రాజానగరం రగడ : టీడీపీ పట్టు నిలుపుకుంటుందా!

Submitted on 11 February 2019
Politics warming in Rajanagaram

తూర్పు గోదావరి : ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది...రాజానగరంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తుంటే....ఎలాగైనా బ్రేకులు వేయాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. గెలుపు ఒకరికి పరువైతే...మరొకరికి పంతంలా మారింది. అధికార పార్టీ మరోసారి పట్టు నిలుపుకుంటుందా ? 

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం.. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటయింది. బూరుగుపూడి నియోజకవర్గంలోని కోరుకొండ, సీతానగరం మండలాలు, కడియం నియోజకవర్గంలోని రాజానగరం మండలం కలిపి...రాజానగరం నియోజకవర్గం ఏర్పడింది. 2009, 2014లలో రెండు పర్యాయాలు ఎన్నికలు జరిగితే...తెలుగుదేశం పార్టీనే విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించి...హ్యాట్రిక్‌ కొట్టాలని టీడీపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. 

టీడీపీ తరపున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పెందుర్తి వెంకటేశ్.. మూడో సారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేశారు. ప్రజల నుంచి మన్ననలు పొందారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. చిత్తశుద్దిని ప్రదర్శించడం లేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఇసుక మాఫియా వ్యవహారాల్లో ఎమ్మెల్యే పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అటు పురుషోత్తంపట్నం లిఫ్ట్ స్కీమ్ వ్యవహారంపై... ఆయన వర్గంలోని నేతలే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకతను.. వైసీపీ సొమ్ము చేసుకోలేకపోయిందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన జక్కంపూడి విజయలక్ష్మి, ఆమె తనయులు రాజా, గణేశ్‌ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు సీటు కోసం పోటీ పడుతుండటంతో... జగన్‌ ఎవరికిస్తారన్న దానిపై ఆసక్తి రేపుతోంది. జక్కంపూడి కుమారులు రాజా, గణేశ్‌...ఇద్దరు ప్రజల్లో తిరుగుతూ యాక్టివ్‌గా ఉంటున్నారు.

మరోవైపు అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకత, విపక్షంలోని బలహీనతలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు...జనసేన ఎత్తులు వేస్తోంది. అందుకనుగుణంగా ప్రణాళికలు రచిస్తూ....పావులు కదుపుతోంది. అయితే నేతల నేతల మధ్య ఐక్యత లేకపోవడం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. బీజేపీ నుంచి జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణ భార్య పద్మావతి అసెంబ్లీ సీటును ఆశిస్తున్నారు. అయితే భర్తకు ఎంపీ సీటు, భార్యకు ఎమ్మెల్యే సీటు ఇస్తారా లేదా అన్నది ఆ పార్టీనే తేల్చాల్సి ఉంది. అదే పార్టీ నుంచి స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకుడు రాయపురెడ్డి చిన్నా కూడా రాజానగరం టికెట్‌ ఆశిస్తున్నారు. 

2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ...కాపుల ఓట్లను భారీగా చీల్చడంతో టీడీపీ సునాయాసంగా విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో కూడా జనసేన కూడా కాపుల ఓట్లను చీల్చితే...టీడీపీనే విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. మూడోసారి గెలిచి టీడీపీ హ్యాట్రిక్‌ కొడుతుందా ? లేదంటే వైసీపీ విజయం సాధిస్తుందో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.
 

Politics warming
Rajanagaram
East Godavari

మరిన్ని వార్తలు