
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాలో శనివారం(జనవరి 19,2019) జరుగబోయే "యునైటెడ్ ఇండియా ర్యాలీ"కి మద్దతు తెలుపుతూ వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఓ లేఖ రాశారు. జనరల్ ఎలక్షన్స్ దగ్గరపడుతున్న సమయంలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ పాల్గొనబోతున్న ఈ ర్యాలీ నుంచి బీజేపీ వ్యతిరేక కూటమి ఐక్యంగా ఉన్న మెసేజ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చునని మమతాకి రాసిన లేఖలో రాహుల్ తెలిపారు. నిజమైన జాతీయవాదం, అభివృద్ది మాత్రమే ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్నికాపాడగలవన్న సిద్దాంతంతో ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతున్నాయని రాహుల్ అన్నారు. మోడీ, బీజేపీ ఆలోచనలు నాశయం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఉంటాయని అన్నారు.
శనివారం జరిగే ప్రతిపక్షాల ఐక్య ర్యాలీలో మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ తరపున మల్లిఖార్జున ఖర్గే,అభిషేక్ మను సింగ్వీ హాజరవుతున్నారు. బీఎస్పీ తరపున సతీష్ చంద్రలు పాల్గొననున్నారు. రాహుల్, సోనియా గాంధీలు ఈ ర్యాలీలో పాల్గొనడం లేదు.