
నైరుతి బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా.... రాయలసీమలో వర్షాలు కురుస్తాయి. రానున్న 24 గంటల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపింది. కోస్తాలోని మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీలో మంచు కురుస్తుందని వెల్లడించింది. చలిగాలులు పెరుగుతాయని తెలిపింది.
విశాఖ ఏజెన్సీ వాసులను చలి వణికిస్తోంది. 4 రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. శనివారం(నవంబర్ 16, 2019) చింతపల్లిలో 7.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చలి గాలులు అధికంగా వీస్తున్నాయి. ఉదయం, రాత్రి మంచు దట్టంగా కురుస్తోంది. చలి, మంచు కారణంగా వృద్ధులు, చిన్నపిల్లలు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సాయంత్రం 5 గంటల నుంచే రోడ్లపై జనసంచారం తగ్గిపోతుంది. జనాలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కాగా నవంబర్ ఆఖరికి కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.