధించి రికార్డు నెలకొల్పాడు. రాష్ట్ర ప్రజల అభిమానానికి తగ్గట్లుగా ఆయనకు అత్యధిక మెజార్టీ దక్కింది. పులివెందులలో జగన్‌ 90 వేల 110 ఓట్లు ఆధిక్యత సాధించారు. జగన్‌ తోపాటు ఆ పార్టీ నేతలు భారీ మెజారిటీతో గెలుపొందారు.

కడప, జమ్మలమడుగు నియోజకవర్గాల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు అంజాద్‌బాషా, డాక్టర్‌ సుధీర్‌రెడ్డి 52వేలకు పైగా మెజార్టీని దక్కించుకొని మరో రికార్డు సాధించారు. కడపలో అంజాద్‌భాషా 52,539 ఓట్లు మెజార్టీ సాధించగా, జమ్మలమడుగులో డాక్టర్‌ సుధీర్‌రెడ్డి 52,035 ఓట్ల మెజార్టీ సాధించారు. కడప ఎంపీ స్థానంలో వైఎస్‌ అవినాష్‌రెడ్డి 3.54 లక్షల ఓట్ల ఆధిక్యతను సొంతం చేసుకున్నారు.

పులివెందుల నియోజకవర్గంలో ఆల్‌టైం రికార్డు వైఎస్‌ కుటుంబం సొంతమని మరోమారు నిరూపించారు. వైఎస్‌ఆర్‌ పులివెందుల అభ్యర్థిగా 1985లో 30వేలు పైగా ఓట్ల మెజార్టీ సాధించి అప్పట్లో ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత 1989లో వైఎస్‌ వివేకానందరెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసి 47 వేల 746 ఓట్ల మెజార్టీ సొంతం చేసుకొని తన అన్న రికార్డును మించిపోయారు. 

1991 ఉప ఎన్నికల్లో పోటీచేసిన డా. వైఎస్‌ పురుషోత్తమరెడ్డి 97వేల 448 ఓట్లు మెజార్టీ సాధించారు. 2009లో ముఖ్యమంత్రి హోదాలో పోటీచేసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి 68 వేల 681 ఓట్ల మెజార్టీని పొందారు. సీఎంగా రెండోసారి ప్రమాణశ్వీకారం చేసిన అనతికాలంలోనే వైఎస్సార్‌ చనిపోవడంతో ఆ తర్వాత ఉప ఎన్నికలల్లో వైఎస్‌ విజయమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా 2011లో పోటీచేసిన వైఎస్‌ విజయమ్మ తన భర్త వైఎస్సార్‌ సాధించిన మెజార్టీ కంటే ఎక్కువగా.. 81 వేల 333 ఓట్ల మెజార్టీ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం జగన్‌ పులివెందులలో రికార్డు స్థాయిలో 90 వేల 110 ఓట్ల మెజార్టీ దక్కించుకున్నారు. 

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి వైఎస్‌ అవినాష్‌రెడ్డి రాజీనామా చేశారు. తాజా ఎన్నికల్లో 3.54 లక్షల ఓట్ల మెజార్టీ సాధించారు. భారతదేశంలో అత్యధిక మెజార్టీ సాధించిన నేతల సరసన వైఎస్‌ అవినాష్‌రెడ్డి నిలిచారు. అదేరీతిలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి ప్రజలు 2.64లక్షల మెజార్టీ కట్టబెట్టారు. ఇప్పటివరకూ కడప జిల్లాలో 10కి 10సీట్లు సాధించిన చరిత్రలేదు. ఈ ఎన్నికల్లో ఆ రికార్డు కూడా సొంతమైంది. 
 

records
kadapa
Election Results
AP
Jagan

మరిన్ని వార్తలు