తెలుగు రాష్ట్రాల్లో రూ.200 లకు చేరువైన ఉల్లి ధరలు

Submitted on 7 December 2019
Prices of onion reach For Rs.200 in Telugu states

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిగడ్డ ధర 200 రూపాయల దిశగా పరుగులు పెడుతోంది. మొన్నటి వరకు గ్రేడ్ వన్ ఉల్లి ధర సెంచరీ పలకగా... ఇప్పుడు డబుల్‌ సెంచరీకి చేరువైంది. తిరుపతి మార్కెట్‌లో ఇప్పటికే 180 రూపాయలకు చేరింది. దీంతో ఉల్లిగడ్డ పేరు వింటేనే జనం వణికిపోతున్నారు. మొన్నటిదాకా ఉల్లిపాయలు కోసి కన్నీళ్లు పెట్టుకున్న మహిళలు... ఇప్పుడు ఉల్లిలేని రెసిపీల కోసం యూట్యూబ్‌ను ఆశ్రయిస్తున్నారు.

విత్‌ అవుట్ ఆనియన్‌ పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. హోటళ్లలో ఆమ్లెట్లు నిషేధించారు. ఉల్లిదోశ అడిగితే... గొప్పగా చూస్తున్నారు. ఉల్లి చెట్నీలకు బదులు కొబ్బరి చట్నీలతో రెస్టారెంట్‌లను రన్‌ చేస్తున్నారు. మరికొంతమంది తెలివిగా ఉల్లి బదులు క్యాబేజ్‌ని వాడేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఉల్లి బాంబ్‌తో జనం బెంబేలెత్తిపోతున్నారు. నిన్నగాక మొన్న సెంచరీ కొట్టి షాక్‌కు గురిచేసిన ఉల్లి... ఇప్పుడు ఈజీగా డబుల్‌ సెంచరీ వైపు దూసుకెళ్తోంది.  

ఉల్లి ధరలు... ఇకనైనా తగ్గుతాయేమోనని ఆశగా ఎదురు చూస్తున్న సామాన్యులకు రోజు రోజుకూ మరింత షాక్ ఇస్తూ.. ఉల్లి ధరలు ఆకాశాన్ని దాటి అంతరిక్షాన్నంటుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో ఉల్లిగడ్డ 170 నుంచి 180 పైనే పలుకుతోంది. అతి త్వరలో 200లకు చేరువయ్యేలా ఉంది. ఇక హైదరాబాద్‌లో ఉల్లిధర రికార్డు స్థాయిలో 160 దాటి, 180 వరకు పలుకుతోంది.

ఉల్లి ధరల పెరుగుదలపై అన్ని వర్గాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఉల్లిగడ్డ నిల్వ అయిపోతుందనగానే.. మధ్య తరగతి, పేద ప్రజల గుండెలు జారిపోతున్నాయి. అంతకంతకూ పెరుగుతున్న ఉల్లి ధరలు.. కన్నీళ్లు పెట్టిస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు ఉన్నది పేద ప్రజల కనీస అవసరాలు తీర్చడానికే కదా అని గృహిణులు ప్రశ్నిస్తున్నారు. ఏ కూర వండాలన్నా మొదట కావాల్సింది ఉల్లిగడ్డే కదా.. ఉల్లి లేకపోతే ఇల్లు గడిచేదెలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి బాంబ్‌ను చూసి తిరుపతిలో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.

onion
prices
Rs.200
Telangana
andhrapradesh

మరిన్ని వార్తలు